పిస్టల్ పవర్...
► జీతూ రాయ్ ‘పసిడి’ గురి
► ప్రపంచ రికార్డుతో సంచలనం రజతం నెగ్గిన అమన్‌ప్రీత్
► 50 మీటర్ల పిస్టల్ ఈవెంట్‌లో భారత్‌కు రెండు పతకాలు
►ప్రపంచకప్ షూటింగ్ టోర్నీ
ఐదు రోజుల నిరీక్షణ ముగిసింది. స్వదేశంలో తొలిసారి జరుగుతున్న ప్రపంచకప్ షూటింగ్ టోర్నమెంట్‌లో భారత షూటర్ల గురికి తొలి పసిడి పతకం వచ్చింది. చివరి షాట్ వరకు నమ్మకం కోల్పోకుండా, ఆత్మవిశ్వాసంతో గురి చూసి కొట్టిన జీతూ రాయ్ భారత్ ఖాతాలో తొలి స్వర్ణ పతకాన్ని జమ చేశాడు. అందరి అంచనాలను తారుమారు చేస్తూ మరో భారత షూటర్ అమన్‌ప్రీత్ సింగ్ కూడా అద్భుతంగా రాణించి రజత పతకం గెలిచాడు. దాంతో పురుషుల 50 మీటర్ల పిస్టల్ ఈవెంట్‌లో భారత్ తమ పవర్‌ఫుల్ ప్రదర్శనతో రెండు పతకాలను సొంతం చేసుకుంది.
న్యూఢిల్లీ: గురిలో కాస్త తేడా వస్తే పతకావకాశాలు తారుమారు అయ్యే పరిస్థితి. కానీ జీతూ రాయ్ మాత్రం తడబడలేదు. ఒక్కో షాట్‌తో ప్రత్యర్థులను వెనక్కి నెట్టి ఏకంగా అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. అదే క్రమంలో కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పి సంచలనం సృష్టించాడు. సొంతగడ్డపై జరుగుతున్న ప్రపంచకప్ షూటింగ్ టోర్నీలో భారత్‌కు తొలి స్వర్ణ పతకాన్ని అందించాడు. బుధవారం జరిగిన పురుషుల 50 మీటర్ల పిస్టల్ ఈవెంట్‌లో జీతూ రాయ్‌తోపాటు అమన్‌ప్రీత్ సింగ్ అదరగొట్టాడు. ఫలితంగా భారత్‌కు పసిడి పతకంతోపాటు రజతం కూడా దక్కింది. ఎనిమిది మంది షూటర్లు పాల్గొన్న ఫైనల్లో జీతూ రాయ్ 230.1 పాయింట్లు స్కోరు చేసి ప్రపంచ రికార్డు నెలకొల్పడమే కాకుండా స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు. చివరి షాట్ వరకు నంబర్‌వన్ స్థానంలో ఉన్న అమన్‌ప్రీత్ సింగ్ కీలకదశలో ఒత్తిడికి లోనయ్యాడు. చివరి షాట్‌లో తడబడి తుదకు 226.9 పాయింట్లతో రజత పతకాన్ని దక్కించుకున్నాడు. 208 పాయింట్లు స్కోరు చేసిన ఇరాన్ షూటర్ వహీద్ గోల్‌ఖాందన్ కాంస్య పతకంతో సరిపెట్టుకున్నాడు.
ఫైనల్లో తొలి రెండు సిరీస్‌లు పూర్తయ్యాక జీతూ రాయ్ ఆరో స్థానంలో నిలిచాడు. ఆ తర్వాత ఒక్కో సిరీస్‌కు జీతూ రాయ్ స్కోరు మెరుగైంది. ఐదో సిరీస్‌లోని తొలి షాట్‌కు జీతూ 10.8, రెండో షాట్‌కు 9.3 స్కోరు చేసి ఆరో స్థానం నుంచి నాలుగో స్థానానికి ఎగబాకాడు. ఆ తర్వాత ఇదే జోరు కొనసాగిస్తూ ఎనిమిదో సిరీస్ పూర్తయ్యాక 209.6 పాయింట్లతో రెండో స్థానానికి వచ్చాడు. అమన్‌ప్రీత్ 209.9 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. చివరిదైన ఎనిమిదో సిరీస్‌లో తొలి షాట్‌కు జీతూ 10... రెండో షాట్‌కు 10.5 స్కోరు చేసి అగ్రస్థానానికి చేరుకున్నాడు. అమన్‌ప్రీత్ తొలి షాట్‌కు 8.8... రెండో షాట్‌కు 8.2 స్కోరు చేసి రెండో స్థానానికి పడిపోయి రజతంతో సంతృప్తి పడ్డాడు. అంతకుముందు 34 మంది షూటర్లు పాల్గొన్న క్వాలిఫయింగ్‌లో అమన్‌ప్రీత్ సింగ్ 561, జీతూ రాయ్ 559 పాయింట్లు సాధించి ఫైనల్‌కు చేరారు. భారత్‌కే చెందిన మరో షూటర్ గుర్‌పాల్ సింగ్ 549 పాయింట్లతో 12వ స్థానంలో నిలిచాడు. టాప్–8లో నిలిచిన వారు ఫైనల్‌కు అర్హత సాధిస్తారు.
స్కీట్‌లో నిరాశ...
మరోవైపు మహిళల స్కీట్ ఈవెంట్‌లో భారత షూటర్లకు నిరాశ ఎదురైంది. 27 మంది బరిలోకి దిగిన క్వాలిఫయింగ్ పోటీల్లో రష్మీ రాథోడ్ 66 పాయింట్లు, ఆర్తి సింగ్ రావు 63 పాయింట్లు, సానియా షేక్ 60 పాయింట్లు సాధించి వరుసగా 17వ, 24వ, 27వ స్థానాల్లో నిలిచారు. ఈ విభాగంలో రియో ఒలింపిక్స్ చాంపియన్ కింబర్లీ రోడ్ (అమెరికా) ఫైనల్లో 56 పాయింట్లు సాధించి కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పడంతోపాటు స్వర్ణ పతకాన్ని దక్కించుకుంది. ఈ టోర్నీలో ఇప్పటివరకు భారత్ స్వర్ణం, రెండు రజతాలు, రెండు కాంస్యాలు సాధించి ఐదు పతకాలతో నాలుగో స్థానంలో ఉంది.