మను... పసిడి గురి  | Deepak Kumar Secured India's 10th Tokyo Olympic Quota | Sakshi
Sakshi News home page

మను... పసిడి గురి 

Published Wed, Nov 6 2019 4:01 AM | Last Updated on Wed, Nov 6 2019 4:01 AM

Deepak Kumar Secured India's 10th Tokyo Olympic Quota - Sakshi

దోహా (ఖతర్‌): అంతర్జాతీయ వేదికపై మరోసారి సత్తా చాటిన భారత యువ షూటర్‌ మను భాకర్‌ ఆసియా చాంపియన్‌గా అవతరించింది. మంగళవారం మొదలైన ఈ మెగా ఈవెంట్‌లో హరియణాకు చెందిన 17 ఏళ్ల మను మహిళల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ వ్యక్తిగత విభాగంలో స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. ఇప్పటికే టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత పొందిన మను ఎనిమిది మంది షూటర్లు పాల్గొన్న ఫైనల్లో 244.3 పాయింట్లు స్కోరు చేసి టాప్‌ ర్యాంక్‌లో నిలిచింది. ఎలిమినేషన్‌ పద్ధతిలో జరిగిన ఫైనల్లో భారత్‌కే చెందిన యశస్విని సింగ్‌ ఐదో స్థానంలో నిలిచింది.

కియాన్‌ వాంగ్‌ (చైనా–242.8 పాయింట్లు) రజతం నెగ్గగా... రాన్‌జిన్‌ జియాంగ్‌ (చైనా–220.2 పాయింట్లు) కాంస్యం కైవసం చేసుకుంది. క్వాలిఫయింగ్‌లో 584 పాయింట్లు సాధించిన మను టాప్‌ ర్యాంక్‌ హోదాలో ఫైనల్‌కు అర్హత సాధించింది. మను భాకర్, యశస్విని (578), అన్ను రాజ్‌ సింగ్‌ (569)లతో కూడిన భారత బృందానికి టీమ్‌ విభాగంలో కాంస్యం లభించింది. క్వాలిఫయింగ్‌లో ఈ త్రయం సాధించిన స్కోరు ఆధారంగా ఈ పతకం ఖాయమైంది. గతేడాది కామన్వెల్త్‌ గేమ్స్‌లో, యూత్‌ ఒలింపిక్స్‌ క్రీడల్లోనూ మను భాకర్‌ స్వర్ణ పతకాలను సాధించింది.

డబుల్‌ ధమాకా... 
పురుషుల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ విభాగంలో భారత షూటర్‌ దీపక్‌ కుమార్‌ ఒకేసారి రెండు లక్ష్యాలను సాధించాడు. ఫైనల్లో అతను 227.8 పాయింట్లు స్కోరు చేసి కాంస్య పతకం నెగ్గడంతోపాటు వచ్చే ఏడాది జరిగే టోక్యో ఒలింపిక్స్‌కు కూడా అర్హత పొందాడు. యుకున్‌ లియు (చైనా–250.5 పాయింట్లు) స్వర్ణం నెగ్గగా... హావోనన్‌ యు (చైనా–249.1 పాయింట్లు) రజతం గెలిచాడు. మంగళవారం తన 32వ జన్మదినాన్ని జరుపుకున్న దీపక్‌ ప్రదర్శనతో... ఇప్పటి వరకు టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత పొందిన భారత షూటర్ల సంఖ్య 10కి చేరింది.

ప్రతి ఈవెంట్‌లో ఒక దేశం నుంచి గరిష్టంగా ఇద్దరికి మాత్రమే అర్హత పొందే అవకాశం ఉంది. దీపక్‌కంటే ముందు ఈ ఈవెంట్‌లో భారత్‌ నుంచి దివ్యాంశ్‌ సింగ్‌ పన్వర్‌ ‘టోక్యో’ బెర్త్‌ సాధించాడు. మరోవైపు వివాన్‌ కపూర్, మనీషా కీర్‌లతో కూడిన భారత జట్టు జూనియర్‌ ట్రాప్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌లో పసిడి పతకం గెలిచింది. మహిళల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ టీమ్‌ విభాగంలో ఇలవేనిల్‌ వలారివన్, అంజుమ్‌ మౌద్గిల్, అపూర్వీ చండేలాలతో కూడిన భారత బృందం 1883.2 పాయింట్లతో రజతం సాధించింది. వ్యక్తిగత విభాగంలో ఇలవేనిల్‌ ఐదో స్థానంలో నిలిచింది.

‘టోక్యో’ బెర్త్‌ సాధించిన భారత షూటర్లు 
►మహిళల 10 మీటర్ల  ఎయిర్‌ రైఫిల్‌ (2) అంజుమ్‌ మౌద్గిల్, అపూర్వీ చండేలా
►పురుషుల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ (2) సౌరభ్‌ చౌదరీ, అభిషేక్‌ వర్మ 
►పురుషుల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ (2) దివ్యాంశ్‌ సింగ్‌ పన్వర్, దీపక్‌ కుమార్‌ 
►పురుషుల 50 మీటర్ల రైఫిల్‌ త్రీ పొజిషన్‌ (1) సంజీవ్‌ రాజ్‌పుత్‌ 
►మహిళల 25 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ (1) రాహీ సర్నోబత్‌ 
►మహిళల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ (2) మను భాకర్, యశస్విని సింగ్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement