భారత్‌కు ఐదో స్థానం
ముగిసిన ప్రపంచకప్ షూటింగ్
న్యూఢిల్లీ: ప్రపంచకప్ షూటింగ్ టోర్నమెంట్‌లో చివరి రోజు భారత్‌కు నిరాశే ఎదురైంది. గురువారం జరిగిన పురుషుల స్కీట్ ఈవెంట్‌లో షీరాజ్ షేక్ ఆరో స్థానంలో నిలిచాడు. అయితే తన ఏడేళ్ల కెరీర్‌లో తొలి ప్రపంచకప్ ఫైనల్ ఆడిన షీరాజ్ అత్యుత్తమ ప్రదర్శన చేశాడు. క్వాలిఫయింగ్ రౌండ్‌లో 121 పాయింట్లు సాధించగా.. ఫైనల్ రౌండ్‌లో చోటు కోసం జరిగిన షూట్ ఆఫ్‌లో మాజీ ప్రపంచ చాంపియన్ జెస్పర్ హెన్సన్ (డెన్మార్క్)ను మించి రాణించాడు. అయితే ఫైనల్లో మాత్రం నిరాశపరిచి ఆరో స్థానంలో నిలిచాడు. గతంలో ఉత్తరప్రదేశ్ తరఫున అండర్–16 విజయ్ మర్చంట్ ట్రోఫీలో పాల్గొన్న షీరాజ్ ఫైనల్లోని 20 షాట్లలో 16 పాయింట్లు సాధించాడు. ‘ఇదో మంచి అనుభవం. అంతా బాగానే సాగినా కొన్ని షాట్లను మిస్ అయ్యాను.
మరింత మెరుగయ్యేందుకు అవకాశం ఉంది’ అని 26ఏళ్ల షీరాజ్ తెలిపాడు. రియో ఒలింపిక్ చాంపియన్ గాబ్రియల్ రోసెట్టిని వెనక్కి నెట్టి ఇటలీకి చెందిన షూటర్ రికార్డో ఫిలిప్పెలి స్వర్ణం సాధించాడు. తొలిసారిగా స్వదేశంలో జరిగిన ఈ మెగా ఈవెంట్‌లో భారత్ మొత్తం ఐదు పతకాలు సాధించింది. ఇందులో ఓ స్వర్ణం, రెండు రజతాలు, రెండు కాంస్యాలున్నాయి. పతకాల పట్టికలో చైనా, ఇటలీ, ఆస్ట్రేలియా, జపాన్ తర్వాత భారత్ ఐదో స్థానంలో నిలిచింది. పురుషుల 50మీ. పిస్టల్ ఈవెంట్‌లో జీతూ రాయ్ ఏకైక స్వర్ణం సాధించిన విషయం తెలిసిందే. శుక్రవారం ఈ చాంపియన్‌షిప్‌లో మిక్స్‌డ్ ఈవెంట్ విభాగంలో పోటీలు జరుగుతాయి. అయితే ప్రయోగాత్మకంగా నిర్వహిస్తున్న ఈ ఈవెంట్లలో సాధించిన పతకాలను పరిగణనలోకి తీసుకోరు.