
సాక్షి, హైదరాబాద్: సౌత్‌జోన్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ షూటర్లు పతకాల పంట పండించారు. జాతీయ షూటింగ్ టోర్నీకి క్వాలిఫయర్స్‌గా నిర్వహిస్తోన్న ఈ టోర్నీలో 6 స్వర్ణాలు, 4 రజతాలు, 2 కాంస్యాలు సహా మొత్తం 12 పతకాలను కైవసం చేసుకున్నారు. గచ్చిబౌలిలోని ‘శాట్స్’ షూటింగ్ రేంజ్‌లో శుక్రవారం జరిగిన పురుషుల వ్యక్తిగత క్లే పీజియన్ స్కీట్ షూటింగ్ ఈవెంట్‌లో రాష్ట్రానికి చెందిన సుభాశ్ చింతలపాటి స్వర్ణాన్ని, రాహుల్ రావు రజతాన్ని గెలుచుకున్నారు. కర్ణాటక షూటర్ డీపీ సవ్యసాచికి కాంస్యం దక్కింది.
జూనియర్ పురుషుల విభాగంలోనూ సుభాశ్ పసిడిని దక్కించుకున్నాడు. నవనీథన్ (తమిళనాడు), మునేక్ బట్టుల (తెలంగాణ) వరుసగా రజత, కాంస్యాల్ని గెలుచుకున్నారు. వెటరన్స్ కేటగిరీలో తెలంగాణకు చెందిన గుస్తి నోరియా స్వర్ణాన్ని, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వి. రాజేంద్రప్రసాద్ కాంస్యాన్ని దక్కించుకున్నారు.
తమిళనాడు షూటర్ రాజగోపాల్ రజతం సాధించాడు. మహిళల విభాగంలో దండు కాత్యాయని (తెలంగాణ), ఎన్. సోనాలి రాజు (తెలంగాణ) వరుసగా తొలి రెండు స్థానాల్లో నిలిచి స్వర్ణ, రజతాలను కైవసం చేసుకోగా... ఎన్. కీర్తన (తమిళనాడు) కాంస్యంతో సంతృప్తి పడింది. జూనియర్ మహిళల కేటగిరీలోనూ కాత్యాయని, సోనాలి, కీర్తన తొలి మూడు స్థానాల్లో నిలిచి పతకాలను గెలుచుకున్నారు. మరోవైపు స్కీట్ టీమ్ ఈవెంట్‌లో చేతన్, అహ్మద్, సుభాశ్‌లతో కూడిన తెలంగాణ ‘ఎ’ జట్టు చాంపియన్‌గా నిలిచింది. సైఫ్ అలీ, రాహుల్ రావు, మునేక్‌లతో కూడిన తెలంగాణ ‘బి’ జట్టు రన్నరప్‌గా నిలవగా... సలీమ్, శ్రేయన్ కపూర్, సాబీర్ సింగ్‌లతో కూడిన తెలంగాణ ‘సి’ బృందం కాంస్యాన్ని తమ ఖాతాలో వేసుకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment