ఆట లౌక్యాన్ని ప్రదర్శిస్తుంది..
నటన భావోద్వేగాన్ని అనుసరిస్తుంది!
ఈ రెండిటి మధ్య ప్రేమ కుదిరితే లౌక్యం గెలుస్తుంది..
భావోద్వేగం వీలైతే సర్దుకుపోతుంది.. వీల్లేకపోతే ఓటమిని అంగీకరిస్తుంది..
బాలీవుడ్‌తో టెన్నిస్ కూడా ప్రేమలో పడింది.
ఆ జంటే మహిమా చౌధరి, లియాండర్ పేస్!!
లియాండర్, మహిమా.. ఒకరికొకరు పరిచయం అయ్యేనాటికి ఇద్దరూ వాళ్ల వాళ్ల కెరీర్‌లో ఉచ్ఛస్థితిలో ఉన్నారు. ఒక పార్టీలో కలుసుకున్నారు ఇద్దరికీ కామన్‌గా ఉన్న స్నేహితుల ద్వారా. తొలి చూపులోనే మహిమాతో ప్రేమలో పడ్డాడు లియాండర్. అతని ప్రేమను చూసి మురిసిపోయింది మహిమా. కెరీర్ కన్నా అతనితో కలసి ఆస్వాదించే కాలానికే ప్రాధాన్యమిచ్చింది. ఇంకా చెప్పాలంటే లియాండర్ కెరీరే ముఖ్యమనుకుంది. అందుకే టెన్నిస్ ఆడడానికి అతను ఎక్కడికి వెళ్లితే అక్కడికి వెంటే వెళ్లింది. అతని బాగోగులను పట్టించుకుంది. అలా మూడేళ్లు సంతోషంగా గడిచిపోయాయి ఆ ఇద్దరి జీవితంలో!
2003...
నెమ్మదిగా లియాండర్ పేస్ మది చలించసాగింది. కళ్లు ఇంకొకరి కోసం వెదకసాగాయి. ఆమె ఎవరో కాదు ప్రముఖ మోడల్ రియా పిళ్లై. ఎక్కడో ఈవెంట్‌లో ఆమెను చూశాడు. ఇట్టే మనసు పారేసుకున్నాడు. ఆ విషయం రియాతో చెప్పాడు కూడా. అప్పటికే సంజయ్ దత్‌తో వైవాహిక బంధాన్ని తెగతెంపులు చేసుకున్న రియా.. టెన్నిస్ స్టార్ లియాండర్ పేస్ ప్రేమ అభ్యర్థనను అంగీకరించింది. ఫోన్ కబుర్లు, డిన్నర్ డేట్లు షెడ్యూల్‌లో భాగమయ్యాయి. రియాకు తన టైమ్ ఇవ్వడం వల్ల సహజంగానే మహిమాకు దూరమవసాగాడు లియాండర్. గ్రహించింది ఆమె. కారణం అడిగింది. ‘చూస్తున్నావ్ కదా మ్యాచ్‌లు, ఎండార్స్‌మెంట్స్‌తో బిజీగా ఉంటున్నాను’ అని చెప్పాడు పొడిపొడిగా. ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్‌లో లియాండర్ ఎంగేజ్ అవడం మహిమా ఆలోచనల్లో అనుమానానికి తావిచ్చింది.
ఒకసారి రియాతో అతను మాట్లాడుతుండగా విన్నది కూడా. నిలదీసింది. అప్పుడూ అదేం లేదంటూ ఆ సందర్భాన్ని తప్పించాడు. అయినా మహిమా మనసు లియాండర్ ప్రవర్తనను తప్పుపడుతూనే ఉంది. అందుకే లియాండర్ చెప్పే మాటలను నమ్మలేదు. ఒకసారి.. లియాండర్.. రియాతో చనువుగా ఉండడాన్ని చూసింది మహిమా. ‘ఇప్పుడు ఏం మాయ చేసి.. ఏ అబద్ధం చెప్పి దాటవేస్తావ్?’ అని ప్రశ్నించింది కళ్ల నిండా నీళ్లతో. తలవంచుకున్నాడు లియాండర్. చెదిరిన మనసుతో అతని జీవితం నుంచి తప్పుకుంది మహిమా.
సహజీవనం
మహిమాతో బ్రేకప్ తర్వాత వెంటనే రియాతో సహజీవనం స్టార్ట్ చేశాడు లియాండర్. 2005 –08 మధ్యలో ఆ ఇద్దరూ ముంబైలోని కొలాబాలో పెళ్లీ చేసుకున్నారని వదంతి. ఆ ఇద్దరికీ కూతురు పుట్టింది. పేరు అయానా. సంతోషంగా సాగిపోతోంది వాళ్ల కాపురం అనే అనుకున్నారు లియాండర్ అభిమానులు.. 2014లో లియాండర్, అతని తండ్రి మీద రియా డొమెస్టిక్ వయొలెన్స్ కేస్ పెట్టేదాకా. ఆ వార్త విని అంతా హతాశులయ్యారు. కూతురి కస్టడీ కోసమూ కేస్ ఫైల్ చేసింది రియా. వాళ్ల ప్రేమ.. అలా వివాదంగా ఎందుకు మారిందనే ఆరా మొదలైంది రియా అభిమానుల్లో. ‘రియా కోసం నన్ను మోసం చేసినట్టే ఇంకెవరికోసమో రియానూ మోసం చేసి ఉంటాడు’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది మహిమా. ఆమె అన్నట్టుగానే కొన్నాళ్లకే.. టెన్నిస్ క్రీడాకారిణి తన్వీ షాతో లియాండర్ ప్రేమలో పడ్డాడనే వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తల్లోని సత్యాన్ని ఇటు లియాండర్ కానీ అటు తన్వీ కాని నిర్ధారించలేదు. కానీ ప్రస్తుతమైతే లియాండర్.. బాలీవుడ్ నటి కిమ్ శర్మతో రిలేషన్‌షిప్‌లో ఉన్నాడని వినికిడి. వాళ్లిద్దరూ కలసి గోవాలో హాలిడేస్‌ను ఆస్వాదిస్తున్న ఫొటోలను ఇద్దరూ కూడా సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఆ వినికిడిని ఈ దృశ్యాలు నిజం చేసినట్టుగా భావిస్తున్నారు క్రీడా, సినీ అభిమానులు.
మహిమా ఏం చేస్తోంది?
లియాండర్ కోసం తన కెరీర్‌ను నిర్లక్ష్యం చేసిన మహిమా .. ప్రేమలో అతను చేసిన మోసం నుంచి బయటపడ్డాక బాబీ ముఖర్జీ అనే ఆర్కిటెక్ట్, బిజినెస్‌మన్‌ను పెళ్లిచేసుకుంది. వాళ్లకో కూతురు అరియానా. కానీ పరస్పర విరుద్ధమైన స్వభావాలు.. దాని వల్ల తలెత్తిన స్పర్థల వల్ల మహిమా, బాబీ సఖ్యంగా ఉండలేకపోయారు. కూతురుని పెట్టుకుని విడిగా ఉంటోంది మహిమా. మళ్లీ సినిమా అవకాశాల కోసమూ ప్రయత్నిస్తోంది.
లియాండర్ పేస్ గొప్ప టెన్నిస్ ప్లేయర్ కావచ్చు. కానీ నాతో మాత్రం ఫెయిర్‌గా లేడు. అతను ఇంకో స్త్రీ చుట్టూ తిరుగుతున్నాడనే నిజం తెలిసినప్పుడు నేనేమంత షాక్ అవలేదు. ఎందుకంటే అప్పటికే అతనెలాంటివాడో తెలిసిపోయింది. అందుకే ఆ బ్రేకప్ కూడా నా మీద పెద్దగా ప్రభావం చూపలేదు. ఒకరకంగా నాకు హెల్పే చేసింది. నాలో పరిణతిని పెంచింది! – ఒక ఇంటర్వ్యూలో లియాండర్ పేస్ గురించి మహిమా చౌధరి.
-ఎస్సార్
Comments
Please login to add a commentAdd a comment