టేలర్ ఫస్ట్ సెంచరీ; ఇంగ్లండ్ విక్టరీ
మాంచెస్టర్: ఆస్ట్రేలియాతో జరిగిన కీలక మూడో వన్డేలో ఇంగ్లండ్ 93 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. సిరీస్ నెగ్గేందుకు ఆశలు సజీవంగా ఉంచుకుంది. జేమ్స్ టేలర్ తొలి వన్డే సెంచరీకి తోడు, స్పిన్నర్ల కట్టుదిట్టమైన బౌలింగ్ తోడడవడంతో ఇంగ్లీషు సేన విజయాన్ని అందుకుంది.
టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 300 పరుగులు చేసింది. టేలర్ సెంచరీ సాధించాడు. 114 బంతుల్లో 5 ఫోర్లతో 101 పరుగులు చేశాడు. రాయ్(63), మోర్గాన్(62) అర్ధసెంచరీలతో రాణించారు. ఆసీస్ బౌలర్లలో మ్యాక్స్ వెల్, కుమిన్స్ రెండేసి వికెట్లు పడగొట్టారు. స్టార్క్, అగార్ ఒక్కో వికెట్ తీశారు.
301 పరుగుల టార్గెట్ ను చేరుకునేందుకు బరిలోకి దిగిన స్మిత్ సేన 44 ఓవర్లలో 207 పరుగులకు ఆలౌటైంది. ఫించ్(53), వేడ్(42) మినహా అందరూ విఫలమయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో ప్లంకెట్, అలీ మూడేసి వికెట్లు నేలకూల్చారు. ఫిన్, రషీద్ రెండేసి వికెట్లు దక్కించుకున్నారు. జేమ్స్ టేలర్ 'మ్యాన్ ఆఫ్ మ్యాచ్' అందుకున్నాడు. ఐదు మ్యాచ్ ల ఈ సిరీస్ లో మొదటి రెండు వన్డేల్లో ఆస్ట్రేలియా గెలిచింది.