Mahima Chaudhary
-
ముఖం నిండా గాయాలు.. అయినా షూట్ చేద్దామన్నా: బాలీవుడ్ నటి
బాలీవుడ్లో స్టార్ హీరోల సరసన నటించిన ముద్దుగుమ్మ మహిమా చౌదరి. ప్రస్తుతం ఆమె సిగ్నేచర్ అనే చిత్రంలో కనిపించనుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ముద్దుగుమ్మ దిల్ క్యా కరే మూవీ షూటింగ్లో ఎదురైన సంఘటనను పంచుకుంది. అది తన వ్యక్తిగత, వృత్తి జీవితాన్ని ఎలా ప్రభావితం చేసిందో వివరించింది. షూటింగ్ సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలిపింది. తన ముఖానికి ఎంత గాయాలు ఉన్నాయో తనకు తెలియదని చెప్పింది. అయినప్పటికీ షూట్ కొనసాగించాలని చెప్పానని.. కానీ దర్శకుడు ప్రకాష్ ఝా విశ్రాంతి తీసుకోమని చెప్పారని వివరించింది.మహిమా చౌదరి మాట్లాడుతూ.. 'షూటింగ్ సమయంలో నాకు నా ప్రమాదం జరిగింది. నా ముఖంపై ఇన్ని గాయాలు ఉన్నాయని నేను గ్రహించలేదు. తర్వాత బాత్రూమ్కి వెళ్లి అద్దంలో చూసుకున్నా. ఏమీ జరగకపోతే షూట్ చేద్దాం అని ప్రకాష్ జీకి చెప్పాను. కానీ ఆయన వద్దన్నారు. గాయం తర్వాత నా ముఖం నుంచి డాక్టర్లు 67 గాజు ముక్కలు బయటకు తీశారు. ఆ సమయంలో ఈ విషయాన్ని బయటకు చెప్పొద్దని అజయ్ దేవగన్, ప్రకాష్ జాను కోరా. నా కెరీర్ కాపాడుకునేందుకు బయట పెట్టొద్దని వారిని అభ్యర్థించాను. దాదాపు 20 ఏళ్ల తర్వాత ఈ విషయం బయటపెట్టానని చెప్పుకొచ్చింది' బాలీవుడ్ భామ. అంతేకాకుండా తన కంటికి సర్జరీ తర్వాత చాలా ఒత్తిడికి గురైనట్లు మహిమా చౌదరి వెల్లడించింది. శస్త్రచికిత్సల తర్వాత ఇప్పటికీ నా కన్ను ఒకటి చిన్నదిగా కనిపిస్తుందని వివరించింది. -
సినిమా ఛాన్స్.. అప్పుడు ఆస్పత్రి బెడ్‌పై ఉన్నాను: నటి
ప్రముఖ నటి మహిమ చౌదరి క్యాన్సర్ బారిన పడ్డారు. ఆమె బ్రెస్ట్ క్యాన్సర్‌కు చికిత్స తీసుకుందని నటుడు అనుపమ్ ఖేర్ వెల్లడించాడు. '‘నా 525వ చిత్రం ‘ద సిగ్నేచ’ర్లో ఓ కీ రోల్ కోసం నెల రోజుల క్రితం అమెరికా నుంచి మహిమకు కాల్ చేశాను. అప్పుడే తను బ్రెస్ట్ క్యాన్సర్‌తో బాధపడుతున్నట్టు తెలిసింది. ఈ విషయాన్ని బయటకు వెల్లడించడంలో నేను కూడా భాగం కావాలని ఆమె కోరుకుంది’’ అంటూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో షేర్ చేశాడు. ఇందులో మహిమ.. క్యాన్సర్ వ్యాధితో తాను చేసిన పోరాటం గురించి వివరిస్తూ భావోద్వేగానికి లోనయింది. ‘మీ 525 సినిమాలో నటించాలని మీరు కాల్ చేసినప్పుడు నేను హాస్పిటల్ బెడ్‌పై ఉన్నాను. నా చుట్టూ డాక్టర్లు, నర్సులు ఉన్నారు. నా జుట్టు పూర్తి పోయింది. మీరు ఇప్పుడు కాల్ చేశారేంటి అనుకున్నాను. ఇంకా వెబ్ సిరీస్‌లు, సినిమాల్లో నటించాలని ఇంకా నాకు ఎన్నో కాల్స్ వచ్చాయి. నేను నటిస్తానని చెప్పలేను. ఎందుకంటే నా హెయిర్ మొత్తం లాస్ అయ్యింది’ అని చెప్పుకొచ్చింది. ‘సాధారణ చెకప్ కోసం వెళ్లగా క్యాన్సర్ బయటపడింది. నాకు ఎలాంటి క్యాన్సర్ లక్షణాలు కూడా కనిపించలేదు. కానీ క్లారిటీ కోసం చెకప్‌కు వెళ్లాను. టెస్ట్ చేసిన డాక్టర్లు ఇది క్యాన్సర్ కణతి అయ్యుండొచ్చు అన్నారు. మీరు దీన్ని తీసేయాలనుకుంటున్నారా? అని అడిగారు. వద్దు వద్దు నేను జస్ట్ చెకప్ కోసం వచ్చాను అన్నాను. చివరకు బయాప్సీ చేసి కణతి తీసి టెస్ట్ చేయగా క్యాన్సర్‌గా తేలింది. ఆ తర్వాత కీమోలు ఇస్తున్న సమయంలో చాలా నీరసించి పోయాను. ఎనర్జీ లాస్ అయ్యాను. నా హెయిర్ పోయింది. కానీ ధైర్యంతో ఈ వ్యాధిని ఎదుర్కొన్నాను. ప్రస్తుతం నేను పూర్తి ఆరోగ్యంగా ఉన్నాను’ అని వివరించింది. కాగా క్యాన్సర్‌పై ఎంతో మంది మహిళలకు అవగాహన కల్పించేందుకు మహిమ తనని కూడా భాగం చేశారని అనుపమ్ ఖేర్ చెప్పుకొచ్చాడు. View this post on Instagram A post shared by Anupam Kher (@anupampkher) -
మహిమాతో బ్రేకప్.. రియాతో సహజీవనం.. లియాండర్ పేస్ బ్రేకప్ స్టోరీ
ఆట లౌక్యాన్ని ప్రదర్శిస్తుంది.. నటన భావోద్వేగాన్ని అనుసరిస్తుంది! ఈ రెండిటి మధ్య ప్రేమ కుదిరితే లౌక్యం గెలుస్తుంది.. భావోద్వేగం వీలైతే సర్దుకుపోతుంది.. వీల్లేకపోతే ఓటమిని అంగీకరిస్తుంది.. బాలీవుడ్‌తో టెన్నిస్ కూడా ప్రేమలో పడింది. ఆ జంటే మహిమా చౌధరి, లియాండర్ పేస్!! లియాండర్, మహిమా.. ఒకరికొకరు పరిచయం అయ్యేనాటికి ఇద్దరూ వాళ్ల వాళ్ల కెరీర్లో ఉచ్ఛస్థితిలో ఉన్నారు. ఒక పార్టీలో కలుసుకున్నారు ఇద్దరికీ కామన్‌గా ఉన్న స్నేహితుల ద్వారా. తొలి చూపులోనే మహిమాతో ప్రేమలో పడ్డాడు లియాండర్. అతని ప్రేమను చూసి మురిసిపోయింది మహిమా. కెరీర్ కన్నా అతనితో కలసి ఆస్వాదించే కాలానికే ప్రాధాన్యమిచ్చింది. ఇంకా చెప్పాలంటే లియాండర్ కెరీరే ముఖ్యమనుకుంది. అందుకే టెన్నిస్ ఆడడానికి అతను ఎక్కడికి వెళ్లితే అక్కడికి వెంటే వెళ్లింది. అతని బాగోగులను పట్టించుకుంది. అలా మూడేళ్లు సంతోషంగా గడిచిపోయాయి ఆ ఇద్దరి జీవితంలో! 2003... నెమ్మదిగా లియాండర్ పేస్ మది చలించసాగింది. కళ్లు ఇంకొకరి కోసం వెదకసాగాయి. ఆమె ఎవరో కాదు ప్రముఖ మోడల్ రియా పిళ్లై. ఎక్కడో ఈవెంట్లో ఆమెను చూశాడు. ఇట్టే మనసు పారేసుకున్నాడు. ఆ విషయం రియాతో చెప్పాడు కూడా. అప్పటికే సంజయ్ దత్తో వైవాహిక బంధాన్ని తెగతెంపులు చేసుకున్న రియా.. టెన్నిస్ స్టార్ లియాండర్ పేస్ ప్రేమ అభ్యర్థనను అంగీకరించింది. ఫోన్ కబుర్లు, డిన్నర్ డేట్లు షెడ్యూల్లో భాగమయ్యాయి. రియాకు తన టైమ్ ఇవ్వడం వల్ల సహజంగానే మహిమాకు దూరమవసాగాడు లియాండర్. గ్రహించింది ఆమె. కారణం అడిగింది. ‘చూస్తున్నావ్ కదా మ్యాచ్‌లు, ఎండార్స్‌మెంట్స్‌తో బిజీగా ఉంటున్నాను’ అని చెప్పాడు పొడిపొడిగా. ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్లో లియాండర్ ఎంగేజ్ అవడం మహిమా ఆలోచనల్లో అనుమానానికి తావిచ్చింది. ఒకసారి రియాతో అతను మాట్లాడుతుండగా విన్నది కూడా. నిలదీసింది. అప్పుడూ అదేం లేదంటూ ఆ సందర్భాన్ని తప్పించాడు. అయినా మహిమా మనసు లియాండర్ ప్రవర్తనను తప్పుపడుతూనే ఉంది. అందుకే లియాండర్ చెప్పే మాటలను నమ్మలేదు. ఒకసారి.. లియాండర్.. రియాతో చనువుగా ఉండడాన్ని చూసింది మహిమా. ‘ఇప్పుడు ఏం మాయ చేసి.. ఏ అబద్ధం చెప్పి దాటవేస్తావ్?’ అని ప్రశ్నించింది కళ్ల నిండా నీళ్లతో. తలవంచుకున్నాడు లియాండర్. చెదిరిన మనసుతో అతని జీవితం నుంచి తప్పుకుంది మహిమా. సహజీవనం మహిమాతో బ్రేకప్ తర్వాత వెంటనే రియాతో సహజీవనం స్టార్ట్ చేశాడు లియాండర్. 2005 –08 మధ్యలో ఆ ఇద్దరూ ముంబైలోని కొలాబాలో పెళ్లీ చేసుకున్నారని వదంతి. ఆ ఇద్దరికీ కూతురు పుట్టింది. పేరు అయానా. సంతోషంగా సాగిపోతోంది వాళ్ల కాపురం అనే అనుకున్నారు లియాండర్ అభిమానులు.. 2014లో లియాండర్, అతని తండ్రి మీద రియా డొమెస్టిక్ వయొలెన్స్ కేస్ పెట్టేదాకా. ఆ వార్త విని అంతా హతాశులయ్యారు. కూతురి కస్టడీ కోసమూ కేస్ ఫైల్ చేసింది రియా. వాళ్ల ప్రేమ.. అలా వివాదంగా ఎందుకు మారిందనే ఆరా మొదలైంది రియా అభిమానుల్లో. ‘రియా కోసం నన్ను మోసం చేసినట్టే ఇంకెవరికోసమో రియానూ మోసం చేసి ఉంటాడు’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది మహిమా. ఆమె అన్నట్టుగానే కొన్నాళ్లకే.. టెన్నిస్ క్రీడాకారిణి తన్వీ షాతో లియాండర్ ప్రేమలో పడ్డాడనే వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తల్లోని సత్యాన్ని ఇటు లియాండర్ కానీ అటు తన్వీ కాని నిర్ధారించలేదు. కానీ ప్రస్తుతమైతే లియాండర్.. బాలీవుడ్ నటి కిమ్ శర్మతో రిలేషన్షిప్లో ఉన్నాడని వినికిడి. వాళ్లిద్దరూ కలసి గోవాలో హాలిడేస్‌ను ఆస్వాదిస్తున్న ఫొటోలను ఇద్దరూ కూడా సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఆ వినికిడిని ఈ దృశ్యాలు నిజం చేసినట్టుగా భావిస్తున్నారు క్రీడా, సినీ అభిమానులు. మహిమా ఏం చేస్తోంది? లియాండర్ కోసం తన కెరీర్‌ను నిర్లక్ష్యం చేసిన మహిమా .. ప్రేమలో అతను చేసిన మోసం నుంచి బయటపడ్డాక బాబీ ముఖర్జీ అనే ఆర్కిటెక్ట్, బిజినెస్‌మన్‌ను పెళ్లిచేసుకుంది. వాళ్లకో కూతురు అరియానా. కానీ పరస్పర విరుద్ధమైన స్వభావాలు.. దాని వల్ల తలెత్తిన స్పర్థల వల్ల మహిమా, బాబీ సఖ్యంగా ఉండలేకపోయారు. కూతురుని పెట్టుకుని విడిగా ఉంటోంది మహిమా. మళ్లీ సినిమా అవకాశాల కోసమూ ప్రయత్నిస్తోంది. లియాండర్ పేస్ గొప్ప టెన్నిస్ ప్లేయర్ కావచ్చు. కానీ నాతో మాత్రం ఫెయిర్‌గా లేడు. అతను ఇంకో స్త్రీ చుట్టూ తిరుగుతున్నాడనే నిజం తెలిసినప్పుడు నేనేమంత షాక్ అవలేదు. ఎందుకంటే అప్పటికే అతనెలాంటివాడో తెలిసిపోయింది. అందుకే ఆ బ్రేకప్ కూడా నా మీద పెద్దగా ప్రభావం చూపలేదు. ఒకరకంగా నాకు హెల్పే చేసింది. నాలో పరిణతిని పెంచింది! – ఒక ఇంటర్వ్యూలో లియాండర్ పేస్ గురించి మహిమా చౌధరి. -ఎస్సార్ -
కాల ‘మహిమ’!
గాసిప్ ‘పర్దేశ్’ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగు పెట్టింది మహిమా చౌధురి. ఈ సినిమా కమర్షియల్ హిట్ అయింది. అందులో ‘గంగ’ పాత్రలో మెప్పించిన మహిమ ‘బెస్ట్ డెబ్యూ అవార్డ్’ అందుకుంది. అయినప్పటికీ ఆమె కెరీర్ పెద్దగా ఊపు అందుకోలేదు. ‘మనసులో మాట’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయం అయిన మహిమ... ఆ తరువాత గ్లామర్‌కు మాత్రమే పరిమితమై పోకుండా నట ప్రాధాన్యం ఉన్న పాత్రలను ధరించింది. ‘ధడ్కన్’ సినిమాకు ఉత్తమ సహాయ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డ్ అందుకుంది. మహిమా చౌధురిలో మంచి నటి ఉంది. ఆయితే ఆమెకు కాలం కలిసి రాలేదు. ఆ కాలమేదో ఇప్పుడు ఆమెకు నిజ జీవిత కథాంశాల చిత్రాల అవకాశంతో కలిసి వస్తున్నట్లే ఉంది. నిజ జీవిత ఘటనలు వెండితెరకు ఎక్కడం, ప్రేక్షకాదరణ పొందడం మనకు కొత్తేమీ కాదు. ‘తల్వార్’ సినిమా దీనికి ఉదాహరణ. ఈ సినిమాకు దేశవిదేశాల్లో ప్రశంసలు లభిస్తున్నాయి. అలాగే ఈమధ్య కాలంలో షీనా బోరా ఉదంతం సంచలనం కలిగించింది. వెండి తెర కథ కంటే ఎక్కువ మలుపులు, సంచలనాలు, ఆశ్చర్యాలు ఆ నిజజీవిత కథలో ఉన్నాయి. ఈ అవకాశాన్ని సినిమా వాళ్లు ఎందుకు జార విడుచుకుంటారు? షీనా బోరాపై తాజాగా ‘డార్క్ చాక్లెట్’ అనే బెంగాలీ సినిమా రూపొందుతోంది. ఇందులో మహిమ కీలక పాత్ర పోషిస్తోంది. ‘‘నాకు బెంగాలీ వచ్చు. నేను పెళ్లి చేసుకుంది కూడా బెంగాలీ అబ్బాయినే కాబట్టి ఈ సినిమాలో నటించడానికి ఎలాంటి ఇబ్బంది లేదు’’ అంటోంది మహిమ. ఈ సినిమా పుణ్యమా అని మహిమా చౌధురి పేరు మళ్లీ లైమ్‌లైట్‌లోకి వచ్చింది. ‘బ్లాక్ చాక్లెట్’ సినిమా హిందీలోకి రిమేక్ అయినా, డబ్ అయినా....మహిమా చౌధురికి అవకాశాలు వెల్లువెత్తడం ఖాయం అని, సెకండ్ ఇన్నింగ్స్ ఊపందుకోనుందని అంటున్నారు సినీ పండితులు. -
పాత్ర కోసం బరువు పెరుగుతున్న మహిమా చౌదరి!
‘పర్దేశ్’ చిత్రం ద్వారా బాలీవుడ్ రంగప్రవేశం చేసిన మహిమా చౌదరి ఆ తర్వాత పలు సినిమాల్లో నటించారు. ‘మనసులో మాట’తో తెలుగు తెరపై తళుక్కుమన్నారు మహిమ. ఆ తర్వాత తెలుగులో చేయనప్పటికీ హిందీ చిత్రాల్లో మాత్రం యాక్ట్ చేశారు. గత కొంతకాలంగా ఆమె అక్కడ కూడా కనుమరుగయ్యారు. బాబీ ముఖర్జీ అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకున్నారామె. ఈ దంపతులకు ఓ కుమార్తె కూడా ఉంది. కాగా, బాబీతో మహిమాకి మనస్పర్థలు ఏర్పడ్డాయనే వార్త ఉంది. అదలా ఉంచితే.. మళ్లీ సిల్వర్ స్క్రీన్‌పై కనిపించబోతున్నారు మహిమ. గ్యాంగ్‌స్టర్‌గా మారిన నటి అర్చనాశర్మ జీవితం ఆధారంగా శశి రంజన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్.ఎస్. హుస్సేన్ జైదీ రాసిన ‘మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబయ్’ నవల ఆధారంగా ఈ సినిమాని రూపొందిస్తున్నారు. ఇందులో అర్చనాశర్మ పాత్రకు మహిమ అయితే బాగుంటుందనుకున్నారు రంజన్. ఈ చిత్రకథ, పాత్ర విని ఎగ్జయిట్ అయిన మహిమ మరో ఆలోచనకు తావివ్వకుండా పచ్చజెండా ఊపేశారట. ఈ పాత్రలో కొంచెం బొద్దుగా కనిపించాలి కాబట్టి ఎనిమిది నుంచి పది కిలోలు బరువు పెరగడానికి కూడా అంగీకరించేశారని సమాచారం. ఈ చిత్రంలో ఓ కీలక పాత్రను రాహుల్‌దేవ్ చేస్తున్నారు. ఇప్పటివరకు ముంబయ్, దుబాయ్, నేపాల్‌లో షూటింగ్ జరిపారు. తదుపరి షెడ్యూల్‌ను సెప్టెంబర్‌లో ప్రారంభిస్తారు.