ఎస్వీయూ పరిశోధకుడి లోగోకు అంతర్జాతీయ గుర్తింపు
ఎస్వీయూనివర్సిటీ వృక్షశాస్త్ర విభాగంలో పరిశోధనలు చేస్తున్న మిట్టా మహింద్రనాథ్ రూపొందించిన జీవవైవిధ్య లోగోకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. కన్వెన్షన్ ఆఫ్ బయలాజికల్ డైవర్సిటీ (సీబీటీ) వెబ్సైట్లో ఈయన రూపొందించిన లోగోను వాడుకున్నారు. ఈ మేరకు సీబీటీ తన వెబ్సైట్లో ప్రకటన చేసింది. మే22న అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ‘ప్రజా జీవన మరియు జీవనోపాధి సంరక్షణ’ అనే ప్రధాన స్రవంతితో మహింద్రనాథ్ లోగో రూపొందించారు.
ఈ లోగోను సీబీటీ తన వెబ్సైట్లో ఉంచింది. ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల్లో రూపొందించిన లోగోల్లో మహింద్రనాథ్ రూపొందించిన లోగో 9 వ స్థానంలో నిలువగా, భారతీయ భాషల్లో బెంగాళీ తర్వాత స్థానాన్ని దక్కించుకుంది. ప్రపంచ వ్యాప్తంగా సీబీటీ జీవవైవిధ్య పరిరక్షణకు దోహదం చేస్తోంది. వివిధ దేశాల్లో ప్రాంతీయ జీవ వైవిధ్య సంస్థలతో అనుసంధానమై సదస్సులు నిర్వహిస్తుంది.
ప్రతి సంవత్సరం మే22న అంతర్జాతీయ జీవ వైవిధ్య సదస్సు నిర్వహిస్తోంది. అంతేకాకుండా ప్రతి యేడాది వివిధ అంశాలను ప్రధాన స్రవంతిగా రూపొందిస్తోంది. ఈ యేడాది జరుగుతున్న సదస్సుకు మహింద్రనాథ్ లోగోకు స్థానం దక్కడంపై పలువురు అధ్యాపకులు, పరిశోధకులు మహింద్రనాథ్ను అభినందిస్తున్నారు. ఈయన వృక్షశాస్త్ర విభాగంలో అసిస్టెంట్ ప్రొపెసర్ కె. మాధవశెట్టి పర్యవేక్షణలో పరిశోధన చేస్తున్నారు.