పూజా ‘గురి’కి కాంస్యం
ప్రపంచకప్ షూటింగ్ టోర్నీ
న్యూఢిల్లీ: సొంతగడ్డపై తొలిసారి జరుగుతున్న ప్రపంచకప్ షూటింగ్ టోర్నమెంట్‌లో తొలి రోజే భారత్ పతకాల బోణీ చేసింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్‌లో పూజా ఘాట్కర్ మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని దక్కించుకుంది. మహారాష్ట్రకు చెందిన 27 ఏళ్ల పూజ ఫైనల్లో 228.8 పాయింట్లు స్కోరు చేసింది. గతంలో రెండుసార్లు ప్రపంచకప్ టోర్నీల్లో ఫైనల్‌కు చేరి పతకం నెగ్గలేకపోయిన పూజ మూడోసారి సఫలం కావడం విశేషం.
మెంగ్‌యావో షి (చైనా) 252.1 పాయింట్లు స్కోరు చేసి కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పడంతోపాటు స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. 248.9 పాయింట్లతో డాంగ్ లిజి (చైనా) రజత పతకాన్ని గెల్చుకుంది. 42 మంది షూటర్లు పాల్గొన్న క్వాలిఫయింగ్ రౌండ్‌లో పూజ 418 పాయింట్లు సాధించి రెండో స్థానంలో నిలిచింది. క్వాలిఫయింగ్‌లో టాప్–8లో నిలిచిన వారు ఫైనల్‌కు అర్హత సాధిస్తారు. క్వాలిఫయింగ్‌లో చేసిన స్కోరును ఫైనల్లో పరిగణలోకి తీసుకోరు. భారత్‌కే చెందిన మేఘన సజ్జనార్ (413.3 పాయింట్లు), వినిత భరద్వాజ్ (412.3 పాయింట్లు) వరుసగా 16వ, 20వ స్థానాల్లో నిలిచారు.
మరోవైపు పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్‌లో భారత్‌కు నిరాశ ఎదురైంది. ఫైనల్‌కు చేరిన భారత షూటర్లు దీపక్ కుమార్ (185.4 పాయింట్లు) ఐదో స్థానంలో, రవి కుమార్ 122 పాయింట్లతో ఎనిమిదో స్థానంలో నిలిచారు. చైనా షూటర్ బుహాన్ సాంగ్ (249.5 పాయింట్లు) కొత్త ప్రపంచ రికార్డు నమోదు చేయడంతోపాటు పసిడి పతకాన్ని దక్కించుకున్నాడు.