మేరాజ్ గురికి రజతం
► స్కీట్ ఈవెంట్‌లో భారత్‌కు తొలిసారి పతకం
► ప్రపంచకప్ షూటింగ్ టోర్నీ
రియో డి జనీరో (బ్రెజిల్): ఒకటా... రెండా... ఏకంగా 26 ప్రపంచకప్ టోర్నమెంట్‌లలో పాల్గొన్నప్పటికీ ఒక్కసారీ పతకం నెగ్గలేకపోయిన భారత షూటర్ మేరాజ్ అహ్మద్ ఖాన్ నిరీక్షణ ఎట్టకేలకు ముగిసింది. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక ముగిసిన ప్రపంచకప్ షూటింగ్ టోర్నమెంట్‌లో ఉత్తరప్రదేశ్‌కు చెందిన 40 ఏళ్ల మేరాజ్ అద్భుతమే చేశాడు. ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన మేరాజ్ స్కీట్ ఈవెంట్‌లో తొలిసారి ఫైనల్‌కు చేరుకోవడంతోపాటు రజత పతకాన్ని సాధించి కొత్త చరిత్ర సృష్టించాడు. ప్రపంచకప్ చరిత్రలో స్కీట్ ఈవెంట్‌లో భారత్‌కు పతకాన్ని అందించిన తొలి షూటర్‌గా మేరాజ్ గుర్తింపు పొందాడు. ఇప్పటికే రియో ఒలింపిక్స్‌కు అర్హత పొందిన మేరాజ్... క్వాలిఫయింగ్‌లో 122 పాయింట్లు సాధించి రెండో స్థానంలో నిలిచి సెమీఫైనల్‌కు చేరుకున్నాడు.
మేరాజ్‌తోపాటు మరో ఐదుగురు షూటర్లు సెమీఫైనల్లో తలపడ్డారు. సెమీస్‌లో మేరాజ్, మార్కస్ స్వెన్సన్ (స్వీడన్) 15 పాయింట్ల చొప్పున స్కోరు చేసి స్వర్ణ పతక పోరుకు ‘సై’ అనగా... 14 పాయింట్ల చొప్పున స్కోరు చేసిన తమారో కసాండ్రా (ఇటలీ), యువాన్ జోస్ అరమ్‌బురు (స్పెయిన్) కాంస్య పతకం కోసం తలపడ్డారు. 16 షాట్‌లు ఉన్న ఫైనల్లో మేరాజ్, స్వెన్సన్ ఇద్దరూ 14 పాయింట్లు సాధించి సమఉజ్జీగా నిలిచారు.
దాంతో విజేతను నిర్ణయించడానికి ‘షూట్ ఆఫ్’ను నిర్వహించారు. ఇందులో స్వెన్సన్ రెండు పాయింట్లు సాధించి స్వర్ణం దక్కించుకోగా... ఒక పాయింట్ స్కోరు చేసిన మేరాజ్‌కు రజత పతకం ఖాయమైంది. తమారో కసాండ్రా (ఇటలీ)కి కాంస్యం లభించింది. క్వాలిఫయింగ్‌లో భారత్‌కే చెందిన షీరాజ్ షేక్ 118 పాయింట్లతో 18వ స్థానంలో... మాన్ సింగ్ 111 పాయింట్లతో 49వ స్థానంలో నిలిచారు.
రియో ఒలింపిక్స్ జరిగే వేదికపైనే నేను పతకం నెగ్గడం చాలా ఆనందంగా ఉంది. షూట్ ఆఫ్ షాట్ కోసం గ్రీస్‌కు చెందిన నా మిత్రుడి వద్ద మందుగుండును తీసుకున్నాను. నేను ఉపయోగించే మందుగుండుతో దీనికి పోలిక లేకపోవడంతో గురి తప్పాను. ఏదేమైనా రియో వేదికపై పతకం నెగ్గడం ఒలింపిక్స్‌కు ముందు శుభారంభం లాంటిదే. ఏ పతకమైనా నేను సాధించగలను అనే నమ్మకాన్ని పెంచుతుంది. -మేరాజ్ అహ్మద్ ఖాన్