చాంగ్వాన్ (దక్షిణ కొరియా): సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ... మేరాజ్ అహ్మద్ ఖాన్ ప్రపంచకప్ షూటింగ్ టోర్నీ చరిత్రలో పురుషుల స్కీట్ విభాగంలో భారత్‌కు తొలిసారి స్వర్ణ పతకాన్ని అందించాడు. సోమవారం జరిగిన పురుషుల స్కీట్ ఈవెంట్ ఫైనల్లో ఉత్తరప్రదేశ్‌కు చెందిన 46 ఏళ్ల మేరాజ్ 40 పాయింట్లకుగాను 37 పాయింట్లు స్కోరు చేశాడు.
నలుగురు పాల్గొన్న ఫైనల్లో ‘డబుల్ ఒలింపియన్’ మేరాజ్ అగ్రస్థానంలో నిలిచి బంగారు పతకాన్ని సాధించాడు. మిన్సు కిమ్ (కొరియా; 36 పాయింట్లు) రజతం, బెన్ లెలెవెలిన్ (బ్రిటన్; 26 పాయింట్లు) కాంస్యం గెల్చుకున్నారు. 35 మంది షూటర్ల మధ్య రెండు రోజులపాటు జరిగిన క్వాలిఫయింగ్ రౌండ్‌లో మేరాజ్ 119 పాయింట్లు స్కోరు చేసి ఎనిమిదో స్థానంలో నిలిచి ర్యాంకింగ్ మ్యాచ్‌లకు అర్హత సాధించాడు.
నలుగురు షూటర్ల మధ్య జరిగిన రెండో ర్యాంకింగ్ మ్యాచ్‌లో మేరాజ్ 27 పాయింట్లు స్కోరు చేసి ఫైనల్‌కు దూసుకెళ్లాడు. 2016 రియో డి జనీరో ప్రపంచకప్ టోర్నీలో మేరాజ్ రజత పతకం సాధించాడు. మహిళల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ టీమ్ ఈవెంట్‌లో అంజుమ్ మౌద్గిల్, ఆశీ చౌక్సీ, సిఫ్ట్‌కౌర్ సామ్రాలతో కూడిన భారత జట్టు కాంస్య పతకం గెల్చుకుంది. కాంస్య పతక పోరులో భారత్ 16–6తో ఆస్ట్రేలియాను ఓడించింది. ఈ టోర్నీలో భారత్ ఐదు స్వర్ణాలు, ఐదు రజతాలు, మూడు కాంస్యాలతో కలిపి మొత్తం 13 పతకాలతో టాప్ ర్యాంక్‌లో కొనసాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment