సౌదీలో ఉద్యోగం పేరుతో మోసం
చాంద్రాయణగుట్ట: సౌదీలో ఉద్యోగం ఇప్పిస్తామంటూ బంధువుల డబ్బులు తీసుకొని మోసగించడంతో మనస్థాపానికి గురైన ఓ యువకుడు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన చాంద్రాయణగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం ఉదయం వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బండ్లగూడ ఆషమాబాద్కు చెందిన మహ్మద్ ఇజాజ్ (25) డ్రై వర్. కాగా ఇతనికి బంధువులు అయిన ఫర్జానా బేగం, మహ్మద్ మసూద్, ఫెరోజ్ అలీ ఖాన్లు సౌదీలో ఉంటున్నారు.
సౌదీ అరేబియాలోని అల్ అబుదీ ట్రావెల్స్‌లో ఉద్యోగం ఇప్పిస్తామంటూ ఇజాజ్ వద్ద రూ.50 వేలు వసూలు చేశారు. ఎంతకీ ఉద్యోగం చూపించకపోవడంతో పాటు తిరిగి డబ్బులు ఇవ్వకపోడంతో మోసపోయానని గ్రహించి... సొంత బంధువులే మోసానికి పాల్పడ్డారని మనస్థాపానికి గురై మంగళవారం రాత్రి దూలానికి నైలాన్ తాడుతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. బుధవారం ఉదయం గమనించిన కుటుంబ సభ్యులకు పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.