World Cup shooting
-
Shooting World Cup: చరిత్ర సృష్టించిన భారత షూటర్లు
అల్మాటీ (కజకిస్తాన్): ప్రపంచకప్ షాట్‌గన్ షూటింగ్ టోర్నీలో భారత షూటర్లు చరిత్ర సృష్టించారు. మహిళల స్కీట్ ఈవెంట్లో భారత్‌కు తొలిసారి రజత, కాంస్య పతకాలు లభించాయి. ఆరుగురు షూటర్ల మధ్య మంగళవారం జరిగిన స్కీట్ ఈవెంట్ ఫైనల్లో గనీమత్ ‘షూట్ ఆఫ్’లో గురితప్పి రజత పతకం సాధించగా... దర్శన కాంస్య పతకాన్ని సంపాదించింది. 60 షాట్ల ఫైనల్లో అసెమ్ ఒరిన్బే (కజకిస్తాన్), గనీమత్ 50 పాయింట్లతో సమఉజ్జీగా నిలిచారు. స్వర్ణ, రజత పతకాల కోసం రెండు షాట్ల ‘షూట్ ఆఫ్’ను నిర్వహించారు. ఒరిన్బే రెండు పాయింట్లు స్కోరు చేసి స్వర్ణ పతకాన్ని ఖరారు చేసుకోగా... గనీమత్ ఒక పాయింట్ సాధించి రజతం దక్కించుకుంది. దర్శన 39 పాయింట్లు స్కోరు చేసి మూడో స్థానంలో నిలిచింది. అంతకుముందు క్వాలిఫయింగ్‌లో దర్శన 120 పాయింట్లు సాధించి రెండో ర్యాంక్‌లో, గనీమత్ 117 పాయింట్లు స్కోరు చేసి నాలుగో ర్యాంక్‌లో నిలిచి ఫైనల్‌కు అర్హత పొందారు. పురుషుల స్కీట్ ఈవెంట్లో భారత్ నుంచి ముగ్గురు షూటర్లు మేరాజ్ అహ్మద్ ఖాన్, గుర్జోత్ ఖాంగురా, అనంత్‌జీత్ సింగ్ వరుసగా 17వ, 19వ, 23వ స్థానాల్లో నిలిచి ఫైనల్ చేరలేకపోయారు. -
ప్రపంచ రికార్డు... అయినా పతకానికి దూరం
ప్రపంచ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత షూటర్ రిథమ్ సాంగ్వాన్ కొత్త ప్రపంచ రికార్డును సృష్టించింది. అజర్‌బైజాన్‌లోని బాకులో జరుగుతున్న ఈ పోటీల్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో రిథమ్ 595 పాయింట్లు స్కోరు సాధించి రికార్డును నమోదు చేసింది. అయితే ఈ పోటీల క్వాలిఫయింగ్ ఈవెంట్లో ఆమె ఈ కొత్త ఘనతను ప్రదర్శించింది. రికార్డు స్కోరుతో ఫైనల్ చేరిన రిథమ్ అసలు సమరంలో మాత్రం విఫలమైంది. సత్తా చాటలేకపోయిన ఆమె చివరగా ఎనిమిదో స్థానంతో సరిపెట్టుకుంది. ఇదే ఈవెంట్ క్వాలిఫయింగ్ ఇతర భారత షూటర్లు ఇషాసింగ్, మను భాకర్ వరుసగా 13వ, 27వ స్థానాల్లో నిలిచి ఆరంభంలోనే ని్రష్కమించారు. పురుషుల 50 మీటర్ల 3 పొజిషన్ రైఫిల్ ఈవెంట్లో కూడా భారత షూటర్లెవరూ ఫైనల్స్‌కు అర్హత సాధించలేకపోయారు. -
Bhopal ISSF World Cup: మనూ భాకర్‌కు కాంస్యం
భోపాల్‌లో జరుగుతున్న ప్రపంచకప్ షూటింగ్లో భారత్ ఖాతాలో ఆరో పతకం చేరింది. మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో మనూ భాకర్ (20 పాయింట్లు) కాంస్య పతకం గెలుచుకుంది. టోర్నీలో భాకర్‌కు ఇదే మొదటి పతకం. ఈ పోరులో డొరీనా (30 పాయింట్లు), జియూ డు (29 పాయింట్లు) స్వర్ణ, రజతాలు గెలుచుకున్నారు. ఇదే విభాగంలో మరో భారత షూటర్, తెలంగాణకు చెందిన ఇషా సింగ్ పతకం సాధించడంలో విఫలమైంది. శనివారం ఈవెంట్లు ముగిసే సరికి భారత్ 1 స్వర్ణం, 1 రజతాలు, 4 కాంస్యాలతో రెండో స్థానంలో కొనసాగుతుండగా...6 స్వర్ణాలు, 2 రజతాలు, 2 కాంస్యాలు (మొత్తం 10 పతకాలు) చైనా అగ్ర స్థానంలో నిలిచింది. -
World Cup 2022: చరిత్ర సృష్టించిన మేరాజ్
చాంగ్వాన్ (దక్షిణ కొరియా): సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ... మేరాజ్ అహ్మద్ ఖాన్ ప్రపంచకప్ షూటింగ్ టోర్నీ చరిత్రలో పురుషుల స్కీట్ విభాగంలో భారత్‌కు తొలిసారి స్వర్ణ పతకాన్ని అందించాడు. సోమవారం జరిగిన పురుషుల స్కీట్ ఈవెంట్ ఫైనల్లో ఉత్తరప్రదేశ్‌కు చెందిన 46 ఏళ్ల మేరాజ్ 40 పాయింట్లకుగాను 37 పాయింట్లు స్కోరు చేశాడు. నలుగురు పాల్గొన్న ఫైనల్లో ‘డబుల్ ఒలింపియన్’ మేరాజ్ అగ్రస్థానంలో నిలిచి బంగారు పతకాన్ని సాధించాడు. మిన్సు కిమ్ (కొరియా; 36 పాయింట్లు) రజతం, బెన్ లెలెవెలిన్ (బ్రిటన్; 26 పాయింట్లు) కాంస్యం గెల్చుకున్నారు. 35 మంది షూటర్ల మధ్య రెండు రోజులపాటు జరిగిన క్వాలిఫయింగ్ రౌండ్లో మేరాజ్ 119 పాయింట్లు స్కోరు చేసి ఎనిమిదో స్థానంలో నిలిచి ర్యాంకింగ్ మ్యాచ్‌లకు అర్హత సాధించాడు. నలుగురు షూటర్ల మధ్య జరిగిన రెండో ర్యాంకింగ్ మ్యాచ్‌లో మేరాజ్ 27 పాయింట్లు స్కోరు చేసి ఫైనల్‌కు దూసుకెళ్లాడు. 2016 రియో డి జనీరో ప్రపంచకప్ టోర్నీలో మేరాజ్ రజత పతకం సాధించాడు. మహిళల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ టీమ్ ఈవెంట్లో అంజుమ్ మౌద్గిల్, ఆశీ చౌక్సీ, సిఫ్ట్‌కౌర్ సామ్రాలతో కూడిన భారత జట్టు కాంస్య పతకం గెల్చుకుంది. కాంస్య పతక పోరులో భారత్ 16–6తో ఆస్ట్రేలియాను ఓడించింది. ఈ టోర్నీలో భారత్ ఐదు స్వర్ణాలు, ఐదు రజతాలు, మూడు కాంస్యాలతో కలిపి మొత్తం 13 పతకాలతో టాప్ ర్యాంక్‌లో కొనసాగుతోంది. -
మనూ–సౌరభ్ జంటకు రజతం
ఒసిజెక్ (క్రొయేషియా): ప్రపంచకప్ షూటింగ్ టోర్నమెంట్లో భారత్‌కు మూడో పతకం లభించింది. శనివారం జరిగిన 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ ఈవెంట్లో మనూ భాకర్–సౌరభ్ చౌదరీ జంటకు రజత పతకం దక్కింది. ఫైనల్లో మనూ–సౌరభ్ జోడీ 12–16తో వితాలినా బత్సారష్కినా–అర్తెమ్ చెర్నోసువ్ (రష్యా) ద్వయం చేతిలో ఓడిపోయింది. ఇదే ఈవెంట్ కాంస్య పతక పోరులో అభిషేక్ వర్మ–యశస్విని సింగ్ (భారత్) జోడీ 7–17తో గొల్నూష్ సెబ్గతోలాహి–జావెద్ ఫరూగి (ఇరాన్) జంట చేతిలో పరాజయం పాలైంది. -
స్వర్ణంతో మెరిసిన అపూర్వి
న్యూఢిల్లీ: ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్‌కప్‌లో భారత్ ఖాతాలో తొలి స్వర్ణం చేరింది. భారత స్టార్ షూటర్ అపూర్వి చండీలా రైఫిల్ అండ్ పిస్టల్ విభాగంలో పసిడి గెలుచుకున్నారు. శనివారం ఆరంభమైన షూటింగ్ వరల్డ్‌కప్‌లో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో అపూర్వి స్వర్ణాన్ని సాధించారు. సరికొత్త రికార్డుతో అపూర్వి పసిడి గెలుచుకోవడం విశేషం. ఫైనల్లో మొత్తం 252. 9 పాయింట్లతో కొత్త వరల్డ్ రికార్డు నెలకొల్పిన అపూర్వి పసిడితో మెరిశారు. ఫలితంగా వరల్డ్‌కప్ షూటింగ్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో స్వర్ణం గెలుచుకున్న రెండో భారత షూటర్‌గా అపూర్వి నిలిచారు. అంతకముందు అంజలీ భగవత్ ఈ ఫీట్ సాధించారు. కాగా, ఇది వరల్డ్‌కప్‌లో అపూర్వికి మూడో పతకం. గత ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్‌కప్‌లో అపూర్వి రజత పతకాన్ని సాధించిన సంగతి తెలిసిందే. తాజా వరల్డ్‌కప్ షూటింగ్లో రజత, కాంస్య పతకాలు చైనా దక్కించుకుంది. జొహో రుజు(251.8 పాయింట్లు) రెండో స్థానంలో నిలిచి రజతాన్ని దక్కించుకోగా, మరో చైనా షూటర్ ఝు హాంగ్(230.4) కాంస్యాన్ని దక్కించుకున్నారు. -
మను మళ్లీ మెరిసె...
గ్వాడలహారా (మెక్సికో): సీనియర్‌స్థాయిలో తాను పాల్గొంటున్న తొలి ప్రపంచకప్ షూటింగ్ టోర్నమెంట్లో టీనేజ్ సంచలనం మనూ భాకర్ మళ్లీ అదుర్స్ అనిపించింది. 16 ఏళ్ల ఈ హరియాణా అమ్మాయి వరుసగా రెండో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత ఈవెంట్లో పసిడి పతకం నెగ్గిన మనూ... 24 గంటల్లోపే మరో స్వర్ణం సాధించింది. ఈసారి 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ ఈవెంట్లో భారత్‌కే చెందిన ఓంప్రకాశ్‌తో కలిసి మనూ విజేతగా నిలిచింది. ఐదు జోడీలు పాల్గొన్న ఫైనల్లో మనూ–ఓంప్రకాశ్ ద్వయం 476.1 పాయింట్లు స్కోరు చేసి అగ్రస్థానంలో నిలిచింది. సాండ్రా రీట్జ్–క్రిస్టియన్ రీట్జ్ (జర్మనీ–475.2 పాయింట్లు) జంట రజతం... సెలైన్ గొబెర్‌విలె–ఫ్లోరియన్ ఫౌక్వెట్ (ఫ్రాన్స్–415.1 పాయింట్లు) జోడీకి కాంస్యం లభించాయి. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ ఈవెంట్లో భారత్‌కే చెందిన మెహులీ ఘోష్–దీపక్ కుమార్ ద్వయం కాంస్యం సాధించింది. ఫైనల్లో మెహులీ–దీపక్ జంట 435.1 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది. ఇప్పటివరకు ఈ టోర్నీలో భారత్ మూడు స్వర్ణాలు, నాలుగు కాంస్యాలతో కలిపి ఏడు పతకాలతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. -
ఏ 'మను' వర్ణించను!
గ్వాడలహారా (మెక్సికో): ప్రపంచ కప్ షూటింగ్లో మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్ పోరు... భారత్‌కు చెందిన 16 ఏళ్ల మను భాకర్ ఒకవైపు... సొంతగడ్డపై ఆడుతున్న 32 ఏళ్ల సీనియర్ అలెజాండ్రా జవాలా మరోవైపు... ఇద్దరి గత రికార్డు చూస్తే అసలు జవాలాకు మనూ పోటీనే కాదు. ఇంత పెద్ద టోర్నీలో తొలిసారి భారత షూటర్ బరిలోకి దిగితే, ఇప్పటికే రెండు ప్రపంచ కప్‌లలో స్వర్ణాలు గెలిచి, రియో ఒలింపిక్స్‌లో నాలుగో స్థానంలో నిలిచిన ఘనత జవాలా సొంతం! 24 షాట్ల ఫైనల్లో 23 షాట్లు ముగిసేసరికి 1.3 పాయింట్ ముందంజలో ఉన్న మెక్సికో క్రీడాకారిణి దాదాపు విజయాన్ని ఖాయం చేసుకుంది. అయితే ఆఖరి షాట్లో తీవ్రమైన ఒత్తిడిని అధిగమించి మను 10.6 స్కోరు సాధిస్తే... జవాలా తడబడి 8.8 పాయింట్లకే పరిమితమైంది. ఫలితంగా ప్రపంచ కప్ షూటింగ్లో స్వర్ణం సాధించిన అతి పిన్న వయస్కురాలిగా మను భాకర్ నిలిచింది. మొత్తం 237.5 పాయింట్లతో ఆమె అగ్రస్థానం సాధించగా... జవాలా (237.1 పాయింట్లు) రజతం, సెలిన్ గోబర్‌విలే (ఫ్రాన్స్–217 పాయింట్లు) కాంస్యం గెల్చుకున్నారు. ఇదే విభాగంలో భారత్‌కే చెందిన యశస్విని సింగ్ (196.1 పాయింట్లు) నాలుగో స్థానంలో నిలిచింది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో భారత షూటర్ రవికుమార్ కాంస్య పతకం సాధించాడు. ప్రపంచకప్‌లో అతనికి ఇదే తొలి పతకం కావడం విశేషం. ఈ పోటీలో రవికుమార్ 226.4 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచాడు. ప్రపంచ నంబర్‌వన్ ఇస్త్వాన్ పెనీ (హంగేరీ– 249.5 పాయింట్లు) స్వర్ణం సాధించగా, అలెగ్జాండర్ షిర్ల్ (ఆస్ట్రియా–248.7 పాయింట్లు) రజత పతకం గెలుచుకున్నాడు. భారత్‌కు చెందిన దీపక్ కుమార్ నాలుగో స్థానంలో నిలిచి నిరాశగా వెనుదిరిగాడు. ఇప్పటివరకు ఈ టోర్నీలో జరిగిన నాలుగు ఈవెంట్స్‌లోనూ భారత్‌కు పతకాలు రావడం విశేషం. ఆరేళ్ల వయసులో బాక్సింగ్ సాధన, ఆరు నెలలు తిరిగే సరికి హరియాణా సబ్ జూనియర్ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం... స్కేటింగ్‌లో రాష్ట్ర చాంపియన్, అథ్లెటిక్స్‌లోనూ పతకాలు... టాంగ్ టా మణిపూర్ మార్షల్ ఆర్ట్స్‌లో జాతీయ స్థాయిలో స్వర్ణం, ఆపై కరాటేలో కూడా మరో పతకం... ఇంతే కాదు, క్రికెట్, కబడ్డీ, టెన్నిస్, స్విమ్మింగ్... ఒక్కటేమిటి ఆ అమ్మాయి ఆడని ఆట లేదు. 16 ఏళ్ల వయసుకే మను భాకర్ స్పోర్ట్స్ రికార్డు ఇది. షూటింగ్‌ను ప్రారంభించింది ఏప్రిల్ 2016లో... జూన్ 2017కు వచ్చేసరికి జూనియర్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో పోటీల బరిలో... ఏడాది కూడా కాక ముందే సీనియర్ ప్రపంచకప్‌లో స్వర్ణ పతకం... మను అనూహ్య ప్రస్థానమిది. మెరైన్ ఇంజినీర్ అయిన తండ్రి ప్రోత్సాహంతో అన్ని ఆటలు ఆడేసి సత్తా చాటిన ఈ అమ్మాయి ఇప్పుడు షూటింగ్లో అంతర్జాతీయ యవనికపై మెరిసి శిఖరాన నిలిచింది. హరియాణాలోని ఝజ్జర్ జిల్లా గోరియా గ్రామం మను స్వస్థలం. వేర్వేరు ఆటల్లో సత్తా చాటుతూ పోయిన ఈ అమ్మాయి బాక్సింగ్ ఆడే సమయంలో కంటికి స్వల్ప గాయమైంది. దాంతో ఆందోళన చెందిన ఆమె తల్లి ఇలాంటి ప్రమాదకరమైన ఆటలు ఇక చాలు అని గట్టిగా చెప్పడంతో షూటింగ్ వైపు మళ్లింది. ఝజ్జర్‌లోని యూనివర్సల్ సీనియర్ సెకండరీ స్కూల్లో ఆమె షూటింగ్లో శిక్షణ పొందింది. సహజ ప్రతిభ, ఎక్కడ అడుగు పెట్టినా గెలవాలనే పట్టుదల వెరసి మను ఒక్కసారిగా దూసుకుపోయింది. 2017 సంవత్సరం మను కెరీర్‌కు సంబంధించి తొలి ఏడాది మాత్రమే. అయితేనేం ఆమె అన్ని విధాలా తన ముద్ర చూపించింది. జాతీయ స్థాయి జూనియర్ అండ్ యూత్ కేటగిరిలో తొలి స్వర్ణంతో ఆమె ప్రస్థానం మొదలైంది. ఆ తర్వాత జపాన్‌లో జరిగిన ఆసియా ఎయిర్‌గన్ చాంపియన్ షిప్లో రజతం సాధించింది. ఇక డిసెంబర్లో జరిగిన సీనియర్ నేషనల్స్లోనైతే వరుసగా రికార్డులు బద్దలు కొట్టి పతకాల వెల్లువతో సంచలనం సృష్టించింది. గత నెలలో జరిగిన ‘ఖేలో ఇండియా’ పోటీల్లో రెండు జూనియర్ జాతీయ రికార్డులు బద్దలు కొట్టిన మను... కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొనే 27 మంది సభ్యుల భారత జట్టులోకి ఎంపికైంది. ఇప్పుడు తాజా ప్రదర్శన ఆమె స్థాయిని మరింత పెంచింది. ‘మా అమ్మాయి ఏ ఆట ఆడినా ఏనాడూ వద్దనలేదు. తనపై మాకు అంత గట్టి నమ్మకం ఉండేది. రూ.1 లక్ష 40 వేలతో ఆమెకు తొలిసారి గన్ కొనిచ్చిన రోజు నాకు బాగా గుర్తుంది. ఈ రోజు ఆమె సాధించిన ఘనత ముందు ఆ విలువ ఏమాత్రం ఎక్కువగా అనిపించడం లేదు’ అని ఆమె తండ్రి రామ్ కిషన్ గర్వంగా అన్నారు. చదువులోనూ ఎక్కడగా తగ్గని మను పదో తరగతి పరీక్షల్లో 10 సీజీపీఏ సాధించడం విశేషం. క్రీడల్లో ఉండేవారు సాధారణంగా ఎంచుకునే సులువైన సబ్జెక్ట్‌లకు భిన్నంగా మెడిసిస్ పూర్తి చేయాలనేది ఆమె లక్ష్యం. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో తమ కూతురు సత్తా చాటుతుందని ఆమె తల్లి సుమేధ ఆత్మవిశ్వాసంతో చెబుతోంది. సంచలన షూటర్... మను భాకర్ సత్తా ఏమిటో గత డిసెంబర్లో తిరువనంతపురంలో జరిగిన సీనియర్ నేషనల్స్ చాంపియన్‌షిప్‌లోనే అందరికీ తెలిసింది. ఈ ఈవెంట్లో మను ఏకంగా 9 స్వర్ణాలు సహా మొత్తం 15 పతకాలు సాధించింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో సీనియర్ హీనా సిద్ధును ఓడించిన మను... ఈ క్రమంలో హీనా పేరిట సుదీర్ఘ కాలంగా ఉన్న అత్యధిక పాయింట్ల (240.6 పాయింట్లు) జాతీయ రికార్డును కూడా బద్దలు కొట్టి స్వర్ణం నెగ్గింది. తొలి ప్రపంచకప్‌లోనే స్వర్ణం గెలుచుకోవడం చాలా సంతోషంగా ఉంది. రాబోయే రోజుల్లో వివిధ పోటీల్లో నా ప్రదర్శన మరింత మెరుగ్గా ఉండేలా ప్రయత్నిస్తా – మను భాకర్ -
సంగ్రామ్‌కు రజతం... అమన్‌కు కాంస్యం
న్యూఢిల్లీ: వరుసగా రెండు రోజుల వైఫల్యం తర్వాత భారత షూటర్లు మళ్లీ మెరిశారు. సీజన్ ముగింపు టోర్నమెంట్ వరల్డ్ కప్ షూటింగ్ ఫైనల్స్‌లో సంగ్రామ్ దహియా, అమన్‌ప్రీత్ సింగ్ గురికి భారత్ ఖాతాలో రెండు పతకాలు చేరాయి. పురుషుల ‘డబుల్ ట్రాప్’ ఈవెంట్లో సంగ్రామ్ రజత పతకం సాధించగా... పురుషుల 50 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో అమన్‌ప్రీత్ సింగ్ కాంస్య పతకాన్ని దక్కించుకున్నాడు. వరల్డ్ కప్ ఫైనల్స్ టోర్నీలో తొలిసారి పాల్గొంటున్న వీరిద్దరు పతకాలు నెగ్గడం విశేషం. ఆరుగురు పాల్గొన్న డబుల్ ట్రాప్ ఫైనల్లో సంగ్రామ్ 76 పాయింట్లు స్కోరు చేసి రెండో స్థానంలో నిలువగా... హు బిన్‌యువాన్ (చైనా–79 పాయింట్లు) ప్రపంచ రికార్డు సృష్టించడంతోపాటు స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు. గాస్‌పరానీ దవీ (ఇటలీ–56 పాయింట్లు) కాంస్య పతకాన్ని సంపాదించాడు. భారత్‌కే చెందిన ప్రపంచ నంబర్‌వన్ అంకుర్ మిట్టల్ 45 పాయింట్లతో నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నాడు. 50 మీటర్ల పిస్టల్ ఈవెంట్ ఫైనల్లో అమన్‌ప్రీత్ సింగ్ 202.2 పాయింట్లు సాధించి మూడో స్థానంలో నిలిచాడు. భారత్‌కే చెందిన స్టార్ షూటర్ జీతూ రాయ్ 123.2 పాయింట్లు స్కోరు చేసి ఎనిమిదో స్థానంతో సంతృప్తి పడ్డాడు. మికెక్ (సెర్బియా–229.3 పాయింట్లు), ఒమ్లెచుక్ (ఉక్రెయిన్–228 పాయిం ట్లు) స్వర్ణ, రజత పతకాలు నెగ్గారు. -
స్వదేశంలో భారత షూటర్లకు చేదు అనుభవం
న్యూఢిల్లీ: ప్రపంచకప్ షూటింగ్లో పాల్గొని స్వదేశానికి వచ్చిన భారత షూటర్లకు విమానాశ్రయంలో చేదు అనుభవం ఎదురైంది. వారి దగ్గరున్న గన్స్, మందుగుండు క్లియరెన్స్ కోసం ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయ కస్టమ్స్ అధికారులు దాదాపు పది గంటలపాటు వారిని నిరీక్షించేలా చేశారు. చైన్ సింగ్, గుర్ప్రీత్ సింగ్, హీనా సిద్ధూ, కైనన్ చెనాయ్ తదితరులతో కూడిన 13 మంది బృందం సైప్రస్ నుంచి మంగళవారం ఉదయం 5 గంటలకు ఇక్కడికి చేరుకున్నారు. అయితే క్లియరెన్స్ పేరిట అధికారులు వీరిని మధ్యాహ్నం 2.30కి బయటికి వదిలారు. ఈ ఉదంతంపై దిగ్గజ షూటర్ అభినవ్ బింద్రా ఘాటుగా స్పందించాడు. ‘ఎయిర్పోర్ట్ అధికారులు వారి గన్లకు క్లియరెన్స్ ఇవ్వకపోవడం దారుణం. అసోసియేషన్ నుంచి ఎలాంటి మద్దతు లభించకపోవడం బాధించింది. అసలు భారత క్రికెటర్లు ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితి ఎదుర్కొన్నారా?’ అని బింద్రా ప్రశ్నించాడు. -
భారత షూటర్లకు అవమానం
న్యూఢిల్లీ : ప్రపంచకప్ షూటింగ్లో పాల్గొన్న భారత షూటర్లు బ్యాంకాక్ విమానాశ్రయంలో అవమానకర పరిస్థితి ఎదుర్కొన్నారు. అక్కడి నుంచి ముంబైకి రావాల్సిన హీనా సిద్ధూ, అంజలీ భగవత్ తమ దగ్గరున్న ఆయుధాలకు సరైన పత్రాలు చూపని కారణంగా అధికారులు విమానం ఎక్కకుండా అడ్డుకున్నారు. అయితే వీరి ప్రవర్తనపై షూటర్లు అభ్యంతరం తెలిపారు. తమ దగ్గర అన్ని అనుమతులున్నా అడ్డుకున్నారని ఆరోపించారు. ‘మా దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నా కూడా బ్యాంకాక్‌లోని జెట్ ఎయిర్వేస్ సెక్యూరిటీ మేనేజర్ మమ్మల్ని విమానంలో ఎక్కకుండా అడ్డుకున్నాడు. అతడు దీన్ని ఇగో సమస్యగా తీసుకున్నాడు. డీజీసీఏ అనుమతి, కస్టమ్స్ క్లియరెన్స్ లేఖ చూపినా పట్టించుకోలేదు’ అని హీనా సిద్ధూ తెలిపింది. అనంతరం జాతీయ రైఫిల్స్ సంఘం జోక్యంతో వారిద్దరు ఎయిరిండియా విమానంలో తిరిగి స్వదేశానికి చేరారు. -
గగన్‌కు నిరాశ
వరల్డ్‌కప్ షూటింగ్ ఫైనల్స్ గబాలా (అజర్బైజాన్): వరల్డ్ కప్ షూటింగ్ ఫైనల్స్‌లో భారత షూటర్ గగన్ నారంగ్ నిరాశపరిచాడు. సోమవారం ముగిసిన ఈ టోర్నీలో పురుషుల 50 మీటర్ల రైఫిల్ ప్రోన్ ఈవెంట్లో గగన్ 144.7 పాయింట్లు స్కోరు చేసి ఐదో స్థానంతో సరిపెట్టుకున్నాడు. డానియల్ బ్రాడ్మియర్ (జర్మనీ-210.5 పాయింట్లు) స్వర్ణం సాధించగా... షెంగ్బో జావో (చైనా-208.5 పాయింట్లు), హెన్రీ జుంగనెల్ (జర్మనీ-187.9 పాయింట్లు) వరుసగా రజత, కాంస్య పతకాలు నెగ్గారు. పురుషుల 50 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో జీతూ రాయ్ త్రుటిలో కాంస్య పతకాన్ని చేజార్చుకున్నాడు. ఈ ఏడాది అద్భుత ఫామ్‌లో