న్యూఢిల్లీ: ప్రపంచ బధిరుల షూటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ షూటర్ ధనుశ్ శ్రీకాంత్ తన ఖాతాలో రెండో స్వర్ణ పతకాన్ని జమ చేసుకున్నాడు. జర్మనీలోని హనోవర్‌లో జరుగుతున్న ఈ టోర్నీనలో ధనుశ్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో విజేతగా నిలిచాడు. ఫైనల్లో ధనుశ్ శ్రీకాంత్–మహిత్ సంధూ (భారత్) ద్వయం 17–5తో భారత్‌కే చెందిన నటాషా జోషి–మొహమ్మద్ ముర్తజా జంటపై గెలిచింది.
ధనుశ్–మహిత్ జోడీ క్వాలిఫయింగ్‌లో 628.8 పాయింట్లు స్కోరు చేసి బధిరుల షూటింగ్‌లో కొత్త ప్రపంచ రికార్డు సృష్టించింది. ఇదే టోర్నీలో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ విభాగంలో అభినవ్ దేశ్వాల్–ప్రాంజలి ధూమల్ జంట రజత పతకాన్ని దక్కించుకుంది. ఫైనల్లో అభినవ్–ప్రాంజలి ద్వయం 7–17తో ఒలెక్సిల్ లేజ్బింక్–ఇనా అఫోన్‌చెంకో (ఉక్రెయిన్) జంట చేతిలో ఓడిపోయింది. మూడో రోజు ముగిశాక భారత్ ఖాతాలో మూడు స్వర్ణాలు, ఆరు రజతాలు, మూడు కాంస్యాలతో కలిపి మొత్తం 12 పతకాలున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment