ప్రపంచ యూనివర్సిటీ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత షూటర్ భవ్‌తేగ్ సింగ్ గిల్(Bhavtegh Singh Gill) పసిడి పతకంతో మెరిశాడు. మంగళవారం జరిగిన పురుషల స్కీట్ విభాగంలో 21 ఏళ్ల భవ్‌తేగ్ సింగ్ గిల్ 58 పాయింట్లు స్కోరు చేసి అగ్ర స్థానంలో నిలిచాడు. జూనియర్ స్థాయిలో నిలకడైన ప్రదర్శన కనబరుస్తున్న భవ్‌తేగ్ సింగ్... ఇప్పటి వరకు అంతర్జాతీయ స్థాయిలో నాలుగు పతకాలు సాధించాడు.
వరల్డ్ యూనివర్సిటీ గేమ్స్‌లోనూ భవ్‌తేగ్ సింగ్ అదిరే గురితో ఆకట్టుకోగా... పెట్రోస్ ఎంగ్లెజోడిస్ (సిప్రస్)కు రజతం, భారత షూటర్ అభయ్ సింగ్‌కు కాంస్య పతకాలు లభించాయి. అంతకుముందు క్వాలిఫయింగ్ రౌండ్‌లో 125 పాయింట్లకు గానూ 122 పాయింట్లు సాధించిన అభయ్ సింగ్ అగ్రస్థానంలో నిలవగా... 119 పాయింట్లు సాధించి నాలుగో స్థానంతో భవ్‌తేగ్ ఫైనల్‌కు అర్హత సాధించాడు. దీంతో పాటు మంగళవారం భారత్ ఖాతాలో మరో మూడు కాంస్య పతకాలు కూడా చేరాయి.
అదే విధంగా.. మహిళల 25 మీటర్ల స్పోర్ట్స్ పిస్టల్ విభాగంలో సిమ్రన్‌ప్రీత్ కౌర్ బ్రార్, మహిళల స్కీట్ విభాగంలో యశస్వి రాథోడ్, పురుషుల స్కీట్ ఈవెంట్‌లో అభయ్ సింగ్ షెఖాన్ కాంస్యాలు గెలుచుకున్నారు. మహిళల స్కీట్‌లో యశస్వి 38 పాయింట్లతో కాంస్యం గెలుచుకుంది. గియాడా లోంఘీ (ఇటలీ), అడెలా సుపెకోవా (స్లొవకియా) వరుసగా స్వర్ణ, రజతాలు దక్కించుకున్నారు.
అంతకుముందు క్వాలిఫయింగ్ ఈవెంట్‌లో యశస్వి 114 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి తుదిపోరుకు చేరింది. మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్‌లో సిమ్రన్‌ప్రీత్ 30 పాయింట్లు సాధించి మూడో స్థానంలో నిలిచి కాంస్యం గెలుచుకుంది. కిమ్ మినెసో (35 పాయింట్లు; కొరియా), ఫౌరె హెలోయిస్ (34 పాయింట్లు; ఫ్రాన్స్) వరుసగా తొలి రెండు స్థానాల్లో నిలిచారు. ఈ పోటీల్లో 23 దేశాలకు చెందిన 220 మంది షూటర్లు పాల్గొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment