కార్గో హ్యాడ్లింగ్‌లో 12 ప్రధాన పోర్ట్‌ల రికార్డ్
► సత్ఫలితాలిచ్చిన చర్యలు
► షిప్పింగ్ మంత్రి గడ్కరీ
న్యూఢిల్లీ: భారత్‌లోని 12 ప్రధాన ఓడరేవులు గడిచిన ఆర్థిక సంవత్సరంలో రికార్డ్‌స్థాయిలో కార్గో హ్యాడ్లింగ్ చేశాయి. ప్రభుత్వ ఆధీనంలోని ఈ ప్రధాన పోర్ట్‌ల పనితీరు మెరుగుపరచడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలు సత్ఫలితాలు ఇచ్చాయని కేంద్ర షిప్పింగ్ రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. ఈ 12 మేజర్ పోర్ట్‌లు 2016–17 ఆర్థిక సంవత్సరంలో 647.43 మిలియన్ టన్నుల కార్గోను హ్యాండిల్ చేశాయని, ఈ సంవత్సరం 6.8 శాతం వార్షిక వృద్ధి నమోదైందని తెలియజేశారు. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరంలో 4.3 శాతం వృద్ధి సాధించామని చెప్పారాయన. గత ఆర్థిక సంవత్సరంలో ప్రైవేట్ పోర్ట్‌లు 4 శాతం వృద్ధి మాత్రమే సాధించాయని తెలిపారు.
అగ్రస్థానంలో కాండ్లా పోర్ట్: అన్ని ప్రధాన పోర్ట్‌లలో కాండ్లా పోర్ట్ అత్యధికంగా కార్గోను హ్యాండిల్ చేసిందని గడ్కరీ తెలిపారు. 105.44 మిలియన్ టన్నులతో కాండ్లా పోర్ట్ మొదటి స్థానంలో నిలిచిందన్నారు. 88.95 మిలియన్ టన్నులతో పారదీప్ పోర్ట్, 63.05 మిలియన్ టన్నులతో ముంబై పోర్ట్‌లు రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయని తెలియజేశారు.
కమోడిటీల విషయానికొస్తే, ఇనుప ఖనిజం ట్రాఫిక్ బాగా పెరిగిందన్నారు. ఇనుప ఖనిజం ట్రాఫిక్ 164 శాతం పెరిగిందని, పెట్రోలియమ్, ఆయిల్, లూబ్రికెంట్స్ 8 శాతం, ఇతర సాధారణ కార్గో 19 శాతం చొప్పున పెరిగాయని వివరించారు. అంతర్జాతీయ ప్రమాణాలు అందుకునేలా ఈ పోర్ట్‌లను అభివృద్ధి చేశామని చెప్పారు. భారత్‌లో మొత్తం 12 ప్రధాన పోర్ట్‌లున్నాయి. కాండ్లా, ముంబై, జవహర్ లాల్ నెహ్రూ పోర్ట్, మర్మగోవా, న్యూ మంగళూర్, కొచ్చిన్, చెన్నై, ఎన్నోర్, వి ఓ చిదంబరనార్, విశాఖ పట్టణం, పారదీప్, కోల్‌కత(హల్డియాను కలుపుకొని) పోర్ట్‌లున్నాయి.