
బాలీవుడ్‌లో స్టార్ హీరోల సరసన నటించిన ముద్దుగుమ్మ మహిమా చౌదరి. ప్రస్తుతం ఆమె సిగ్నేచర్ అనే చిత్రంలో కనిపించనుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ముద్దుగుమ్మ దిల్ క్యా కరే మూవీ షూటింగ్‌లో ఎదురైన సంఘటనను పంచుకుంది. అది తన వ్యక్తిగత, వృత్తి జీవితాన్ని ఎలా ప్రభావితం చేసిందో వివరించింది. షూటింగ్ సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలిపింది. తన ముఖానికి ఎంత గాయాలు ఉన్నాయో తనకు తెలియదని చెప్పింది. అయినప్పటికీ షూట్ కొనసాగించాలని చెప్పానని.. కానీ దర్శకుడు ప్రకాష్ ఝా విశ్రాంతి తీసుకోమని చెప్పారని వివరించింది.
మహిమా చౌదరి మాట్లాడుతూ.. 'షూటింగ్ సమయంలో నాకు నా ప్రమాదం జరిగింది. నా ముఖంపై ఇన్ని గాయాలు ఉన్నాయని నేను గ్రహించలేదు. తర్వాత బాత్‌రూమ్‌కి వెళ్లి అద్దంలో చూసుకున్నా. ఏమీ జరగకపోతే షూట్ చేద్దాం అని ప్రకాష్ జీకి చెప్పాను. కానీ ఆయన వద్దన్నారు. గాయం తర్వాత నా ముఖం నుంచి డాక్టర్లు 67 గాజు ముక్కలు బయటకు తీశారు. ఆ సమయంలో ఈ విషయాన్ని బయటకు చెప్పొద్దని అజయ్ దేవగన్, ప్రకాష్ జాను కోరా. నా కెరీర్ కాపాడుకునేందుకు బయట పెట్టొద్దని వారిని అభ్యర్థించాను. దాదాపు 20 ఏళ్ల తర్వాత ఈ విషయం బయటపెట్టానని చెప్పుకొచ్చింది' బాలీవుడ్ భామ. అంతేకాకుండా తన కంటికి సర్జరీ తర్వాత చాలా ఒత్తిడికి గురైనట్లు మహిమా చౌదరి వెల్లడించింది. శస్త్రచికిత్సల తర్వాత ఇప్పటికీ నా కన్ను ఒకటి చిన్నదిగా కనిపిస్తుందని వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment