Love Breakup
-
లవ్ బ్రేకప్ చెప్పడంతో ప్రియురాలిపై కత్తితో దాడి
హైదరాబాద్: లవ్ బ్రేకప్ చెప్పడంతో ఓ ప్రియుడు ప్రియురాలిపై కత్తితో దాడికి పాల్పడి తాను కూడా కత్తితో పొడుచుకొని ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డ ఘటన శనివారం కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. డీఏఈ కాలనీకి చెందిన మెరుగు వన్ష్ (21) మౌలాలి ఎంజే కాలనీలో నివసించే యువతి (21) ఇద్దరు చిన్ననాటి మిత్రులు. ఒకే స్కూల్లో చదువుకున్న వారు చిన్ననాటి నుంచే స్నేహంగా ఉంటూ వస్తున్నారు. వారి స్నేహం కాస్తా ప్రేమగా మారి ప్రేమికులయ్యారు. ప్రస్తుతం వారు కీసరలోని గీతాంజలి ఇంజినీరింగ్ కళాశాలలో ఫైనల్ ఇయర్ చదువుతున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఏం జరిగిందో తెలియదు కానీ శుక్రవారం అమ్మాయి లవ్ బ్రెకప్ చెప్పింది. దీంతో మనసులో కక్ష పెట్టుకున్న వన్ష్ ప్రియురాలిని చంపి తాను కూడా చనిపోవాలని పథకం వేసుకున్నాడు. శనివారం తన ప్రియురాలికి ఫోన్ చేసి చివరిసారిగా ఒక్కసారి మాట్లాడుకుందా అంటూ నమ్మించి పిలిపించాడు. అలా ఇద్దరు కలిసి కారులో డీఏఈ కాలనీకి వెళ్లారు. కాలనీలో ఓ మూలన కారు పార్కు చేసి కారు అద్దాలు వేసుకొని మాట్లాడుకున్నారు. ఎందుకు బ్రేకప్ చెబుతున్నావంటూ కొద్దిసేపు వాదించుకున్నారు. ఈ క్రమంలోనే ఒక్కసారిగా కత్తి తీసి ప్రియురాలి, పొట్ట, మెడపై విచక్షణ రహితంగా పొడవడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో వన్ష్ కూడా పొట్టలో పొడుచుకొని ఆత్మహత్యయత్నం చేశాడు. ఆమె కేకలు వేయడంతో గమనించిన కాలనీవాసులు, సీఐఎస్ఎఫ్ సిబ్బంది కారు వద్దకు వెళ్లి కారు అద్దాలు పగులగొట్టి కారు డోర్ తెరిచారు. వారిని స్థానిక ఎన్ఎఫ్సీ సంజీవని ఆసుపత్రికి తరలించి ప్రాథమిక వైద్యం అందించారు. ఘటనపై వివరాలు సేకరించి కేసు నమోదు చేసినట్లు ఇన్స్పెక్టర్ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. ప్రస్తుతం ఇద్దరి ప్రాణాలకు హాని లేదన్నారు. -
సుశాంత్‌తో బ్రేకప్‌పై హీరోయిన్ ఆసక్తికర వ్యాఖ్యలు
బాలీవుడ్ స్టార్ సుశాంత్ సింగ్ మరణం ఇప్పటికీ మిస్టరీగానే మిగిలింది. ఆయన మరణించి మూడేళ్లు దాటిన(2020 జూన్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు).. ఇప్పటికీ ఆయన గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి. ఆయన మాజీ ప్రియురాలు అంకిత లోఖండేతో పాటు అతన్ని పెళ్లి చేసుకోవాలనుకున్న రియా చక్రవర్తి.. ఇప్పటికీ సుశాంత్‌ని తలచుకొని బాధపడుతుంటారు. తాజాగా హీరోయిన్ అంకితా లోఖండే..సుశాంత్‌తో బ్రేకప్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. సుశాంత్‌ని తాను ఎంతగానో ప్రేమించానని, కానీ ఇతరుల మాటలను విని తనకు బ్రేకప్ చెప్పాడని ఆవేదన వ్యక్తం చేసింది. ‘మేమిద్దరం విడిపోవడానికి పెద్ద కారణాలేవి లేవు. సుశాంత్ విడిపోదామని చెప్పగానే నేను షాకయ్యాను. ఆయన నిర్ణయంతో రాత్రికి రాత్రే నా జీవితంలోని పరిస్థితులన్నీ మారిపోయాయి. బ్రేకప్ ఎందుకు చెప్పాడో తెలియదు. కానీ అతని నిర్ణయాన్ని మాత్రం తప్పుబట్టాలని నేను ఎప్పుడు అనుకోలేదు. ఎదుట వాళ్ల మాటలు విని ఆయన నాకు బ్రేకప్ చెప్పాడేమో అనిపిస్తుంది’అని అంకితా లోఎఖండే చెప్పుకొచ్చింది. కాగా, సుశాంత్ ఇండస్ట్రీకి అడుగుపెట్టిన తొలినాళ్లలోనే అంకితతో పరిచయం ఏర్పడింది. ఇద్దరు కలిసి ఓ సీరియల్లో నటించారు. ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. అయితే సుశాంత్ హీరోగా మారిన తర్వాత పరిస్థితులు మారాయి. వీరిద్దరు విడిపోయారు. ఆ తర్వాత సుశాంత్.. రియా చక్రవర్తితో ప్రేమాయణం కొనసాగించాడు. ఇద్దరు కలిసి పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ అనుహ్యంగా 2020లో ఆత్మహత్య చేసుకున్నాడు. -
రష్మికతో టచ్‌లో ఉన్నా.. మెసేజ్‌లు కూడా చేసుకుంటాం: రక్షిత్ శెట్టి
ఎవరికై నా అదృష్టం ఎంత అవసరమో అన్నది హీరోయిన్ రష్మిక మందన్నను చూస్తే తెలుస్తుంది. కొందరికి అందం ప్రతిభా ఉన్నా లక్కు దోబూచులాడుంది. అది లేకపోతే ఎన్ని ఉన్నా పైకి రావడం సాధ్యం కాదు. నటి రష్మిక విషయంలో అదృష్టమే కీలకం అయ్యిందని చెప్పక తప్పదు. 2016 కిరాక్ పార్టీ అనే కన్నడ చిత్రం ద్వారా కథానాయకిగా పరిచయమైన డ్యూటీ రష్మిక మందన్న. తొలిచిత్రమే మంచి విజయాన్ని సాధించడంతో ఈ కన్నడ బ్యూటీకి వెంటనే టాలీవుడ్ నుంచి పిలుపు వచ్చింది. అలా అక్కడ ఛలో అనే చిత్రంలో కథానాయకిగా నటించింది ఆ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఇక్కడే రష్మిక మందన్న అదృష్టం ఏమిటో అర్థం అయిపోతుంది. ఆ తర్వాత గీత గోవిందం చిత్రం ఈ అమ్మడిని క్రేజీ హీరోయిన్ను చేసేసింది. ఇక ఆ తర్వాత అల్లు అర్జున్‌తో జతకట్టిన పుష్ప చిత్రం స్టార్ హీరోయిన్ను చేయడంతో పాటు బాలీవుడ్‌కు తీసుకెళ్లింది. అయితే కోలీవుడ్‌లో ఈమెకు లక్కు అనే మ్యాజిక్కు పెద్దగా పనిచేయలేదు. అదేవిధంగా బాలీవుడ్లో నటించిన రెండు చిత్రాలు ఆశించిన విజయాలను సాధించలేదు. త్వరలో తెరపైకి రానున్న యానిమల్ చిత్రం రిజల్ట్ కోసమే రష్మిక మందన్న ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉందని చెప్పవచ్చు. ఇక ఈమె వ్యక్తిగత విషయాలు గురించి చెప్పాలంటే చాలా కథలే ఉన్నాయి. కన్నడంలో నటించిన తొలి చిత్రం షూటింగ్ దశలోనే ఆ చిత్ర హీరో రక్షిత్ శెట్టి ప్రేమలో పడింది. వీరిద్దరి ప్రేమ వ్యవహారం పెళ్లి వరకు వెళ్లింది. అయితే ఆ తర్వాత అది ముందుకు సాగలేదు. పెళ్లి పీటలూ ఎక్కలేదు. ఇక గీత గోవిందం చిత్రం తర్వాత ఆ చిత్ర కథానాయకుడు విజయ్ దేవరకొండతో చెట్టాపట్టాల్ అంటూ ప్రచారం బాగానే జరిగుతుంది. వీరిద్దరూ సహజీవనంలో ఉన్నారనే మాటా వినిపిస్తోంది. అయితే అలాంటి వార్తలను రష్మిక ఖండించింది. ఫ్రెండ్స్ మాత్రమే అని స్పష్టం చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో రష్మిక మందన్న మాజీ ప్రియుడు రక్షిత్ శెట్టి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఇటీవల ఒక భేటీలో పేర్కొంటూ తాను నటి రష్మిక మందన్నతో ఇప్పటికీ టచ్‌లోనే ఉన్నాం అని పేర్కొన్నారు. ఫోన్ ద్వారా మెసేజ్‌లు చేసుకుంటామని, చిత్రాలు విడుదల సమయంలో ఒకరికొకరు అభినందనలు తెలుపుకుంటామని చెప్పారు. రష్మిక ముందన్న నటిగా చాలా కలలు ఉన్నాయని, దాన్ని కరెక్ట్ గా అర్థం చేసుకొని ఇప్పుడు నేషనల్ క్రష్ అయ్యిందని పేర్కొన్నారు. ఈయన వ్యాఖ్యలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. -
ఓ వ్యక్తిని పిచ్చిగా ప్రేమించా.. జీవితం నాశనమైంది: హీరోయిన్
తమిళసినిమా: కోలీవుడ్‌లో విక్రమ్‌కు జంటగా నటించి మెరిసిన ఉత్తరాది భామ కిరణ్. ఆ తరువాత అజిత్, కమలహాసన్ వంటి ప్రముఖ నటులతో నటించి అగ్రస్థాయికి చేరుకుంది. అందాలారబోతకు వెనుకాడని నటి ఈ అమ్మడు. అలా మంచి ఫామ్‌లో ఉన్న కిరణ్ అనూహ్యంగా సినిమాలకు దూరమైంది. అలా చాలాకాలం తర్వాత మళ్లీ సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యింది. ఆ మధ్య కార్తీ కథానాయకుడిగా నటించిన శకుని చిత్రంలో చిన్న పాత్రలో నటించింది. (చదవండి: తగ్గేదే లే..ఆపేదేలే..అనుకున్నా..!) తాజాగా నటుడు విజయ్ కథానాయకుడుగా నటిస్తున్న లియో చిత్రంలో నటించినట్లు కిరణ్ పేర్కొంది. ఆమె మాట్లాడుతూ తాను ఒక వ్యక్తిని పిచ్చిగా ప్రేమించానని చెప్పింది. అతన్నే పెళ్లి చేసుకోవాలని కోరుకున్నానంది. అయితే ఆ ప్రేమ ఫెయిల్ అయ్యిందని చెప్పింది. దాంతో తన మనసు ముక్కలైపోయిందని పేర్కొంది. సినిమాలు కొద్ది కాలం లేకపోవడానికి ప్రేమలో ఓడిపోవడమే కారణం అని చెప్పింది. అప్పుడు సరిగా ఉన్నట్లయితే నటిగా మంచి స్థాయికి చేరుకునేదానినంది. తప్పుడు నిర్ణయం కారణంగానే తమ జీవితం నాశనమైందని ఆవేదనను వ్యక్తం చేసింది. ఇప్పుడు మళ్లీ నటించాలని కోరుకుంటున్నానని అయితే ఎవరు అవకాశాలు ఇవ్వడం లేదని చెప్పింది. తాను మొదట్లో ఐదు విజయవంతమైన చిత్రాలు నటించినా ఇప్పుడు ఒక్కరు కూడా తనను నటించడానికి పిలవకపోవడం బాదాకరమన్నారు. కొత్త దర్శకుల చిత్రాల్లో నటించడానికి కూడా రెడీ అని కిరణ్ పేర్కొంది. -
అజయ్ జడేజా బ్రేకప్ స్టోరీ: మ్యాచ్ ఫిక్సింగ్.. మాధురీ దీక్షిత్‌ని దూరం చేసిందా!
అజయ్ జడేజా పేరు తెలియని క్రికెట్ అభిమానులు ఉండరు.. మాధురీ దీక్షిత్‌ను గుర్తుపట్టని సినీ ప్రేక్షకులు ఉండరు.. ఓ వెలుగు వెలిగిన తారలు.. వారి వారి రంగాల్లోని వాళ్ల గ్లామర్.. సంపాదించుకున్న పాపులారిటీ ఒకరితో ఒకరు ప్రేమలో పడేలా చేసింది. కానీ పెళ్లిదాకా తీసుకెళ్లలేదు. అర్ధాంతరంగా ముగిసిన ఆ లవ్ స్టోరీ ఏంటంటే... ఇది 1990ల కథ.. ఓ మ్యాగజైన్ కోసం ఫొటో షూట్ చేయడానికి అజయ్ వెళ్లాడు. అక్కడ కలిసింది మాధురీ దీక్షిత్. అప్పటిదాకా ఆమె సినిమాలు చూశాడు.. ఆమె అభినయానికి ఆరాధకుడయ్యాడు. ఆ వెండితెర వేలుపు తన కళ్ల ముందే కొలువుదీరేసరికి అప్రతిభుడయ్యాడు. ఆ అందానికి ముగ్ధుడయ్యాడు. ఆమె నవ్వుకి పడిపోయాడు. అజయ్ జడేజా గురించి మాధురీ విన్నది. కానీ చూడ్డం అదే మొదలు. ఆ పరిచయానికి తనూ కాస్త ఎగ్జయిట్ అయింది. ఇద్దరి మధ్యా స్నేహం మొదలైంది. అప్పటికే..సంజయ్ దత్తో ప్రేమ, అతను టాడా కేసులో ఇరుక్కోవడం.. ఆ నేపథ్యంలో మాధురీని మీడియా ఫోకస్ చేయడం.. వంటి చిక్కులు, చికాకుల్లో ఉంది. మాధురీ.. దిగులు, కలత, కలవరం గూడులో దాక్కునుంది. అలాంటి సమయంలో అజయ్ పరిచయం.. స్నేహం ఆమెకు కాస్త ఊరటనిచ్చాయి. అతని హాస్య చతురత ఆమెలో ఉత్సాహాన్ని, జీవనాసక్తినీ పెంచింది. తనకు తెలియకుండానే అతనితో ప్రేమలో పడింది. మాధురీకి తన మీదున్న ప్రేమను సినిమా రంగంలో తన ఎంట్రీకి పాస్‌గా ఉపయోగించుకోవాలనుకున్నాడు అజయ్. మైదానంలో సిక్సర్లు కొట్టినంత తేలికగా తెర మీద హీరోయిక్ స్టంట్లు చేయాలని ఉబలాటపడ్డాడు. ఆ విషయాన్ని మాధురీ చెవిలో వేశాడు. సినిమాల్లోకి రావాలనుకున్న అజయ్‌కు వెన్నుదన్నుగా నిలబడాలనుకుంది. తనకు బాగా పరిచయం ఉన్న నిర్మాతలందరినీ అతనికి పరిచయం చేసింది. వాళ్లకు అతణ్ణి రికమెండ్ చేసింది. ఈ ఇద్దరి మధ్య ఉన్న ఆ చనువు చూసి బాలీవుడ్లో గుసగుసలు మొదలయ్యాయి. ఆ టైమ్‌లోనే ఈ జంట ఓ మ్యాగజైన్ మీద కవర్ ఫొటోగా అచ్చయింది. దాంతో ఆ గుసగుసలు పెళ్లి చేసుకుంటారనే వదంతుల రూపం తీసుకున్నాయి. ఇటు సినిమా ఇండస్ట్రీ, అటు క్రికెట్ ఫీల్డ్కీ చేరాయి. ఈలోపే.. క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ సంచలనం అయింది. అందులో అజయ్ పేరూ వినిపించింది. పత్రికల నిండా అవే వార్తలు. మళ్లీ నిరాశ, నిస్పృహలు ఆవహించాయి మాధురీని. ‘అలాంటిదేమీ లేదు.. పట్టించుకోవద్దు’ అని చెప్పే ప్రయత్నం చేశాడు అజయ్. ఆ మాటను నమ్మింది ఆమె. కానీ ఈలోపే అజయ్ తల్లిదండ్రులకు వాళ్ల ప్రేమ విషయం తెలిసింది. అజయ్ వాళ్లది రాజకుటుంబం. ఆ ఇంటి కోడలు ఓ సినిమా యాక్టరా? వీల్లేదు అంటూ ఫత్వా జారీ చేశారని ఓ వార్త. అదలా ఉంచితే మ్యాచ్ ఫిక్సింగ్‌లో దోషిగా తేలాడు అజయ్. ఇన్ని గందరగోళాల మధ్య ఆ రిలేషన్‌ను ముందుకు తీసుకెళ్లాలనుకోలేదు మాధురీ. అంతకుముందు ఆమె కుటుంబం అజయ్ పట్ల సానుకూల దృక్ఫథంతోనే ఉంది. కానీ ఎప్పుడైతే మ్యాచ్ ఫిక్సింగ్‌లు, మాధురీ పట్ల అతనింట్లో వాళ్లకున్న అభిప్రాయం తెలిసేసరికి ఆమె ఇంటి వాళ్లూ ఆ సంబంధం పట్ల మొగ్గు చూపలేదు. ఆ ప్రేమకు చరమగీతం పాడి.. మనసులోంచి అజయ్‌ను చెరిపేసుకొమ్మనే సలహా ఇచ్చారు. అజయ్ జడేజా నుంచి సానుకూల స్పందన వస్తుందేమోనని చూసింది. కనీసం వివరణ కూడా ఇవ్వలేదు అతను. ఇవన్నీ గ్రహించిన మాధురీ కుటుంబం మళ్లీ ఆమె దిగులు లోకం తలుపు తట్టకముందే అమెరికా సంబంధం తెచ్చారు. అతనే డాక్టర్ శ్రీరామ్ నేనే. తర్జనభర్జనలేమీ లేకుండా మీమాంసేదీ పెట్టుకోకుండా శ్రీరామ్‌కు ఓకే చెప్పింది. అతని జీవితభాగస్వామై అమెరికా వెళ్లిపోయింది. ఇక్కడ అజయ్ జడేజా కూడా ఎలాంటి శషభిషలు లేకుండా జయ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ∙ఎస్సార్ -
మహిమాతో బ్రేకప్.. రియాతో సహజీవనం.. లియాండర్ పేస్ బ్రేకప్ స్టోరీ
ఆట లౌక్యాన్ని ప్రదర్శిస్తుంది.. నటన భావోద్వేగాన్ని అనుసరిస్తుంది! ఈ రెండిటి మధ్య ప్రేమ కుదిరితే లౌక్యం గెలుస్తుంది.. భావోద్వేగం వీలైతే సర్దుకుపోతుంది.. వీల్లేకపోతే ఓటమిని అంగీకరిస్తుంది.. బాలీవుడ్‌తో టెన్నిస్ కూడా ప్రేమలో పడింది. ఆ జంటే మహిమా చౌధరి, లియాండర్ పేస్!! లియాండర్, మహిమా.. ఒకరికొకరు పరిచయం అయ్యేనాటికి ఇద్దరూ వాళ్ల వాళ్ల కెరీర్లో ఉచ్ఛస్థితిలో ఉన్నారు. ఒక పార్టీలో కలుసుకున్నారు ఇద్దరికీ కామన్‌గా ఉన్న స్నేహితుల ద్వారా. తొలి చూపులోనే మహిమాతో ప్రేమలో పడ్డాడు లియాండర్. అతని ప్రేమను చూసి మురిసిపోయింది మహిమా. కెరీర్ కన్నా అతనితో కలసి ఆస్వాదించే కాలానికే ప్రాధాన్యమిచ్చింది. ఇంకా చెప్పాలంటే లియాండర్ కెరీరే ముఖ్యమనుకుంది. అందుకే టెన్నిస్ ఆడడానికి అతను ఎక్కడికి వెళ్లితే అక్కడికి వెంటే వెళ్లింది. అతని బాగోగులను పట్టించుకుంది. అలా మూడేళ్లు సంతోషంగా గడిచిపోయాయి ఆ ఇద్దరి జీవితంలో! 2003... నెమ్మదిగా లియాండర్ పేస్ మది చలించసాగింది. కళ్లు ఇంకొకరి కోసం వెదకసాగాయి. ఆమె ఎవరో కాదు ప్రముఖ మోడల్ రియా పిళ్లై. ఎక్కడో ఈవెంట్లో ఆమెను చూశాడు. ఇట్టే మనసు పారేసుకున్నాడు. ఆ విషయం రియాతో చెప్పాడు కూడా. అప్పటికే సంజయ్ దత్తో వైవాహిక బంధాన్ని తెగతెంపులు చేసుకున్న రియా.. టెన్నిస్ స్టార్ లియాండర్ పేస్ ప్రేమ అభ్యర్థనను అంగీకరించింది. ఫోన్ కబుర్లు, డిన్నర్ డేట్లు షెడ్యూల్లో భాగమయ్యాయి. రియాకు తన టైమ్ ఇవ్వడం వల్ల సహజంగానే మహిమాకు దూరమవసాగాడు లియాండర్. గ్రహించింది ఆమె. కారణం అడిగింది. ‘చూస్తున్నావ్ కదా మ్యాచ్‌లు, ఎండార్స్‌మెంట్స్‌తో బిజీగా ఉంటున్నాను’ అని చెప్పాడు పొడిపొడిగా. ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్లో లియాండర్ ఎంగేజ్ అవడం మహిమా ఆలోచనల్లో అనుమానానికి తావిచ్చింది. ఒకసారి రియాతో అతను మాట్లాడుతుండగా విన్నది కూడా. నిలదీసింది. అప్పుడూ అదేం లేదంటూ ఆ సందర్భాన్ని తప్పించాడు. అయినా మహిమా మనసు లియాండర్ ప్రవర్తనను తప్పుపడుతూనే ఉంది. అందుకే లియాండర్ చెప్పే మాటలను నమ్మలేదు. ఒకసారి.. లియాండర్.. రియాతో చనువుగా ఉండడాన్ని చూసింది మహిమా. ‘ఇప్పుడు ఏం మాయ చేసి.. ఏ అబద్ధం చెప్పి దాటవేస్తావ్?’ అని ప్రశ్నించింది కళ్ల నిండా నీళ్లతో. తలవంచుకున్నాడు లియాండర్. చెదిరిన మనసుతో అతని జీవితం నుంచి తప్పుకుంది మహిమా. సహజీవనం మహిమాతో బ్రేకప్ తర్వాత వెంటనే రియాతో సహజీవనం స్టార్ట్ చేశాడు లియాండర్. 2005 –08 మధ్యలో ఆ ఇద్దరూ ముంబైలోని కొలాబాలో పెళ్లీ చేసుకున్నారని వదంతి. ఆ ఇద్దరికీ కూతురు పుట్టింది. పేరు అయానా. సంతోషంగా సాగిపోతోంది వాళ్ల కాపురం అనే అనుకున్నారు లియాండర్ అభిమానులు.. 2014లో లియాండర్, అతని తండ్రి మీద రియా డొమెస్టిక్ వయొలెన్స్ కేస్ పెట్టేదాకా. ఆ వార్త విని అంతా హతాశులయ్యారు. కూతురి కస్టడీ కోసమూ కేస్ ఫైల్ చేసింది రియా. వాళ్ల ప్రేమ.. అలా వివాదంగా ఎందుకు మారిందనే ఆరా మొదలైంది రియా అభిమానుల్లో. ‘రియా కోసం నన్ను మోసం చేసినట్టే ఇంకెవరికోసమో రియానూ మోసం చేసి ఉంటాడు’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది మహిమా. ఆమె అన్నట్టుగానే కొన్నాళ్లకే.. టెన్నిస్ క్రీడాకారిణి తన్వీ షాతో లియాండర్ ప్రేమలో పడ్డాడనే వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తల్లోని సత్యాన్ని ఇటు లియాండర్ కానీ అటు తన్వీ కాని నిర్ధారించలేదు. కానీ ప్రస్తుతమైతే లియాండర్.. బాలీవుడ్ నటి కిమ్ శర్మతో రిలేషన్షిప్లో ఉన్నాడని వినికిడి. వాళ్లిద్దరూ కలసి గోవాలో హాలిడేస్‌ను ఆస్వాదిస్తున్న ఫొటోలను ఇద్దరూ కూడా సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఆ వినికిడిని ఈ దృశ్యాలు నిజం చేసినట్టుగా భావిస్తున్నారు క్రీడా, సినీ అభిమానులు. మహిమా ఏం చేస్తోంది? లియాండర్ కోసం తన కెరీర్‌ను నిర్లక్ష్యం చేసిన మహిమా .. ప్రేమలో అతను చేసిన మోసం నుంచి బయటపడ్డాక బాబీ ముఖర్జీ అనే ఆర్కిటెక్ట్, బిజినెస్‌మన్‌ను పెళ్లిచేసుకుంది. వాళ్లకో కూతురు అరియానా. కానీ పరస్పర విరుద్ధమైన స్వభావాలు.. దాని వల్ల తలెత్తిన స్పర్థల వల్ల మహిమా, బాబీ సఖ్యంగా ఉండలేకపోయారు. కూతురుని పెట్టుకుని విడిగా ఉంటోంది మహిమా. మళ్లీ సినిమా అవకాశాల కోసమూ ప్రయత్నిస్తోంది. లియాండర్ పేస్ గొప్ప టెన్నిస్ ప్లేయర్ కావచ్చు. కానీ నాతో మాత్రం ఫెయిర్‌గా లేడు. అతను ఇంకో స్త్రీ చుట్టూ తిరుగుతున్నాడనే నిజం తెలిసినప్పుడు నేనేమంత షాక్ అవలేదు. ఎందుకంటే అప్పటికే అతనెలాంటివాడో తెలిసిపోయింది. అందుకే ఆ బ్రేకప్ కూడా నా మీద పెద్దగా ప్రభావం చూపలేదు. ఒకరకంగా నాకు హెల్పే చేసింది. నాలో పరిణతిని పెంచింది! – ఒక ఇంటర్వ్యూలో లియాండర్ పేస్ గురించి మహిమా చౌధరి. -ఎస్సార్ -
ధోనితో బ్రేకప్‌పై లక్ష్మీరాయ్ షాకింగ్ కామెంట్!
Dhoni And Raai Laxmi Breakup Story: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ, దక్షిణాది హాట్ భామ లక్ష్మీరాయ్ మధ్య అప్పట్లో లవ్ ట్రాక్ నడిచిన విషయం తెలిసిందే. 2008లో ఐపీఎల్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా ధోనీ ఉన్నప్పుడు.. ఆ జట్టు ప్రచారకర్తగా లక్ష్మీరాయ్ వ్యవహరించింది. ఆ సమయంలోనే ఇద్దరి మధ్య స్నేహం చిగురించి.. ప్రేమ మొగ్గ తొడిగిందని అంటారు. అప్పట్లో ఈ ఇద్దరూ డేటింగ్ చేసినట్టు కథనాలు హల్చల్ చేశాయి. అయితే, ఈ ఇద్దరి మధ్య అనుబంధం ఎక్కువకాలం కొనసాగలేదు. 2009లో వీరిద్దరు బ్రేకప్ చెప్పుకున్నారు. ఆ తర్వాత ధోని సాక్షిని పెళ్లి చేసుకున్నాడు. రాయ్ లక్ష్మీ మాత్రం ఇప్పటికీ వివాహం చేసుకోలేదు. ఇదిలా ఉంటే తాజాగా ఈ హాట్ బ్యూటీ ఓ ఇంటర్వ్యూలో ధోనితో బ్రేకప్ గురించి చెప్పుకొచ్చింది. ధోనితో కొనసాగించిన రిలేషన్ తన జీవితంలో ఓ మచ్చగా మిగిలిపోయిందని పేర్కొంది. తనతో బ్రేకప్ జరిగి 12 ఏళ్లు గడిచిన.. ఈ విషయం ఇప్పటికీ తనను వెంటాడుతూనే ఉందన్నారు. ధోని గురించి మీడియాలో ఏదైన చర్చ వస్తే.. తన పేరును ప్రసావిస్తున్నారని వాపోయింది. తనకు పెళ్లై, పిల్లకు పుట్టినా.. ధోనితో అఫైర్ గురించి మాట్లాడుతూనే ఉంటారేమోనని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. తాము బ్రేకప్ చెప్పుకున్నప్పటికీ.. ఒకరిపై ఒకరికి గౌరవం ఉందన్నారు. ధోనీ తర్వాత తన జీవితంలో చాలా బ్రేకప్స్ జరిగాయని, కానీ వాటిని ఎవరూ గమనించలేదని చెప్పింది. ప్రస్తుతం తన దృష్టి కెరీర్ పైనే ఉందని, పెళ్లి ఆలోచన ఇప్పట్లోదేని స్పష్టం చేసింది. -
నగ్మాతో గంగూలీ పీకల్లోతు ప్రేమ.. ఆ ఫోటోలు చూసి డోనా ఫైర్..బ్రేకప్ స్టోరీ
‘ఉరుము ఉరిమి మంగలం మీద పడ్డట్టు’ అనే జాతీయం తెలుసు కదా! అభిమాన క్రికెటర్ ఆశించిన ఆటతీరును కనబర్చలేకపోతే ఆ ఆటగాడి స్నేహితురాలో.. ప్రేమికురాలో ఆ నిందను మోయాల్సి వస్తోంది! క్రికెట్ అభిమానుల ఈ ఆగ్రహం సర్వసాధారణమైపోయింది.. ఈ రీతికి అనుష్కా శర్మనే కాదు.. అంతకుముందే నటి నగ్మా కూడా బలైంది!! ఎవరి విషయంలోనో చెప్పేలోపే ఆ వ్యక్తి మీ ఊహకు అందే ఉంటాడు.. సౌరవ్ గంగూలీ అని!! 1999.. వరల్డ్ కప్ మ్యాచ్ రోజులవి.. అప్పుడే కామన్ ఫ్రెండ్స్ ద్వారా సౌరవ్‌కి నగ్మా పరిచయం అయింది. లౌక్యం తెలియని ఆమె ప్రవర్తన అతణ్ణి ఆకట్టుకుంది. నగ్మాకూ అంతే.. ఇండియన్ క్రికెట్ టీమ్ కెప్టెన్‌గా ఉన్న సౌరవ్ పాపులారిటీ కన్నా అతని స్నేహపూర్వకమైన నడతే నచ్చింది. అన్ని జంటల ప్రయాణంలాగే ఈ జంట ప్రయాణమూ పరిచయం.. స్నేహం మీదుగా ప్రేమ పిచ్ చేరుకుంది. ఎప్పటిలాగే మీడియా ఆ కబుర్లను దేశమంతా బట్వాడా చేసింది. ఆ ప్రేమ వ్యవహారంలో పడిపోయి సౌరవ్ ఆట మీద దృష్టి పెట్టలేకపోతున్నాడనే విమర్శలనూ వినిపించింది. వరల్డ్ కప్ చేజారిపోవడానికీ సౌరవ్ ఏకాగ్రత లోపమనీ.. దానికి కారణం నగ్మాయేననీ క్రికెట్ అభిమానులు.. సౌరవ్ వీరాభిమానులూ తీర్మానం చేశారు. సౌరవ్ సారథ్యంలోని జట్టు ఎక్కడ ఏ మ్యాచ్ ఓడిపోయినా ‘అంతా నీవల్లే.. నీవల్లే’ అంటూ నగ్మాను ట్రోల్ చేయసాగారు. అన్నిటినీ సహించింది నగ్మా. కానీ డోనా భరించలేకపోయింది. ఆ ట్రోలింగ్స్‌ను కాదు.. భర్త ప్రవర్తనను. నగ్మాతో ప్రేమలో పడేటప్పటికే సౌరవ్ .. డోనాకు భర్త. ఆమె.. అతని చిన్ననాటి స్నేహితురాలు. మనసిచ్చి.. పుచ్చుకున్న నెచ్చెలి. పెద్దవాళ్లను ఎదిరించి మరీ డోనాను పెళ్లాడాడు. తర్వాత రెండేళ్లకే నగ్మా ఎదురైంది. అతని మనసు గెలుచుకుంది. తర్వాత కథనంతా మీడియాలో వినింది.. చదివింది.. కనింది డోనా. అవన్నీ రూమర్సే అని తేలిగ్గా తీసుకుంది కూడా.. నగ్మా, సౌరవ్ తిరుపతి వచ్చి దర్శనం చేసుకున్నారని.. రహస్యంగా పెళ్లీ చేసుకున్నారనే వార్త వచ్చే వరకూ. వట్టి వార్తగానే వస్తే దాన్నీ పట్టించుకోకపోవునేమో డోనా.. కానీ సౌరవ్, నగ్మా ఇద్దరూ కలసి తిరుమలలో దర్శనానికి వెళ్తున్న ఫొటోతో సహా అచ్చయింది పత్రికల్లో. విడాకులకు సిద్ధం.. అందుకే డోనా ఆ వ్యవహారాన్ని తేలిగ్గా తీసుకోలేకపోయింది. ఆ రుజువులు చూపిస్తూ సౌరవ్‌ను నిలదీసింది. ‘ఇవన్నీ రూమర్స్.. మా మధ్య అలాంటిదేం లేదు అంటూ అదే మీడియాకు స్టేట్మెంట్ ఇస్తారా? నన్ను విడాకులు ఇమ్మంటారా?’ అని అడిగింది డోనా .. సౌరవ్‌ను. డోనా స్వరంలోని స్థిరత్వానికి భయపడిపోయాడు సౌరవ్. చైల్డ్‌హుడ్ స్వీట్ హార్ట్.. హార్ట్ బ్రేక్ అయిందని అర్థమైంది ఆ భర్తకు. కళ్లనిండా నీళ్లతో ‘క్షమించు’ అని విన్నవించుకున్నాడు. ‘జీవితంలో ఇలాంటి ఆకర్షణలు సాధారణం. అదే సమయంలో స్థిర చిత్తమూ అవసరం’ అని అనునయిస్తున్నట్టుగా సౌరవ్ చేతిని తన చేతుల్లోకి తీసుకుంది డోనా. అవన్నీ రూమర్సే.. ఆ తర్వాత మీడియాలో స్టేట్మెంట్ వచ్చింది.. ‘నగ్మాతో అలాంటిదేం లేదు.. అవన్నీ రూమర్స్’ అంటూ. అది సౌరవ్, డోనా ఇద్దరి నుంచీ వెలువడింది. ఇప్పుడు నగ్మా హర్ట్ అయింది. మౌనంగా ఏడ్చింది. సౌరవ్ మాటకు గౌరవం ఇచ్చి అతని జీవితంలోంచి తప్పుకుంది. ఒంటరిగానే జీవితం కొనసాగిస్తోంది. అయితే.. నగ్మా, సౌరవ్ తమ ప్రేమను మీడియా ముఖంగా ఎప్పుడూ నిర్ధారించలేదు. ‘ఇద్దరికీ సంబంధించిన ఒక వ్యవహారంలో ఒకరికి కెరీర్ ప్రధానమైనప్పుడు ఇంకొకరు దాని పర్యవసానాల బరువును మోయాల్సి వస్తుంది. అయినా నాతోనే ఉండాలనే ఈగోకి వెళ్లే బదులు ఆ అనుబంధాన్ని తెంచుకొని బయటకు రావడమే మంచిది. అవతలి వ్యక్తి ఆశయం కోసం మన ఆసక్తి, ఇష్టాలను త్యాగం చేయాల్సి వస్తుంది. వాళ్ల జీవితంలో మన ఉనికి వాళ్లకు సంతోషాన్ని పంచకపోగా నరకాన్ని తలపిస్తుంటే అక్కడి నుంచి మనం తప్పుకోవడమే మేలు’ అని చెప్పింది నగ్మా .. ‘సావి’ పత్రికకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో. ఆ మాటలు సౌరవ్నుద్దేశించేనని భావించారు ఆమె అభిమానులు. - ఎస్సార్ -
కత్రినాతో రణ్‌బీర్ సహజీవనం.. ఆలియా ఎంట్రీతో బ్రేకప్
Karina Kapoor-Ranbir Kapoor Breakup: ‘అవును.. మోసం చేశాను. అవగాహన, అనుభవరాహిత్యం, నా మీద నాకున్న అతివిశ్వాసం, నా మొండితనం వల్ల అవతలి వ్యక్తిని టేకెన్ ఫర్ గ్రాంటెడ్‌గా తీసుకున్నాను. అనుభవం నేర్పిన పాఠంతో రిలేషన్షిప్ విలువ అర్థమైంది’ అని చెప్పాడు రణ్‌బీర్ కపూర్.. దీపిక పడుకోణ్‌తో బ్రేకప్ అయ్యాక చాలా రోజులకు. ఆనాటికి అతను కత్రీనా ప్రేమలో ఉన్నాడు. ఈ ఇద్దరినీ ఒకరినొకరికి పరిచయం చేసింది ఎవరో తెలుసా? దీపిక పడుకోణ్. సందర్భం.. కత్రీనా కైఫ్ బర్త్‌డే పార్టీ. ఆ సమయంలో కత్రీనా ..సల్మాన్‌ఖాన్ ప్రేమలో ఉంది. దీపిక, కత్రీనా ఇద్దరూ మంచి స్నేహితులు. 2008లో తన పుట్టిన రోజు వేడుకకు దీపికాను ఆహ్వానించింది కత్రీనా. అప్పటికి దీపిక, రణ్‌బీర్‌లు డేటింగ్లో ఉన్నారు. ఆ పార్టీకి అతణ్ణి వెంటబెట్టుకెళ్లి.. కత్రీనాకు పరిచయం చేసింది దీపిక. అలా రణ్‌బీర్, కత్రీనాలు ఫ్రెండ్స్ అయ్యారు. ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీకి విపరీతమైన క్రేజ్ ‘అజబ్ ప్రేమ్ కీ గజబ్ కహానీ’ విడుదలైంది. అందులో హీరోహీరోయిన్లు రణ్‌బీర్, కత్రీనాలే. ఆ సినిమాతో వాళ్ల ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీకి విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. తెరబయటా సన్నిహితులైపోయారు. దీపికాతో రణ్బీర్కున్న అనుబంధం పలచనవసాగింది. ఇటు సల్మాన్‌తో కత్రీనా రిలేషన్ కూడా కొన ఊపిరితో ఉండింది. న్యూయార్క్‌లో రణ్‌బీర్, కత్రినాల సెలబ్రేషన్స్ రణ్‌బీర్, కత్రీనాల తర్వాత సినిమా. ఆ సెట్స్‌మీదే ఆ జంట మధ్య ఉన్న స్నేహం ప్రేమగా మారింది. అప్పటిదాకా వదంతులుగా ప్రచారమవుతున్న ఆ వ్యవహారం గురించి నమ్మడం మొదలుపెట్టారు ఇటు సినిమాభిమానులు.. అటు దీపిక, సల్మాన్‌లు. ఆనవాళ్లూ దొరికి ఆ బంధాన్ని బ్రేక్ చేసేసుకున్నారిద్దరూ. రాజ్‌నీతి పూర్తయ్యాక ఆ ఒత్తిళ్ల నుంచి ఉపశమనం కోసం న్యూ యార్క్ వెళ్లారు రణ్‌బీర్, కత్రినా. అక్కడ న్యూ ఇయర్ ఈవ్‌ను సెలబ్రేట్ చేసుకున్నారు. కత్రీనా.. రణ్‌బీర్ కుటుంబానికి దగ్గరైంది. రణ్‌బీర్ కూడా కత్రీనా ఫ్యామిలీకి ఆప్తుడైపోయాడు. కరీనా హింట్‌తో ఫిక్సయ్యారు ఈ ఇద్దరూ స్పెయిన్‌లో హాలీడేస్‌ను స్పెండ్ చేశారు. అక్కడి సముద్రం ఒడ్డున వీళ్లు దిగిన ఫోటోలు ఇంటర్నెట్లో వైరల్ అయ్యాయి. ఇంక ఈ జంట పెళ్లి పీటలెక్కడం ఖాయమనుకున్నాయి బాలీవుడ్ వర్గాలు. దాన్ని బలరపరుస్తున్నట్టుగా కాఫీ విత్ కరణ్ షోలో ‘రణ్‌బీర్, కత్రీనా పెళ్లిలో చిక్నీ చమేలీ (అగ్నీపథ్ సినిమాలోని ఈ స్పెషల్ సాంగ్‌ను కత్రీనా మీద చిత్రీకరించారు) పాట మీద డాన్స్ చేయాలనుకుంటున్నాను’ అని చెప్పింది కరీనా. ఇంటర్వ్యూల్లో ఒకరిపై ఒకరు ప్రేమాభిమానాలు ఆ జంట కూడా తమ వ్యవహారాన్ని రహస్యంగా ఉంచే ప్రయత్నం చేయలేదు. డే అవుట్లు, వీకెండ్ హ్యాంగవుట్లతో పాపరాజీకి కావలసినంత ఫుటేజీ ఇచ్చారు. బాలీవుడ్ ఫంక్షన్లకూ కలిసే వెళ్లి కనువిందు చేశారు. అంతేకాదు.. ‘రణ్‌బీర్ అద్భుతమైన నటుడే కాదు అత్యద్భుతమైన వ్యక్తి కూడా. నా జీవితంలో అతను ప్రత్యేకం. తను నాకెంత దగ్గరివాడో ఈపాటికి అందరూ గమనించే ఉంటారు’ అంటూ కత్రీనా.. ‘నా లైఫ్‌లో కత్రీనాది స్పెషల్ ప్లేస్. నా కుటుంబం, ఆప్తుల వరుసలో తను ముందుంటుంది’అంటూ రణ్‌బీర్ మీడియా ఇంటర్వ్యూలలో ఒకరి మీద ఒకరికున్న ప్రేమాభిమానాలను పంచుకున్నారు. సహజీవనం..నిశ్చితార్థం కూడా... వాళ్ల ప్రేమ కచ్చితంగా పెళ్లిగా మారుతుందనే నమ్మకానికి ఇంకో కారణం.. ఆ ఇద్దరూ కొత్త ఫ్లాట్‌లోకి మారి సహజీవనమూ ప్రారంభించడం. లండన్‌లో ఆ జంటకు ఇరు కుటుంబాల ఆధ్వర్యంలో నిశ్చితార్థం జరిగిందనే వదంతీ వినిపించింది. రేపేమాపో వివాహ ఆహ్వాన∙పత్రిక రావొచ్చనీ ఎదురు చూడసాగారు ఆ జంట సన్నిహితులు. ‘ఈ ఏడాది (2015) ఇద్దరం బిజీయే.. పెళ్లి ఆలోచన కూడా రానంతగా. వచ్చే ఏడు ప్లాన్ చేసుకుంటున్నాం’ అని చెప్పాడు రణ్‌బీర్ కపూర్.. ఆనంద్ బజార్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో. రణ్‌బీర్ లైఫ్‌లోకి ఆలియా ఎంట్రీ ఆ ప్రేమా పెళ్లిదాకా రాలేదు. ఇద్దరూ విడిపోయారు. అలియా భట్‌తో రణ్‌బీర్‌కు కుదిరిన స్నేహమే కత్రీనాతో బ్రేకప్‌కి కారణం అంటారు రణ్‌బీర్ ఫ్రెండ్స్. ‘జగ్గా జాసూస్’ ప్రారంభమయ్యాక వీళ్ల మధ్య పొరపొచ్చాలు పొడచూపాయి. ఆ సినిమా నిర్మాతల్లో కత్రీనా కైఫ్ ఒకరు. షూటింగ్లో ఈ ఇద్దరూ ఎడమొహం పెడమొహంగానే ఉన్నారని వినికిడి. అయితే..వాళ్ల బ్రేకప్ నేపథ్యంలో మీడియాకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో రణ్‌బీర్ ‘మేమిద్దరం విడిపోయామంటూ వస్తున్న వార్తలన్నీ మీడియా ఊహగానాలే. మా మధ్య ఎలాంటి స్పర్థలు లేవు. నన్ను చాలా ప్రభావితం చేసిన వ్యక్తి కత్రీనా. ఆమెతోనే జీవితాన్ని పంచుకుంటాను. ఎట్టి పరిస్థితుల్లో తనను మిస్ చేసుకోను. ఐ నీడ్ హర్ ఇన్ మై లైఫ్’ అని చెప్పాడు. అది ఒట్టి అబద్ధమని ఆ వెంటనే తేలిపోయింది. ‘ప్రాణంగా ప్రేమించి వ్యక్తి నుంచి విడివడి.. నేనుగా నిలబడ్డానికి.. చాలా కష్టపడ్డాను. అస్పష్టతను మించిన నరకం ఉండదు’ అని చెప్పింది కత్రీనా కైఫ్.. జగ్గా జాసూస్ సినిమా విడుదల తర్వాత ఒక ఇంటర్వ్యూలో. ∙ఎస్సార్ -
రెడ్‌హ్యాండెడ్‌గా దొరికి దీపిక కాళ్లు పట్టుకున్నాడు.. రణ్‌బీర్ బ్రేకప్ స్టోరీ
అగర్ తుమ్ సాథ్ హో .. తేరీ నజ్రోమే హై తేరే సప్నే తేరే సప్నోమే మే హై నారాజీ ముఝే లగ్తా హై కె బాతే దిల్ కీ .. హోతీ లఫ్జోంకీ ధోఖేబాజీ తుమ్ సాథ్ హో యా నా హో క్యా ఫర్క్ హై.. బేదర్ద్ థీ జిందగీ బేదర్ద్ హై.. ( నీ కళ్ల నిండా నీ కలలే.. ఆ కలల్లో ఉన్నదంతా బాధే.. మనసులోని ఊసులన్నీ పెదాల మీది గారడీగా అనిపిస్తున్నాయి నాకు.. నువ్వు నా తోడున్నా లేకపోయినా తేడా ఏం ఉంది? అప్పుడూ నిర్దయగానే ఉండింది.. ఇప్పుడూ నిర్దయగానే సాగుతోంది జీవితం) ఈ పాట ‘తమాషా’ సినిమాలోనిది. ఇందులో రణ్‌బీర్ కపూర్, దీపికా పడుకోణ్ హీరోహీరోయిన్లు. ఆ బ్రేకప్ సాంగ్ ఒకరకంగా ఆ ఇద్దరి భగ్నప్రేమకూ తెరరూపంగా కనిపించింది. నిజానికి వాళ్లిద్దరూ నటీనటులుగా కంటే కూడా లవ్బర్డ్స్గానే ప్రాచుర్యం పొందారు. దీపిక.. ప్రేమ పిపాసి. రణ్‌బీర్.. కాసనోవా. అతని చూపులు, మాటలు, చేష్టలకు ఏ అమ్మాౖయెనా పడిపోవాల్సిందే. దీపికా పడిపోయింది. ఫిల్మీ బ్యాక్‌గ్రౌండ్ లేని ఆమెకు రణ్‌బీర్.. అతని చుట్టూ ఉన్న వాతావరణం.. ఆ కుటుంబం అద్భుతంగా కనిపించింది. జీవితం కూడా సినిమాలాగే తోచింది. ఇలలో అతని కథానాయిక తానే అనుకుంది.. నమ్మింది! లంచ్‌తో మొదలై హాలిడే వరకు దీపిక, రణ్‌బీర్‌ల మేకప్ ఆర్టిస్ట్ బృందం ఒకటే. అందులోని ఒక ఆర్టిస్ట్ వల్లే ఆ ఇద్దరూ ఒకరికొకరు పరిచయం అయ్యారు. అలా 2008లో వాళ్లకు స్నేహం కుదిరింది. ముందు లంచ్‌కి కలుద్దామనుకున్నారు. లంచ్ నుంచి సాయంకాలం కాఫీ వరకూ సాగింది ఆ సమావేశం. కాఫీ తాగేసి ఎవరిదారిన వాళ్లు వెళ్లి పోదామానుకున్నారు. కాఫీ తర్వాత చీజ్ కేక్ .. చీజ్ కేక్ నుంచి మిస్టర్ బీన్స్ ‘హాలిడే’ సినిమా దాకా వెళ్లింది వాళ్ల డే షెడ్యూల్. అక్కడితో దీపికకు ‘బై’ చెప్పాలనిపించలేదు రణ్‌బీర్‌కు. ఆమె కళ్లల్లోని అమాయకత్వంలో అతని మనసు చిక్కుకుపోయింది. దీపికను ఇంటి దగ్గర దిగబెట్టే వరకు అమెతో గడిపే టైమ్‌ను పొడిగించుకున్నాడు. ఇల్లొచ్చేసినా వదిలి వెళ్లాలనిపించలేదు అతనికి. ఆమెతోపాటే ఇంట్లోకి నడిచాడు. తెల్లవార్లూ కబుర్లతో ఆమె కళ్లల్లో ఇల్లు కట్టేసుకున్నాడు. రణ్‌బీర్ అంటే దీపికకు ఇష్టం మొదలైపోయింది. ‘బచ్నా ఏ హసీనో’ వాళ్లిద్దరూ కలిసిన నటించి తొలి సినిమా. ఆ సెట్స్ మీద వాళ్ల ప్రేమ ఖరారైంది. దీపికకు ఆశల రుచి చూపించాడు. తన గురించి కలలు కనే హక్కునిచ్చాడు. ఈ దృశ్యాలన్నీ ఆ సినిమా ప్రమోషన్ వేదికల మీద ప్రేక్షకులకు కనిపించాయి. అలరించాయి. అందుకే ‘బచ్నా ఏ హసీనో’ కన్నా దీపికా, రణ్‌బీర్‌ల రియల్ లవ్‌నే ఎక్కువగా ఫీలయ్యారు అభిమానులు. ఆ ఇద్దరి పెళ్లి వార్త మీద ఆసక్తి పెంచుకున్నారు. అయితే బాలీవుడ్ వర్గాల్లో మాత్రం ఆ ఆత్రం కనపడలేదు. ఎందుకంటే రణ్‌బీర్ గురించి వారికి బాగా తెలుసు. ఆ ప్రేమలో అతనికి సీరియస్‌నెస్ లేదని, ఆ ప్లేబాయ్ కత్రీనాతో చేతిలో చేయి వేసి నడుస్తున్నాడనీ తెలుసు. పచ్చబొట్టూ వేసుకుంది రణ్‌బీర్ కేంద్రంగానే ప్రపంచాన్ని అల్లుకుంది దీపిక. అతని బలాన్ని చూసి మురిసిపోయింది. బలహీనతలను ఎంచకుండా ఉండిపోయింది. ఆ ప్రేమను తన మెడ మీద ‘ఆర్కే (రణ్‌బీర్ కపూర్)’ గా పచ్చబొట్టుతో చెక్కుకుంది. నిజానికి ఈ ప్రేమ్ కహానీని ఆద్యంతం గమనిస్తే ఇందులో రణ్‌బీర్ సైలెంట్ లవర్‌గానే ఉన్నాడు. భావోద్వేగాలతో మీడియా ముందు బయటపడింది దీపికానే.. ‘రణ్‌బీరే నా లోకం. తన దగ్గర నేను నేనుగా ఉండగలను. మా రిలేషన్పిప్లోని బ్యూటీ అదే!’ అంటూ. ఈ ధోరణేదీ రణ్‌బీర్ తల్లిదండ్రులకు నచ్చలేదు. ఆమెను ఆ ఇంటి కోడలిగా ఒప్పుకునేది లేదనీ రణ్‌బీర్‌కు స్పష్టం చేశారు. అప్పుడూ మౌనంగానే ఉన్నాడతను అర్థాంగీకారంగా. తెలిసిపోయింది.. నిజం ఎన్నాళ్లో దాగదు. కానీ ముందు బయటవాళ్లకు తెలిశాకే ఐన వాళ్లను చేరుతుంది. కత్రినాతో రణ్‌బీర్ చనువూ అలాగే ఆలస్యంగా తెలిసింది దీపికాకు. కాళ్లబేరానికి వచ్చాడు రణ్‌బీర్ ‘నేనలాంటి వాణ్ణి కాను.. ఇంకొక్క చాన్స్ ఇవ్వమంటూ. క్షమించేసింది. ఆ చాన్స్‌నూ నిలుపుకోలేకపోయాడు. రెడ్‌హ్యాండెడ్‌గా దీపికాకు దొరికిపోయాడు. ఇంక అతనితో కుదరదు.. ఆ ప్రేమ నిలవదు అనుకొని ఆ బంధాన్ని బ్రేక్ చేసుకుంది. మనసారా ఏడ్చింది.. రణ్‌బీర్ అనే బలహీనతను అధిగమించి అతణ్ణి ఓ సహనటుడిగా మాత్రమే అంగీకరించేంతగా! కొత్త ప్రారంభానికి అడుగేసింది. ‘అతను మోసం చేస్తున్నాడని ఫస్ట్‌టైమ్ తెలిసినప్పుడు తప్పు నాదేనేమో అనుకున్నా. ఆ మోసం కంటిన్యూ అవుతోందని గ్రహించాక తప్పు అవతలి వ్యక్తిలోనే ఉందని అర్థమైంది. నన్నో ఫూల్‌ని చేసి ఆడిస్తున్నాడని తెలిశాక ఆ రిలేషన్లో ఉండడం మీనింగ్లెస్. అసలు నేను అతనికి సెకండ్ చాన్స్ ఇచ్చి ఉండాల్సిందే కాదు. కాళ్లావేళ్లా పడితే ఇచ్చాను. అదీ ఒకందుకు మంచిదే అయింది. నా కళ్లముందే పట్టుపడి నా కళ్లు తెరిపించాడు. ఏమీ ఆశించకుండా అతణ్ణి ప్రేమించా. నమ్మకం, గౌరవం పునాదుల మీదే ప్రేమ నిలబడుతుంది. ఆ రెండిటి విలువ అవతలి మనిషికి తెలియనప్పుడు ఆ బంధంలోంచి బయటకు రావడమే మంచిది. బ్రేకప్ తర్వాత ఒక కొత్త మనిషిగా మారాను. నన్నిలా మార్చిన ఘనత అతనిదే. థాంక్స్ టు హిమ్’ అని చెప్పింది దీపిక పడుకోణ్.. ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో. ∙ఎస్సార్ -
పదేపదే అదే కామెంట్.. అందుకే షాహిద్‌కి విద్యాబాలన్ గుడ్‌బై
షా హిద్ కపూర్.. బాలీవుడ్ లవర్ బాయ్. తను కలిసి నటించిన కథానాయికలు అందరి (దాదాపుగా)తో ప్రేమలో పడ్డాడు.. కరీనా కపూర్‌తో అతని లవ్ స్టోరీ మినహా మిగిలినవన్నీ వదంతులుగానే ప్రచారమయ్యాయి. అందులో ఒకటే విద్యాబాలన్‌తో ఇష్క్. ఈ ఇద్దరూ కలిసి నటించిన సినిమా కిస్మత్ కనెక్షన్. దాంతోనే వీళ్ల పరిచయం మొదలైంది. ఆ షూటింగ్ జరుగుతుండగానే ఆ స్నేహం ప్రేమగా మారింది. ఎప్పటిలాగే ఆ ప్రేమ కబుర్లు పుకార్లుగా షికార్లు చేశాయి. వాటిని మీడియా కూడా క్యాచ్ చేసింది. వాటి కోసం పత్రికలు, చానెళ్లలో ప్రముఖ స్థానాన్ని, ప్రైమ్ టైమ్‌నూ కేటాయించింది. ఆ ప్రచారానుసారం షాహిద్, విద్యల ప్రేమ కిస్మత్ కనెక్షన్ విడుదల తర్వాత కొన్ని నెలల వరకూ సాగింది. ఇంక అది పెళ్లితో పదిలం కానుందని షాహిద్ సన్నిహితులు అనుకునేలోపే వాళ్ల బ్రేకప్ వార్త వినిపించింది. కారణం.. షాహిద్ దుందుడుకుతనం, దురుసు ప్రవర్తన అని తేల్చారు ఆ ఇద్దరి సన్నిహితులు. విద్యా బాలన్ వెయిట్ గురించి కామెంట్ చేశాడట షాహిద్. ఒక్కసారి కాదు పదేపదే. గౌరవం లేని ప్రేమ మనజాలదు.. అదెప్పటికైనా ఇద్దరి దారులను వేరు చేయక తప్పదు అని గ్రహించింది విద్యా. మారు మాట్లాడకుండా షాహిద్‌కు గుడ్ బై చెప్పింది... కెరీర్ మీద ప్రేమను పెంచుకుంది. ‘మనం ఇష్టపడేవారు మనల్ని చులకనగా చూస్తుంటే మనసు విరిగి పోతుంది. ఆ చనువును మన చేతకానితనంగా తీసుకుంటే తట్టుకోలేం. నా విషయంలో అదే జరిగింది. ఆ వ్యక్తి .. పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు.. అతని పట్ల నాకున్న ఇష్టాన్ని అలుసుగా తీసుకొని నాలో లోపాలు వెదుకుతూ, వెటకారమాడుతుంటే భరించలేకపోయా. ఆ బంధం కన్నా నా ఆత్మాభిమానాన్ని కాపాడుకోవడం ముఖ్యమనుకున్నా. అందుకే ఆ రిలేషన్లోంచి బయటకు వచ్చేశా’ అని చెప్పింది విద్యాబాలన్ ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో. ఆమె అలా అతని అహంకారాన్ని ప్రశ్నించినా షాహిద్కేమీ పట్టలేదు. ఆ బ్రేకప్ను చాలా తేలికగా తీసుకున్నాడు. అతనూ ఒక ఇంటర్వ్యూలో ‘నా కోస్టార్ట్స్లో ఇద్దరిని అమితంగా ఇష్టపడ్డాను. అందులో ఒకరు ఇష్టపడ్డ మనిషిని మోసం చేయడంలో ప్రసిద్ధులు’ అంటూ పేర్కొన్నాడు. ఆ ఇద్దరిలో ఒకరు కరీనా కపూర్, ఇంకొకరు ప్రియాంక చోప్రానా? లేక విద్యా బాలనా? ఈ ఇద్దరిలో ఆ రెండో వ్యక్తి ఎవరో మీడియాకు అంతుచిక్కలేదు. కాఫీ విత్ కరణ్‌లో... షాహిద్ కపూర్‌తో ఉన్న స్నేహం గురించి విద్యా బాలన్‌ను అడిగాడు కరణ్ జోహార్ తన ‘కాఫీ విత్ కరణ్’ షోలో. ‘కొంత కాలంగా ఎక్కడికి వెళ్లినా ఇదే ప్రశ్న. ఆ పేరుతో నన్ను జత పర్చడం వినీ వినీ విసుగెత్తిపోయా. ఇండస్ట్రీలో ఇంతమంది హీరోలతో నటించా.. ఇంకెవరి పేరుతోనైనా జత చేయండి. అంటే నిప్పు లేందే పొగరాదని కాదు నా ఉద్దేశం.. ఆ నిప్పు రాజేసిన వాళ్ల పేరు చెప్పను అంటున్నానంతే’ అని కౌంటర్ ఇచ్చింది విద్యా బాలన్. ఆ తర్వాత ఇంకేదో సందర్భంలో ఇంకేదో పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘ఎస్.. మేమిద్దరం రిలేషన్లో ఉన్నాం ఒకప్పుడు. అది ఫ్రెండ్షిప్. అతను నా కోస్టార్’ అని బదులిచ్చింది. విద్యాబాలన్ ఇచ్చిన ఈ జవాబుతో షాహిద్ దగ్గర ఇంకేదో రాబట్టాలని చూసిన మీడియాకు నిరాశే ఎదురైంది ‘ఆమెకు నాకు మధ్య ఫ్రెండ్షిప్ కూడా లేదు.. భవిష్యత్‌లో ఆమెతో నటించేదీ లేదు’ అన్న షాహిద్ సమాధానంతో. దీనికీ విద్యా కౌంటర్ ఇచ్చింది.. ‘ఫ్రెండ్షిప్కు అతను ఇచ్చే నిర్వచనమేంటో నాకు తెలీదు కానీ ‘కిస్మత్ కనెక్షన్’ సినిమా టైమ్‌లో మేమిద్దరం మంచి ఫ్రెండ్స్‌మి. మా ఇద్దరి మధ్య మంచి అనుబంధమే ఉండింది.. అయితే అది ప్రేమ కాదు.. అందులో రొమాన్స్ లేదు. నాతో నటించకూడదు అనుకోవడం అతని ఇష్టం. అతని ఆ నిర్ణయంతో నాకేం ఇబ్బంది లేదు.. ఇండస్ట్రీలో అతనొక్కడే హీరో అయితే తప్ప’ అంటూ. ‘హమారీ అధూరీ కహానీ’ సినిమా ప్రమోషన్ సమయంలో విద్యా ‘నా కెరీర్లోనే కాదు జీవితంలోనే స్పెషల్ మూవీ ఇది. షూటింగ్ పూర్తయ్యాక ఒకరకమైన ప్రశాంతతను.. మనశ్శాంతినీ పొందాను. నా ప్రేమ కథ పూర్తయినట్టనిపించింది’ అని చెప్పింది. ఆ మాటలు షాహిద్ గురించేననే కథనాన్ని అల్లేసింది మీడియా. ఏమైనా షాహిద్‌కు విద్యా పట్ల ప్రేమ ఉండిందో లేదో తెలియదు కానీ విద్యా మాత్రం షాహిద్‌ను మనసారా ప్రేమించింది. దీనికి నిదర్శనం.. మీరా రాజ్‌పుత్ షాహిద్‌తో పెళ్లి నిశ్చయం కాగానే విద్యా గురించి ఆరా తీసిందట ఇంకా ఆమె మనసులో అతను ఉన్నాడేమోననే సందేహ నివృత్తి కోసం! కరీనా, విద్యా బాలన్తోనే కాదు షాహిద్ పేరు, ప్రేమ సోనాక్షి సిన్హా, ప్రియాంక చోప్రా, అమృతా రావుతోనూ వినిపించాయి. ఎవరితోనూ సీరియస్‌గా లేడు షాహిద్.. అనే నిందా వినిపించింది.. కనిపించింది.. మీరా రాజ్‌పుత్‌ను జీవితభాగస్వామిగా చేసుకోవడంతో. -ఎస్సార్ -
కంగనా తిట్టినా..చేయి చేసుకున్నా తట్టుకున్నా కానీ...
త్యాగం.. ప్రేను ఓడిస్తుంది.. స్వార్థం.. మనిషిని గెలిపిస్తుంది.. చిత్రంగా రెండూ ప్రేమకు విషాదాంతాలిచ్చేవే! స్వార్థం, త్యాగం పోరులో కంగనా రనౌత్, అధ్యయన్ సుమన్ ప్రేమ కూడా ఓడిపోయింది. చాలా మంది సినిమా వాళ్ల ప్రేమ కథల్లాగే వీళ్ల కథకూ స్టార్టింగ్ పాయింట్ షూటింగ్ స్పాటే. కంగనా, అధ్యయన్ కలిసి నటించిన ‘రాజ్.. ది మిస్టరీ కంటిన్యూస్’ సెట్స్. ఆ సినిమాలోని ‘ఓ జానా.. ’ పాట చిత్రీకరణ సమయంలో ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. షూటింగ్ అయిపోయాక లాంగ్ డ్రైవ్స్, డిన్నర్లు సాధరణమయ్యాయి వాళ్ల షెడ్యూల్లో. సినిమా పూర్తయ్యేలోపే అధ్యయన్కు ‘ఐ లవ్ యూ’ చెప్పింది కంగనా. ‘మై భీ’ అన్నాడు. అది ఎన్నాళ్లుంది? ఎందుకు ఎండ్ అయింది? అధ్యయన్ మాటల్లోనే తెలుసుకుందాం (‘డీఎన్ఏ’కు అతను ఇచ్చిన ఇంటర్వ్యూ నుంచి)... నాకొక రోజు మహేశ్ భట్ నుంచి ఫోన్ వచ్చింది. ‘రాజ్ 2 రషెస్ చూసి ఫోన్ చేస్తున్నా.. నీ వర్క్ చాలా నచ్చింది. నీతో సినిమా చేయాలనుకుంటున్నా’ అంటూ. నా ఫోన్ స్పీకర్ ఆన్‌లోనే ఉండడంతో కంగనా కూడా విన్నది. నిజానికి నా కెరీర్‌ను మలిచే గుడ్ న్యూస్ అది. కానీ ఆమెకు నచ్చలేదు. ‘నాకెందుకు ఎవ్వరు ఫోన్ చేయరు? ఏం చూసి నీకు చాన్స్ ఇస్తామంటున్నారు?’ అని చిటపటలాడింది. ఆ రియాక్షన్‌కు ఫీలయ్యా. ఫ్యాషన్ మూవీ తర్వాత కొన్నాళ్ల దాకా ఆమెకు పెద్దగా అవకాశాలు రాలేదు. ఆ ఫ్రస్ట్రేషన్‌తోనే అలా అంటుందని సరిపెట్టుకున్నా. నా బర్త్‌డేకు ఒకసారి మా నాన్న (శేఖర్ సుమన్) బీఎమ్‌డబ్ల్యూ సెవెన్ సిరీస్ కారు గిఫ్ట్‌గా ఇచ్చారు. ఆ గుడ్‌న్యూస్‌ను కంగనాతో షేర్ చేసుకుంటే బదులుగా వెటకారమే. ‘ఏం సాధించావని కోటి రూపాయల గిఫ్ట్ కొనిచ్చాడు మీ నాన్న?’ అంటూ. ఆ సంఘటన తర్వాత కంగనా హైదరాబాద్ వెళ్లింది. అక్కడి నుంచి కాల్ చేసింది ‘నేను తెలుగు మూవీ ఒకటి సైన్ చేశా. ప్రభాస్ హీరో. ఇంకో సంగతి బీఎమ్‌డబ్ల్యూ సెవెన్ సిరీస్ బుక్ చేశా’ అని చెప్పింది. అంత పోటీ తనకు. లూజర్ అనే మాట వినీవినీ.. కంగనా తీరేంటో అర్థమయ్యేది కాదు. ఆమెకెప్పుడు ప్రేమ పుడుతుందో.. ఎప్పుడు కోపం వస్తుందో.. దేనికి సంతోషంగా ఉంటుందో.. దేనికి హర్ట్ అవుతుందో తెలిసేది కాదు. ఆ రిలేషనే కన్ఫ్యూజన్. ఇంకా చెప్పాలంటే ప్రేమ కన్నా అవమానాన్నే ఇచ్చింది. అన్నిటినీ భరించాను. నోటికొచ్చినట్టు తిట్టినా.. నా మీద చేయి చేసుకున్నా తట్టుకున్నాను. ఆఖరికు నా కళ్లముందే మా నాన్నను ఇన్సల్ట్ చేసినా తన వైపే ఉన్నా. ఫిలిం జర్నలిస్ట్‌లతో నాకు ఫోన్లు చేయించి ఆమెను ప్రాణం కన్నా ఎక్కువగా ఇష్టపడుతున్నాననే స్టేట్మెంట్స్ ఇప్పించింది. బేషరతుగా ఇచ్చాను. నా కెరీర్ కన్నా తనే ముఖ్యమనుకొని. కానీ అదే స్టేట్మెంట్ తనను ఇవ్వమంటే ఇవ్వకుండా దాటవేసింది. అయినా నేను ప్రశ్నించలేదు. ఆమె ఎక్సెంట్రిక్ బిహేవియర్‌ను ఆడవాళ్ల భావోద్వేగాల కోణంలోంచే అర్థం చేసుకోవడానికి ప్రయత్నించా. కానీ దాన్ని ఆమె అడ్వాంటేజ్‌గా తీసుకుంది. దాంతో కంగనాకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నా. పసిగట్టింది తను. వెంటనే నన్ను సునీత మీనన్ అనే జ్యోతిష్యురాలి దగ్గరకు పట్టుకెళ్లింది. మేమిద్దరం మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని, మా ఇద్దరి బంధం ఇద్దరికీ కలిసి వస్తుందని చెప్పించింది. ఆ మాటలు నమ్మి నా నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నా. షరా మామూలే. పొంతన కుదరని ఆమె ప్రవర్తనతో నాకు కన్ఫ్యూజనూ మామూలే. ఈసారి నావల్ల కాలేదు. నాతో డేటింగ్ చేస్తూనే హృతిక్ రోషన్ మీద మనసు పెట్టుకుంది. ఆమె అతనికి రాసిన మెయిల్స్ నా కంటబడ్డాయి. ఆమె ఆసక్తులు, లక్ష్యాలు వేరని, మాది నిలబడే రిలేషన్ కాదనీ స్పష్టమైంది. ఆ ఇంట్లోంచి వచ్చేశా. దాన్నీ తనకు అనుకూలంగానే మలచుకుంది కంగనా. చెప్పాపెట్టకుండా ఆమెను వదిలేసి వెళ్లిపోయానని ప్రచారం చేసి సింపతీ పొందింది. సినిమా చాన్స్‌ల కోసం నేను తనను వాడుకున్నాననీ కామెంట్ చేసింది. బ్రేకప్‌తో ఆల్రెడీ డిప్రెషన్లోకి వెళ్లిపోయిన నాకు ఆమె మాటలతో మరింత నిస్పృహ ఆవహించింది. తిప్పికొట్టే ఓపిక, సమర్థించుకునే శక్తీ అడుగంటిపోయాయి. ‘లూజర్’ అనే మాట వినీవినీ నా మీద నేనే నమ్మకం కోల్పోయా. తర్వాత ఆలోచిస్తే అనిపించింది.. ఎవరు ఎవరిని వాడుకున్నారు అని. తను నాకు పరిచయం అయ్యేనాటికి ఆమె స్టారేం కాదు. కానీ నాకు స్టార్డమ్ బ్యాక్‌గ్రౌండ్ అయినా ఉంది కదా ( తండ్రి శేఖర్ సుమన్ పేరున్న నటుడు) వాడుకోవాలనుకుంటే’ అంటాడు అధ్యయన్ సుమన్. లవ్ ఫెయిల్యూర్‌తో మందుకు, సిగరెట్‌కు బానిసయ్యాడు అధ్యయన్. తల్లిదండ్రుల సహాయంతో బయటపడ్డాడు. కొత్త జీవితాన్ని ప్రారంభించాడు. ఆ అధ్యాయం తర్వాత కంగనా ప్రయాణమూ ఆగలేదు. ‘జీవితంలో ప్రేమతో నాకు చేదు అనుభవాలే ఉన్నప్పటికీ ప్రేమలో పడని రోజులు నాకు గుర్తులేవు. ప్రేమిస్తూనే ఉంటాను.. దెబ్బతింటూనే ఉంటాను.. నిలబడ్తాను .. మళ్లీ ప్రేమలో పడ్తాను. ప్రేమ జీవితేచ్ఛను కలిగిస్తుంది ’ అంటుంది కంగనా రనౌత్. -ఎస్సార్ -
అతడు నాకు సరైనోడు కాదు, సో బ్రేకప్: నటి
'నయీ పడోసన్' సినిమాతో బాలీవుడ్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది నటి మహేక్ చాహల్. తర్వాత బిగ్‌బాస్ హిందీ సీజన్ 5లో పాల్గొని ప్రేక్షకులకు మరింత దగ్గరైన ఈ భామ అభిమానుల అండతో రన్నరప్‌గా నిలిచింది. ఈ షో ద్వారా వచ్చిన గుర్తింపుతో సల్మాన్ ఖాన్ 'వాంటెడ్' సినిమాలోనూ నటించే ఛాన్స్ కొట్టేసింది. తాజాగా ఈ బాలీవుడ్ బ్యూటీ ఖత్రోన్ కె ఖిలాడీ 11వ సీజన్ కోసం కేప్‌టౌన్ పయనమైంది. తన బాయ్‌ప్రెండ్ అస్మిత్ పటేల్‌కు బ్రేకప్ చెప్పినట్లు వస్తున్న వార్తలపై మహేక్ చాహల్ స్పందించింది. 'నేనే మా బంధానికి ముగింపు పలికాను. ఎప్పుడైతే ఒక వ్యక్తికి ఎక్కువ సమయం కేటాయిస్తావో, అతడితోనే కలిసి ఉంటావో అప్పుడు ఆ వ్యక్తి నిజస్వరూపం తెలుస్తుంది. అస్మిత్ నాకు సరైనోడు కాదనిపించింది. బ్రేకప్ తర్వాత పరిస్థితి చాలా క్లిష్టంగా ఉంటుంది. కానీ నా ఫ్యామిలీ, స్నేహితులు నాకు మద్దతుగా నిలబడ్డారు. నా సమస్యలను వారితో చెప్పుకున్నాను. నేను ఓ ఏడాదిపాటు గోవాలో ఉండిపోయాను. అక్కడి ప్రకృతి నన్ను కోలుకునేలా చేసింది. సమయం అన్నింటినీ నయం చేస్తుంది, అలాగే నన్ను సాధారణ స్థితికి తీసుకొచ్చింది' అని చాహల్ చెప్పుకొచ్చింది. చదవండి: మొదటి పెళ్లి.. మానసిక హింసకు గురయ్యా: నటి జీవితాన్ని లైట్ తీసుకోకండి: హీరోయిన్ రిక్వెస్ట్ -
ఆ రోజు రాత్రి ఐశ్వర్య ఇంటికి వెళ్లిన సల్మాన్.. దూకి చస్తానని బెదిరించి..
సల్మాన్ ఖాన్.. పెళ్లి ప్రస్తావన లేకుండా అతని పేరు వినపడదు.. అతను అనుకున్నట్టే జరిగి ఉంటే ఈ పాటికి పెళ్లి చేసుకునేవాడేమో! జరగకపోవడానికి స్వయంకృతాపరాధమే కారణం అంటారు అతని శ్రేయోభిలాషులు కూడా! కోరి వచ్చిన ప్రేమైశ్యర్యాన్ని కాపాడుకోలేకపోయిన అభాగ్యుడు అని వ్యాఖ్యానిస్తారు!! ఐశ్యర్య రాయ్‌ను ప్రేమించాడు.. ఆమె ఆత్మగౌరవాన్ని లెక్కచేయనంతగా! అందుకే ఆ ప్రేమ ముక్కలైపోయింది!! ఐశ్యర్య సినిమాల్లోకి అడుగుపెట్టేనాటికే సల్మాన్ ఖాన్ సూపర్‌స్టార్. అతనికి ఆమె పరిచయం అయ్యేనాటికే సల్మాన్.. సోమి అలీ ప్రేమికుడు. వాళ్లిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలూ గుప్పుమన్నాయి. ‘హమ్ దిల్ దే చుకే సనమ్’ కోసం సంజయ్ లీలా భన్సాలీ హీరోయిన్ను వెదుకుతున్నాడు. ఐశ్యర్యను సూచించాడు సల్మాన్. సంజయ్‌కీ నచ్చి ఐశ్యర్య కథానాయికగా ‘హమ్ దిల్ దే చుకే సనమ్’ షూటింగ్ మొదలుపెట్టేశాడు. అది పూర్తయ్యేసరికి సల్మాన్, ఐశ్వర్య ఒకరితో ఒకరు ప్రేమలో పడ్డారు. సినిమా కూడా సూపర్ డూపర్ హిట్. ఐశ్వర్యా నంబర్ వన్ నాయిక అయిపోయి అవకాశాలు వరుస కట్టాయి. సల్మాన్ .. ఐశ్యర్యను ఇష్టపడుతున్నాడనే నిజం సోమి అలీకి తెలిసి.. మనసు విరిగి అమెరికా వెళ్లిపోయింది. రాకపోకలు.. సల్మాన్ తనపై కురిపిస్తున్న ప్రేమ.. అతని అపురూపం ఐశ్వర్యను ఆశ్చర్యపరిచాయి. ఆమెకు అతను తన కుటుంబాన్నీ పరిచయం చేశాడు. సల్మాన్ చెల్లెళ్లు అల్విర, అర్పితతో ఐశ్వర్యకు దోస్తీ బాగా కుదిరింది. ఎప్పుడు సమయం దొరికినా సల్మాన్ వాళ్లింటికి వెళ్లి కాలక్షేపం చేసేది. అంతకుముందే సల్మాన్ ప్రేమ వ్యవహారాలు, సోమి అలీతో పెళ్లి వార్తా తెలిసి ఉండడంతో తమ కూతురు సల్మాన్‌తో చనువుగా ఉండడం నచ్చలేదు ఐశ్వర్య తల్లిదండ్రులకు. ఆ విషయంలో ఆమెను వారించారు. అతను అలాంటివాడు కాదని ఆమె వాళ్లతో వాదించింది. విభేదించి తను విడిగా అపార్ట్మెంట్ తీసుకొని అందులో ఉండసాగింది. అభద్రత.. ఐశ్వర్య.. సల్మాన్‌తో ఎంత చనువుగా ఉన్నా పెళ్లి మాట వచ్చేసరికి ఔనని కాని, కాదని కాని తేల్చకుండా మౌనంగా ఉండిపోయేదిట. అతనేమో ఆ ప్రేమను పెళ్లితో కట్టిపడేసుకుందామనుకున్నాడు. దాంతో ఆమె సైలెన్స్ సల్మాన్‌ను అభద్రతకు గురిచేసింది. ఐశ్వర్య ఆలోచన వేరు. సల్మాన్‌ను పెళ్లి చేసుకోవాలని ఉన్నా.. అప్పుడప్పుడే మొదలైన స్టార్‌డమ్‌నూ అప్పుడే వదులుకోవాలని లేదు ఆమెకు. అందుకే సల్మాన్ ప్రశ్నకు ఐశ్వర్య మౌనమే సమాధానమయ్యేది. ఒకరోజు రాత్రి.. ఉన్నపళంగా ఐశ్వర్య ఉంటున్న అపార్ట్‌మెంట్‌కు చేరుకున్నాడు సల్మాన్. ఆమె ఫ్లాట్ తలుపులను దబదబా బాదసాగాడు. అతని ఆవేశం అర్థమైన ఐశ్వర్య తలుపులు తీయలేదు. అతనూ వెనక్కి తగ్గలేదు . తెల్లవారు జాము మూడు గంటల వరకు అలా తలుపులు కొడుతూనే ఉన్నాడు చేతుల్లోని చర్మం చిట్లి రక్తం కారుతున్నా. ఆ చప్పుడు చుట్టుపక్కల వాళ్లకు అంతరాయం కలిగినా పోలీస్ కంప్లయింట్ ఇచ్చే ధైర్యం చేయలేదు వాళ్లు. ఆఖరకు తలుపులు తెరవకపోతే ఆ పదిహేడో అంతస్తు (ఆ అపార్ట్మెంట్లో ఐశ్వర్య ఫ్లాట్ పదిహేడో అంతస్తులోనే ఉంది) నుంచి దూకి చచ్చిపోతానననీ బెదిరించాడట సల్మాన్. అప్పుడు తలుపులు తీసింది ఐశ్వర్య అని ఆ సంఘటనకు సాక్ష్యంగా ఉన్న ఆ అంతస్తు వాసుల మాట. తర్వాత ఆ సంఘనట మీద ఐశ్వర్య వాళ్ల నాన్న కృష్టరాజ్ రాయ్ పోలీస్ కంప్లయింట్ ఇచ్చాడట. ‘ఐశ్వర్య వాళ్ల నాన్న పోలీస్ కంప్లయింట్ ఇచ్చిన మాట నిజమే. ప్రేమలో ఇలాంటివి సహజం. పోలీస్ కంప్లయింట్ ఇచ్చినందుకు ఐశ్వర్య ఫాదర్ మీద నాకేం కోపం లేదు. ఆయన చేసింది కరెక్టే’ అని చెప్పాడు సల్మాన్ ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో. అక్కడితో ఆగలేదు.. ఒకసారి చల్తే చల్తే సినిమా షూటింగ్ జరుగుతుంటే వెళ్లి ఐశ్వర్య మీద అరిచాడట. అడ్డొచ్చిన ఆ సినిమా నిర్మాత, హీరో షారూఖ్ ఖాన్‌నూ దుర్భాషలాడాడని అప్పటి వార్తలు. ఈ రభస ఎందుకని చివరకు ఆ సినిమా నుంచి ఐశ్వర్యను తొలగించి ఆ స్థానంలో రాణి ముఖర్జీని తీసుకున్నారట. అలా సల్మాన్ సెట్స్ మీదకు వచ్చి గొడవ చేయడం ఆమె కెరీర్‌నే కాదు ఆమె వ్యక్తిత్వాన్నీ గాయపరిచాయి. ప్రేమ పేరుతో సల్మాన్ తనను ఆస్తిగా భావించడాన్ని భరించలేకపోయింది ఐశ్వర్య. దాదాపు మూడేళ్ల ఆ బంధనాన్ని 2002, మార్చిన తెంచేసుకుంది. ‘తాగి తిట్టినా, కొట్టినా సహించాను. వేరే అమ్మాయిలతో తిరిగినా ప్రశ్నించలేదు. ఆ సహనం నా ఆత్మాభిమానానికే ఎసరు పెడ్తుంటే ఊరుకోలేను కదా. అందుకే ఆ రిలేషన్‌ను వద్దనుకున్నాను. బ్రేకప్ తర్వాత కూడా చాలా సార్లు ఫోన్లు చేసి బూతులు తిట్టేవాడు. నేను పనిచేస్తున్న ప్రతి నటుడితో నాకు సంబంధం అంటగట్టాడు. ఈ జీవితంలో అదొక పీడకల. నా ఆత్మగౌరవం, నా సంక్షేమం కోసం లైఫ్‌లోనే కాదు సినిమాల్లో కూడా అతని భాగస్వామ్యాన్ని వద్దనుకున్నా. భవిష్యత్‌లో అతనితో నటించే సమస్యే లేదు’ అని ఓ పత్రికా ఇంటర్వ్యూలో చెప్పింది ఐశ్వర్య. ‘ఐశ్వర్య మీద చేయిచేసుకున్నానడం అబద్ధం. బాధేస్తే.. కోపమొస్తే నన్ను నేను హింసించుకుంటాను. ఒక్క సుభాష్ ఘాయ్‌ని తప్ప ఇప్పటివరకు నేనెవరీ కొట్టలేదు. అతనిక్కూడా వెంటనే క్షమాపణ చెప్పేశా’ అంటాడు సల్మాన్. ఏది ఏమైనా అతని దురుసు ప్రవర్తనతోనే ఆ ప్రేమ కథ బ్రేక్ అయిందని సల్మాన్ అభిమానులూ ఒప్పుకునే సత్యం. - ఎస్సార్ -
ప్రియుడితో నటి బ్రేకప్: సోషల్ మీడియాకు గుడ్‌బై!
