పోలవరానికి ప్రాధాన్యమివ్వాలి
భీమవరం :పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చూపడం తగదని రాష్ట్ర మాజీ మంత్రి, పోలవరం ప్రాజెక్టు సాధన సమితి నాయకులు యర్రా నారాయణస్వామి పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మా ణంపై భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల వెట్ సెంటర్ ఆధ్వర్యంలో సోమవారం రైతు నేతలు, మేధావులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం అనంతరం నారాయణస్వామి మాట్లాడుతూ రాష్ట్ర రాజధాని నిర్మాణం కంటే పోలవరం ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యమివ్వాలన్నారు. రాజధాని నిర్మాణానికి తొందర ఏమీలేదని పదేళ్ల వరకు హైదరాబాద్ రాజధానిగా ఉంటుందన్నారు. రాష్ట్రం ఎడారిగా మారకుండా పోలవరం నిర్మాణంపై దృష్టి సారించాలని ప్రభుత్వానికి సూచించారు. జాతీయ ప్రాజెక్టు అయినప్పటికీ పోలవరం నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రానున్న బడ్జెట్లో రూ.2వేల కోట్లు విడుదల చేసి కేంద్రం వద్ద రీఎంబర్స్మెంట్ పొందవచ్చన్నారు. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కేంద్రం ఇంతా అన్యాయం చేయడం దారుణం అన్నారు.
ప్రాజెక్టు పూర్తిచేయకపోతే
టీడీపీకి నూకలు చెల్లుతాయి
పోలవరం ప్రాజెక్టును 2018 నాటికి పూర్తిచేయకపోతే టీడీపీకి నూకలు చెల్లుతాయని రాష్ట్ర రైతు కార్యాచరణ సమితి నేత మంతెన సూర్యానారాయణరాజు పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టును అధికారంలోకి రాగానే మొదటి ప్రాధ్యానత ఇచ్చి పూర్తి చేస్తామని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు మాటా మార్చి కాలయాపన చేయడానికి పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని తెరపైకి తెచ్చారన్నారు. రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలంటే పోలవరం ప్రాజెక్టు వేగంగా పూర్తికావలసిందేన్నారు. ఈ ప్రాజెక్టుకు రూ.100 కోట్లు కేటాయించడం కంటే మరో అన్యాయం ఏదీ ఉండదన్నారు. దీనిపై పోరాడేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నామన్నారు. సమావేశంలో జలవనరుల నిపుణులు, వెబ్సెంటర్ కోఆర్డినేటర్ ఫ్రొఫెసర్ పీఏ రామకృష్ణంరాజు, పశ్చిమడెల్టాప్రాజెక్టు కమిటి మాజీ చైర్మన్ రుద్రరాజు పండురాజు, రైతు నేతలు నల్లం నాగేశ్వరావు, మెంటే సోమేశ్వరావు, కృష్ణంరాజు, పాండురంగరాజు, పాతపాటి మురళీరామరాజు పాల్గొన్నారు.