సల్మాన్ ఖాన్.. పెళ్లి ప్రస్తావన లేకుండా అతని పేరు వినపడదు.. అతను అనుకున్నట్టే జరిగి ఉంటే ఈ పాటికి పెళ్లి చేసుకునేవాడేమో! జరగకపోవడానికి స్వయంకృతాపరాధమే కారణం అంటారు అతని శ్రేయోభిలాషులు కూడా! కోరి వచ్చిన ప్రేమైశ్యర్యాన్ని కాపాడుకోలేకపోయిన అభాగ్యుడు అని వ్యాఖ్యానిస్తారు!! ఐశ్యర్య రాయ్‌ను ప్రేమించాడు.. ఆమె ఆత్మగౌరవాన్ని లెక్కచేయనంతగా! అందుకే ఆ ప్రేమ ముక్కలైపోయింది!!
ఐశ్యర్య సినిమాల్లోకి అడుగుపెట్టేనాటికే సల్మాన్ ఖాన్ సూపర్‌స్టార్. అతనికి ఆమె పరిచయం అయ్యేనాటికే సల్మాన్.. సోమి అలీ ప్రేమికుడు. వాళ్లిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలూ గుప్పుమన్నాయి. ‘హమ్ దిల్ దే చుకే సనమ్’ కోసం సంజయ్ లీలా భన్సాలీ హీరోయిన్‌ను వెదుకుతున్నాడు. ఐశ్యర్యను సూచించాడు సల్మాన్. సంజయ్‌కీ నచ్చి ఐశ్యర్య కథానాయికగా ‘హమ్ దిల్ దే చుకే సనమ్’ షూటింగ్ మొదలుపెట్టేశాడు. అది పూర్తయ్యేసరికి సల్మాన్, ఐశ్వర్య ఒకరితో ఒకరు ప్రేమలో పడ్డారు. సినిమా కూడా సూపర్ డూపర్ హిట్. ఐశ్వర్యా నంబర్ వన్ నాయిక అయిపోయి అవకాశాలు వరుస కట్టాయి. సల్మాన్ .. ఐశ్యర్యను ఇష్టపడుతున్నాడనే నిజం సోమి అలీకి తెలిసి.. మనసు విరిగి అమెరికా వెళ్లిపోయింది.
రాకపోకలు..
సల్మాన్ తనపై కురిపిస్తున్న ప్రేమ.. అతని అపురూపం ఐశ్వర్యను ఆశ్చర్యపరిచాయి. ఆమెకు అతను తన కుటుంబాన్నీ పరిచయం చేశాడు. సల్మాన్ చెల్లెళ్లు అల్విర, అర్పితతో ఐశ్వర్యకు దోస్తీ బాగా కుదిరింది. ఎప్పుడు సమయం దొరికినా సల్మాన్ వాళ్లింటికి వెళ్లి కాలక్షేపం చేసేది. అంతకుముందే సల్మాన్ ప్రేమ వ్యవహారాలు, సోమి అలీతో పెళ్లి వార్తా తెలిసి ఉండడంతో తమ కూతురు సల్మాన్‌తో చనువుగా ఉండడం నచ్చలేదు ఐశ్వర్య తల్లిదండ్రులకు. ఆ విషయంలో ఆమెను వారించారు. అతను అలాంటివాడు కాదని ఆమె వాళ్లతో వాదించింది. విభేదించి తను విడిగా అపార్ట్‌మెంట్ తీసుకొని అందులో ఉండసాగింది.
అభద్రత..
ఐశ్వర్య.. సల్మాన్‌తో ఎంత చనువుగా ఉన్నా పెళ్లి మాట వచ్చేసరికి ఔనని కాని, కాదని కాని తేల్చకుండా మౌనంగా ఉండిపోయేదిట. అతనేమో ఆ ప్రేమను పెళ్లితో కట్టిపడేసుకుందామనుకున్నాడు. దాంతో ఆమె సైలెన్స్ సల్మాన్‌ను అభద్రతకు గురిచేసింది. ఐశ్వర్య ఆలోచన వేరు. సల్మాన్‌ను పెళ్లి చేసుకోవాలని ఉన్నా.. అప్పుడప్పుడే మొదలైన స్టార్‌డమ్‌నూ అప్పుడే వదులుకోవాలని లేదు ఆమెకు. అందుకే సల్మాన్ ప్రశ్నకు ఐశ్వర్య మౌనమే సమాధానమయ్యేది.
ఒకరోజు రాత్రి..
ఉన్నపళంగా ఐశ్వర్య ఉంటున్న అపార్ట్‌మెంట్‌కు చేరుకున్నాడు సల్మాన్. ఆమె ఫ్లాట్ తలుపులను దబదబా బాదసాగాడు. అతని ఆవేశం అర్థమైన ఐశ్వర్య తలుపులు తీయలేదు. అతనూ వెనక్కి తగ్గలేదు . తెల్లవారు జాము మూడు గంటల వరకు అలా తలుపులు కొడుతూనే ఉన్నాడు చేతుల్లోని చర్మం చిట్లి రక్తం కారుతున్నా. ఆ చప్పుడు చుట్టుపక్కల వాళ్లకు అంతరాయం కలిగినా పోలీస్ కంప్లయింట్ ఇచ్చే ధైర్యం చేయలేదు వాళ్లు. ఆఖరకు తలుపులు తెరవకపోతే ఆ పదిహేడో అంతస్తు (ఆ అపార్ట్‌మెంట్‌లో ఐశ్వర్య ఫ్లాట్ పదిహేడో అంతస్తులోనే ఉంది) నుంచి దూకి చచ్చిపోతానననీ బెదిరించాడట సల్మాన్. అప్పుడు తలుపులు తీసింది ఐశ్వర్య అని ఆ సంఘటనకు సాక్ష్యంగా ఉన్న ఆ అంతస్తు వాసుల మాట. తర్వాత ఆ సంఘనట మీద ఐశ్వర్య వాళ్ల నాన్న కృష్టరాజ్ రాయ్ పోలీస్ కంప్లయింట్ ఇచ్చాడట. ‘ఐశ్వర్య వాళ్ల నాన్న పోలీస్ కంప్లయింట్ ఇచ్చిన మాట నిజమే. ప్రేమలో ఇలాంటివి సహజం. పోలీస్ కంప్లయింట్ ఇచ్చినందుకు ఐశ్వర్య ఫాదర్ మీద నాకేం కోపం లేదు. ఆయన చేసింది కరెక్టే’ అని చెప్పాడు సల్మాన్ ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో.
అక్కడితో ఆగలేదు..
ఒకసారి చల్తే చల్తే సినిమా షూటింగ్ జరుగుతుంటే వెళ్లి ఐశ్వర్య మీద అరిచాడట. అడ్డొచ్చిన ఆ సినిమా నిర్మాత, హీరో షారూఖ్ ఖాన్‌నూ దుర్భాషలాడాడని అప్పటి వార్తలు. ఈ రభస ఎందుకని చివరకు ఆ సినిమా నుంచి ఐశ్వర్యను తొలగించి ఆ స్థానంలో రాణి ముఖర్జీని తీసుకున్నారట. అలా సల్మాన్ సెట్స్ మీదకు వచ్చి గొడవ చేయడం ఆమె కెరీర్‌నే కాదు ఆమె వ్యక్తిత్వాన్నీ గాయపరిచాయి. ప్రేమ పేరుతో సల్మాన్ తనను ఆస్తిగా భావించడాన్ని భరించలేకపోయింది ఐశ్వర్య. దాదాపు మూడేళ్ల ఆ బంధనాన్ని 2002, మార్చిన తెంచేసుకుంది.
‘తాగి తిట్టినా, కొట్టినా సహించాను. వేరే అమ్మాయిలతో తిరిగినా ప్రశ్నించలేదు. ఆ సహనం నా ఆత్మాభిమానానికే ఎసరు పెడ్తుంటే ఊరుకోలేను కదా. అందుకే ఆ రిలేషన్‌ను వద్దనుకున్నాను. బ్రేకప్ తర్వాత కూడా చాలా సార్లు ఫోన్‌లు చేసి బూతులు తిట్టేవాడు. నేను పనిచేస్తున్న ప్రతి నటుడితో నాకు సంబంధం అంటగట్టాడు. ఈ జీవితంలో అదొక పీడకల. నా ఆత్మగౌరవం, నా సంక్షేమం కోసం లైఫ్‌లోనే కాదు సినిమాల్లో కూడా అతని భాగస్వామ్యాన్ని వద్దనుకున్నా. భవిష్యత్‌లో అతనితో నటించే సమస్యే లేదు’ అని ఓ పత్రికా ఇంటర్వ్యూలో చెప్పింది ఐశ్వర్య. ‘ఐశ్వర్య మీద చేయిచేసుకున్నానడం అబద్ధం. బాధేస్తే.. కోపమొస్తే నన్ను నేను హింసించుకుంటాను. ఒక్క సుభాష్ ఘాయ్‌ని తప్ప ఇప్పటివరకు నేనెవరీ కొట్టలేదు. అతనిక్కూడా వెంటనే క్షమాపణ చెప్పేశా’ అంటాడు సల్మాన్. ఏది ఏమైనా అతని దురుసు ప్రవర్తనతోనే ఆ ప్రేమ కథ బ్రేక్ అయిందని సల్మాన్ అభిమానులూ ఒప్పుకునే సత్యం.
- ఎస్సార్
Comments
Please login to add a commentAdd a comment