ఇషా సింగ్ ‘డబుల్’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర షూటింగ్ చాంపియన్‌షిప్‌లో ఇషా సింగ్ ‘డబుల్’ సాధించింది. ఆమె యూత్ మహిళల, మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్స్‌లో విజేతగా నిలిచింది. గచ్చిబౌలిలోని ‘శాట్స్’ షూటింగ్ రేంజ్‌లో బుధవారం ముగిసిన ఈ మూడు రోజుల టోర్నీకి విశేష స్పందన లభించింది. మునుపెన్నడూ లేని విధంగా 500 మంది షూటర్లు ఈ ఈవెంట్‌లో పాల్గొన్నారు. బుధవారం జరిగిన టోర్నీ ముగింపు కార్యక్రమంలో రాష్ట్ర డీజీపీ అనురాగ్ శర్మ, శాట్స్ ఎండీ ఎ. దినకర్‌బాబు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా డీజీపీ అనురాగ్ శర్మ మాట్లాడుతూ యువతరం షూటింగ్ క్రీడ పట్ల ఆసక్తి కనబరుస్తుండటం హర్షించదగ్గ విషయమన్నారు.
షూటర్లకు గన్ లైసెన్స్‌లు జారీ చేయడంలో ఢిల్లీ తరహా విధానాన్ని త్వరలోనే హైదరాబాద్‌లోనూ అమలు చేస్తామని పేర్కొన్నారు. 24 గంటల్లోనే లైసెన్స్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. అంతర్జాతీయ స్థాయి ఈవెంట్లకు ఆతిథ్యమిచ్చేందుకు నగరంలోని షూటింగ్ రేంజ్‌లను అభివృద్ధి చేయాల్సి ఉందని శాట్స్ ఎండీ దినకర్ బాబు అభిప్రాయపడ్డారు. దేశంలోనే అత్యుత్తమ షూటింగ్ రేంజ్‌లుగా తీర్చిదిద్దేందుకు దాదాపు రూ. 10 కోట్లు అవసరమని ఆయన అంచనా వేశారు. షూటింగ్ క్రీడ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతామని తెలిపారు. తెలంగాణ రైఫిల్ అసోసియేషన్ కృషిని ఆయన అభినందించారు.
బుధవారం జరిగిన వివిధ ఈవెంట్‌ల విజేతల వివరాలు
పురుషుల 50 మీ. రైఫిల్ ప్రోన్: 1. సాబీర్ అలీఖాన్, 2. తాహెర్ ఖాద్రి, 3. ప్రీత్‌పాల్ సింగ్.
మహిళలు: 1. వర్కాల సువర్ణ, 2. అనూష ఎర్రబల్లి, 3. సంయుక్త స్వామి.
50 మీ. జూనియర్ పురుషుల రైఫిల్ ప్రోన్: 1. సయ్యద్ మొహమ్మద్ మహమూద్, 2. అబిద్ అలీఖాన్, 3. ధీరజ్.
జూనియర్ మహిళలు: 1. సురభి భరద్వాజ్, 2. ఆర్. వైష్ణవి, 3. మౌనిక.
పురుషుల 10 మీ. ఎయిర్ పిస్టల్: 1. అనురాగ్ గౌత మ్, 2. మహేంద్ర రెడ్డి, 3. నాగసాయి తరుణ్.
యూత్ పురుషుల 10 మీ. ఎయిర్ పిస్టల్: 1. తనిష్క్, 2. అబ్దుల్ రెహమాన్ ఖాన్, 3. నాగసాయి తరుణ్.
యూత్ మహిళలు: 1. ఇషా సింగ్, 2. ఐషిత, 3. పెనిషా.
మహిళల 10 మీ. ఎయిర్ పిస్టల్: 1. ఇషా సింగ్, 2. ఐషితా, 3. ఫాతిమా ముఫద్దల్.
జూ. పురుషుల 10 మీ. ఎయిర్ పిస్టల్: 1. మహేం ద్రరెడ్డి, 2.తనిష్క్, 3.అబ్దుల్ రెహమాన్ ఖాన్.
పురుషుల 10 మీ. ఎయిర్ రైఫిల్: 1. వినయ్ కుమార్, 2. ఆదిత్య, 3. అమన్.
మహిళలు: 1. స్నిగ్ధ, 2. సంయుక్త, 3. నందిని.