భారత షూటర్లకు నిరాశ  | Shooting World Cup: Mixed day for Indian shooters on day 3 | Sakshi
Sakshi News home page

భారత షూటర్లకు నిరాశ 

Published Tue, Feb 26 2019 1:03 AM | Last Updated on Tue, Feb 26 2019 1:03 AM

Shooting World Cup: Mixed day for Indian shooters on day 3 - Sakshi

న్యూఢిల్లీ: సొంతగడ్డపై జరుగుతున్న ప్రపంచకప్‌లో తొలి రెండు రోజుల్లో ప్రపంచ రికార్డులు సృష్టించడంతోపాటు పసిడి పతకాలను సొంతం చేసుకున్న భారత షూటర్లకు మూడో రోజు మాత్రం నిరాశ ఎదురైంది. పురుషుల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ విభాగంలో బరిలోకి దిగిన ముగ్గురు భారత షూటర్లు దీపక్‌ కుమార్, రవి కుమార్, దివ్యాంశ్‌ సింగ్‌ పన్వర్‌ ఫైనల్‌కు చేరుకోవడంలో విఫలమయ్యారు. 95 మంది షూటర్లు పాల్గొన్న క్వాలిఫయింగ్‌లో దివ్యాంశ్‌ 627.2 పాయింట్లు స్కోరు చేసి 12వ స్థానంలో... రవి కుమార్‌ 627 పాయింట్లు సాధించి 14వ స్థానంలో... గతేడాది ఆసియా క్రీడల్లో రజతం నెగ్గిన దీపక్‌ కుమార్‌ 624.3 పాయింట్లు స్కోరు చేసి 34వ స్థానంలో నిలిచారు.

ఫైనల్లో సెర్గీ కామెన్‌స్కీ (రష్యా–249.4 పాయింట్లు), యుకున్‌ లియు (చైనా–247 పాయింట్లు), జిచెంగ్‌ హుయ్‌ (చైనా–225.9 పాయింట్లు) వరుసగా స్వర్ణ, రజత, కాంస్య పతకాలను గెల్చుకున్నారు. మంగళవారం మూడు ఈవెంట్స్‌లో భారత షూటర్లు బరిలోకి దిగనున్నారు. మహిళల 50 మీటర్ల రైఫిల్‌ త్రీ పొజిషన్‌లో సునిధి చౌహాన్, గాయత్రి... 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ విభాగంలో హీనా సిద్ధూ, మను భాకర్, శ్రీనివేథ... పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్‌ ఫైర్‌ పిస్టల్‌ విభాగంలో భావేశ్‌ షెకావత్, గుర్‌ప్రీత్‌ సింగ్, ఆదర్శ్‌ సింగ్, అర్పిత్‌ గోయల్, అనీశ్‌ పోటీపడనున్నారు. ఈ మెగా ఈవెంట్‌లో తొలి రోజు మహిళల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ విభాగంలో అపూర్వీ చండేలా... రెండో రోజు పురుషుల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ విభాగంలో సౌరభ్‌ చౌధరీ ప్రపంచ రికార్డులు సృష్టించడంతోపాటు పసిడి పతకాలను గెల్చుకున్న సంగతి తెలిసిందే.    

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement