
న్యూఢిల్లీ: వరుసగా రెండు రోజుల వైఫల్యం తర్వాత భారత షూటర్లు మళ్లీ మెరిశారు. సీజన్ ముగింపు టోర్నమెంట్ వరల్డ్ కప్ షూటింగ్ ఫైనల్స్‌లో సంగ్రామ్ దహియా, అమన్‌ప్రీత్ సింగ్ గురికి భారత్ ఖాతాలో రెండు పతకాలు చేరాయి. పురుషుల ‘డబుల్ ట్రాప్’ ఈవెంట్‌లో సంగ్రామ్ రజత పతకం సాధించగా... పురుషుల 50 మీటర్ల పిస్టల్ ఈవెంట్‌లో అమన్‌ప్రీత్ సింగ్ కాంస్య పతకాన్ని దక్కించుకున్నాడు. వరల్డ్ కప్ ఫైనల్స్ టోర్నీలో తొలిసారి పాల్గొంటున్న వీరిద్దరు పతకాలు నెగ్గడం విశేషం. ఆరుగురు పాల్గొన్న డబుల్ ట్రాప్ ఫైనల్లో సంగ్రామ్ 76 పాయింట్లు స్కోరు చేసి రెండో స్థానంలో నిలువగా... హు బిన్‌యువాన్ (చైనా–79 పాయింట్లు) ప్రపంచ రికార్డు సృష్టించడంతోపాటు స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు.
గాస్‌పరానీ దవీ (ఇటలీ–56 పాయింట్లు) కాంస్య పతకాన్ని సంపాదించాడు. భారత్‌కే చెందిన ప్రపంచ నంబర్‌వన్ అంకుర్ మిట్టల్ 45 పాయింట్లతో నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నాడు. 50 మీటర్ల పిస్టల్ ఈవెంట్ ఫైనల్లో అమన్‌ప్రీత్ సింగ్ 202.2 పాయింట్లు సాధించి మూడో స్థానంలో నిలిచాడు. భారత్‌కే చెందిన స్టార్ షూటర్ జీతూ రాయ్ 123.2 పాయింట్లు స్కోరు చేసి ఎనిమిదో స్థానంతో సంతృప్తి పడ్డాడు. మికెక్ (సెర్బియా–229.3 పాయింట్లు), ఒమ్లెచుక్ (ఉక్రెయిన్–228 పాయిం ట్లు) స్వర్ణ, రజత పతకాలు నెగ్గారు.