హాలీవుడ్ లవ్ బర్డ్స్ బెన్ అఫ్లెక్- అన డె అర్మాస్ ఈ మధ్యే ప్రేమ బంధానికి స్వస్తి పలికిన విషయం తెలిసిందే. ఇది జరిగిన రెండు వారాలకు అన డె సోషల్ మీడియాకే గుడ్‌బై చెప్తూ ట్విటర్ అకౌంట్‌ను డిలీట్ చేసింది. ఆమె తీసుకున్న నిర్ణయంతో అన డె అభిమానులు విచారంలో మునిగిపోయారు. కాగా "డీప్ వాటర్" సినిమా షూటింగ్ సమయంలో బెన్, అన డె ప్రేమలో పడ్డారు. గతేడాది ఏప్రిల్‌లోనే ప్రేమ విషయాన్ని అన డె అధికారికంగా ధృవీకరించింది. అతడితో కలిసి పుట్టినరోజు జరుపుకున్న ఫొటోలను సైతం అభిమానులతో పంచుకుంది. తన క్వారంటైన్ సమయాన్ని కూడా లాస్ ఏంజెల్స్‌లోని బెన్ నివాసంలో అతడి పిల్లలతో గడిపింది. కానీ ఏడాది తిరిగేలోగా ఒకరికొకరు బ్రేకప్ చెప్పుకున్నారు. (చదవండి: ‘టైటానిక్’ చూడాలంటేనే అసహ్యం వేస్తోంది: కేట్) బెన్ ఇప్పుడు అనతో డేటింగ్ చేయట్లేదని, వారి మధ్య బంధం బీటలు వారిందని వారి సన్నిహితులు మీడియాకు తెలిపారు. బెన్ తన పిల్లలతో కలిసి లాస్ ఏంజెల్స్‌లోనే ఉండాలనుకుంటున్నాడని, కానీ అన డె లాస్ ఏంజెల్స్‌కు రావాలనుకోవట్లేదని మీడియాకు తెలిపారు. విడిపోయినప్పటికీ వారు సంతోషంగానే ఉన్నారని పేర్కొన్నారు. కాగా ఆ మధ్య బెన్ అఫ్లెక్ ఇంట్లో నుంచి అన డె ఫొటోలను సిబ్బంది చెత్త డబ్బాలో పారేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట ప్రత్యక్షం కావడంతో సదరు నటి తీవ్ర మనస్తాపానికి గురైంది. ఈ క్రమంలోనే ఆమె సోషల్ మీడియా నుంచి తప్పుకుని ఉండవచ్చని భావిస్తున్నారు. (చదవండి: ‘టెక్ట్స్ ఫర్ యూ’ షూటింగ్ పూర్తయిందోచ్!) A life-sized cardboard cutout of Ana de Armas from inside Ben Affleck’s residence was seen being thrown out into a trash can. (January 18, 2021) pic.twitter.com/4bxxDC97WZ — Ana de Armas Updates (@ArmasUpdates) January 19, 2021 -
‘రోజుకు 12 మాత్రలు వేసుకున్నా’
నటి ఇలియానా మంచి ఫామ్‌లో ఉన్నప్పుడు ఎలాగైతే ప్రతి నిత్యం ఏదో సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో ఉండేదో, ఇప్పుడు అలా ఉండడానికి ప్రయత్నిస్తోంది. 2005లో సినీరంగ ప్రవేశం చేసింది ఈ గోవా బ్యూటీ . తెలుగులో దేవదాస్ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు ఆ మూవీ సక్సెస్‌తో వరుస అవకాశాలను రాబట్టుకుని స్టార్‌డమ్‌ను అందుకుంది. అయితే తమిళంలో పరిచయం అయిన కేడీ చిత్రం ఈ జాణను నిరాశ పరిచింది. దీంతో కోలీవుడ్ వైపు తిరిగి చూడలేదు. తెలుగులో వెలిగిపోతున్న రోజుల్లో నన్బన్ అనే చిత్రంతో కోలీవుడ్‌లో రీఎంట్రీ అయ్యింది. అయితే ఇక్కడ అదే ఇలియానాకు చివరి చిత్రం. తెలుగులో క్రేజీ హీరోయిన్గా రాణిస్తున్న సమయంలోనే బాలీవుడ్‌పై దృష్టి సారించడంతో దక్షిణాదికి దూరమైంది. అదే సమయంలో ప్రేమలో పడింది. ఆస్ట్రేలియాకు చెందిన ఆండ్రూ అనే ఫొటోగ్రాఫర్‌తో ప్రేమలో మునిగిపోయింది. అయితే ఆ ప్రేమ ఎంతో కాలం సాగలేదు. మనస్పర్థల కారణంగా ఈ మధ్యనే బ్రేకప్ అయ్యింది. అయితే ఆండ్రూతో లవ్ బ్రేకప్ నటి ఇలియానాపై తీవ్ర ప్రభావాన్నే చూపింది. ఈ విషయాన్ని తనే ఒక ఇంటర్వ్యూలో పేర్కొంది. తన ఇన్‌స్ట్రాగామ్ వంటి సామాజిక మాధ్యమాల్లో ఆండ్రూకు సంబంధించిన జ్ఞాపకాలను తుడిచేసినా, మానసికంగా వాటి నుంచి బయటపడడం సుల భం కాలేదు. అతనితో లవ్ బ్రేకప్ ఇలియానాను మానసికంగా చాలా కృంగదీసింది. దీని గురించి ఇలియానా తెలుపుతూ ఆ మనోవేదన నుంచి బయటపడడానికి వారమంతా చికిత్స కోసం ఆస్పత్రి చుట్టూ తిరిగానంది. దీంతో చిత్రాల్లో నటించడం కూడా మానుకున్నానని చెప్పింది. మానసికవేదనతో ఒక సమయంలో రోజుకు 12 మాత్రలు వేసుకున్నానని చెప్పింది. అందువల్ల బరువు పెరిగిపోయానని తెలిపింది. బరువు తగ్గడానికి జిమ్‌కు వెళదామనుకుంటే ఆ ఫొటోలను తీసి ఎక్కడ సామాజిక మాధ్యమాల్లో పెడతారోనన్న భయం కలిగేదని .. అందుకే జిమ్‌కు వెళ్లడం కూడా మానేశానని చెప్పింది. అలా కొంత కాలం గదిలోనే ఏకాంతంగా గడిపేసినట్లు, చాలా మానసికవేదనకు గురైనట్లు చెప్పిన ఇలియానా ఇప్పుడు మళ్లీ నటనపై పూర్తిగా దృష్టి సారించినట్లు వెల్లడించింది. ప్రస్తుతానికి హిందీ చిత్రాల్లో నటిస్తున్న ఈ బ్యూటీ దక్షిణాదిలో అవకాశాలను మళ్లీ రాబట్టుకోగలుగుతుందా? ఎందుకంటే ఇప్పటికే ఓ తెలుగు చిత్రంలో నటించినా అది సత్ఫలితాన్నివ్వలేదు. -
చిత్రం చెప్పింది
ప్రేమలో ఉన్నవాళ్లంతా పెళ్లి చేసుకుంటారని చెప్పలేం. లవ్‌కి బ్రేకప్ చెప్పుకునే జంటలు ఉంటాయి. ఇప్పుడు అందాల తార సుస్మితా సేన్ తన బాయ్‌ఫ్రెండ్ రోహ్మన్తో లవ్‌కి కటీఫ్ చెప్పారన్నది కొందరి ఊహ. ఆ ఊహ తప్పని ఇక్కడున్న చిత్రం చెప్పింది. చిత్రం అంటే ఫొటో అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ ఫొటోని స్వయంగా సుస్మితా సేన్ విడుదల చేశారు. రోహ్మన్తో కలసి తాను జిమ్ చేస్తున్న ఫొటోను ఆమె బయటపెట్టారు. ఈ ఫొటో చాలు.. ఈ ఇద్దరూ విడిపోలేదని చెప్పడానికి. మరి పెళ్లెప్పుడూ అంటే.. ఇద్దరూ చేసుకున్నప్పుడు. ఆ విషయం గురించి మౌనం వహిస్తున్న ఈ ఇద్దరూ పార్టీల్లో, రెస్టారెంటుల్లో.. ఇలా చాలా చోట్ల జాయింట్‌గా కనిపిస్తున్నారు. -
ఈ జంటకు ఏమైంది.?
సాక్షి. సినిమా: నటుడు జై, అంజలిల మధ్య ప్రేమాయణం చాలా కాలంగా సాగుతోందనే ప్రచారం కోడైకూస్తున్న విషయం తెలిసిందే. ఎంగేయుమ్ ఎప్పోదుమ్ చిత్రంలో కలిసి నటించిన ఈ జంట మధ్య అప్పటి నుంచే ఒకరినొకరు ఇష్ట పడ్డారని, ఒకే ఇంటిలో కలిసి జీవిస్తున్నారనే ప్రచారం విసృతంగా జరిగింది. ఆ తరువాత కూడా జై, అంజలి కలిసి కొన్ని చిత్రాల్లో నటించారు. వీరిద్దరూ కలిసి నటించిన చివరి చిత్రం బెలూన్. ఆ మధ్య నటి జ్యోతిక ప్రధాన పాత్రలో నటించిన మగళీర్ మట్టుం చిత్ర యూనిట్ దోసె పోటీని సవాల్‌గా తీసుకుని జై తన ఇంట్లో దోసెలు వేసి అంజలికి స్వయంగా పెట్టారు. ఆ ఫొటోలను ట్విటర్లో పొందుపరిచి ఫుల్ పబ్లిసిటీ పొందారు. అదేవిధంగా గత ఏడాది అంజలి పుట్టిన రోజు వేడుక బెలూన్ చిత్ర షూటింగ్ సెట్లో జరగ్గా, జైకి షూటింగ్ లేకపోయినా ఆయన ఆ వేడుకలో పాల్గొని సందడి చేశారు. దీంతోపాటు ట్విటర్లో అంజలికి కవిత రూపంలో శుభాకాంక్షలు కూడా తెలిపారు. అలాంటిది గత 17న అంజలి పుట్టిన రోజు సందర్భంగా నటుడు జై ఎలాంటి శుభాకాంక్షలు చెప్పకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దీంతో ప్రస్తుతం వీరిద్దరి మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయనే ప్రచారం వైరల్ అవుతోంది. అదే విధంగా నటి అంజలి జై కు తనకు మధ్య ప్రేమ లాంటిదేమీ లేదని చెప్పడం విశేషం. ఇకపోతే కొద్ది కాలంగా జై, అంజలి నటించిన చిత్రాలు ఆశించిన విజయాలను సాధించడం లేదు. ఇది కూడా వీరి మధ్య విబేధాలకు కారణం అని కోలీవుడ్ వర్గాల్లో వినిపిస్తోంది. ప్రస్తుతం వీరిద్దరూ నటించే చిత్రాలపై దృష్టి సారిస్తున్నారు. ప్రస్తుతం నటి అంజలి తమిళం, తెలుగు అంటూ నాలుగైదు చిత్రాలతో బిజీగా ఉంది. సోషల్ మీడియాల్లో మాత్రం జై, అంజలిల లవ్ బ్రేకప్ అనే ప్రచారాన్ని జోరుగా చేస్తున్నారు. -
నన్నడగొద్దు ప్లీజ్
సార్! ఒకమ్మాయి నన్ను ఐదేళ్లుగా ప్రేమిస్తోంది. కానీ నేను పట్టించుకోలేదు. ఇప్పుడు నాకు ఆ అమ్మాయి కావాలనిపిస్తోంది. అయితే, తానిప్పుడు కాంటాక్ట్ అవట్లేదు. ఇప్పుడు నేనేం చేయాలి సార్? – నగేశ్ ‘అయ్యో పాపం సార్! అబ్బాయి బెంగపడుతున్నాడు!!’ అవునా!? ‘అవునా... ఏంటి సార్? అల్లల్లాడిపోతున్నాడు!?’ నీకెలా తెలుసు అల్లల్లాడిపోతున్నాడని!? ‘చదివితే అర్థం కావడం లేదా సార్?’ ఏది... ఆ నాలుగు ముక్కల్లోనే నీకంత అర్థమయిపోయిందా? ‘సార్... లవ్ అంటే పేజీలు... పేజీలు రాయడం కాదు సార్!’ మరేంటో? ‘ఫోర్ వర్డ్స్‌లో ఫుల్లుగా చెప్పేయడమే సార్!!’ అమ్మాయి మనోడిని ఇష్టపడినప్పుడు మాత్రం పోజులు కొట్టాడు! ట్రెయిన్ వెళ్లాక ప్లాట్‌ఫామ్ మీద అడుక్కుంటున్నాడు!! ‘ఏంటి సార్, ప్రేమను అడుక్కోవడం... అర్ధించుకోవడం... అంటున్నారు!? వెరీ బ్యాడ్ సార్!!’ అదే ప్లాట్‌ఫామ్ మీద ఇష్టమైన ఇంకో అమ్మాయి కనబడితే కూడా మనోడు మళ్లీ స్టైల్ కొట్టడని ఏంటి గ్యారెంటీ? ‘ఊరుకోండి సార్... బాధ పడతాడు. ఏదైనా మంచి విషయం చెప్పండి!!’ నగేశ్! డోన్ట్‌వర్రీ. గుడ్ థింగ్స్ హ్యాపెన్ టు గుడ్ బాయ్స్ లైక్ యూ!! అప్పుడు తొందరపడలేదు! అమ్మాయిని మోసగించలేదు!! యూ ఆర్ గ్రేట్! నీకు తప్పకుండా లవ్ మళ్లీ చాన్స్ ఇస్తుంది!! - ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్ ప్రేమ, ఆకర్షణ, టీనేజ్ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి. లవ్ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్–34. lovedoctorram@sakshi.com -
ఆసిన్ ప్రేమకు బ్రేకప్
చెన్నై: నటి ఆసిన్ ప్రేమ బ్రేకప్ అయినట్లు బాలీవుడ్లో ప్రచారం హోరెత్తుతోంది. తెలుగు,తమిళ భాషల్లో ప్రముఖ హీరోయిన్గా వెలుగొందిన ఆమె గజినీ చిత్రంతో బాలీవుడ్ రంగప్రవేశం చేశారు. తొలి చిత్రంతోనే అక్కడ యమ క్రేజ్‌ను సంపాదించుకున్న ఆసిన్‌కు హిందీలో అవకాశాలు వెల్లువెత్తాయి. గజినీ తరువాత సల్మాన్‌ఖాన్‌తో రెడీ, అక్షయకుమార్ సరసన హౌస్‌ఫుల్ 2, కిలాడి 786, అజయ్‌దేవ్‌గన్‌కు జంటగా భోల్ బచ్చన్ భోల్ చిత్రాల్లో నటించారు. ఆ సమయంలోనే బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముఖేష్‌తో ప్రేమాయణం నడిపారు. అయితే కొంతకాలం తరువాత మనస్పర్థల కారణంగా విడిపోయారు. ఆ తరువాత ఆసిన్ ముంబైకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త రాకుల్శర్మతో పరిచయం ప్రేమగా మారిందనే ప్రచారం జోరుగా సాగింది. దాన్ని ఈ ప్రేమ జంట ఖండించలేదు. అలా 2013 నుంచి సాగిన ఆసిన్ రాకుల్ల ప్రేమకు తాజాగా బ్రేక్ పడిందని బాలీవుడ్ వర్గాల బోగట్టా. ప్రస్తుతం ఆల్ఈజ్ వెల్ చిత్రంలో ఆసిన్, అభిషేక్‌బచ్చన్ జంటగా నటిస్తున్నారు. -
విఫలమైతే మరోసారి
ఒక సారి ప్రేమ విఫలమైతే, మరో సారి ఫలిస్తుందని, అంత మాత్రాన తన కొడుకుపై నేరం మోపడం సరికాదని సీనియర్ నటుడు, నిర్మాత, దర్శకుడు టీ రాజేందర్ అంటున్నారు. ఇంతకీ ఈయన కొడుకు ఎవ్వరన్నది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కోలీవుడ్‌లో మిస్టర్ రోమియోగా పేరున్న శింబు నయన తారల ఘాటు ప్రేమ గురించి ప్రత్యేకంగా మళ్లీ వివరించాల్సిన అవసరం లేదు. అయితే, ఆప్రేమ పెళ్లికి దారి తీయలేదు. అదే విధంగా ఆ తర్వాత హన్సికతో ప్రేమ కూడా పటాపంచలైంది. ఇలా రెండు సార్లు ప్రేమలో ఓడిన శింబు, ఇటీవల మన శ్శాంతి కోసం హిమాలయాల బాట పట్టాడు. గత ఏడాదిన్నరగా శింబు నటించిన చిత్రాలు ఏవీ తెరపైకి రాలేదు. అయితే, మాజీ ప్రేమికురాలు నయన తార, హన్సికతో నటించిన ఇదు నమ్మ ఆలు, వాలు చిత్రాలు వరుసగా విడుదలకు సిద్ధం అవుతున్నాయి. శింబు, నయన తారల లవ్ బ్రేకప్ అయిన తర్వాత కలిసి నటిస్తున్న చిత్రం ఇదు నమ్మ ఆలు. ఈ చిత్రం కోసం నయన తారకు అధిక పారితోషికాన్ని సైతం చెల్లించినట్టునట్టు సమాచారం. ఏది ఏమైనా ఇప్పటి వరకు శింబు ప్రేమ వ్యవహారాల గురించి మౌనం వహిస్తున్న ఆయన తండ్రి రాజేందర్ ఎట్టకేలకు నోరు విప్పారు. తన కొడుకుని సమర్థిస్తూ మాట్లాడటం విశేషం. శింబు యువకుడు. యుక్త వయస్సులో ప్రేమ పుట్టడం సహజం. అయితే, ఓ సారి ప్రేమలో విఫలమైన పక్షంలో మళ్లీ కొంత కాలం తర్వాత ప్రేమ పుడుతుంది. ఇది లోకం రీతి. అయినా, శింబును నేరస్తుడుగా చూస్తున్నారన్నారు. నిజం చెప్పాలంటే, శింబు చాలా సిన్సియర్. చిన్న వయస్సులోనే ఎంతో ప్రతిభను చాటుకున్నారు. అలాంటి వాడు తన కుమారుడు కావడం గర్వంగా ఉందని పేర్కొన్నారు. -
సిద్ధార్థ్, సమంత మధ్య చిచ్చు పెట్టిన దీపా?
నటుడు సిద్ధార్థ్, సమంత ప్రేమలో పడ్డారని, త్వరలో పెళ్లికి సిద్ధం అవుతున్నారన్న వదంతులున్నాయి. తాజాగా వీరి మధ్య ప్రేమ బ్రేకప్ అయినట్లు కథనాలు వెలువడుతున్నాయి. అందుకు కారణం నటి దీపా సన్నిధి అంటూ మరో ప్రచారం మొదలైంది. సిద్ధార్థ్, దీపా సన్నిధి జంటగా ఎనక్కుల్ ఒరువన్(నాలో ఒక డు) చిత్రంలో నటిస్తున్నారు. ఇది మలయాళంలో ఘన విజయం సాధించిన లూసియా అనే చిత్రానికి రీమేక్. ప్రసాద్ రామర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సీవీ కుమార్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో కథనాయకిగా నటించిన దీపా సన్నిధి 24 ఏళ్ల కన్నడ భామ. చిక్ మంగళూరుకు చెందిన ఈ బ్యూటీ ఎనక్కుల్ ఒరువన్ చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయం అవుతున్న దీపా సన్నిధితో సిద్ధార్థ్ సన్నిహితంగా మెలుగుతున్నారన్న వార్త జోరందుకుంది. సిద్ధార్థ్, సమంత మధ్య ప్రేమ పటాపంచల్ కావడానికి ఇదే కారణమని కోలీవుడ్ టాక్. ఈ విషయం తన దృష్టికి రావడంతో సమంత సిద్ధార్థ్‌ను నిలదీసినట్టు, చివరకు తమ ప్రేమకు బ్రేక్ వేసుకున్నట్టు సమాచారం. నటి దీపా సన్నిధి మాత్రం తాను ఆ ఇద్దర్నీ విడదీయలేదని పేర్కొనడం గమనార్హం. -
శింబుకు షాక్ ఇచ్చిన హన్సిక
మాజీ ప్రేమికుడు శింబుకు నటి హన్సిక షాక్ ఇచ్చింది. వీరిద్దరు వేట్టై మన్నన్ , వేలు చిత్రాల్లో హీరోహీరోయిన్లుగా నటించారు. ఆ సమయంలోనే ఈ క్రేజీ జంట మధ్య ప్రేమ పెటాకులైన సంగతి తెలిసిందే. అయితే శింబు, హన్సికల లవ్ బ్రేకప్ అయిన తరువాత కూడా హన్సిక వాలు చిత్రంలో శింబుతో కలిసి నటించింది. అయినా ఆ చిత్రం షూటింగ్ పూర్తి కాలేదు. ఇప్పుడా చిత్రానికి సమస్యలొచ్చాయి. శింబుతో ఇకపై నటించను అని హన్సిక తెగేసి చెప్పేసింది. ప్రకటన చేస్తూ వాలు చిత్రం కోసం 64 రోజుల కాల్షీట్స్ అడిగారని చెప్పింది. వారికిచ్చిన కాల్షీట్స్లో తాను నటించానని అంది. ఆ తరువాత మరో 20 రోజులు అడిగారని తెలిపింది. చిత్రం పూర్తి కావాలన్న ఉద్దేశంతో ఆ 20రోజులు నటించానని చెప్పింది. మళ్లీ ఇప్పుడు ఒక పాట చిత్రీకరించాలి, మరో మూడు రోజుల కాల్షీట్స్ కావాలని అంటున్నారని తెలిపింది. తాను తెలుగు చిత్రం పవర్ ప్రమోషన్ కార్యక్రమంలో బిజీగా ఉన్నా, నూతన దర్శకుడు రావడంతో ఈ నెల 7, 8, 9 తేదీలను వాలు చిత్రం కోసం కేటాయించానని చెప్పింది. అయితే ఆ కాల్షీట్స్ను వారు సద్వినియోగం చేసుకోలేదని అంది. ఇకపై వాలు చిత్రం కోసం కాల్షీట్స్ కేటాయించేది లేదు. ఆ చిత్రంలో నటించేదీ లేదని హన్సిక తెగేసి చెప్పేసింది. దీంతో ఇప్పటికే పలు కారణాల వల్ల నిర్మాణ కార్యక్రమాల్లో జాప్యం జరిగినా వాలు చిత్రం తాజాగా హన్సిక ప్రకటనతో మరింత చిక్కుల్లో పడినట్లయింది.