shooting championship
-
ధనుశ్–మహిత్ జోడీ ప్రపంచ రికార్డు
న్యూఢిల్లీ: ప్రపంచ బధిరుల షూటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ షూటర్ ధనుశ్ శ్రీకాంత్ తన ఖాతాలో రెండో స్వర్ణ పతకాన్ని జమ చేసుకున్నాడు. జర్మనీలోని హనోవర్‌లో జరుగుతున్న ఈ టోర్నీనలో ధనుశ్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో విజేతగా నిలిచాడు. ఫైనల్లో ధనుశ్ శ్రీకాంత్–మహిత్ సంధూ (భారత్) ద్వయం 17–5తో భారత్‌కే చెందిన నటాషా జోషి–మొహమ్మద్ ముర్తజా జంటపై గెలిచింది.ధనుశ్–మహిత్ జోడీ క్వాలిఫయింగ్‌లో 628.8 పాయింట్లు స్కోరు చేసి బధిరుల షూటింగ్లో కొత్త ప్రపంచ రికార్డు సృష్టించింది. ఇదే టోర్నీలో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ విభాగంలో అభినవ్ దేశ్వాల్–ప్రాంజలి ధూమల్ జంట రజత పతకాన్ని దక్కించుకుంది. ఫైనల్లో అభినవ్–ప్రాంజలి ద్వయం 7–17తో ఒలెక్సిల్ లేజ్బింక్–ఇనా అఫోన్చెంకో (ఉక్రెయిన్) జంట చేతిలో ఓడిపోయింది. మూడో రోజు ముగిశాక భారత్ ఖాతాలో మూడు స్వర్ణాలు, ఆరు రజతాలు, మూడు కాంస్యాలతో కలిపి మొత్తం 12 పతకాలున్నాయి. -
ప్రతాప్ సింగ్‌కు పసిడి పతకం
న్యూఢిల్లీ: ఆసియా షూటింగ్ చాంపియన్‌షిప్‌ను భారత్ స్వర్ణ పతకంతో ముగించింది. పోటీల చివరిరోజు బుధవారం భారత్ ఒక స్వర్ణం, ఒక రజతం, ఒక కాంస్యం సాధించింది. పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్స్ వ్యక్తిగత విభాగంలో ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్ పసిడి పతకం గెలిచాడు. ఫైనల్లో ప్రతాప్ సింగ్ 463.5 పాయింట్లు స్కోరు చేసి విజేతగా నిలిచాడు. ఐశ్వరీ ప్రతాప్ సింగ్, అఖిల్ షెరాన్, స్వప్నిల్ కుసాలేలతో కూడిన భారత బృందం ఇదే విభాగంలో టీమ్ ఈవెంట్లో 1764 పాయింట్లతో రజత పతకం కైవసం చేసుకుంది. పురుషుల 25 మీటర్ల సెంటర్ ఫైర్ పిస్టల్ ఈవెంట్ వ్యక్తిగత విభాగంలో ప్రదీప్ సింగ్ షెఖావత్ 582 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని సాధించాడు. ఓవరాల్‌గా ఈ టోర్నీలో భారత బృందం 8 స్వర్ణాలు, 10 రజతాలు, 4 కాంస్యాలతో కలిపి 22 పతకాలతో రెండో స్థానంలో నిలిచింది. -
శ్రియాంక గురికి 13వ బెర్తు
న్యూఢిల్లీ: భారత షూటర్లు పారిస్ ఒలింపిక్సే లక్ష్యంగా ఆసియా షూ టింగ్ చాంపియన్‌షిప్‌లో రాణిస్తున్నారు. తాజాగా శ్రియాంక సదాంగి ఒలింపిక్స్ బెర్తు సంపాదించింది. కొరియాలోని చాంగ్వాన్లో జరుగుతున్న ఈ పోటీల్లో ఆమె మహిళల 50 మీటర్ల రైఫిల్ త్రి పొజిషన్లో నాలుగో స్థానంలో నిలిచింది. పతకం చేజారినా... ‘పారిస్’ గురి కుది రింది. ఆమె 440.5 స్కోరుతో నాలుగో స్థానంలో తృప్తిపడింది. ఆమెతో పాటు ఈ ఈవెంట్లో సిఫ్త్ కౌర్ సమ్రా, ఆషి చౌక్సీ, ఆయుషి పొడెర్లు కూడా క్వాలిఫయింగ్ మార్క్ దాటారు. షూటింగ్లో భారత్‌కిది 13వ ఒలింపిక్ బెర్తు కావడం విశేషం. -
తనిష్క్ బృందానికి రజతం
చాంగ్వాన్ (దక్షిణ కొరియా): ఆసియా షూటింగ్ చాంపియన్‌షిప్‌లో ఆదివారం భారత్‌కు రెండు రజత పతకాలు లభించాయి. జూనియర్ పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ టీమ్ ఈవెంట్లో తెలంగాణ ప్లేయర్ కొడవలి తనిష్క్ మురళీధర్ నాయుడు, రాజ్కన్వర్ సింగ్ సంధూ, సమీర్లతో కూడిన భారత జట్టు రెండో స్థానంలో నిలిచింది. తనిష్క్ (569), సమీర్ (573), రాజ్కన్వర్ (579) బృందం ఓవరాల్‌గా 1721 పాయింట్లు స్కోరు చేసి రజత పతకం కైవసం చేసుకుంది. పురుషుల 50 మీటర్ల రైఫిల్ ప్రోన్ వ్యక్తిగత విభాగంలో భారత షూటర్ జాహిద్ హుస్సేన్ రజత పతకం సొంతం చేసుకున్నాడు. జాహిద్ 624.5 పాయింట్లు సాధించి రెండో స్థానంలో నిలిచాడు. మరో మూడు రోజులపాటు కొనసాగే ఈ చాంపియన్íÙప్లో ప్రస్తుతం భారత్ 8 స్వర్ణాలు, 12 రజతాలు, 5 కాంస్యాలతో కలిపి మొత్తం 25 పతకాలతో రెండో స్థానంలో ఉంది. -
కాంస్య పతకంతో భారత్ బోణీ
ప్రపంచ సీనియర్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో తొలి రోజే భారత్ పతకాల బోణీ కొట్టింది. అజర్బైజాన్ రాజధాని బకూలో గురువారం మొదలైన ఈ మెగా ఈవెంట్లో పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ టీమ్ ఈవెంట్లో భారత జట్టుకు కాంస్య పతకం లభించింది. శివా నర్వాల్ (579), సరబ్జోత్ సింగ్ (578), అర్జున్ సింగ్ (577)లతో కూడిన భారత జట్టు 1,734 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది. వ్యక్తిగత క్వాలిఫయింగ్ పోటీల్లో ఆయా దేశాల షూటర్లు సాధించిన పాయింట్ల సగటు ఆధారంగా టీమ్ ఈవెంట్ పతకాలను ఖరారు చేస్తారు. భారత పిస్టల్ షూటర్లెవరూ టాప్–8లో నిలవకపోవడంతో వ్యక్తిగత విభాగం ఫైనల్‌కు అర్హత పొందలేకపోయారు. మరోవైపు హైదరాబాద్ షూటర్ ఇషా సింగ్, పలక్, దివ్యలతో కూడిన భారత మహిళల పిస్టల్ జట్టు 1,708 పాయింట్లతో 11వ స్థానంలో నిలిచింది. -
నిబంధనలు గాలికి.. మగ షూటర్ల గదిలో మహిళా షూటర్లు!
ప్రపంచ జూనియర్ షూటింగ్ ఛాంపియన్షిప్ మూడో ఎడిషన్ కొరియాలోని చాంగ్వాన్లో జరిగింది. ఈ పోటీలకు భారత్ పెద్ద సంఖ్యలో షూటర్లను కొరియాకు పంపింది. ఈ పోటీలో 44 దేశాల నుంచి 550 మందికి పైగా షూటర్లు పాల్గొన్నారు. భారత్ 6 స్వర్ణాలు, 6 రజతాలు, 5 కాంస్య పతకాలతో సహా 17 పతకాలు సాధించి పతకాల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. చైనా 12 స్వర్ణాలు సహా 28 పతకాలను సాధించి పతకాల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. ఈ విషయం పక్కనబెడితే కొరియా వెళ్లిన భారత జూనియర్ షూటింగ్ జట్టులోని కొందరు సభ్యులు నిబంధన ఉల్లఘించినట్లు తెలుస్తోంది. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఇద్దరు మహిళా షూటర్లు మగ షూటర్ల హోటల్ గదిలో ఉన్నట్టుగా మీడియాలో వార్తలు వచ్చాయి. హోటల్ గదిలో అర్ధరాత్రి వరకు పార్టీలు చేసుకుంటున్నారని, బిగ్గరగా పాటలు పాడుతూ సందడి చేశారని తెలిసింది. సమాచారం అందుకున్న అధికారులు భారతీయులకు గదులు ఇవ్వవద్దని సిబ్బందిని హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఇదే విషయమే అక్కడే ఉన్న భారత అధికారులు పీటీఐకి బదులిస్తూ.. పురుష షూటర్లు ఉన్న హోటల్‌కు మహిళా షూటర్లు వెళ్లినట్లు ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేశారు. 'మగ షూటర్లు ఉన్న గదికి ఎవరూ వెళ్లినట్లు లేదా అక్కడ నుండి తిరిగి వచ్చినట్లు కనిపించలేదు.' అని అధికారులు స్పష్టం చేశారు. ''అంతర్జాతీయ పోటీల కోసం భారతదేశం నుండి బయలుదేరే ముందు చేయవలసినవి, చేయకూడని వాటి గురించి షూటర్లకు వివరిస్తాం. ఏది సరైనది, ఏది తప్పు అనే దానిపై వారికి అవగాహన కల్పించడానికి రోజువారీ బ్రీఫింగ్ కూడా ఉంటుంది.'' అని ఓ అధికారి చెప్పారు. అయితే హోటల్లోని కొన్ని పరికరాలు దెబ్బతిన్నాయని హోటల్ సిబ్బంది చెబుతున్నారు. ఈ తప్పిదానికి పరిహారం ఇవ్వడంతో అక్కడి నుంచి చెక్ అవుట్ చేసినట్లు అధికారులు తెలిపారు. చదవండి: Ben Stokes: 'తప్పుడు వార్తలు.. ఆసీస్ ఆటగాళ్లతో కలిసి మందు కొట్టలేదు' Cristiano Ronaldo: ఎట్టకేలకు గోల్.. దిగ్గజం రికార్డును బద్దలు కొట్టిన రొనాల్డో -
ISSF World Championship: ఇషా పసిడి గురి
కైరో (ఈజిప్ట్): ప్రపంచ జూనియర్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ షూటర్ ఇషా సింగ్ స్వర్ణ పతకం సాధించింది. శనివారం జరిగిన జూనియర్ మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో ఇషా సింగ్ చాంపియన్ గా అవతరించింది. ఫైనల్లో ఇషా 29 పాయింట్లు స్కోరు చేసి అగ్రస్థానంలో నిలిచింది. సిజువాన్ ఫెంగ్ (చైనా; 26 పాయింట్లు) రజతం, మిరియమ్ జాకో (హంగేరి; 18 పాయింట్లు) కాంస్యం గెలిచారు. పురుషుల జూనియర్ 25 మీటర్ల పిస్టల్, స్టాండర్డ్ పిస్టల్ ఈవెంట్స్‌లో భారత్‌కే చెందిన ఉదయ్‌వీర్ సిద్ధూ పసిడి పతకాలు సొంతం చేసుకున్నాడు. పిస్టల్ విభాగంలో ఉదయ్‌వీర్ 580 పాయింట్లు స్కోరు చేసి టాప్ ర్యాంక్‌లో నిలిచాడు. మాస్ట్రోవలెరియో (ఇటలీ; 579 పాయింట్లు) రజతం, లియు యాంగ్పన్ (చైనా; 577 పాయింట్లు) కాంస్యం సాధించారు. స్టాండర్డ్ పిస్టల్ ఈవెంట్లో ఉదయ్‌వీర్ 568 పాయింట్లు స్కోరు చేసి అగ్ర స్థానాన్ని దక్కించుకున్నాడు. సమీర్ (భారత్; 567 పాయింట్లు) కాంస్యం గెలిచాడు. -
ISSF World Championship: 18 ఏళ్లకే ప్రపంచ చాంపియన్
కైరో: విశ్వ వేదికగా మరోసారి భారత షూటర్ గురి అదిరింది. ప్రపంచ సీనియర్ షూటింగ్ చాంపియన్ షిప్లో భారత్ ‘పసిడి’ ఖాతా తెరిచింది. శుక్రవారం జరిగిన పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో మహారాష్ట్రకు చెందిన 18 ఏళ్ల రుద్రాంక్ష్ బాలాసాహెబ్ పాటిల్ స్వర్ణ పతకంతో మెరిశాడు. ఈ ప్రదర్శనతో రుద్రాంక్ష్ 2024 పారిస్ ఒలింపిక్స్‌కు కూడా అర్హత సాధించాడు. థానేకు చెందిన రుద్రాంక్ష్ ఫైనల్లో 17–13 పాయింట్ల తేడాతో డానిలో డెనిస్ సొలాజో (ఇటలీ)పై గెలుపొందాడు. తొలిసారి ప్రపంచ సీనియర్ చాంపియన్‌షిప్‌లో ఆడుతున్న రుద్రాంక్ష్ ఫైనల్లో ఒకదశలో 4–10తో వెనుకంజలో ఉన్నాడు. అయినా ఒత్తిడికి లోనుకాకుండా లక్ష్యంపై గురి పెట్టిన ఈ టీనేజ్ షూటర్ చివరకు నాలుగు పాయింట్ల తేడాతో విజయాన్ని అందుకున్నాడు. అంతకుముందు 114 మంది షూటర్లు పాల్గొన్న క్వాలిఫయింగ్‌లో రుద్రాంక్ష్ 633.9 పాయింట్లు స్కోరు చేసి అగ్రస్థానంలో నిలిచాడు. భారత్‌కే చెందిన అంకుశ్ కిరణ్ జాదవ్ 630.6 పాయింట్లు స్కోరు చేసి ఆరో స్థానంలో నిలిచాడు. టాప్–8లో నిలిచిన షూటర్లు ర్యాంకింగ్ మ్యాచ్‌కు అర్హత సాధించారు. ర్యాంకింగ్ మ్యాచ్‌లో సొలాజో 262.7 పాయింట్లతో, రుద్రాంక్ష్ 261.9 పాయింట్లతో తొలి రెండు స్థానాల్లో నిలిచిన స్వర్ణ పతక పోరుకు అర్హత పొందారు. అంకుశ్ 154.2 పాయింట్లతో ఎనిమిదో స్థానంతో సరిపెట్టుకున్నాడు. ర్యాంకింగ్ మ్యాచ్‌లో 261.8 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచిన చైనా షూటర్ లిహావో షెంగ్ కాంస్య పతకం దక్కించుకున్నాడు. అభినవ్ బింద్రా తర్వాత ప్రపంచ చాంపియన్‌షిప్‌లో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్‌లో స్వర్ణ పతకం నెగ్గిన రెండో భారతీయ షూటర్‌గా రుద్రాంక్ష్ గుర్తింపు పొందాడు. అంతేకాకుండా ఈ మెగా ఈవెంట్ చరిత్రలో భారత్ తరఫున పసిడి పతకం గెలిచిన పిన్న వయస్కుడిగా రుద్రాంక్ష్ రికార్డు నెలకొల్పాడు. గత ఏడాది పెరూలో జరిగిన జూనియర్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రుద్రాంక్ష్ రజతం నెగ్గగా.. ఈ ఏడాది జర్మనీలో జరిగిన జూనియర్ ప్రపంచకప్‌లో స్వర్ణం సాధించాడు. ఈ సంవత్సరమే సీనియర్ జట్టులోకి వచ్చిన రుద్రాంక్ష్ రెండు ప్రపంచకప్‌లలో పాల్గొన్నా పతకం సాధించలేకపోయాడు. అయితే ప్రపంచ చాంపియన్‌షిప్‌లో మెరిసి స్వర్ణంతోపాటు ఒలింపిక్స్‌కు అర్హత పొంది ఔరా అనిపించాడు. ప్రపంచ సీనియర్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం నెగ్గిన ఆరో భారతీయ షూటర్ రుద్రాంక్ష్ . గతంలో అభినవ్ బింద్రా (2006; 10 మీటర్ల ఎయిర్ రైఫిల్), మానవ్‌జిత్ సంధూ (2006; ట్రాప్), తేజస్విని సావంత్ (2010; 50 మీటర్ల రైఫిల్ ప్రోన్), అంకుర్ మిట్టల్ (2018; డబుల్ ట్రాప్), ఓంప్రకాశ్ (2018; 50 మీటర్ల పిస్టల్) ఈ ఘనత సాధించారు. -
షూటింగ్ పోటీల్లో అజిత్ సత్తా.. 4 బంగారు పతకాలు కైవసం
Ajith Kumar Wins Medals In Tamilnadu 47Th State Shooting Championship: ప్రముఖ నటుడు, కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ సినిమాల్లోనే కాకుండా ఇతర రంగాలలోనూ తన నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఆయనకు బైక్ రేసింగ్ అంటే ఎంతో ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పటికే బైక్ రేసింగ్, రైఫిల్ షూటింగ్లో ఆయన పలు పతకాలను గెలుచుకున్నారు. ప్రస్తుతం తన 61వ చిత్రానికి సంబంధించిన కార్యక్రమాల్లో బిజీగా ఉన్న అజిత్ రైఫిల్ షూటర్‌గా బంగారు పతకాలను, కాంస్య పతకాలను గెలుచుకోవడం సినీ ఇండస్ట్రీలో విశేషంగా మారింది. తమిళనాడు రాష్ట్రస్థాయిలో 47వ రైఫిల్ షూటింగ్ పోటీలు తిరుచ్చిలో ఈనెల 26వ తేదీ నుంచి రైఫిల్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఈ పోటీలలో 1300 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. కాగా ఈ పోటీలో పాల్గొనడానికి అజిత్ టీమ్ చెన్నై సమీపంలోని మౌరై వీరపురం పోలీసు ట్రైనింగ్ అకాడమీలో తీవ్రంగా రైఫిల్ షూటింగ్ ప్రాక్టీస్ చేసింది. ఇక ఈనెల 27వ తేదీన అజిత్ టీమ్ తిరుచ్చిలో జరిగిన పోటీలో పాల్గొని 4 బంగారు పతకాలను, 2 కాంస్య పతకాలను గెలుచుకుంది. సెంటర్ ఫైర్ పిస్టల్, స్తందర్డ్ పిస్టల్ వస్టర్, 50 మీటర్ల ప్రీ పిస్టల్ మాస్టర్, స్టాండర్డ్ పిస్టల్ మాస్టర్ కేటగిరీల్లో పసిడి పతకాలను, 50 మీటర్ల ప్రీ పిస్టల్, స్టాండర్డ్ పిస్టల్ కేటగిరీలో కాంస్య పతకాలను సాధించారు. దీంతో అజిత్ అభిమానులు ఆయన్ను షూటింగ్ స్టార్ అంటూ కొనియాడుతున్నారు. చదవండి: నిర్మాతగా మారిన బ్యూటిఫుల్ హీరోయిన్.. ఈ ఏడాది దుమ్మురేపిన సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఇవే.. -
Deaflympics 2022: అదరగొట్టిన ధనుష్ శ్రీకాంత్
న్యూఢిల్లీ: మరోసారి తన గురితో తెలంగాణ యువ షూటర్ ధనుష్ శ్రీకాంత్ అదరగొట్టాడు. బధిరుల ఒలింపిక్స్ (డెఫిలింపిక్స్) క్రీడల్లో భారత్‌కు మరో స్వర్ణ పతకాన్ని అందించాడు. బ్రెజిల్లో జరుగుతున్న ఈ క్రీడల్లో 19 ఏళ్ల ధనుష్ శ్రీకాంత్–ప్రియేషా దేశ్‌ముఖ్ జంట 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో భారత్ ఖాతాలో బంగారు పతకాన్ని వేసింది. ఫైనల్లో ధనుష్ శ్రీకాంత్–ప్రియేషా ద్వయం 16–10 పాయింట్ల తేడాతో సెబాస్టియన్ హెర్మానీ–సబ్రీనా (జర్మనీ) జోడీపై విజయం సాధించి విజేతగా నిలిచింది. వరుసగా నాలుగుసార్లు ఒలింపిక్స్‌లో పాల్గొనడం తోపాటు 2012 లండన్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ మేటి షూటర్ గగన్ నారంగ్‌కు చెందిన ‘గన్ ఫర్ గ్లోరీ’ అకాడమీలో శిక్షణ పొందుతున్న ధనుష్ శ్రీకాంత్‌కు ఈ బధిరుల ఒలింపిక్స్‌లో రెండో స్వర్ణం కావడం విశేషం. ఇంతకుముందు ధనుష్ శ్రీకాంత్ పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత విభాగంలో పసిడి పతకం సాధించిన సంగతి తెలిసిందే. క్వాలిఫయింగ్‌లో శ్రీకాంత్–ప్రియేషా జంట 414 పాయింట్లు స్కోరు చేసి అగ్రస్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించింది. కాంస్య పతక పోరులో శౌర్య సైనీ–నటాషా జోషి (భారత్) జంట 8–16తో వయోలెటా–అలెగ్జాండర్ (ఉక్రెయిన్) జోడీ చేతిలో ఓడిపోయింది. ప్రస్తుతం భారత్ నాలుగు స్వర్ణాలు, రెండు కాంస్యాలతో కలిపి మొత్తం ఆరు పతకాలతో ఆరో ర్యాంక్‌లో ఉంది. -
హైదరాబాద్ యువ షూటర్ ఇషా సింగ్‌కు అభినందన...
సాక్షి, హైదరాబాద్: పెరూలో ఇటీవల జరిగిన ప్రపంచ జూనియర్ షూటింగ్ చాంపియన్‌షిప్ లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించి రెండు రజత పతకాలు సాధించిన హైదరాబాద్ యువ షూటర్ ఇషా సింగ్‌ను తెలంగాణ రాష్ట్ర క్రీడల మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ అభినందించారు. తెలంగాణకు చెందిన పలువురు క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ వేదికలపై అద్భుత ప్రతిభ కనబరుస్తున్నారని, షూటింగ్లో ఇషా భారత భవిష్యత్ ఆశాకిరణమని ఈ సందర్భం గా మంత్రి వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమం లో తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ఐ–లీగ్‌లో తెలుగు కుర్రాడు సాక్షి, హైదరాబాద్: దేశవాళీ ఫుట్‌బాల్ ఐ–లీగ్‌లో తెలుగు కుర్రాడు సునీల్ బథాలా అరంగేట్రం చేయనున్నాడు. ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్ఆర్ కడప జిల్లాకు చెందిన సునీల్‌తో ఈ లీగ్‌లో తొలిసారి బరిలోకి దిగనున్న శ్రీనిధి డెక్కన్ ఫుట్‌బాల్ క్లబ్ (ఎస్‌డీఎఫ్‌సీ) ఒప్పందం చేసుకుంది. గతంలో భారత అండర్–16 శిబిరంలో పాల్గొన్న సునీల్ 2020 డిసెంబర్లో ఎస్డీఎఫ్సీలో సెంటర్ డిఫెండర్‌గా చేరాడు. తన ఆటతీరుకు మెరు గులు దిద్దుకొని ఐ–లీగ్‌లో పాల్గొనే అవకాశాన్ని సంపాదించాడు. 13 జట్లు పాల్గొనే ఐ–లీగ్ డిసెంబర్లో మొదలయ్యే అవకాశముంది. చదవండి: KKR vs DC, IPL 2021: కోల్‌కతా ‘సిక్సర్’తో... -
Namyaa Kapoor: నామ్యా కపూర్‌కు స్వర్ణం
World Junior Shooting Championship: ప్రపంచ జూనియర్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు చెందిన 14 ఏళ్ల నామ్యా కపూర్ స్వర్ణం గెలుచుకుంది. 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఆమె మొదటి స్థానంలో నిలిచింది. ఫైనల్లో ఆమె 36 పాయింట్లు స్కోర్ చేసింది. ఇదే ఈవెంట్లో మరో భారత షూటర్ మనూ భాకర్ కాంస్యం గెలుచుకోగా, ఫ్రాన్స్‌కు చెందిన కెమిల్ జెడ్జెవ్స్కీ రజతం సాధించింది. ఇప్పటి వరకు ఈ టోర్నీలో భారత్‌కు 7 స్వర్ణాలు సహా మొత్తం 16 పతకాలు వచ్చాయి. చదవండి: Dronavalli Harika: ఒలింపిక్ విజయంలాంటిదే.. నా భర్త అన్ని విధాలా అండగా నిలిచారు -
World Junior Shooting Championship: భారత్‌కు 4 స్వర్ణాలు, 2 రజతాలు
లిమా (పెరూ): ప్రపంచ జూనియర్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత షూటర్లు పతకాల పంట పండిస్తున్నారు. ఆదివారం జరిగిన ఆరు ఈవెంట్స్‌లో నాలుగింటిలో భారత్‌కు 4 స్వర్ణ పతకాలు, రెండు రజతాలు రావడం విశేషం. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ పురుషుల టీమ్ ఫైనల్లో తెలంగాణ షూటర్ ధనుశ్ శ్రీకాంత్, రాజ్‌ప్రీత్ సింగ్, పార్థ్ మఖీజాలతో కూడిన భారత జట్టు 16–6తో అమెరికా జట్టును ఓడించి స్వర్ణం సాధించింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ ఫైనల్లో మనూ భాకర్–సరబ్జిత్ (భారత్) ద్వయం 16–12తో శిఖా–నవీన్ (భారత్) జోడీ పై గెలిచింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మహిళల టీమ్ ఫైనల్లో మనూ భాకర్, రిథమ్, శిఖా నర్వాల్‌లతో కూడిన భారత జట్టు 16–12తో బెలారస్ జట్టును ఓడించింది. -
భారత్ ‘డబుల్’ ధమాకా
న్యూఢిల్లీ: మరోసారి తమ సత్తా నిరూపించుకుంటూ భారత షూటర్లు ప్రపంచకప్ షూటింగ్ టోర్నీలో మూడో రోజు రెండు స్వర్ణాలు, ఒక రజతం, ఒక కాంస్యం సొంతం చేసుకున్నారు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మహిళల, పురుషుల టీమ్ ఈవెంట్స్‌లో టీమిండియాకు రెండు పసిడి పతకాలు లభించాయి. యశస్విని, మనూ భాకర్, శ్రీనివేథాలతో కూడిన భారత మహిళల ఎయిర్ పిస్టల్ జట్టు ఫైనల్లో 16–8 స్కోరుతో జులీటా బొరెక్, జోనా ఐవోనా, అగ్నెస్కాలతో కూడిన పోలాండ్ జట్టుపై గెలిచింది. సౌరభ్, రిజ్వీ, అభిషేక్ వర్మలతో కూడిన భారత పురుషుల ఎయిర్ పిస్టల్ జట్టు ఫైనల్లో 17–11 స్కోరుతో దిన్ తాన్, క్వాక్ ట్రాన్, చుయెన్ ఫాన్లతో కూడిన వియత్నాం జట్టును ఓడించింది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ పురుషుల టీమ్ ఈవెంట్లో దీపక్, పంకజ్, ఐశ్వర్య ప్రతాప్ సింగ్‌లతో కూడిన భారత బృందానికి రజతం లభించింది. ఫైనల్లో టీమిండియా 14–16 స్కోరుతో లుకాస్, విలియమ్, షెర్రీలతో కూడిన అమెరికా జట్టు చేతిలో ఓడిపోయింది. మహిళల స్కీట్ వ్యక్తిగత విభాగంలో భారత షూటర్ గనేమత్ సెఖోన్ కాంస్య పతకం కైవసం చేసుకుంది. ఆరుగురి మధ్య ఎలిమినేషన్ పద్ధతిలో జరిగిన ఫైనల్లో గనేమత్ 40 పాయింట్లు స్కోరు చేసి మూడో స్థానంలో నిలిచింది. తద్వారా ప్రపంచకప్ షూటింగ్ టోర్నీ చరిత్రలో స్కీట్ విభాగంలో పతకం గెలిచిన తొలి భారత మహిళా షూటర్‌గా గనేమత్ గుర్తింపు పొందింది. మూడో రోజు పోటీలు ముగిసిన తర్వాత భారత్ మూడు స్వర్ణాలు, మూడు రజతాలు, మూడు కాంస్యాలతో కలిపి మొత్తం తొమ్మిది పతకాలతో అగ్రస్థానంలో ఉంది. -
అజిత్ షూట్ చేశాడు.. మెడల్ ఇచ్చారు
తమిళ సూపర్‌స్టార్ అజిత్ కేవలం మేకప్పే జీవితం అనుకునే టైప్ కాదు. డబ్బు లెక్కపెట్టుకోవడమే జీవిత పరమార్థం అనుకోడు. కార్ రేసింగ్, స్పోర్ట్స్, బైక్ రైడింగ్... వంటివి ఎంజాయ్ చేస్తాడు. వాటిని సీరియస్‌గా సాధన చేసి పోటీల్లో కూడా పాల్గొంటాడు. అలాంటి కార్ రేస్ వల్లే పెద్ద ప్రమాదం జరిగి గతంలో ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. అయితే ఇప్పుడు అజిత్ అభిమానులు పొంగిపోయే సందర్భం వచ్చింది. మార్చి 2 నుంచి 7 వ తేదీల మధ్య చెన్నైలో స్టేట్ షూటింగ్ కాంపిటీషన్ జరిగింది. రాష్ట్రం మొత్తం నుంచి 900 మంది షూటర్స్ పాల్గొన్నారు. చెన్నై రైఫిల్ క్లబ్ సభ్యుడు అయిన అజిత్ మరో నలుగురు సభ్యుల బృందంతో షూటింగ్ కాంపిటీషన్లో పాల్గొన్నాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 6 మెడల్స్ సొంతం చేసుకున్నాడు. ‘ఫైర్ పిస్టల్’, ‘ఫ్రీ పిస్టల్’, ‘స్టాండర్డ్ పిస్టల్’ తదితర విభాగాలలో ఈ మెడల్స్ వచ్చాయి. పోటీకి ముందు కొన్ని రోజులు ఉదయాన్నే రైఫిల్ క్లబ్‌కు వచ్చి షూటింగ్ ప్రాక్టీస్ చేశాడతడు. మెడలో మెడల్స్ వేసుకున్న అజిత్ కటౌట్‌కు నిమ్మకాయల దండ వేసుకున్నంత అందంగా అభిమానులకు కనిపించాడు. చదవండి: వుమెన్స్ డే: అనుష్క, కూతురు ఫోటోతో కోహ్లి భావోద్వేగం -
కైనన్ షెనాయ్ పసిడి గురి
కువైట్: ఆసియా ఆన్లైన్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత షూటర్లు అదరగొట్టారు. కువైట్‌లో రెండు రోజులపాటు జరిగిన ఈ టోర్నీలో మొత్తం 11 పతకాలు గెల్చుకున్న భారత్ టాప్ ర్యాంక్‌ను దక్కించుకుంది. ఇందులో నాలుగు స్వర్ణాలు, రెండు రజతాలు, ఐదు కాంస్య పతకాలు ఉన్నాయి. పురుషుల ట్రాప్ ఈవెంట్లో తెలంగాణ షూటర్ కైనన్ షెనాయ్ చాంపియన్‌గా నిలిచాడు. 34 మంది షూటర్లు పాల్గొన్న ట్రాప్ ఈవెంట్లో 30 ఏళ్ల కైనన్ 150 పాయింట్లకుగాను 145 పాయింట్లు స్కోరు చేసి పసిడి పతకాన్ని సొంతం చేసుకున్నాడు. 2016 రియో ఒలింపిక్స్‌లో పాల్గొన్న ఈ హైదరాబాద్ షూటర్ ఆరు రౌండ్లలో వరుసగా 24, 24, 24, 25, 24, 24 పాయింట్లు సాధించాడు. నసీర్ (కువైట్–144 పాయింట్లు) రజతం, పృథ్వీరాజ్ (భారత్–143 పాయింట్లు) కాంస్య పతకం నెగ్గారు. భారత్‌కే చెందిన సౌరభ్ (10 మీ. ఎయిర్ పిస్టల్), దివ్యాంశ్ (10 మీ. ఎయిర్ రైఫిల్), రాజేశ్వరి (మహిళల ట్రాప్ ఈవెంట్) కూడా బంగారు పతకాలు నెగ్గారు. 22 దేశాల నుంచి 274 మంది షూటర్లు ఈ టోర్నీలో పాల్గొన్నారు. ముంబై సిటీ జట్టుకు షాక్ బంబోలిమ్: ఇండియన్ సూపర్ లీగ్ ఫుట్‌బాల్ టోర్నీలో ముంబై సిటీ జట్టుకు రెండో ఓటమి ఎదురైంది. శనివారం జరిగిన మ్యాచ్‌లో నార్త్ ఈస్ట్ యునైటెడ్ జట్టు 2–1తో ముంబై జట్టును ఓడించింది. 30 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్న ముంబై జట్టుకు ఈ టోర్నీలో ఎదురైన రెండు పరాజయాలు నార్త్ ఈస్ట్ జట్టు చేతిలోనే రావడం గమనార్హం. నవంబర్ 21న తాము ఆడిన తొలి లీగ్ మ్యాచ్‌లోనూ ముంబై 0–1తో నార్త్ ఈస్ట్ జట్టు చేతిలో ఓడింది. -
షూటింగ్ ప్రపంచ కప్ నుంచి వైదొలిగిన భారత్
న్యూఢిల్లీ: సైప్రస్ వేదికగా మార్చి 4 నుంచి 13 వరకు జరిగే ప్రపంచ షూటింగ్ ప్రపంచ కప్ నుంచి భారత్ వైదొలిగింది. కోవిడ్–19 విజృంభిస్తున్న నేపథ్యంలో భార త షూటర్ల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు భారత జాతీయ రైఫిల్ సంఘం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. కోవిడ్–19 రోజు రోజుకు విస్తరిస్తున్న తరుణంలో భారత ఆరోగ్య మంత్రిత్వ శాఖ కొన్ని దేశాలకు భారతీయులు ప్రయాణం చేయకుండా ఉంటేనే మంచిదంటూ ఈ నెల 26న తెలిపింది. ఆ దేశాల జాబితాలో సైప్రస్ ఉండటంతో భారత షూటర్లు షూటింగ్ ప్రపంచ కప్ ఈవెంట్‌కు దూరమయ్యారు. -
సౌత్ జోన్ షూటింగ్ టోర్నీ షురూ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రైఫిల్ సంఘం ఆధ్వర్యంలో గురువారం సౌత్‌జోన్ షూటింగ్ చాంపియన్‌షిప్ ప్రారంభమైంది. సంఘీనగర్లోని అమన్ సంఘి 300మీ. బిగ్ బోర్ షూటింగ్ రేంజ్ వేదికగా బిగ్ బోర్ షూటింగ్ పోటీలు జరుగుతాయి. ఎల్బీ నగర్ డిప్యూటీ పోలీస్ కమిషనర్, ఐపీఎస్ సున్‌ప్రీత్ సింగ్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసి పోటీలను ప్రారంభించారు. మొత్తం 150 మంది షూటర్లు 34 షూటింగ్ ఈవెంట్లలో తలపడనున్నారు. సీనియర్, జూనియర్, వెటరన్ పురుషుల మహిళల కేటగిరీల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు చెందిన షూటర్లు పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైఫిల్ సంఘం అధ్యక్షులు అమిత్ సంఘి పాల్గొన్నారు. -
మను... పసిడి గురి
దోహా (ఖతర్): అంతర్జాతీయ వేదికపై మరోసారి సత్తా చాటిన భారత యువ షూటర్ మను భాకర్ ఆసియా చాంపియన్‌గా అవతరించింది. మంగళవారం మొదలైన ఈ మెగా ఈవెంట్లో హరియణాకు చెందిన 17 ఏళ్ల మను మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. ఇప్పటికే టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత పొందిన మను ఎనిమిది మంది షూటర్లు పాల్గొన్న ఫైనల్లో 244.3 పాయింట్లు స్కోరు చేసి టాప్ ర్యాంక్‌లో నిలిచింది. ఎలిమినేషన్ పద్ధతిలో జరిగిన ఫైనల్లో భారత్‌కే చెందిన యశస్విని సింగ్ ఐదో స్థానంలో నిలిచింది. కియాన్ వాంగ్ (చైనా–242.8 పాయింట్లు) రజతం నెగ్గగా... రాన్‌జిన్ జియాంగ్ (చైనా–220.2 పాయింట్లు) కాంస్యం కైవసం చేసుకుంది. క్వాలిఫయింగ్‌లో 584 పాయింట్లు సాధించిన మను టాప్ ర్యాంక్ హోదాలో ఫైనల్‌కు అర్హత సాధించింది. మను భాకర్, యశస్విని (578), అన్ను రాజ్ సింగ్ (569)లతో కూడిన భారత బృందానికి టీమ్ విభాగంలో కాంస్యం లభించింది. క్వాలిఫయింగ్‌లో ఈ త్రయం సాధించిన స్కోరు ఆధారంగా ఈ పతకం ఖాయమైంది. గతేడాది కామన్వెల్త్ గేమ్స్‌లో, యూత్ ఒలింపిక్స్ క్రీడల్లోనూ మను భాకర్ స్వర్ణ పతకాలను సాధించింది. డబుల్ ధమాకా... పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో భారత షూటర్ దీపక్ కుమార్ ఒకేసారి రెండు లక్ష్యాలను సాధించాడు. ఫైనల్లో అతను 227.8 పాయింట్లు స్కోరు చేసి కాంస్య పతకం నెగ్గడంతోపాటు వచ్చే ఏడాది జరిగే టోక్యో ఒలింపిక్స్‌కు కూడా అర్హత పొందాడు. యుకున్ లియు (చైనా–250.5 పాయింట్లు) స్వర్ణం నెగ్గగా... హావోనన్ యు (చైనా–249.1 పాయింట్లు) రజతం గెలిచాడు. మంగళవారం తన 32వ జన్మదినాన్ని జరుపుకున్న దీపక్ ప్రదర్శనతో... ఇప్పటి వరకు టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత పొందిన భారత షూటర్ల సంఖ్య 10కి చేరింది. ప్రతి ఈవెంట్లో ఒక దేశం నుంచి గరిష్టంగా ఇద్దరికి మాత్రమే అర్హత పొందే అవకాశం ఉంది. దీపక్‌కంటే ముందు ఈ ఈవెంట్లో భారత్ నుంచి దివ్యాంశ్ సింగ్ పన్వర్ ‘టోక్యో’ బెర్త్ సాధించాడు. మరోవైపు వివాన్ కపూర్, మనీషా కీర్‌లతో కూడిన భారత జట్టు జూనియర్ ట్రాప్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో పసిడి పతకం గెలిచింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ విభాగంలో ఇలవేనిల్ వలారివన్, అంజుమ్ మౌద్గిల్, అపూర్వీ చండేలాలతో కూడిన భారత బృందం 1883.2 పాయింట్లతో రజతం సాధించింది. వ్యక్తిగత విభాగంలో ఇలవేనిల్ ఐదో స్థానంలో నిలిచింది. ‘టోక్యో’ బెర్త్ సాధించిన భారత షూటర్లు ►మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ (2) అంజుమ్ మౌద్గిల్, అపూర్వీ చండేలా ►పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ (2) సౌరభ్ చౌదరీ, అభిషేక్ వర్మ ►పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ (2) దివ్యాంశ్ సింగ్ పన్వర్, దీపక్ కుమార్ ►పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ (1) సంజీవ్ రాజ్‌పుత్ ►మహిళల 25 మీటర్ల ఎయిర్ పిస్టల్ (1) రాహీ సర్నోబత్ ►మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ (2) మను భాకర్, యశస్విని సింగ్ -
అగస్త్య పసిడి గురి
సాక్షి, హైదరాబాద్: ఆలిండియా జీవీ మావలంకార్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ రాష్ట్ర షూటర్ కె. అగస్త్య సాయికుమార్ సత్తా చాటాడు. గుజరాత్‌లోని ఖాన్పూర్ వేదికగా జరిగిన ఈ టోర్నీలో తెలంగాణ రైఫిల్ అసోసియేషన్ (టీఆర్ఏ)కు ప్రాతినిధ్యం వహించిన అగస్త్య, 50మీ. పురుషుల రైఫిల్ త్రీ పొజిషన్ ఈవెంట్లో చాంపియన్‌గా నిలిచాడు. అతను ఫైనల్లో 567 పాయింట్లు స్కోర్ చేసి పసిడి పతకాన్ని సొంతం చేసుకున్నాడు. తొలుత నీలింగ్ పొజిషన్లో 183 పాయింట్లు స్కోర్ చేసిన అగస్త్య ప్రోన్ కేటగిరీలో 197 పాయింట్లు సాధించాడు. చివరగా స్టాండింగ్ పొజిషన్లో 187 పాయింట్లను స్కోర్ చేసి విజేతగా నిలిచాడు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన సంస్కార్ హవి ల్లా 560 పాయింట్లతో రజత పతకాన్ని దక్కించుకోగా... పంజాబ్ షూటర్ పంకజ్ ముఖీజా 558 పాయింట్లతో కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు. ఈ సందర్భంగా టీఆర్ఏ అధ్యక్షుడు అమిత్ సంఘీ జాతీయ స్థాయిలో చాంపియన్‌గా నిలిచిన అగస్త్యను అభినందించారు. -
జాతీయ షూటింగ్ జట్టులో ఆయుశ్, అబిద్
సాక్షి, హైదరాబాద్: ఆసియా షూటింగ్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే భారత జట్టుకు తెలంగాణకు చెందిన ఆరుగురు షూటర్లు ఎంపికైనట్లు తెలంగాణ రైఫిల్ సంఘం అధ్యక్షుడు అమిత్ సంఘి శుక్రవారం వెల్లడించారు. రాష్ట్రం నుంచి ఐదుగురు పురుషులు, ఒక మహిళ ఈ జట్టులో చోటు దక్కించుకున్నారు. క్లే పీజియన్ ట్రాప్ పురుషుల విభాగంలో కైనన్ షెనాయ్, క్లే పీజియన్ స్కీట్ జూనియర్ పురుషుల కేటగిరీలో ఆయుశ్ రుద్రరాజు, 50మీ. రైఫిల్ ప్రోన్ పురుషుల విభాగంలో గగన్ నారంగ్, 50మీ. రైఫిల్ ప్రోన్ జూనియర్ పురుషుల విభాగంలో అబిద్ అలీఖాన్, 10మీ. ఎయిర్ రైఫిల్ పురుషుల కేటగిరీలో మాస్టర్ ధనుశ్ శ్రీకాంత్ భారత్‌కు ప్రాతినిధ్యం వహించనున్నారు. 10మీ. ఎయిర్ పిస్టల్ జూనియర్ మహిళల విభాగంలో ఇషా సింగ్ తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. దోహాలోని ఖతర్ వేదికగా నవంబర్‌లో ఆసియా షూటింగ్ చాంపియన్‌షిప్ జరుగుతుంది. -
భళారే.. భారత్
రియో డి జనీరో(బ్రెజిల్): ప్రపంచకప్ షూటింగ్ టోర్నమెంట్లో భారత్ అదరగొట్టింది. మిక్స్డ్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో భారత్ మరో స్వర్ణ పతకాన్ని సాధించింది. భారత్ మిక్స్డ్ డబుల్స్ జోడి మను బాకర్-సౌరవ్ చౌధురీలు పసిడిని ఖాతాలో వేసుకున్నారు. దాంతో రియో డి జనీరో పర్యటనను స్వర్ణంతో భారత్ ముగించడమే కాకుండా పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. ఈ టోర్నమెంట్లో భారత్ మొత్తంగా ఐదు స్వర్ణ పతకాలు, రెండు రజతాలు, రెండు కాంస్యాలు సాధించింది. ఫలితంగా ఈ ఏడాది వేర్వేరు వేదికల్లో జరిగన నాలుగు ఐఎస్ఎస్ఎఫ్ రైఫిల్, పిస్టల్ వరల్డ్‌కప్ ఈవెంట్లలోనూ భారత్ టాప్‌ను దక్కించుకుంది. మను బాకర్-సౌరవ్ చౌధరీలు స్వర్ణాన్ని సాధించే క్రమంలో మరో భారత జోడి యశస్విని దేశ్వాయ్-అభిషేక్ వర్మలపై పైచేయి సాధించారు. మనుబాకర్-సౌరవ్లు 17-15 తేడాతో యశస్విని- అభిషేక్‌లపై విజయం సాధించి పసిడి కైవసం చేసుకున్నారు. -
భారత్‌కు మరో స్వర్ణం
రియో డి జనీరో(బ్రెజిల్): ప్రపంచకప్ షూటింగ్ టోర్నమెంట్లో భారత్‌కు మరో స్వర్ణం లభించింది. 10 మీ ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో ఫైనల్‌కు చేరుకున్న భారత షూటర్ అభిషేక్ వర్మ పసిడితో మెరిశాడు. పురుషుల విభాగంలో ఎనిమిది మంది తుది పోరుకు అర్హత సాధించగా అభిషేక్ వర్మ టాప్‌లో నిలిచాడు. మొత్తంగా ఫైనల్లో 244.2 పాయింట్లతో అభిషేక్ స్వర్ణాన్ని ఖాయం చేసుకున్నాడు. ఫలితంగా ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు. ఇక ఇదే విభాగంలో ఫైనల్‌కు చేరిన మరో భారత షూటర్ సౌరభ్ చౌధరీ కాంస్యతో సరిపెట్టుకున్నాడు. చౌధరి 221.9 పాయింట్లతో కాంస్య సాధించాడు. రజత పతకాన్ని టర్కీకి చెందిన ఇస్మాయిల్ కీల్స్ చేజిక్కించుకున్నాడు. 243.1 పాయింట్లతో ఇస్మాయిల్ రెండో స్థానానికి పరిమితమయ్యాడు.గురువారం జరిగిన పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ ఈవెంట్లో సంజీవ్ రాజ్‌పుత్ రజత పతకాన్ని గెలుచుకున్నాడు. బుధవారం జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో భారత షూటర్ ఇలవేణి స్వర్ణాన్ని సాధించిన సంగతి తెలిసిందే. మొత్తంగా రెండు స్వర్ణాలు, ఒక రజతం, ఒక కాంస్యంతో భారత్ పతకాల పట్టికలో టాప్కు చేరింది. -
ఇలవేనిల్‌కు స్వర్ణం
రియో డి జనీరో (బ్రెజిల్): ప్రపంచకప్ షూటింగ్ టోర్నమెం ట్లో భారత మహిళా షూటర్ ఇలవేనిల్ వలరివాన్ స్వర్ణ పతకాన్ని సాధించింది. బుధవారం జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఫైనల్లో ఇలవేనిల్ 251.7 పాయింట్లు స్కోరు చేసి విజేతగా నిలిచింది. సియోనైడ్ మెకంటోష్ (బ్రిటన్–250.6 పాయింట్లు) రజతం, యింగ్ షిన్ లిన్ (చైనీస్ తైపీ–229.9 పాయింట్లు) కాంస్యం సాధించారు. భారత్‌కే చెందిన అంజుమ్ మౌద్గిల్ (166.8 పాయింట్లు) ఆరో స్థానంలో నిలిచింది. -
హోమాన్షిక రెడ్డికి మూడు స్వర్ణాలు
రాయదుర్గం: తెలంగాణ రాష్ట్ర షూటింగ్ చాంపియన్‌షిప్ పోటీల్లో హైదరాబాద్ యువ షూటర్ హోమాన్షిక రెడ్డి అదరగొట్టింది. గచ్చిబౌలిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోని ‘శాట్స్’ షూటింగ్ రేంజ్లో శనివారం ముగిసిన ఈ టోర్నమెంట్లో హోమాన్షిక మూడు స్వర్ణ పతకాలను కైవసం చేసుకుంది. బేగంపేట్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో పదో తరగతి విద్యా ర్థిని అయిన హోమాన్షిక ఎయిర్ రైఫిల్ 10 మీటర్ల పెప్ సైట్ ఈవెంట్‌లోని సీనియర్, జూనియర్, యూత్ విభాగాల్లో విజేతగా నిలిచింది. హోమాన్షికను తండ్రి మహీపాల్ రెడ్డి, కోచ్‌లు అభినందించారు. భవిష్యత్‌లో మరిన్ని పతకాలు సాధించి జాతీయ జట్టులో స్థానం సాధించాలని ఆకాంక్షించారు. మియాపూర్‌లోని జెనిసిస్ ఇంటర్నేషనల్ స్కూల్లో పదో తరగతి చదివే సంతోషి అభిజ్ఞ మూడో స్థానంలో నిలిచింది. రెండు విభాగాలలో ఆమె కాంస్య పతకాలను సాధించింది. పోటీల చివరి రోజు రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ (శాట్స్) చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి, వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ దినకర్ బాబు, ఐఆర్ఎస్ అధికారి డాక్టర్ మంజుల, తెలంగాణ రాష్ట్ర షూటింగ్ విభాగం ప్రతినిధులు పాల్గొని విజేతలకు బహుమతులను అందించారు. ఇతర విభాగాల విజేతల వివరాలు 10మీ. రైఫిల్ యూత్ మహిళలు: 1. హోమాన్షిక రెడ్డి, 2. తన్వీ, 3. సంతోషి అభిజ్ఞ. 10మీ. రైఫిల్ జూనియర్ మహిళలు: 1. హోమాన్షిక రెడ్డి, 2. తన్వీ, 3. సంతోషి అభిజ్ఞ. 10మీ. రైఫిల్ మహిళలు: 1. హోమాన్షిక, 2. తన్వీ, 3. సుప్రియ. 10మీ. రైఫిల్ యూత్ పురుషులు: 1. ధనుశ్ శ్రీకాంత్, 2. బిజ్జు, 3. రమణ. 10మీ. రైఫిల్ జూనియర్ పురుషులు: 1. ధనుశ్ శ్రీకాంత్, 2. పరాష్కర్, 3. బిజ్జు. 10మీ. రైఫిల్ పురుషులు: 1. ధనుశ్ శ్రీకాంత్, 2. పరాష్కర్, 3. ఆదిత్య. 10మీ. రైఫిల్ యూత్ మహిళలు: 1. సామియా, 2. నాజ్ అంజుమ్, 3. షిరీన్ . 10మీ. రైపిల్ జూనియర్ మహిళలు: 1. నాజ్ అంజుమ్, 2. షిరీన్. 10మీ. రైఫిల్ మహిళలు: 1. సుమయ్యా ఫాతిమా, 2. ప్రవాణి, 3. నైలా. 10మీ. రైఫిల్ యూత్ పురుషులు: 1. సల్మాన్, 2. రవితేజ, 3. శివకృష్ణ. 10మీ. రైఫిల్ జూనియర్ పురుషులు: 1. ధనుశ్ రెడ్డి, 2. హాజీ అబ్దుల్ రషీద్, 3. తనీశ్. 10మీ. రైఫిల్ పురుషులు: 1. ధనుశ్ రెడ్డి, 2. మీర్జా అర్బాజ్ బేగ్, 3. ఆసిఫ్ ఉమర్. 10మీ. పిస్టల్ యూత్ మహిళలు: 1. అర్కితా 2. ఆషిత, 3. రినీషా. 10మీ. పిస్టల్ జూనియర్ మహిళలు: 1. ఫాతిమా, 2. జాబిలి, 3. అర్కితా. 10మీ. పిస్టల్ మహిళలు: 1. ఫాతిమా, 2. జాబిలి, 3. మాళవిక. 10మీ. పిస్టల్ యూత్ పురుషులు: 1. కౌశిక్, 2. సాత్విక్, 3. తరుణ్. 10మీ. పిస్టల్ జూనియర్ పురుషులు: 1. కౌశిక్, 2. జైనులాబ్దిన్, 3. సాత్విక్.