డబ్బుల్ ట్రబుల్
అనంతపురం కార్పొరేషన్ : కార్పొరేషన్ టైం బాగుండి సరిపోయింది. లేకపోతే ఇంజనీరింగ్ అధికారులు రూపొందించిన పథకం పారి ఉంటే సంస్థ రూ.50 లక్షలు నష్టపోయుండేది. వివరాల్లోకి వెళితే.. నగర పరిధిలోని ఐదు ప్రధాన రహదారుల విస్తరణ, ఆర్సీసీ డివైడర్ల ఏర్పాటుకు సంబంధించిన అంశాలను కౌన్సిల్ అనుబంధ అజెండాలో ఉంచారు. అనుబంధ అజెండాలోని 5వ అంశంగా.. నగర పాలక సంస్థ పరిధిలోని చౌదరి సర్కిల్ నుంచి రుద్రంపేట బైపాస్ రోడ్డు వరకు గల రోడ్డును విస్తరించి ఆర్సీసీ డివైడర్లు ఏర్పాటు చేసేందుకు రూ.48.55 లక్షలతో ఎస్టిమేట్ వేశారు.
ఈ మేరకు పరిపాలనపరమైన అనుమతి మంజూరు చేయూలని కోరారు. మరో వైపు అనుబంధ అజెండాలోని 9వ అంశంగా.. నగర పాలక సంస్థ పరిధిలోని చౌదరి సర్కిల్ నుంచి శ్రీ నగర్ కాలనీ జంక్షన్ వరకు గల రోడ్డును విస్తరించి ఆర్సీసీ డివైడర్లు ఏర్పాటు చేసేందుకు రూ.45.49 లక్షలతో ఎస్టిమేట్ తయారు చేశారు. ఈ మేరకు పరిపాలనాపరమైన అనుమతి మంజూరు చేయూలని కోరారు. ఈ రెండు అంశాల్లోని పని ఒక్కటే కావడం గమనార్హం. అయితే ఒక్క పనిని రెండు వేర్వేరు పనులుగా చూపిస్తూ ఇటీవల నిర్వహించిన కౌన్సిల్ సమావేశంలో అనుమతి కోసం ఉంచారు.
కాగా, నగరంలోని ప్రధాన రహదారుల విస్తరణ కోసం ఉంచిన ఏ ఒక్క పనినీ కౌన్సిల్ సభ్యులు ఆమోదించలేదు. దీంతో అధికారుల పథకం బెడిసి కొట్టినట్లయ్యింది. ఒక వేళ అనుమతి లభించి ఉంటే ఒక పని చేసి దానికి రెండు బిల్లులు తీసుకుని సంస్థకు టోకరా వేసేవారనడంలో సందేహం లేదు. అధికారులు ఇంతగా బరితెగించారంటే ముఖ్య ప్రజాప్రతినిధులెవరైనా వారిపై ఒత్తిడి తెచ్చి ఉంటారనే చర్చ జరుగుతోంది.
ఈ వ్యవహారంపై పూర్తి స్థారుు విచారణ జరిపిస్తే.. గతంలో కూడా ఇదే రీతిలో ఒక పనికి రెండు ఎస్టిమేషన్లు వేసి నిధులు దోచుకున్న సంఘటనలేవైనా ఉంటే వెలుగు చూసే అవకాశం ఉంటుందని ఓ కార్పొరేటర్ వ్యాఖ్యానించారు. ఈ తతంగంపై సోమవారం కార్పొరేషన్లో కొందరు ఉద్యోగులు గుసగుసలు పోరుున నేపథ్యంలో పాలక వర్గం ఏ విధంగా స్పందిస్తుందోననే ఉత్సుకత నెలకొంది.