
రియో డి జనీరో: ప్రపంచకప్ షూటింగ్ టోర్నీలో భారత్ ఖాతాలో తొలి స్వర్ణ పతకం చేరింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్‌లో భారత షూటర్ ఇలవేనిల్ వలారివన్ విజేతగా నిలిచి బంగారు పతకాన్ని సాధించింది. ఎనిమిది మంది షూటర్ల మధ్య ఎలిమినేషన్ పద్ధతిలో జరిగిన ఫైనల్లో తమిళనాడుకు చెందిన 24 ఏళ్ల ఇలవేనిల్ 252.2 పాయింట్లు స్కోరు చేసి అగ్రస్థానంలో నిలిచింది.
క్వాలిఫయింగ్‌లో ఇలవేనిల్ 630.5 పాయింట్లు స్కోరు చేసి ఎనిమిదో స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించింది. ఓవరాల్‌గా ప్రపంచకప్ టోరీ్నలలో ఇలవేనిల్‌కిది ఐదో స్వర్ణ పతకం. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో భారత షూటర్ సందీప్ సింగ్ 628.2 పాయింట్లు సాధించి 14వ స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత పొందలేకపోయాడు.