న్యూఢిల్లీ: మరోసారి తన గురితో తెలంగాణ యువ షూటర్ ధనుష్ శ్రీకాంత్ అదరగొట్టాడు. బధిరుల ఒలింపిక్స్ (డెఫిలింపిక్స్) క్రీడల్లో భారత్‌కు మరో స్వర్ణ పతకాన్ని అందించాడు. బ్రెజిల్‌లో జరుగుతున్న ఈ క్రీడల్లో 19 ఏళ్ల ధనుష్ శ్రీకాంత్–ప్రియేషా దేశ్‌ముఖ్ జంట 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో భారత్ ఖాతాలో బంగారు పతకాన్ని వేసింది.
ఫైనల్లో ధనుష్ శ్రీకాంత్–ప్రియేషా ద్వయం 16–10 పాయింట్ల తేడాతో సెబాస్టియన్ హెర్మానీ–సబ్రీనా (జర్మనీ) జోడీపై విజయం సాధించి విజేతగా నిలిచింది. వరుసగా నాలుగుసార్లు ఒలింపిక్స్‌లో పాల్గొనడం తోపాటు 2012 లండన్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ మేటి షూటర్ గగన్ నారంగ్‌కు చెందిన ‘గన్ ఫర్ గ్లోరీ’ అకాడమీలో శిక్షణ పొందుతున్న ధనుష్ శ్రీకాంత్‌కు ఈ బధిరుల ఒలింపిక్స్‌లో రెండో స్వర్ణం కావడం విశేషం.
ఇంతకుముందు ధనుష్ శ్రీకాంత్ పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత విభాగంలో పసిడి పతకం సాధించిన సంగతి తెలిసిందే. క్వాలిఫయింగ్‌లో శ్రీకాంత్–ప్రియేషా జంట 414 పాయింట్లు స్కోరు చేసి అగ్రస్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించింది. కాంస్య పతక పోరులో శౌర్య సైనీ–నటాషా జోషి (భారత్) జంట 8–16తో వయోలెటా–అలెగ్జాండర్ (ఉక్రెయిన్) జోడీ చేతిలో ఓడిపోయింది. ప్రస్తుతం భారత్ నాలుగు స్వర్ణాలు, రెండు కాంస్యాలతో కలిపి మొత్తం ఆరు పతకాలతో ఆరో ర్యాంక్‌లో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment