Major ports
-
79 కోట్ల టన్నుల కార్గో
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ప్రధాన నౌకాశ్రయాల నుంచి గత ఆర్థిక సంవత్సరంలో 79.5 కోట్ల టన్నుల సరుకు రవాణా జరిగింది. వాటాల విక్రయం ద్వారా రూ.3,700 కోట్లు సాధించాలన్న లక్ష్యాన్ని మించి రూ.5,000 కోట్ల విలువైన రవాణా లావాదేవీలు జరిగాయని మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్, వాటర్‌వేస్ సెక్రటరీ సుధాన్‡్ష పంత్ వెల్లడించారు. 2021–22తో పోలిస్తే సరుకు రవాణా గత ఆర్థిక సంవత్సరంలో 10.4 శాతం అధికంగా జరిగిందని తెలిపారు. పోర్ట్స్, షిప్పింగ్, వాటర్‌వేస్ మంత్రి సర్వానంద సోనోవాల్ గ్రీన్ పోర్ట్ మార్గదర్శకాలను వచ్చే వారం విడుదల చేయనున్నట్టు చెప్పారు. భారత్‌లో ప్రధాన నౌకాశ్రయాల్లో దీనదయాల్ (కాండ్లా), ముంబై, మార్మగోవా, న్యూ మంగళూరు, కొచ్చిన్, చెన్నై, ఎన్నోర్ (కామరాజార్), ట్యూటికోరిన్, విశాఖపట్నం, పారదీప్, కోల్‌కత (హాల్దియాతో కలిపి), జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ ఉన్నాయి. స్వల్పంగా పెరిగిన వాటా.. ప్రధానేతర పోర్టులతో పోలిస్తే చాలా ఏళ్ల తర్వాత మేజర్ పోర్టులు అధిక వార్షిక వృద్ధి రేటు నమోదు చేశాయని పంత్ తెలిపారు. ‘ప్రధానేతర పోర్టులు రాష్ట్ర ప్రభుత్వాలచే నిర్వహించబడతాయి. చాలా రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాంటి ఓడరేవులను ప్రైవేట్ భాగస్వాములకు లీజుకు ఇచ్చాయి. సరుకు రవాణాలో నాన్–మేజర్ పోర్టులు 8.5–9 శాతం వృద్ధి చెందాయి. మొత్తం కార్గోలో ప్రధాన పోర్టుల వాటా 54 నుంచి 55 శాతానికి, నాన్–మేజర్ పోర్టుల వాటా 46 నుంచి 45 శాతానికి వచ్చి చేరింది. ప్రధాన పోర్టులకు 1 శాతం మార్పు కూడా చాలా ముఖ్యమైన విజయం. ఎందుకంటే చాలా సవాళ్లు ఉన్నప్పటికీ ఇవి తమ వాటాను పెంచుకున్నాయి. జలమార్గాల ద్వారా సరుకు రవాణా 16 శాతం ఎగసి 12.6 కోట్ల టన్నులకు చేరింది. ప్రధాన పోర్టులకు వచ్చిన నౌక పని ముగించుకుని వెళ్లేందుకు అయ్యే సమయం 3–4 గంటలు తగ్గింది’ అని వివరించారు. -
సముద్ర వాణిజ్యంలో అగ్రగామిగా..
ఎంవీపీకాలనీ (విశాఖ తూర్పు): తూర్పుతీరంలో సముద్ర వాణిజ్యంలో అన్నివేళల బలమైన శక్తిగా ఆంధ్రప్రదేశ్ నిలుస్తోంది. బంగాళాఖాతం వెంబడి ఉన్న అనేక నగరాలను దాటుకొని వాణిజ్యం, రక్షణ అంశాల్లో తూర్పు తీరం అగ్రగామిగా నిలుస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న మేజర్ పోర్టుల కేటగిరీలో సైతం విశాఖ ప్రత్యేక చాటుతోంది. వాణిజ్య పరంగా పోర్టు నుంచి రికార్డు స్థాయిలో సరుకు రవాణా సాగిస్తోంది. దశాబ్దాలుగా వాణిజ్య సామర్థ్యాన్ని పెంచుకుంటూ ముందుకు సాగుతోంది. నేడు జాతీయ మారిటైం దినోత్సవాన్ని పురస్కరించుకొని సముద్ర వాణిజ్యం, రక్షణ రంగాల్లో పటిష్టమవుతున్న విశాఖ ఖ్యాతిపై ప్రత్యేక కథనం. విశాఖ ఓడరేవును లార్డ్ విల్లింగ్డన్ 1933, డిసెంబర్19న