ఎన్నికల కోడ్ కూసినా...
చెరువుమాధారం(నేలకొండపల్లి)న్యూస్‌లైన్: ఎన్నికల కోడ్ కూసిన తెలుగుదేశం పార్టీ నాయకులు నిబంధనలు ఉల్లంఘించి పార్టీ ఆధ్వర్యంలో క్రీడలు ఏర్పాటు చేస్తున్నారు. మండలంలోని చెరువుమాధారం గ్రామంలో అంకమ్మజాతర సందర్భంగా ఈనెల 19 నుంచి 21వ తేదీ వరకు రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలను నిర్వహిస్తున్నారు. టీడీపీ పేరుతో పసుపు పచ్చ రంగు కరపత్రంలో పాలేరు నియోజకవర్గ ఇన్చార్జీ స్వర్ణకుమారి, మండలాధ్యక్షుడు నెల్లూరి భద్రయ్య, మండల కార్యదర్శి మైశా శంకర్ పేర్లతో ముద్రించి వేలాది కరపత్రాలను పంచుతున్నారు. ఎన్నికల కోడ్ ఉండగా తెలుగుదేశం నాయకులు ఈరకంగా ప్రచారం చేస్తున్నారు.
క్రీడలను టీడీపీ గ్రామశాఖ కార్యకర్తలు నిర్వహిస్తుండుటతో గ్రామంలో రాజకీయ గోడవలకు నిలయంగా మారింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన టీడీపీ నాయకులపై చర్యలు తీసుకోవాలని వివిధ పార్టీల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. గ్రామంలో కొలువైన అంకమ్మ జాతర ఈనెల 17వ తేదీ నుంచి జరిగే ఉత్సవాన్ని టీడీపీ రాజకీయం చేస్తుందని గ్రామస్తులు ఆరోపించారు. కోడ్ ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుని వెంటనే కరపత్రాలు నిలిపివేయాలని పలువురు డిమాండ్ చేశారు. ఈ విషయమై ఎస్సై బి.సత్యనారాయణను ప్రశ్నించగా చెరువుమాదారం గ్రామంలో టీడీపీ నాయకులు కరపత్రాలు పంచే విషయం తన దృష్టికి వచ్చిందని, పంపిణీ నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశానన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.