నేడు చంద్రబాబు, వెంకయ్య రాక
గుడివాడ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు శనివారం గుడ్లవల్లేరు మండలం డోకిపర్రు విచ్చేయనున్నారు. ఈ మేరకు డివిజనల్ పౌర సంబంధాల శాఖ అధికారి శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. గుడ్లవల్లేరు మండలం డోకిపర్రులో ప్రముఖ పారిశ్రామికవేత్త, మెయిల్ అధినేత పీపీ రెడ్డి నిర్మించిన శ్రీవెంకటేశ్వరస్వామి దేవస్థానాన్ని వీరు సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి ప్రత్యేక విమానంలో శనివారం మధ్యాహ్నం 3.55 గంటలకు గన్నవరం చేరుకుంటారని, అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో 4.15 గంటలకు డోకిపర్రుకు చేరుకుంటారని తెలిపారు. 5.15 గంటలకు తిరుగు ప్రయాణమై రాజమండ్రి వెళతారని వివరించారు. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ప్రత్యేక విమానంలో శనివారం ఉదయం 7.45 గంటలకు గన్నవరం చేరుకుని, అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో 8.15 గంటలకు డోకిపర్రు చేరుకుంటారని తెలిపారు. ఉదయం 10 గంటలకు విజయవాడలోని ఈఎస్ఐసీ సబ్ రీజనల్ నూతన భవనాన్ని ప్రారంభించి 11 గంటల నుంచి 12 వరకు ఆంధ్ర లయోలా కాలేజీలో జరిగే ఎమర్జింగ్ గ్లోబల్ ఆపర్చునిటీస్ ఇన్ ఎంటర్ప్రెన్యూర్షిప్ కాన్ఫరెన్స్లో పాల్గొంటారని వివరించారు. అనంతరం 12 గంటలకు బయలుదేరి నెల్లూరు వెళతారని పేర్కొన్నారు.