ఉన్న జీతూ రాయ్ ఫైనల్స్‌లో మాత్రం తడబడ్డాడు. అతను 150.7 పాయింట్లు సాధించి నాలుగో స్థానంలో నిలిచాడు. జీవీ వాంగ్ (చైనా-195.8 పాయింట్లు), తొమొయుకి మత్సుదా (జపాన్-194.8 పాయింట్లు), పాంగ్ వీ (చైనా-170.1 పాయింట్లు) వరుసగా స్వర్ణ, రజత, కాంస్య పతకాలను గెల్చుకున్నారు. సీజన్లో నాలుగు వరల్డ్ కప్‌లలో రాణించి టాప్-8లో ఉన్న వారు ఈ ఫైనల్స్‌లో పాల్గొన్నారు. ఓవరాల్‌గా భారత్‌కు ఈ మెగా ఈవెంట్లో ఒక్క పతకమూ రాలేదు. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్‌లో అయోనిక పాల్ నాలుగో స్థానం పొందగా... 10 మీటర్ల ఎయిర్ పిస్టల్‌లో హీనా సిద్ధూ క్వాలిఫయింగ్ దశలోనే నిష్ర్కమించింది. పురుషుల ట్రాప్ ఈవెంట్లో ‘షూట్ ఆఫ్’లో మానవ్‌జిత్ సింగ్ సంధూ కాంస్య పతకాన్ని కోల్పోగా... పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో జీతూ రాయ్ ఐదో స్థానాన్ని దక్కించుకున్నాడు. -
జీతూ రాయ్‌కి రజతం
ప్రపంచకప్ షూటింగ్ మ్యూనిచ్: భారత నంబర్‌వన్ పిస్టల్ షూటర్ జీతూ రాయ్.. ప్రపంచకప్ షూటింగ్లో రజత పతకం సాధించాడు. బుధవారం జరిగిన పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్ ఫైనల్స్‌లో జీతూ 199.4 స్కోరుతో రెండో స్థానంలో నిలిచాడు. స్పెయిన్‌కు చెందిన పాబ్లో కారెరా 201.3 స్కోరుతో స్వర్ణం గెలుచుకోగా, ఉక్రెయిన్ షూటర్ పావ్లో కొరోస్టయిలోవ్ కాంస్యం దక్కించుకున్నాడు. ఇక పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ ఈవెంట్ క్వాలిఫయింగ్స్‌లో లండన్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత గగన్ నారంగ్ 8వ స్థానం పొందాడు. -
హీనాకు రజతం
ప్రపంచకప్ షూటింగ్ న్యూఢిల్లీ: భారత స్టార్ ఎయిర్ పిస్టల్ షూటర్ హీనా సిద్ధూ అమెరికాలో జరుగుతున్న ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచకప్‌లో రజత పతకం సాధించింది. అర్హత రౌండ్లో 400కు 386 పాయింట్లు స్కోరు చేసిన ఆమె ఫైనల్లో 200.8 స్కోరు నమోదు చేసి రెండో స్థానాన్ని దక్కించుకుంది. అంటొనెటా బెనోవా (బల్గేరియా-203.6 పాయింట్లు) స్వర్ణం... జొరానా అరునోవిక్ (సెర్బియా-180.9 పాయింట్లు) కాంస్యం సాధించారు. హీనాకు వరుసగా ఇది మూడో అంతర్జాతీయ పతకం కావడం విశేషం. గత నెలలోనే కువైట్‌లో జరిగిన ఆసియా ఎయిర్‌గన్ చాంపియన్‌షిప్‌లో హీనా స్వర్ణం సాధించింది. దీంతో ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలో ఉన్న హీనా టాప్ ర్యాంకుకు చేరువైంది.