Mairaj Ahmed Khan
-
World Cup 2022: చరిత్ర సృష్టించిన మేరాజ్
చాంగ్వాన్ (దక్షిణ కొరియా): సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ... మేరాజ్ అహ్మద్ ఖాన్ ప్రపంచకప్ షూటింగ్ టోర్నీ చరిత్రలో పురుషుల స్కీట్ విభాగంలో భారత్‌కు తొలిసారి స్వర్ణ పతకాన్ని అందించాడు. సోమవారం జరిగిన పురుషుల స్కీట్ ఈవెంట్ ఫైనల్లో ఉత్తరప్రదేశ్‌కు చెందిన 46 ఏళ్ల మేరాజ్ 40 పాయింట్లకుగాను 37 పాయింట్లు స్కోరు చేశాడు. నలుగురు పాల్గొన్న ఫైనల్లో ‘డబుల్ ఒలింపియన్’ మేరాజ్ అగ్రస్థానంలో నిలిచి బంగారు పతకాన్ని సాధించాడు. మిన్సు కిమ్ (కొరియా; 36 పాయింట్లు) రజతం, బెన్ లెలెవెలిన్ (బ్రిటన్; 26 పాయింట్లు) కాంస్యం గెల్చుకున్నారు. 35 మంది షూటర్ల మధ్య రెండు రోజులపాటు జరిగిన క్వాలిఫయింగ్ రౌండ్లో మేరాజ్ 119 పాయింట్లు స్కోరు చేసి ఎనిమిదో స్థానంలో నిలిచి ర్యాంకింగ్ మ్యాచ్‌లకు అర్హత సాధించాడు. నలుగురు షూటర్ల మధ్య జరిగిన రెండో ర్యాంకింగ్ మ్యాచ్‌లో మేరాజ్ 27 పాయింట్లు స్కోరు చేసి ఫైనల్‌కు దూసుకెళ్లాడు. 2016 రియో డి జనీరో ప్రపంచకప్ టోర్నీలో మేరాజ్ రజత పతకం సాధించాడు. మహిళల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ టీమ్ ఈవెంట్లో అంజుమ్ మౌద్గిల్, ఆశీ చౌక్సీ, సిఫ్ట్‌కౌర్ సామ్రాలతో కూడిన భారత జట్టు కాంస్య పతకం గెల్చుకుంది. కాంస్య పతక పోరులో భారత్ 16–6తో ఆస్ట్రేలియాను ఓడించింది. ఈ టోర్నీలో భారత్ ఐదు స్వర్ణాలు, ఐదు రజతాలు, మూడు కాంస్యాలతో కలిపి మొత్తం 13 పతకాలతో టాప్ ర్యాంక్‌లో కొనసాగుతోంది. -
మేరాజ్ గురికి రజతం
► స్కీట్ ఈవెంట్లో భారత్‌కు తొలిసారి పతకం ► ప్రపంచకప్ షూటింగ్ టోర్నీ రియో డి జనీరో (బ్రెజిల్): ఒకటా... రెండా... ఏకంగా 26 ప్రపంచకప్ టోర్నమెంట్లలో పాల్గొన్నప్పటికీ ఒక్కసారీ పతకం నెగ్గలేకపోయిన భారత షూటర్ మేరాజ్ అహ్మద్ ఖాన్ నిరీక్షణ ఎట్టకేలకు ముగిసింది. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక ముగిసిన ప్రపంచకప్ షూటింగ్ టోర్నమెంట్లో ఉత్తరప్రదేశ్‌కు చెందిన 40 ఏళ్ల మేరాజ్ అద్భుతమే చేశాడు. ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన మేరాజ్ స్కీట్ ఈవెంట్లో తొలిసారి ఫైనల్‌కు చేరుకోవడంతోపాటు రజత పతకాన్ని సాధించి కొత్త చరిత్ర సృష్టించాడు. ప్రపంచకప్ చరిత్రలో స్కీట్ ఈవెంట్లో భారత్‌కు పతకాన్ని అందించిన తొలి షూటర్‌గా మేరాజ్ గుర్తింపు పొందాడు. ఇప్పటికే రియో ఒలింపిక్స్‌కు అర్హత పొందిన మేరాజ్... క్వాలిఫయింగ్‌లో 122 పాయింట్లు సాధించి రెండో స్థానంలో నిలిచి సెమీఫైనల్‌కు చేరుకున్నాడు. మేరాజ్తోపాటు మరో ఐదుగురు షూటర్లు సెమీఫైనల్లో తలపడ్డారు. సెమీస్‌లో మేరాజ్, మార్కస్ స్వెన్సన్ (స్వీడన్) 15 పాయింట్ల చొప్పున స్కోరు చేసి స్వర్ణ పతక పోరుకు ‘సై’ అనగా... 14 పాయింట్ల చొప్పున స్కోరు చేసిన తమారో కసాండ్రా (ఇటలీ), యువాన్ జోస్ అరమ్బురు (స్పెయిన్) కాంస్య పతకం కోసం తలపడ్డారు. 16 షాట్లు ఉన్న ఫైనల్లో మేరాజ్, స్వెన్సన్ ఇద్దరూ 14 పాయింట్లు సాధించి సమఉజ్జీగా నిలిచారు. దాంతో విజేతను నిర్ణయించడానికి ‘షూట్ ఆఫ్’ను నిర్వహించారు. ఇందులో స్వెన్సన్ రెండు పాయింట్లు సాధించి స్వర్ణం దక్కించుకోగా... ఒక పాయింట్ స్కోరు చేసిన మేరాజ్‌కు రజత పతకం ఖాయమైంది. తమారో కసాండ్రా (ఇటలీ)కి కాంస్యం లభించింది. క్వాలిఫయింగ్‌లో భారత్‌కే చెందిన షీరాజ్ షేక్ 118 పాయింట్లతో 18వ స్థానంలో... మాన్ సింగ్ 111 పాయింట్లతో 49వ స్థానంలో నిలిచారు. రియో ఒలింపిక్స్ జరిగే వేదికపైనే నేను పతకం నెగ్గడం చాలా ఆనందంగా ఉంది. షూట్ ఆఫ్ షాట్ కోసం గ్రీస్‌కు చెందిన నా మిత్రుడి వద్ద మందుగుండును తీసుకున్నాను. నేను ఉపయోగించే మందుగుండుతో దీనికి పోలిక లేకపోవడంతో గురి తప్పాను. ఏదేమైనా రియో వేదికపై పతకం నెగ్గడం ఒలింపిక్స్‌కు ముందు శుభారంభం లాంటిదే. ఏ పతకమైనా నేను సాధించగలను అనే నమ్మకాన్ని పెంచుతుంది. -మేరాజ్ అహ్మద్ ఖాన్