బతుకమ్మను వైభవంగా నిర్వహించాలి
కలెక్టర్ డీఎస్ లోకేష్‌కుమార్
ఖమ్మం జెడ్పీసెంటర్: బతుకమ్మ పండుగను జిల్లాలో వైభవంగా నిర్వహించాలని అధికారులను కలెక్టర్ డీఎస్ లోకేష్‌కుమార్ ఆదేశించారు. ఈ నెల 30 నుంచి అక్టోబర్ 8వ తేదీ వరకు బతుకమ్మ పండుగ నిర్వహణపై గురువారం కలెక్టరేట్లోని ప్రజ్ఞా సమావేశ మందిరంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. మహిళలకు ఆధాధ్య దైవమైన ప్రకృతి పండుగ బతుకమ్మను అధికారులు సమన్వయంతో ఘనంగా నిర్వహించాలన్నారు. ప్రభుత్వ శాఖల భవనాలను విద్యుద్దీపాలతో అలంకరించాలన్నారు. నగరంలో పండుగ వాతావరణం ఉట్టిపడేలా ఏర్పాట్లు చేయాలన్నారు. నగరంలోని ప్రధాన కూడళ్లను విద్యుద్దీపాలతో అలంకరించాలని; బతుకమ్మ ఆడే ప్రదేశాలలో విద్యుద్దీపాలు, తాగునీరు ఏర్పాటు చేయాలని, ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య పనులు చేపట్టాలని, నగర పాలక సంస్థ కమిషనర్‌ను ఆదేశించారు. నగరంలో ఈ నెల 30 వ తేదీ నుంచి అక్టోబర్ 8వ తేదీ వరకు ప్రతి రోజు సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు పండుగ నిర్వహణ షెడ్యూల్ రూపొందించినట్టు తెలిపారు. నగరంతో పాటు అన్ని మండలాల్లో బతుకమ్మ వేడుకలు నిర్వహించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కొత్తగూడెం, భద్రాచలంలో వేడుకలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ దివ్య, డీఆర్వో శ్రీనివాస్, జెడ్పీ సీఈఓ మారుపాక నాగేశ్, ఏడీ ముర్తుజా, సీపీఓ రాందాస్, దేవాదాయ శాఖ ఉప కమిషనర్ రాజేందర్, డీఎస్పీ సురేష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
షెడ్యూల్ ఇలా...
- 30న మెప్మా, బీసీ వెల్ఫేర్, ఎన్పీడీసీఎల్ శాఖల ఆధ్వర్యంలో ఆటాపాట.
- అక్టోబర్ 1న స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో.
- 2న జిల్లా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో.
- 3న పోలీస్, ఫైర్, ఎక్సైజ్, రవాణా, అటవీ శాఖల ఆధ్వర్యంలో.
- 4న కలెక్టరేట్ ఆవరణలో అన్ని శాఖల ఆధ్వర్యంలో.
- 5న సంక్షేమ భవన్‌లోని అన్ని శాఖలు, సమాచార శాఖ ఆధ్వర్యంలో.
- 6న మున్సిపల్, మార్కెటింగ్ శాఖల ఆధ్వర్యంలో.
- 7న జిల్లాపరిషత్, పరిశ్రమలు, మత్స్య శాఖ, వ్యవసాయ శాఖల ఆధ్వర్యంలో.
- 8న అన్ని శాఖల సమన్వయంతో కాల్వొడ్డులోని నయాబజార్ కళాశాల ఆవరణలో పెద్దఎత్తున ఆటాపాట. బాణసంచా వెలుగుల్లో బతుకమ్మ సంబురాల నిర్వహణ.