Jeetu Roy
-
భారత్‌కు ఐదో స్థానం
ముగిసిన ప్రపంచకప్ షూటింగ్ న్యూఢిల్లీ: ప్రపంచకప్ షూటింగ్ టోర్నమెంట్లో చివరి రోజు భారత్‌కు నిరాశే ఎదురైంది. గురువారం జరిగిన పురుషుల స్కీట్ ఈవెంట్లో షీరాజ్ షేక్ ఆరో స్థానంలో నిలిచాడు. అయితే తన ఏడేళ్ల కెరీర్లో తొలి ప్రపంచకప్ ఫైనల్ ఆడిన షీరాజ్ అత్యుత్తమ ప్రదర్శన చేశాడు. క్వాలిఫయింగ్ రౌండ్లో 121 పాయింట్లు సాధించగా.. ఫైనల్ రౌండ్లో చోటు కోసం జరిగిన షూట్ ఆఫ్‌లో మాజీ ప్రపంచ చాంపియన్ జెస్పర్ హెన్సన్ (డెన్మార్క్)ను మించి రాణించాడు. అయితే ఫైనల్లో మాత్రం నిరాశపరిచి ఆరో స్థానంలో నిలిచాడు. గతంలో ఉత్తరప్రదేశ్ తరఫున అండర్–16 విజయ్ మర్చంట్ ట్రోఫీలో పాల్గొన్న షీరాజ్ ఫైనల్లోని 20 షాట్లలో 16 పాయింట్లు సాధించాడు. ‘ఇదో మంచి అనుభవం. అంతా బాగానే సాగినా కొన్ని షాట్లను మిస్ అయ్యాను. మరింత మెరుగయ్యేందుకు అవకాశం ఉంది’ అని 26ఏళ్ల షీరాజ్ తెలిపాడు. రియో ఒలింపిక్ చాంపియన్ గాబ్రియల్ రోసెట్టిని వెనక్కి నెట్టి ఇటలీకి చెందిన షూటర్ రికార్డో ఫిలిప్పెలి స్వర్ణం సాధించాడు. తొలిసారిగా స్వదేశంలో జరిగిన ఈ మెగా ఈవెంట్లో భారత్ మొత్తం ఐదు పతకాలు సాధించింది. ఇందులో ఓ స్వర్ణం, రెండు రజతాలు, రెండు కాంస్యాలున్నాయి. పతకాల పట్టికలో చైనా, ఇటలీ, ఆస్ట్రేలియా, జపాన్ తర్వాత భారత్ ఐదో స్థానంలో నిలిచింది. పురుషుల 50మీ. పిస్టల్ ఈవెంట్లో జీతూ రాయ్ ఏకైక స్వర్ణం సాధించిన విషయం తెలిసిందే. శుక్రవారం ఈ చాంపియన్‌షిప్‌లో మిక్స్డ్ ఈవెంట్ విభాగంలో పోటీలు జరుగుతాయి. అయితే ప్రయోగాత్మకంగా నిర్వహిస్తున్న ఈ ఈవెంట్లలో సాధించిన పతకాలను పరిగణనలోకి తీసుకోరు. -
పిస్టల్ పవర్...
► జీతూ రాయ్ ‘పసిడి’ గురి ► ప్రపంచ రికార్డుతో సంచలనం రజతం నెగ్గిన అమన్‌ప్రీత్ ► 50 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో భారత్‌కు రెండు పతకాలు ►ప్రపంచకప్ షూటింగ్ టోర్నీ ఐదు రోజుల నిరీక్షణ ముగిసింది. స్వదేశంలో తొలిసారి జరుగుతున్న ప్రపంచకప్ షూటింగ్ టోర్నమెంట్లో భారత షూటర్ల గురికి తొలి పసిడి పతకం వచ్చింది. చివరి షాట్ వరకు నమ్మకం కోల్పోకుండా, ఆత్మవిశ్వాసంతో గురి చూసి కొట్టిన జీతూ రాయ్ భారత్ ఖాతాలో తొలి స్వర్ణ పతకాన్ని జమ చేశాడు. అందరి అంచనాలను తారుమారు చేస్తూ మరో భారత షూటర్ అమన్‌ప్రీత్ సింగ్ కూడా అద్భుతంగా రాణించి రజత పతకం గెలిచాడు. దాంతో పురుషుల 50 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో భారత్ తమ పవర్ఫుల్ ప్రదర్శనతో రెండు పతకాలను సొంతం చేసుకుంది. న్యూఢిల్లీ: గురిలో కాస్త తేడా వస్తే పతకావకాశాలు తారుమారు అయ్యే పరిస్థితి. కానీ జీతూ రాయ్ మాత్రం తడబడలేదు. ఒక్కో షాట్‌తో ప్రత్యర్థులను వెనక్కి నెట్టి ఏకంగా అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. అదే క్రమంలో కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పి సంచలనం సృష్టించాడు. సొంతగడ్డపై జరుగుతున్న ప్రపంచకప్ షూటింగ్ టోర్నీలో భారత్‌కు తొలి స్వర్ణ పతకాన్ని అందించాడు. బుధవారం జరిగిన పురుషుల 50 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో జీతూ రాయ్‌తోపాటు అమన్‌ప్రీత్ సింగ్ అదరగొట్టాడు. ఫలితంగా భారత్‌కు పసిడి పతకంతోపాటు రజతం కూడా దక్కింది. ఎనిమిది మంది షూటర్లు పాల్గొన్న ఫైనల్లో జీతూ రాయ్ 230.1 పాయింట్లు స్కోరు చేసి ప్రపంచ రికార్డు నెలకొల్పడమే కాకుండా స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు. చివరి షాట్ వరకు నంబర్‌వన్ స్థానంలో ఉన్న అమన్‌ప్రీత్ సింగ్ కీలకదశలో ఒత్తిడికి లోనయ్యాడు. చివరి షాట్లో తడబడి తుదకు 226.9 పాయింట్లతో రజత పతకాన్ని దక్కించుకున్నాడు. 208 పాయింట్లు స్కోరు చేసిన ఇరాన్ షూటర్ వహీద్ గోల్‌ఖాందన్ కాంస్య పతకంతో సరిపెట్టుకున్నాడు. ఫైనల్లో తొలి రెండు సిరీస్‌లు పూర్తయ్యాక జీతూ రాయ్ ఆరో స్థానంలో నిలిచాడు. ఆ తర్వాత ఒక్కో సిరీస్‌కు జీతూ రాయ్ స్కోరు మెరుగైంది. ఐదో సిరీస్‌లోని తొలి షాట్‌కు జీతూ 10.8, రెండో షాట్‌కు 9.3 స్కోరు చేసి ఆరో స్థానం నుంచి నాలుగో స్థానానికి ఎగబాకాడు. ఆ తర్వాత ఇదే జోరు కొనసాగిస్తూ ఎనిమిదో సిరీస్ పూర్తయ్యాక 209.6 పాయింట్లతో రెండో స్థానానికి వచ్చాడు. అమన్‌ప్రీత్ 209.9 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. చివరిదైన ఎనిమిదో సిరీస్‌లో తొలి షాట్‌కు జీతూ 10... రెండో షాట్‌కు 10.5 స్కోరు చేసి అగ్రస్థానానికి చేరుకున్నాడు. అమన్‌ప్రీత్ తొలి షాట్‌కు 8.8... రెండో షాట్‌కు 8.2 స్కోరు చేసి రెండో స్థానానికి పడిపోయి రజతంతో సంతృప్తి పడ్డాడు. అంతకుముందు 34 మంది షూటర్లు పాల్గొన్న క్వాలిఫయింగ్‌లో అమన్‌ప్రీత్ సింగ్ 561, జీతూ రాయ్ 559 పాయింట్లు సాధించి ఫైనల్‌కు చేరారు. భారత్‌కే చెందిన మరో షూటర్ గుర్పాల్ సింగ్ 549 పాయింట్లతో 12వ స్థానంలో నిలిచాడు. టాప్–8లో నిలిచిన వారు ఫైనల్‌కు అర్హత సాధిస్తారు. స్కీట్‌లో నిరాశ... మరోవైపు మహిళల స్కీట్ ఈవెంట్లో భారత షూటర్లకు నిరాశ ఎదురైంది. 27 మంది బరిలోకి దిగిన క్వాలిఫయింగ్ పోటీల్లో రష్మీ రాథోడ్ 66 పాయింట్లు, ఆర్తి సింగ్ రావు 63 పాయింట్లు, సానియా షేక్ 60 పాయింట్లు సాధించి వరుసగా 17వ, 24వ, 27వ స్థానాల్లో నిలిచారు. ఈ విభాగంలో రియో ఒలింపిక్స్ చాంపియన్ కింబర్లీ రోడ్ (అమెరికా) ఫైనల్లో 56 పాయింట్లు సాధించి కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పడంతోపాటు స్వర్ణ పతకాన్ని దక్కించుకుంది. ఈ టోర్నీలో ఇప్పటివరకు భారత్ స్వర్ణం, రెండు రజతాలు, రెండు కాంస్యాలు సాధించి ఐదు పతకాలతో నాలుగో స్థానంలో ఉంది. -
జీతూ రాయ్‌కు చాంపియన్స ట్రోఫీ
న్యూఢిల్లీ: భారత స్టార్ షూటర్ జీతూ రాయ్ అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య (ఐఎస్ఎస్ఎఫ్) సీజన్ ముగింపు టోర్నమెంట్లో చాంపియన్స ట్రోఫీని సొంతం చేసుకున్నాడు. ఇటలీలోని బొలోగ్నాలో ఆదివారం ముగిసిన ఈ టోర్నమెంట్లో పురుషుల, మహిళల విభాగాల్లో పతకాలు గెలిచినవారు మాత్రమే చాంపియన్స ట్రోఫీ కోసం పోటీపడతారు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ లేదా 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగాల్లో మాత్రమే ఈ అవార్డు కోసం పోటీలు నిర్వహిస్తారు. జీతూ రాయ్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌ను ఎంచుకున్నాడు. ఎలిమినేషన్ పద్ధతిలో జరిగిన ఫైనల్లో తొలి నాలుగు షాట్ల తర్వాత అత్యల్ప స్కోరు ఉన్న షూటర్ నిష్ర్కమిస్తాడు. ఆ తర్వాత ప్రతి షాట్‌కూ తక్కువ స్కోరు ఉన్న ఒక్కో షూటర్ తప్పుకుంటాడు. చివరకు బరిలో నిలిచిన ఇద్దరికి ఫైనల్ నిర్వహిస్తారు. ఫైనల్లో ఇద్దరి స్కోర్లు సున్నాగా ఉంటాయి. ఇద్దరికీ మూడు షాట్లు కొట్టేందుకు అవకాశం ఇస్తారు. ఫైనల్లో జీతూ రాయ్ 29.6 పాయి0ట్లు స్కోరు చేసి విజేతగా అవతరించగా... దామిర్ మికెక్ (సెర్బియా) 28.3 పాయి0ట్లతో రన్నరప్‌గా నిలిచాడు. విజేతగా నిలిచిన జీతూ రాయ్‌కు 5 వేల యూరోలు (రూ. 3 లక్షల 70 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి. -
దీపా, జీతూలకు రాజీవ్ఖేల్త్న్ర!
దాదాపుగా ఖరారు న్యూఢిల్లీ: భారత ప్రభుత్వం అందించే అత్యున్నత క్రీడా అవార్డు ‘రాజీవ్ ఖేల్త్న్ర’కు ఈ ఏడాది జిమ్నాస్ట్ దీపా కర్మాకర్, షూటర్ జీతూరాయ్ పేర్లను ప్రతిపాదించారు. వీరిద్దరు ఒలింపిక్స్‌లో పతకం సాధించడంలో విఫలమైనా, ఇటీవలి ప్రదర్శనను పరిగణనలోకి తీసుకున్నారు. వాస్తవానికి ఖేల్త్న్ర అవార్డు కోసం పేర్లు ప్రతిపాదించేందుకు ఇప్పటికే గడువు ముగిసినా... రియోలో దీప ప్రదర్శన ఆమె పేరును చేర్చేలా చేసింది. అటు జీతూ కూడా రెండేళ్లుగా నిలకడగా రాణిస్తున్నాడు. 12 మంది సభ్యుల కమిటీ కూడా వీరిద్దరి పేర్లను దాదాపుగా ఖరారు చేసినట్లు సమాచారం. ఒక వేళ ఒలింపిక్స్‌లో సింధు పతకం సాధిస్తే ఆమెను కూడా ఎంపిక చేసే అవకాశం ఉంది. మరో వైపు అర్జున అవార్డు కోసం అజింక్య రహానే, శివ థాపా, గుర్ప్రీత్, అపూర్వి చండీలా, సౌమ్యజిత్, వినేశ్ ఫోగట్ తదితరుల పేర్లను సంబంధిత సంఘాలు ప్రతిపాదించాయి. -
జీతూ రాయ్‌కు రజతం
షూటింగ్ వరల్డ్ కప్ బాకు (అజర్బైజాన్): రియో ఒలింపిక్స్ ముందు భారత ‘పిస్టల్ కింగ్’ జీతూ రాయ్ రజతంతో మెరిశాడు. శనివారం ఇక్కడ జరిగిన ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ వరల్డ్ కప్ ఫైనల్లో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో జీతూ రాయ్ 199.5 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. 200 పాయింట్లతో ఫిలిప్ అల్మిడా (బ్రెజిల్) స్వర్ణాన్ని సాధించగా, మూడుసార్లు ఒలింపిక్ చాంపియన్ అయిన జంగో జిన్ (కొరియా) 178.8 పాయింట్లతో కాంస్యంతో సరిపెట్టుకున్నాడు. ఓవరాల్‌గా రాయ్‌కి ఇది ఆరో ప్రపంచ కప్ పతకం కాగా... ఈ సీజన్లో రెండోది. మరోవైపు 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ప్రపంచ మాజీ నంబర్‌వన్ హీనా సిద్ధూ (582 పాయింట్లు) ఫైనల్స్‌కు అర్హత సాధించింది.