
సాక్షి, హైదరాబాద్: సౌత్‌జోన్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ జట్టు స్వర్ణంతో మెరిసింది. నేషనల్స్ షూటింగ్ టోర్నీకి క్వాలిఫయర్‌గా గచ్చి బౌలిలోని ‘శాట్స్’ షూటింగ్ రేంజ్‌లో నిర్వహించిన ఈ టోర్నీలో... ట్రాప్ ఈవెంట్‌లో తెలంగాణ జట్టు అగ్రస్థానాన్ని దక్కించుకుంది. ఆదివారం జరిగిన టీమ్ ఈవెంట్ ట్రాప్ షూటింగ్‌లో కైనన్ షెనాయ్, దరియస్ షెనాయ్, గౌతమ్ జ్ఞాన్‌చందానిలతో కూడిన తెలంగాణ బృందం 348 పాయింట్లు సాధించి విజేతగా నిలిచింది. రజతం సాధించిన తమిళనాడు ‘ఎ’ బృందం 329 పాయింట్లు స్కోర్ చేసింది. తమిళనాడు ‘బి’ జట్టు 310 పాయింట్లతో కాంస్యాన్ని గెలుచుకుంది. మరోవైపు వ్యక్తిగత విభాగంలోనూ గౌతమ్ ఆకట్టుకున్నాడు. పురుషుల వ్యక్తిగత క్లే పీజియన్ ట్రాప్ ఈవెంట్‌లో స్వర్ణాన్ని కైవసం చేసుకున్నాడు. గౌతమ్ 33 పాయింట్లు సాధించి చాంపియన్‌గా నిలిచాడు. తమిళనాడుకు చెందిన లోకేశ్వరన్ 25 పాయింట్లతో రజతాన్ని, సెంథిల్ కుమార్ 17 పాయింట్లతో కాంస్యాన్ని దక్కించుకున్నారు. మహిళల విభాగంలో నివేథ (తమిళనాడు) పసిడిని కొల్లగొట్టింది.