Shooting World Cup tournament
-
రిథమ్–అనీశ్ జోడీకి స్వర్ణం
కైరో (ఈజిప్ట్): ప్రపంచకప్ షూటింగ్ టోర్నమెంట్‌ను భారత్ స్వర్ణ పతకంతో ముగించింది. టోర్నీ చివరిరోజు సోమవారం భారత్‌కు ఒక స్వర్ణం, ఒక రజతం లభించాయి. 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో రిథమ్ సాంగ్వాన్–అనీశ్ భన్వాలా జోడీ పసిడి పతకం సొంతం చేసుకుంది. ఫైనల్లో రిథమ్–అనీశ్ ద్వయం 17–7తో చవీసా పాదుక–రామ్ ఖమాయెంగ్ (థాయ్‌లాండ్) జంటపై గెలిచింది. అంతకుముందు జరిగిన పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ టీమ్ ఈవెంట్లో అనీశ్, గుర్ప్రీత్ సింగ్, భావేశ్ షెఖావత్‌లతో కూడిన భారత జట్టుకు రజతం దక్కింది. ఫైనల్లో భారత జట్టు 7–17తో జర్మనీ జట్టు చేతిలో ఓడిపోయింది. ఓవరాల్‌గా ఈ టోర్నీలో భారత్ నాలుగు స్వర్ణాలు, రెండు రజతాలు, ఒక కాంస్యంతో కలిపి మొత్తం ఏడు పతకాలు సాధించి టాప్ ర్యాంక్‌లో నిలిచింది. -
భారత్‌కు ఐదో స్థానం
ముగిసిన ప్రపంచకప్ షూటింగ్ న్యూఢిల్లీ: ప్రపంచకప్ షూటింగ్ టోర్నమెంట్లో చివరి రోజు భారత్‌కు నిరాశే ఎదురైంది. గురువారం జరిగిన పురుషుల స్కీట్ ఈవెంట్లో షీరాజ్ షేక్ ఆరో స్థానంలో నిలిచాడు. అయితే తన ఏడేళ్ల కెరీర్లో తొలి ప్రపంచకప్ ఫైనల్ ఆడిన షీరాజ్ అత్యుత్తమ ప్రదర్శన చేశాడు. క్వాలిఫయింగ్ రౌండ్లో 121 పాయింట్లు సాధించగా.. ఫైనల్ రౌండ్లో చోటు కోసం జరిగిన షూట్ ఆఫ్‌లో మాజీ ప్రపంచ చాంపియన్ జెస్పర్ హెన్సన్ (డెన్మార్క్)ను మించి రాణించాడు. అయితే ఫైనల్లో మాత్రం నిరాశపరిచి ఆరో స్థానంలో నిలిచాడు. గతంలో ఉత్తరప్రదేశ్ తరఫున అండర్–16 విజయ్ మర్చంట్ ట్రోఫీలో పాల్గొన్న షీరాజ్ ఫైనల్లోని 20 షాట్లలో 16 పాయింట్లు సాధించాడు. ‘ఇదో మంచి అనుభవం. అంతా బాగానే సాగినా కొన్ని షాట్లను మిస్ అయ్యాను. మరింత మెరుగయ్యేందుకు అవకాశం ఉంది’ అని 26ఏళ్ల షీరాజ్ తెలిపాడు. రియో ఒలింపిక్ చాంపియన్ గాబ్రియల్ రోసెట్టిని వెనక్కి నెట్టి ఇటలీకి చెందిన షూటర్ రికార్డో ఫిలిప్పెలి స్వర్ణం సాధించాడు. తొలిసారిగా స్వదేశంలో జరిగిన ఈ మెగా ఈవెంట్లో భారత్ మొత్తం ఐదు పతకాలు సాధించింది. ఇందులో ఓ స్వర్ణం, రెండు రజతాలు, రెండు కాంస్యాలున్నాయి. పతకాల పట్టికలో చైనా, ఇటలీ, ఆస్ట్రేలియా, జపాన్ తర్వాత భారత్ ఐదో స్థానంలో నిలిచింది. పురుషుల 50మీ. పిస్టల్ ఈవెంట్లో జీతూ రాయ్ ఏకైక స్వర్ణం సాధించిన విషయం తెలిసిందే. శుక్రవారం ఈ చాంపియన్‌షిప్‌లో మిక్స్డ్ ఈవెంట్ విభాగంలో పోటీలు జరుగుతాయి. అయితే ప్రయోగాత్మకంగా నిర్వహిస్తున్న ఈ ఈవెంట్లలో సాధించిన పతకాలను పరిగణనలోకి తీసుకోరు. -
పిస్టల్ పవర్...
► జీతూ రాయ్ ‘పసిడి’ గురి ► ప్రపంచ రికార్డుతో సంచలనం రజతం నెగ్గిన అమన్‌ప్రీత్ ► 50 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో భారత్‌కు రెండు పతకాలు ►ప్రపంచకప్ షూటింగ్ టోర్నీ ఐదు రోజుల నిరీక్షణ ముగిసింది. స్వదేశంలో తొలిసారి జరుగుతున్న ప్రపంచకప్ షూటింగ్ టోర్నమెంట్లో భారత షూటర్ల గురికి తొలి పసిడి పతకం వచ్చింది. చివరి షాట్ వరకు నమ్మకం కోల్పోకుండా, ఆత్మవిశ్వాసంతో గురి చూసి కొట్టిన జీతూ రాయ్ భారత్ ఖాతాలో తొలి స్వర్ణ పతకాన్ని జమ చేశాడు. అందరి అంచనాలను తారుమారు చేస్తూ మరో భారత షూటర్ అమన్‌ప్రీత్ సింగ్ కూడా అద్భుతంగా రాణించి రజత పతకం గెలిచాడు. దాంతో పురుషుల 50 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో భారత్ తమ పవర్ఫుల్ ప్రదర్శనతో రెండు పతకాలను సొంతం చేసుకుంది. న్యూఢిల్లీ: గురిలో కాస్త తేడా వస్తే పతకావకాశాలు తారుమారు అయ్యే పరిస్థితి. కానీ జీతూ రాయ్ మాత్రం తడబడలేదు. ఒక్కో షాట్‌తో ప్రత్యర్థులను వెనక్కి నెట్టి ఏకంగా అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. అదే క్రమంలో కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పి సంచలనం సృష్టించాడు. సొంతగడ్డపై జరుగుతున్న ప్రపంచకప్ షూటింగ్ టోర్నీలో భారత్‌కు తొలి స్వర్ణ పతకాన్ని అందించాడు. బుధవారం జరిగిన పురుషుల 50 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో జీతూ రాయ్‌తోపాటు అమన్‌ప్రీత్ సింగ్ అదరగొట్టాడు. ఫలితంగా భారత్‌కు పసిడి పతకంతోపాటు రజతం కూడా దక్కింది. ఎనిమిది మంది షూటర్లు పాల్గొన్న ఫైనల్లో జీతూ రాయ్ 230.1 పాయింట్లు స్కోరు చేసి ప్రపంచ రికార్డు నెలకొల్పడమే కాకుండా స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు. చివరి షాట్ వరకు నంబర్‌వన్ స్థానంలో ఉన్న అమన్‌ప్రీత్ సింగ్ కీలకదశలో ఒత్తిడికి లోనయ్యాడు. చివరి షాట్లో తడబడి తుదకు 226.9 పాయింట్లతో రజత పతకాన్ని దక్కించుకున్నాడు. 208 పాయింట్లు స్కోరు చేసిన ఇరాన్ షూటర్ వహీద్ గోల్‌ఖాందన్ కాంస్య పతకంతో సరిపెట్టుకున్నాడు. ఫైనల్లో తొలి రెండు సిరీస్‌లు పూర్తయ్యాక జీతూ రాయ్ ఆరో స్థానంలో నిలిచాడు. ఆ తర్వాత ఒక్కో సిరీస్‌కు జీతూ రాయ్ స్కోరు మెరుగైంది. ఐదో సిరీస్‌లోని తొలి షాట్‌కు జీతూ 10.8, రెండో షాట్‌కు 9.3 స్కోరు చేసి ఆరో స్థానం నుంచి నాలుగో స్థానానికి ఎగబాకాడు. ఆ తర్వాత ఇదే జోరు కొనసాగిస్తూ ఎనిమిదో సిరీస్ పూర్తయ్యాక 209.6 పాయింట్లతో రెండో స్థానానికి వచ్చాడు. అమన్‌ప్రీత్ 209.9 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. చివరిదైన ఎనిమిదో సిరీస్‌లో తొలి షాట్‌కు జీతూ 10... రెండో షాట్‌కు 10.5 స్కోరు చేసి అగ్రస్థానానికి చేరుకున్నాడు. అమన్‌ప్రీత్ తొలి షాట్‌కు 8.8... రెండో షాట్‌కు 8.2 స్కోరు చేసి రెండో స్థానానికి పడిపోయి రజతంతో సంతృప్తి పడ్డాడు. అంతకుముందు 34 మంది షూటర్లు పాల్గొన్న క్వాలిఫయింగ్‌లో అమన్‌ప్రీత్ సింగ్ 561, జీతూ రాయ్ 559 పాయింట్లు సాధించి ఫైనల్‌కు చేరారు. భారత్‌కే చెందిన మరో షూటర్ గుర్పాల్ సింగ్ 549 పాయింట్లతో 12వ స్థానంలో నిలిచాడు. టాప్–8లో నిలిచిన వారు ఫైనల్‌కు అర్హత సాధిస్తారు. స్కీట్‌లో నిరాశ... మరోవైపు మహిళల స్కీట్ ఈవెంట్లో భారత షూటర్లకు నిరాశ ఎదురైంది. 27 మంది బరిలోకి దిగిన క్వాలిఫయింగ్ పోటీల్లో రష్మీ రాథోడ్ 66 పాయింట్లు, ఆర్తి సింగ్ రావు 63 పాయింట్లు, సానియా షేక్ 60 పాయింట్లు సాధించి వరుసగా 17వ, 24వ, 27వ స్థానాల్లో నిలిచారు. ఈ విభాగంలో రియో ఒలింపిక్స్ చాంపియన్ కింబర్లీ రోడ్ (అమెరికా) ఫైనల్లో 56 పాయింట్లు సాధించి కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పడంతోపాటు స్వర్ణ పతకాన్ని దక్కించుకుంది. ఈ టోర్నీలో ఇప్పటివరకు భారత్ స్వర్ణం, రెండు రజతాలు, రెండు కాంస్యాలు సాధించి ఐదు పతకాలతో నాలుగో స్థానంలో ఉంది. -
జీతూ ఖాతాలో కాంస్యం
ప్రపంచకప్ షూటింగ్ టోర్నీ న్యూఢిల్లీ: కొన్నేళ్లుగా అంతర్జాతీయస్థాయిలో నిలకడగా పతకాలు సాధిస్తున్న భారత స్టార్ షూటర్ జీతూ రాయ్ సొంతగడ్డపై తొలిసారి జరుగుతోన్న ప్రపంచకప్ షూటింగ్ టోర్నీలో మెరిశాడు. సోమవారం మిక్స్డ్ పిస్టల్ టెస్ట్ ఈవెంట్లో భారత్‌కే చెందిన హీనా సిద్ధూతో జతగా స్వర్ణం గెలిచిన జీతూ అదే జోరును మంగళవారం కొనసాగించాడు. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో మూడో స్థానంలో నిలిచి తన ఖాతాలో కాంస్య పతకాన్ని జమ చేసుకున్నాడు. ఎనిమిది మంది పాల్గొన్న ఫైనల్లో 29 ఏళ్ల జీతూ రాయ్ 216.7 పాయింట్లు స్కోరు చేశాడు. తొమొయుకి మత్సుద (జపాన్) 240.1 పాయింట్లు సాధించి కొత్త ప్రపంచ రికార్డు సృష్టించడంతోపాటు స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు. విన్ జువాన్ హోంగ్ (వియత్నాం) 236.6 పాయింట్లతో రజత పతకాన్ని గెల్చుకున్నాడు. 35 మంది షూటర్లు పాల్గొన్న క్వాలిఫయింగ్ రౌండ్లో జీతూ రాయ్ 577 పాయింట్లు సాధించి ఆరో స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత పొందాడు. టాప్–8లో ఉన్న షూటర్లు ఫైనల్లో పోటీపడ్డారు. భారత్‌కే చెందిన ఓంకార్ సింగ్ 574 పాయింట్లు, అమన్‌ప్రీత్ సింగ్ 572 పాయింట్లు సాధించి వరుసగా 14వ, 19వ స్థానాల్లో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయారు. ‘ఫైనల్ ఆరంభంలో నేను తడబడ్డాను. మిగతా వారికంటే వెనుకబడ్డాను. ఒకదశలో పతకం గెలుస్తానో లేదో అనే అనుమానం కలిగింది. అయితే ఎలాగైనా పతకం నెగ్గాలనే లక్ష్యంతో ఏకాగ్రతతో లక్ష్యంపై దృష్టి కేంద్రీకరించాను. నిలకడగా పాయింట్లు సాధించి చివరకు కాంస్య పతకాన్ని గెలిచాను’ అని జీతూ రాయ్ వ్యాఖ్యానించాడు. ‘క్వాలిఫయింగ్ సందర్భంగా స్కోరు బోర్డును చూడలేదు. దానిపై దృష్టి పెడితే ఏకాగ్రత దెబ్బతింటుందని తెలుసు. తప్పిదాల నుంచి పాఠాలు నేర్చుకుంటాను. ఫైనల్‌కు చేరుకోవడంతో నాపై ఉన్న ఒత్తిడి తొలగిపోయింది. రియో ఒలింపిక్స్‌లో వైఫల్యం తర్వాత నేను నెగ్గిన మూడో అంతర్జాతీయ పతకమిది. వరల్డ్ కప్ ఫైనల్స్‌లో రజతం, అదే టోర్నీలో చాంపియన్ ఆఫ్ చాంపియన్స్ టైటిల్‌ను సాధించాను’ అని జీతూ రాయ్ తెలిపాడు. గగన్, చెయిన్ సింగ్‌లకు నిరాశ మరోవైపు పురుషుల 50 మీటర్ల ప్రోన్ ఈవెంట్లో పోటీపడ్డ చెయిన్ సింగ్, గగన్ నారంగ్, సుశీల్ ఘాలే పతకం నెగ్గడంలో విఫలమయ్యారు. చెయిన్ సింగ్ ఫైనల్‌కు చేరుకున్నా 141.9 పాయింట్లు సాధించి ఏడో స్థానంతో సరిపెట్టుకున్నాడు. క్వాలిఫయింగ్‌లో సుశీల్ 617.9 పాయింట్లు, గగన్ నారంగ్ 617 పాయింట్లు స్కోరు చేసి వరుసగా 12వ, 15వ స్థానాల్లో నిలిచి ఫైనల్ రౌండ్‌కు అర్హత పొందలేకపోయారు. ఫైనల్లో తొషికాజు యమషిటా (జపాన్) 249.8 పాయింట్లతో ప్రపంచ రికార్డు నెలకొల్పడంతోపాటు పసిడి పతకాన్ని గెల్చుకున్నాడు. లియు యుకున్ (చైనా–249.3 పాయింట్లు) రజతం, డానియల్ రోమన్జికి (పోలాండ్–226.6 పాయింట్లు) కాంస్యం సాధించారు. ఇప్పటివరకు భారత్ ఈ టోర్నీలో ఒక రజతం, రెండు కాంస్యాలు నెగ్గి మూడు పతకాలతో ఐదో స్థానంలో ఉంది. చైనా ఆరు స్వర్ణాలు, ఐదు రజతాలతో అగ్రస్థానంలో ఉంది. -
గురి అదిరింది
జీతూ–హీనా జంటకు స్వర్ణం రజతం నెగ్గిన అంకుర్ మిట్టల్ ప్రపంచకప్ షూటింగ్ టోర్నీ న్యూఢిల్లీ: వరుసగా రెండు రోజుల వైఫల్యం తర్వాత భారత షూటర్లు మెరిశారు. సొంతగడ్డపై జరుగుతున్న అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య (ఐఎస్ఎస్ఎఫ్) ప్రపంచకప్ టోర్నమెంట్లో సోమవారం భారత్‌కు ఒక స్వర్ణం, ఒక రజతం లభించాయి. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో కొత్తగా ప్రవేశపెట్టనున్న 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ ఈవెంట్‌ను ఈ టోర్నీలో ప్రయోగాత్మకంగా నిర్వహించారు. ఈ విభాగంలో భారత స్టార్ షూటర్లు జీతూ రాయ్–హీనా సిద్ధూ జతగా బరిలోకి దిగారు. ఫైనల్లో జీతూ–హీనా ద్వయం 5–3తో యుకారి కొనిషి–తొమొయుకి మత్సుదా (జపాన్) జోడీపై గెలిచింది. మూడో స్థానంలో నిలిచిన నఫాస్వన్ యాంగ్‌పైబూన్–కెవిన్ వెంటా (స్లొవేనియా) జంటకు కాంస్య పతకం లభించింది. షూటింగ్ రేంజ్లో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో మిక్స్డ్ ఈవెంట్ గంట ఆలస్యంగా ప్రారంభమైంది. ఈ ఈవెంట్‌ను ప్రయోగాత్మకంగా నిర్వహించినందుకు షూటర్లకు పతకాలు ప్రదానం చేసినా ఫలితాలకు మాత్రం అధికారిక గుర్తింపు ఇవ్వలేదు. పతకాల పట్టిక జాబితాలో కూడా వీటిని చేర్చలేదు. పాయింట్ తేడాతో...: మరోవైపు పురుషుల డబుల్ ట్రాప్ ఈవెంట్లో అంకుర్ మిట్టల్ రెండో స్థానంలో నిలిచి రజత పతకాన్ని దక్కించుకున్నాడు. కేవలం పాయింట్ తేడా తో అంకుర్‌కు స్వర్ణం చేజారింది. ఫైనల్లో అంకుర్ 74 పాయింట్లు స్కోరు చేశాడు. జేమ్స్ విలెట్ (ఆస్ట్రేలియా) 75 పాయింట్లతో కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పడంతోపాటు స్వర్ణ పతకాన్ని గెలిచాడు. జేమ్స్ డీడ్మన్ (బ్రిటన్–56 పాయింట్లు) కాంస్య పతకాన్ని నెగ్గాడు. భారత్‌కే చెందిన సంగ్రామ్ దహియా ఆరో స్థానంతో సరిపెట్టుకున్నాడు. కొత్త నిబంధనల ప్రకారం డబుల్ ట్రాప్ ఫైనల్ ఈవెంట్లో షాట్ల సంఖ్యను 50 నుంచి 80 షాట్లకు పెంచారు. 30 షాట్లు పూర్తయిన తర్వాత తక్కువ స్కోరు ఉన్న వారు నిష్క్రమించడం మొదలవుతుంది. 20 మంది షూటర్లు పాల్గొన్న క్వాలిఫయింగ్ రౌండ్లో అంకుర్ 137 పాయింట్లతో నాలుగో స్థానంలో, సంగ్రామ్ 138 పాయింట్లతో ఫైనల్‌కు అర్హత సాధించారు. 15 ఏళ్ల శపథ్ భరద్వాజ్ 132 పాయింట్లతో పదో స్థానంలో నిలిచాడు. టాప్–6లో నిలిచిన వారు ఫైనల్‌కు అర్హత పొందారు. మహిళల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ ఈవెంట్ ఫైనల్లో తేజస్విని సావంత్ 402.4 పాయింట్లు సాధించి ఏడో స్థానంతో సరిపెట్టుకుంది. ఇప్పటివరకు ఈ టోర్నీలో భారత్ రజతం, కాంస్యం నెగ్గింది. -
పూజా ‘గురి’కి కాంస్యం
ప్రపంచకప్ షూటింగ్ టోర్నీ న్యూఢిల్లీ: సొంతగడ్డపై తొలిసారి జరుగుతున్న ప్రపంచకప్ షూటింగ్ టోర్నమెంట్లో తొలి రోజే భారత్ పతకాల బోణీ చేసింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో పూజా ఘాట్కర్ మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని దక్కించుకుంది. మహారాష్ట్రకు చెందిన 27 ఏళ్ల పూజ ఫైనల్లో 228.8 పాయింట్లు స్కోరు చేసింది. గతంలో రెండుసార్లు ప్రపంచకప్ టోర్నీల్లో ఫైనల్‌కు చేరి పతకం నెగ్గలేకపోయిన పూజ మూడోసారి సఫలం కావడం విశేషం. మెంగ్యావో షి (చైనా) 252.1 పాయింట్లు స్కోరు చేసి కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పడంతోపాటు స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. 248.9 పాయింట్లతో డాంగ్ లిజి (చైనా) రజత పతకాన్ని గెల్చుకుంది. 42 మంది షూటర్లు పాల్గొన్న క్వాలిఫయింగ్ రౌండ్లో పూజ 418 పాయింట్లు సాధించి రెండో స్థానంలో నిలిచింది. క్వాలిఫయింగ్‌లో టాప్–8లో నిలిచిన వారు ఫైనల్‌కు అర్హత సాధిస్తారు. క్వాలిఫయింగ్‌లో చేసిన స్కోరును ఫైనల్లో పరిగణలోకి తీసుకోరు. భారత్‌కే చెందిన మేఘన సజ్జనార్ (413.3 పాయింట్లు), వినిత భరద్వాజ్ (412.3 పాయింట్లు) వరుసగా 16వ, 20వ స్థానాల్లో నిలిచారు. మరోవైపు పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో భారత్‌కు నిరాశ ఎదురైంది. ఫైనల్‌కు చేరిన భారత షూటర్లు దీపక్ కుమార్ (185.4 పాయింట్లు) ఐదో స్థానంలో, రవి కుమార్ 122 పాయింట్లతో ఎనిమిదో స్థానంలో నిలిచారు. చైనా షూటర్ బుహాన్ సాంగ్ (249.5 పాయింట్లు) కొత్త ప్రపంచ రికార్డు నమోదు చేయడంతోపాటు పసిడి పతకాన్ని దక్కించుకున్నాడు. -
ప్రపంచకప్ షూటింగ్ టోర్నీలో గగన్ నారంగ్‌కు నిరాశ
నాలుగు రోజుల వ్యవధిలో రెండు ఈవెంట్స్‌లో ఫైనల్‌కు చేరుకున్న భారత షూటర్ గగన్ నారంగ్ పతకం మాత్రం సాధించలేకపోయాడు. అజర్బైజాన్లో జరుగుతున్న ప్రపంచకప్ షూటింగ్ టోర్నమెంట్లో ఆదివారం భారత షూటర్లు గగన్ నారంగ్, హీనా సిద్ధూ నిరాశ పరిచారు. పురుషుల 50 మీటర్ల రైఫిల్ ప్రోన్ ఫైనల్లో గగన్ నారంగ్ 103.1 పాయింట్లు స్కోరు చేసి ఏడో స్థానంతో సరిపెట్టుకున్నాడు. మహిళల 25 మీటర్ల పిస్టల్ ఫైనల్లో హీనా సిద్ధూ ఎనిమిదో స్థానంలో నిలిచింది. -
జీతూ రాయ్‌కు చేజారిన పతకం
మ్యూనిచ్: ప్రపంచకప్ షూటింగ్ టోర్నమెంట్లో భారత షూటర్ జీతూ రాయ్ త్రుటిలో కాంస్య పతకాన్ని చేజార్చుకున్నాడు. ఆదివారం జరిగిన పురుషుల 50 మీటర్ల పిస్టల్ ఈవెంట్ ఫైనల్లో జీతూ రాయ్ 149.7 పాయింట్లు స్కోరు చేసి నాలుగో స్థానంలో నిలిచాడు. పాబ్లో కరెరా (స్పెయిన్-193.9 పాయింట్లు) స్వర్ణం సాధించగా... వీ పాంగ్ (చైనా-190.3 పాయింట్లు) రజతం, జిన్ జోంగో (కొరియా-170.4 పాయింట్లు) కాంస్యం గెలుపొందారు. మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్ సెమీఫైనల్లో భారత షూటర్ అనీసా సయ్యద్ ఆరో స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత పొందలేకపోయింది. -
మేరాజ్ గురికి రజతం
► స్కీట్ ఈవెంట్లో భారత్‌కు తొలిసారి పతకం ► ప్రపంచకప్ షూటింగ్ టోర్నీ రియో డి జనీరో (బ్రెజిల్): ఒకటా... రెండా... ఏకంగా 26 ప్రపంచకప్ టోర్నమెంట్లలో పాల్గొన్నప్పటికీ ఒక్కసారీ పతకం నెగ్గలేకపోయిన భారత షూటర్ మేరాజ్ అహ్మద్ ఖాన్ నిరీక్షణ ఎట్టకేలకు ముగిసింది. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక ముగిసిన ప్రపంచకప్ షూటింగ్ టోర్నమెంట్లో ఉత్తరప్రదేశ్‌కు చెందిన 40 ఏళ్ల మేరాజ్ అద్భుతమే చేశాడు. ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన మేరాజ్ స్కీట్ ఈవెంట్లో తొలిసారి ఫైనల్‌కు చేరుకోవడంతోపాటు రజత పతకాన్ని సాధించి కొత్త చరిత్ర సృష్టించాడు. ప్రపంచకప్ చరిత్రలో స్కీట్ ఈవెంట్లో భారత్‌కు పతకాన్ని అందించిన తొలి షూటర్‌గా మేరాజ్ గుర్తింపు పొందాడు. ఇప్పటికే రియో ఒలింపిక్స్‌కు అర్హత పొందిన మేరాజ్... క్వాలిఫయింగ్‌లో 122 పాయింట్లు సాధించి రెండో స్థానంలో నిలిచి సెమీఫైనల్‌కు చేరుకున్నాడు. మేరాజ్తోపాటు మరో ఐదుగురు షూటర్లు సెమీఫైనల్లో తలపడ్డారు. సెమీస్‌లో మేరాజ్, మార్కస్ స్వెన్సన్ (స్వీడన్) 15 పాయింట్ల చొప్పున స్కోరు చేసి స్వర్ణ పతక పోరుకు ‘సై’ అనగా... 14 పాయింట్ల చొప్పున స్కోరు చేసిన తమారో కసాండ్రా (ఇటలీ), యువాన్ జోస్ అరమ్బురు (స్పెయిన్) కాంస్య పతకం కోసం తలపడ్డారు. 16 షాట్లు ఉన్న ఫైనల్లో మేరాజ్, స్వెన్సన్ ఇద్దరూ 14 పాయింట్లు సాధించి సమఉజ్జీగా నిలిచారు. దాంతో విజేతను నిర్ణయించడానికి ‘షూట్ ఆఫ్’ను నిర్వహించారు. ఇందులో స్వెన్సన్ రెండు పాయింట్లు సాధించి స్వర్ణం దక్కించుకోగా... ఒక పాయింట్ స్కోరు చేసిన మేరాజ్‌కు రజత పతకం ఖాయమైంది. తమారో కసాండ్రా (ఇటలీ)కి కాంస్యం లభించింది. క్వాలిఫయింగ్‌లో భారత్‌కే చెందిన షీరాజ్ షేక్ 118 పాయింట్లతో 18వ స్థానంలో... మాన్ సింగ్ 111 పాయింట్లతో 49వ స్థానంలో నిలిచారు. రియో ఒలింపిక్స్ జరిగే వేదికపైనే నేను పతకం నెగ్గడం చాలా ఆనందంగా ఉంది. షూట్ ఆఫ్ షాట్ కోసం గ్రీస్‌కు చెందిన నా మిత్రుడి వద్ద మందుగుండును తీసుకున్నాను. నేను ఉపయోగించే మందుగుండుతో దీనికి పోలిక లేకపోవడంతో గురి తప్పాను. ఏదేమైనా రియో వేదికపై పతకం నెగ్గడం ఒలింపిక్స్‌కు ముందు శుభారంభం లాంటిదే. ఏ పతకమైనా నేను సాధించగలను అనే నమ్మకాన్ని పెంచుతుంది. -మేరాజ్ అహ్మద్ ఖాన్ -
గగన్‌కు నిరాశ
రియో డి జనీరో: ప్రపంచ కప్ షూటింగ్ టోర్నమెంట్లో భారత షూటర్ల నిరాశాజనక ప్రదర్శన కొనసాగుతోంది. పురుషుల 50 మీటర్ల రైఫిల్ ప్రోన్ విభాగంలో భారత స్టార్ షూటర్లు గగన్ నారంగ్, చెయిన్ సింగ్ ఫైనల్‌కు అర్హత పొందడంలో విఫలమయ్యారు. క్వాలిఫయింగ్‌లో చెయిన్ 617.1 పాయింట్లతో 45వ... గగన్ 615.5 పాయిం ట్లతో 48వ స్థానంలో నిలిచి నిరాశ పరిచారు.