అజయ్ జడేజా పేరు తెలియని క్రికెట్ అభిమానులు ఉండరు.. మాధురీ దీక్షిత్‌ను గుర్తుపట్టని సినీ ప్రేక్షకులు ఉండరు.. ఓ వెలుగు వెలిగిన తారలు.. వారి వారి రంగాల్లోని వాళ్ల గ్లామర్.. సంపాదించుకున్న పాపులారిటీ ఒకరితో ఒకరు ప్రేమలో పడేలా చేసింది. కానీ పెళ్లిదాకా తీసుకెళ్లలేదు. అర్ధాంతరంగా ముగిసిన ఆ లవ్ స్టోరీ ఏంటంటే...
ఇది 1990ల కథ.. ఓ మ్యాగజైన్ కోసం ఫొటో షూట్ చేయడానికి అజయ్ వెళ్లాడు. అక్కడ కలిసింది మాధురీ దీక్షిత్. అప్పటిదాకా ఆమె సినిమాలు చూశాడు.. ఆమె అభినయానికి ఆరాధకుడయ్యాడు. ఆ వెండితెర వేలుపు తన కళ్ల ముందే కొలువుదీరేసరికి అప్రతిభుడయ్యాడు. ఆ అందానికి ముగ్ధుడయ్యాడు. ఆమె నవ్వుకి పడిపోయాడు. అజయ్ జడేజా గురించి మాధురీ విన్నది. కానీ చూడ్డం అదే మొదలు. ఆ పరిచయానికి తనూ కాస్త ఎగ్జయిట్ అయింది. ఇద్దరి మధ్యా స్నేహం మొదలైంది.
అప్పటికే..సంజయ్ దత్‌తో ప్రేమ, అతను టాడా కేసులో ఇరుక్కోవడం.. ఆ నేపథ్యంలో మాధురీని మీడియా ఫోకస్ చేయడం.. వంటి చిక్కులు, చికాకుల్లో ఉంది. మాధురీ.. దిగులు, కలత, కలవరం గూడులో దాక్కునుంది. అలాంటి సమయంలో అజయ్ పరిచయం.. స్నేహం ఆమెకు కాస్త ఊరటనిచ్చాయి. అతని హాస్య చతురత ఆమెలో ఉత్సాహాన్ని, జీవనాసక్తినీ పెంచింది. తనకు తెలియకుండానే అతనితో ప్రేమలో పడింది. మాధురీకి తన మీదున్న ప్రేమను సినిమా రంగంలో తన ఎంట్రీకి పాస్‌గా ఉపయోగించుకోవాలనుకున్నాడు అజయ్.
మైదానంలో సిక్సర్లు కొట్టినంత తేలికగా తెర మీద హీరోయిక్ స్టంట్లు చేయాలని ఉబలాటపడ్డాడు. ఆ విషయాన్ని మాధురీ చెవిలో వేశాడు. సినిమాల్లోకి రావాలనుకున్న అజయ్‌కు వెన్నుదన్నుగా నిలబడాలనుకుంది. తనకు బాగా పరిచయం ఉన్న నిర్మాతలందరినీ అతనికి పరిచయం చేసింది. వాళ్లకు అతణ్ణి రికమెండ్ చేసింది. ఈ ఇద్దరి మధ్య ఉన్న ఆ చనువు చూసి బాలీవుడ్‌లో గుసగుసలు మొదలయ్యాయి. ఆ టైమ్‌లోనే ఈ జంట ఓ మ్యాగజైన్ మీద కవర్ ఫొటోగా అచ్చయింది. దాంతో ఆ గుసగుసలు పెళ్లి చేసుకుంటారనే వదంతుల రూపం తీసుకున్నాయి. ఇటు సినిమా ఇండస్ట్రీ, అటు క్రికెట్ ఫీల్డ్‌కీ చేరాయి.
ఈలోపే.. క్రికెట్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ సంచలనం అయింది. అందులో అజయ్ పేరూ వినిపించింది. పత్రికల నిండా అవే వార్తలు. మళ్లీ నిరాశ, నిస్పృహలు ఆవహించాయి మాధురీని. ‘అలాంటిదేమీ లేదు.. పట్టించుకోవద్దు’ అని చెప్పే ప్రయత్నం చేశాడు అజయ్. ఆ మాటను నమ్మింది ఆమె. కానీ ఈలోపే అజయ్ తల్లిదండ్రులకు వాళ్ల ప్రేమ విషయం తెలిసింది. అజయ్ వాళ్లది రాజకుటుంబం. ఆ ఇంటి కోడలు ఓ సినిమా యాక్టరా? వీల్లేదు అంటూ ఫత్వా జారీ చేశారని ఓ వార్త.
అదలా ఉంచితే మ్యాచ్ ఫిక్సింగ్‌లో దోషిగా తేలాడు అజయ్. ఇన్ని గందరగోళాల మధ్య ఆ రిలేషన్‌ను ముందుకు తీసుకెళ్లాలనుకోలేదు మాధురీ. అంతకుముందు ఆమె కుటుంబం అజయ్ పట్ల సానుకూల దృక్ఫథంతోనే ఉంది. కానీ ఎప్పుడైతే మ్యాచ్ ఫిక్సింగ్‌లు, మాధురీ పట్ల అతనింట్లో వాళ్లకున్న అభిప్రాయం తెలిసేసరికి ఆమె ఇంటి వాళ్లూ ఆ సంబంధం పట్ల మొగ్గు చూపలేదు. ఆ ప్రేమకు చరమగీతం పాడి.. మనసులోంచి అజయ్‌ను చెరిపేసుకొమ్మనే సలహా ఇచ్చారు. అజయ్ జడేజా నుంచి సానుకూల స్పందన వస్తుందేమోనని చూసింది. కనీసం వివరణ కూడా ఇవ్వలేదు అతను. ఇవన్నీ గ్రహించిన మాధురీ కుటుంబం మళ్లీ ఆమె దిగులు లోకం తలుపు తట్టకముందే అమెరికా సంబంధం తెచ్చారు. అతనే డాక్టర్ శ్రీరామ్ నేనే. తర్జనభర్జనలేమీ లేకుండా మీమాంసేదీ పెట్టుకోకుండా శ్రీరామ్‌కు ఓకే చెప్పింది. అతని జీవితభాగస్వామై అమెరికా వెళ్లిపోయింది. ఇక్కడ అజయ్ జడేజా కూడా ఎలాంటి శషభిషలు లేకుండా జయ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు.
∙ఎస్సార్
Comments
Please login to add a commentAdd a comment