
ముంబై: బీజేపీ సీనియర్ నేత, కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తాజాగా చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. కీలకమైన పార్లమెంటరీ కమిటీ నుంచి ఆయన్ని తప్పించిన తర్వాత రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చ జరిగిన సంగతి తెలిసింది. ఈ క్రమంలో.. అవసరానికి వాడుకుని వదిలేయకూడదంటూ శనివారం నాగ్‌పూర్‌లో జరిగిన పారిశ్రామికవేత్తల కార్యక్రమం వేదికగా గడ్కరీ మాట్లాడటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఒక వ్యక్తి ఓడిపోయినప్పుడు కాదని, తాను పూర్తిగా వదిలేసినప్పుడే అంతమవుతాడని పేర్కొన్నారు.
‘బిజినెస్, సామాజిక పనులు, రాజకీయాల్లో ఉన్న ఎవరికైనా మానవ సంబంధాలే అతిపెద్ద బలం. అయితే, ఎవరూ వాడుకుని వదిలేసే మనస్తత్వంతో వ్యవహరించకూడదు. మంచి, చెడు రెండు సమయంలోనూ పట్టుకున్న చేతిని వదలకూడదు. ఎల్లప్పుడూ పట్టుకునే ఉండాలి. ఉదయించే సూర్యుడిని(ఎదిగే వ్యక్తులను) పూజించొద్దు.’ అని పేర్కొన్నారు గడ్కరీ. స్టూడెంట్ నాయకుడిగా ఉన్న రోజులను గుర్తు చేసుకున్నారు గడ్కరీ. ఆ సమయంలో మంచి భవిష్యత్తు కోసం తనను కాంగ్రెస్‌లో చేరాలని శ్రీకాంత్ జిక్కర్ కోరినట్లు చెప్పారు. అయితే, కాంగ్రెస్ భావజాలం తనకు నచ్చదని, పార్టీలో చేరటం కంటే బావిలో దూకి ఆత్మహత్య చేసుకునేందుకైనా సిద్ధమని చెప్పినట్లు తెలిపారు. యువ పారిశ్రామిక వేత్తలు తమ ఆశలను ఎప్పటికీ వదులుకోవద్దని సూచించారు.
ఇదీ చదవండి: ప్రభుత్వంపై నితిన్ గడ్కరీ వ్యాఖ్యలు.. మరోసారి దుమారం!
Comments
Please login to add a commentAdd a comment