ఇక రైల్ టికెట్ తీసుకోవడం ఈజీ : డీఆర్ఎం
కృష్ణా(విజయవాడ): రైల్వేలో ప్రయాణికులకు మరిన్ని సౌకర్యాలు కల్పించే లక్ష్యంతో అన్ని ముఖ్యమైన స్టేషన్లలో ఆటోమెటిక్ టికెట్ వెండింగ్ మెషిన్లను ఏర్పాటు చేశామని డీఆర్ఎం అశోక్‌కుమార్ తెలిపారు. విజయవాడ రైల్వేస్టేషన్లో మెయిన్ బుకింగ్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన ఆటోమెటిక్ టికెట్ వెండింగ్ మెషిన్‌ను ఆయన బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఆర్ఎం మాట్లాడుతూ ఇక నుంచి అన్ రిజర్వుడ్, ఫ్లాట్‌ఫాం టికెట్లను వెండింగ్మిషన్ ద్వారా సులభంగా పొందొచ్చని సూచించారు. ఈ మిషన్లలో ఏప్రాంతానికైనా టికెట్ పొందే అవకాశం ఉంటుందని దీని పేర్కొన్నారు. డివిజన్లో 17 ఆటోమెటిక్ టికెట్ వెండింగ్ మిషన్లును ఏర్పాటు చేశామని తెలిపారు.
విజయవాడలో 8, తెనాలి, నెల్లూరు, రాజమండ్రి, కొవ్వురులో మిగిలినవి ఏర్పాటుచేశామని వివరించారు. విజయవాడ మెయిన్ బుకింగ్ కార్యాలయం వద్ద నాలుగు, తూర్పు, దక్షిణ ప్రవేశ ద్వారాల వద్ద రెండేసి మెషిన్లను ఏర్పాటుచేశామని వివరించారు. ప్రయాణికులు రూ.50 చెల్లించి స్మార్ట్ కార్డు కూడా పొందొచ్చన్నారు. ఈ కార్డు ఏడాది పాటు వినియోగంలో ఉంటుందని, దాని సాయంతో దక్షిణ మధ్య రైల్వేలో అన్ రిజర్వుడు టికెట్లను ఏప్రాంతానికైనా తీసుకోవచ్చని సూచించారు. ఈ కార్డును రూ.50 నుంచి రూ.5 వేల వరకూ రీచార్జిచేసుకోవచ్చని తెలిపారు.