ప్రారంభించారు. రూ 3.78 కోట్లు వ్యయంతో ఈ ఓడరేవు నిర్మించారు. ప్రారంభంలో 3 బెర్త్‌లతో ఏడాదికి 1.3 లక్షల టన్నుల సరుకు రవాణా చేసిన ఈ ఓడరేవు ప్రస్తుతం 24 బెర్త్‌లతో 65 మిలియన్ టన్నుల సరుకు రవాణాతో అభివృద్ధిలో దూసుకుపోతోంది. ప్రస్తుతం 974 కిలోమీటర్లు సుదీర్ఘ సముద్రతీరం ఉన్న ఆంధ్రప్రదేశ్ మారిటైం బోర్డు పరిధిలో 13 నాన్ మేజర్ పోర్టులు ఉన్నాయి. దీంతో పాటు ఏపీలో విశాఖపట్నం పోర్టు ఏకైక మేజర్ పోర్టుగా నిలిచింది. రక్షణ రంగంలో బలమైన శక్తిగా: రక్షణ పరంగా తూర్పు నావికదళం విశాఖ కేంద్రంగా బలమైన శక్తిగా ఎదుగుతోంది. 1968లో ఆవిర్భవించిన తూర్పు నావికాదళం క్రమంగా తూర్పు సముద్ర జలాల్లో అగ్రగామిగా నిలిచింది. దేశంలో తొలిగా నిర్మించిన అణుజలంతర్గామి ఐఎన్ఎస్ అరిహంత్ విశాఖలో తయారు చేయడం విశాఖకు తీరానికి గర్వకారణంగా నిలుస్తోంది. 1992 నుంచి జరుగుతున్న మలబార్ విన్యాసాలకు తూర్పు తీరం అనేక సార్లు అతిథ్యమిచ్చింది. తూర్పునావికాదళం విశిష్టతను పెంచేలా ప్రెసిడెంట్ ప్లీట్ రివ్యూలకు విశాఖను వేదికగా నిలిచింది. తూర్పున ఏపీకి అగ్రస్థానం.. భారత పోర్ట్స్, షిప్పింగ్స్, వాటర్‌వేవ్స్ మంత్రిత్వశాఖ లెక్కల ప్రకారం నాన్ మేజర్ పోర్టుల కేటగిరీలో 2021–22 ఏడాదికి గాను ఓవర్సీస్ కార్గో ట్రాఫిక్‌లో ఆంధ్రప్రదేశ్ మారిటైం బోర్డు 2వ స్థానంలో నిలిచింది. 70.7శాతం వాటాతో 324.43 మిలియన్ టన్నుల లావాదేవీలతో గుజరాత్ తొలిస్థానంలో ఉండగా 14.8 శాతం వాటాతో ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో నిలిచింది. తరువాతి స్థానాల్లో 7.7 శాతం వాటాతో ఒడిశా, 4.2 శాతం వాటాతో మహారాష్ట్ర రాష్ట్రాలు ఉన్నాయి. అయితే కోస్టల్ కార్గో ట్రాఫిక్‌లో ఏపీ మూడో స్థానంలో నిలిచింది. 51.7 శాతం వాటాతో 41.27 మిలియన్ టన్నుల లావాదేవీలతో గుజరాత్ తొలిస్థానంలో నిలవగా 28.3 శాతం వాటాతో మహారాష్ట్ర 2వ స్థానంలోను 14.4 శాతం వాటాతో ఏపీ మారిటైమ్ బోర్డు మూడో స్థానంలో నిలిచాయి. తూర్పున బే ఆఫ్ బెంగాల్లో కార్గో వాణిజ్యంలో ఆంధ్రప్రదేశ్‌కు అగ్రస్థానం లభించింది. -
ప్రధాన పోర్టుల్లో పడిపోయిన రవాణా
న్యూఢిల్లీ: దేశంలోని 12 ప్రధాన నౌకాశ్రయాల్లో (పోర్టులు) కార్గో రద్దీ(నౌకా రవాణా) సెప్టెంబర్ నెలలోనూ క్షీణతను నమోదు చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో నౌకా రవాణా (ఏప్రిల్–సెప్టెంబర్) 14 శాతం తగ్గి 298.55 మిలియన్ టన్నులుగా (ఎంటీ) నమోదైంది. ఈ వివరాలను పోర్టుల అసోసియేషన్ (ఐపీఏ) తెలిపింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో 348 ఎంటీల రవాణా నమోదు కావడం గమనార్హం. మార్చి నుంచి నౌకా రవాణా 12 పోర్టుల్లో చెప్పుకోతగినంత పడిపోయిందని, కరోనా వైరస్సే కారణమని షిప్పింగ్ శాఖా మంత్రి మన్ సుఖ్ మాండవీయ పేర్కొన్నారు. ఒక్క మర్ముగావో పోర్ట్ మినహాయించి మిగిలిన ప్రధాన పోర్టులు అన్నింటిలోనూ సెప్టెంబర్ వరకు రవాణా ప్రతికూలంగానే ఉంది. నౌకాశ్రయాల వారీగా పరిశీలిస్తే.. కామరాజర్ పోర్ట్ (ఎన్నోర్)లో రవాణా ఏప్రిల్–సెప్టెంబర్ కాలంలో 32 శాతం మేర పడిపోయి 10.77 ఎంటీలుగా ఉంది. అదే విధంగా చెన్నై నౌకాశ్రయంలో 26 శాతం వరకు తగ్గి 18.38 ఎంటీలుగా నమోదైంది. కొచ్చిన్ పోర్టులో 24 శాతం తగ్గి 12.58 ఎంటీలుగా ఉండగా.. జేఎన్ పీటీలో నౌకా రవాణా పరిమాణం 22 శాతం మేర తగ్గి 27 మిలియన్ టన్నులుగా నమోదైంది. కోల్‌కతా పోర్టులో 19 శాతం క్షీణించి 25.56 ఎంటీలుగా, ముంబై పోర్టులో 19 శాతం తగ్గి 24.45 ఎంటీలుగా ఉంది. కేంద్ర ప్రభుత్వం నిర్వహణలోని 12 ప్రధాన పోర్టుల్లో దీనదయాళ్ (కాండ్లా), ముంబై, జేఎన్ పీటీ, మర్ముగావో, న్యూ మంగళూరు, కొచ్చిన్, చెన్నై, కామరాజర్ (ఎన్నోర్), వీవో చిదంబర్ నార్, విశాఖపట్నం, పారదీప్, కోల్‌కతా (హాల్దియా కలిపి) ఉన్నాయి. -
కార్గో హ్యాడ్లింగ్లో 12 ప్రధాన పోర్ట్‌ల రికార్డ్
► సత్ఫలితాలిచ్చిన చర్యలు ► షిప్పింగ్ మంత్రి గడ్కరీ న్యూఢిల్లీ: భారత్‌లోని 12 ప్రధాన ఓడరేవులు గడిచిన ఆర్థిక సంవత్సరంలో రికార్డ్‌స్థాయిలో కార్గో హ్యాడ్లింగ్ చేశాయి. ప్రభుత్వ ఆధీనంలోని ఈ ప్రధాన పోర్ట్‌ల పనితీరు మెరుగుపరచడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలు సత్ఫలితాలు ఇచ్చాయని కేంద్ర షిప్పింగ్ రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. ఈ 12 మేజర్ పోర్ట్‌లు 2016–17 ఆర్థిక సంవత్సరంలో 647.43 మిలియన్ టన్నుల కార్గోను హ్యాండిల్ చేశాయని, ఈ సంవత్సరం 6.8 శాతం వార్షిక వృద్ధి నమోదైందని తెలియజేశారు. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరంలో 4.3 శాతం వృద్ధి సాధించామని చెప్పారాయన. గత ఆర్థిక సంవత్సరంలో ప్రైవేట్ పోర్ట్‌లు 4 శాతం వృద్ధి మాత్రమే సాధించాయని తెలిపారు. అగ్రస్థానంలో కాండ్లా పోర్ట్: అన్ని ప్రధాన పోర్ట్‌లలో కాండ్లా పోర్ట్ అత్యధికంగా కార్గోను హ్యాండిల్ చేసిందని గడ్కరీ తెలిపారు. 105.44 మిలియన్ టన్నులతో కాండ్లా పోర్ట్ మొదటి స్థానంలో నిలిచిందన్నారు. 88.95 మిలియన్ టన్నులతో పారదీప్ పోర్ట్, 63.05 మిలియన్ టన్నులతో ముంబై పోర్ట్‌లు రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయని తెలియజేశారు. కమోడిటీల విషయానికొస్తే, ఇనుప ఖనిజం ట్రాఫిక్ బాగా పెరిగిందన్నారు. ఇనుప ఖనిజం ట్రాఫిక్ 164 శాతం పెరిగిందని, పెట్రోలియమ్, ఆయిల్, లూబ్రికెంట్స్ 8 శాతం, ఇతర సాధారణ కార్గో 19 శాతం చొప్పున పెరిగాయని వివరించారు. అంతర్జాతీయ ప్రమాణాలు అందుకునేలా ఈ పోర్ట్‌లను అభివృద్ధి చేశామని చెప్పారు. భారత్‌లో మొత్తం 12 ప్రధాన పోర్ట్‌లున్నాయి. కాండ్లా, ముంబై, జవహర్ లాల్ నెహ్రూ పోర్ట్, మర్మగోవా, న్యూ మంగళూర్, కొచ్చిన్, చెన్నై, ఎన్నోర్, వి ఓ చిదంబరనార్, విశాఖ పట్టణం, పారదీప్, కోల్‌కత(హల్డియాను కలుపుకొని) పోర్ట్‌లున్నాయి.