Kandla Port
-
రూ.1,700 కోట్ల హెరాయిన్ పట్టివేత
అహ్మదాబాద్: గుజరాత్లో వేర్వేరు ఘటనల్లో భారీ మొత్తంలో డ్రగ్స్ పట్టుబడ్డాయి. కాండ్లా పోర్టులోని ఓ కంటైనర్ నుంచి రూ.1,439 కోట్ల విలువైన 200 కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజన్స్ (డీఆర్ఐ) అధికారులు సోమవారం వెల్లడించారు. గత సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో ఇరాన్ నుంచి జిప్సమ్ పేరుతో వచ్చిన 17 కంటెయినర్లు ఉత్తరాఖండ్‌లోని ఓ సంస్థకు అందాల్సి ఉందని తెలిపారు. వాటిని తనిఖీ చేయగా 205.6 కిలోల బరువున్న రూ.1,439 కోట్ల విలువైన హెరాయిన్ బయటపడిందని చెప్పారు. ఉత్తరాఖండ్‌కు చెందిన సంస్థ యజమానిని ఎట్టకేలకు అనేక ప్రాంతాల్లో సోదాల అనంతరం పంజాబ్‌లోని ఓ కుగ్రామంలో పట్టుకున్నట్లు చెప్పారు. కాగా, గత ఏడాది సెప్టెంబర్‌లో గుజరాత్‌లోని ముంద్రా పోర్టులో రూ.21వేల కోట్ల విలువైన సుమారు 3 టన్నుల హెరాయిన్ పట్టుబడిన విషయం తెలిసిందే. పాక్ బోటులో రూ.280 కోట్ల హెరాయిన్ పాకిస్తాన్‌కు చెందిన పడవలో అక్రమంగా తరలిస్తున్న రూ.280 కోట్ల విలువైన హెరాయిన్ కచ్ తీరంలో పట్టుబడింది. సోమవారం ఉదయం భారత ప్రాదేశిక జలాల్లోకి అక్రమంగా ప్రవేశించిన అల్ హజ్ అనే పడవను తీరరక్షక దళం, గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ గుర్తించింది. లొంగిపోవాలంటూ చేసిన హెచ్చరికలతో పారిపోయేందుకు ప్రయత్నించగా ఆ పడవలోని వారిపై కాల్పులు జరిపింది. దీంతో అందులోని కనీసం ఇద్దరు గాయపడ్డారని అధికారులు తెలిపారు. అనంతరం, పడవతోపాటు అందులో ఉన్న 56 కిలోల బరువున్న రూ.280 కోట్ల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకుని, 9 మందిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. ఓ ఉత్తరాది రాష్ట్రానికి ఈ నిషేధిత డ్రగ్ చేరాల్సి ఉందని, కరాచీకి చెందిన ముస్తాఫా అనే స్మగ్లరే ఈ రాకెట్ వెనుక ఉండి ఉంటాడని అనుమానిస్తున్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు. -
భారత్‌లోకి ఉగ్ర మూకలు?
భుజ్(గుజరాత్)/కోయంబత్తూరు: కశ్మీర్‌కు స్వతంత్రప్రతిపత్తి రద్దు అనంతరం పాకిస్తాన్‌తో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, ఆ దేశం నుంచి ఉగ్రవాదులు దేశంలోకి దొంగచాటుగా ప్రవేశించే అవకాశాలున్నాయన్న నిఘా వర్గాల హెచ్చరికలతో గుజరాత్ తీరం కచ్ జిల్లాలోని కాండ్లా, ముంద్రా పోర్టులతోపాటు కీలక సంస్థల వద్ద హై అలర్ట్ ప్రకటించారు. ఉగ్ర సంస్థ ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) కేరళ–తమిళనాడు మాడ్యూల్ కార్యకలాపాలపై మరిన్ని వివరాలు రాబట్టేందుకు కోయంబత్తూర్‌లో ఎన్ఐఏ తనిఖీలు చేపట్టింది. పాక్ కమాండోలు సముద్రం మీదుగా భారత్‌లోకి ప్రవేశించి మత విద్వేషాలు సృష్టించడంతోపాటు నీటిలో ఉండి దాడులకు తెగబడే అవకాశాలున్నాయంటూ భారత నేవీ హెచ్చరికలు పంపిన నేపథ్యంలో యంత్రాంగం అప్రమత్తమైంది. కచ్ తీరంలో అదానీ గ్రూప్ ఆధ్వర్యంలో నడుస్తున్న ముంద్రా పోర్టు వద్ద భద్రతను కట్టుదిట్టం చేసింది. దేశంలోని అతిపెద్ద పోర్టుల్లో ఇది ఒకటి కాగా, ప్రభుత్వరంగ కాండ్లా నౌకాశ్రయం ద్వారా పెద్ద మొత్తంలో సరుకు రవాణా జరుగుతుంది. అరేబియా సముద్ర తీరంలోని ఈ రెండు పోర్టులు పాకిస్తాన్‌కు చేరువలో ఉన్నాయి. ఇక్కడికి సమీపంలో జామ్‌నగర్‌లోని ప్రపంచంలోనే అతిపెద్ద రిలయన్స్ చమురుశుద్ధి కర్మాగారం, వడినార్ వద్ద రష్యాకు చెందిన రోస్నెఫ్ట్ ఆయిల్ రిఫైనరీలున్నాయి. ఉగ్రవాదుల చొరబాటుకు అవకాశం ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో కచ్ జిల్లాలోని కాండ్లా పోర్టుతోపాటు కీలక సంస్థల వద్ద భద్రతను భారీగా పెంచాం’ అని ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (బోర్డర్ రేంజ్) డీబీ వఘేలా తెలిపారు. పోలీసులు, మెరైన్ బలగాలు, ఇతర భద్రతా సంస్థలు ఈ ప్రాంతంలో గస్తీని ముమ్మరం చేశాయి. తీరప్రాంత భద్రతా చర్యలను పటిష్టం చేశామని, ఉగ్రవాదులు పాల్పడే ఎలాంటి దుస్సాహసాన్నయినా తిప్పికొట్టేందుకు బలగాలను అప్రమత్తం చేశామని డిప్యూటీ చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ మురళీధర్ పవార్ తెలిపారు. ఐఎస్ లింకులపై ఎన్ఐఏ తనిఖీలు ఉగ్ర సంస్థ ఇస్లామిక్ స్టేట్ కేరళ–తమిళనాడు మాడ్యూల్ కార్యకలాపాలపై కూపీ లాగుతున్న జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) గురువారం కోయంబత్తూరులో విస్తృతంగా సోదాలు చేపట్టింది. ఎర్నాకులంలోని ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు జారీ చేసిన వారంట్ల మేరకు నిందితుల సంబంధీకులకు చెందిన ఐదు ప్రాంతాల్లో తనిఖీలు చేశాం. ఈ తనిఖీల్లో ఒక ల్యాప్‌టాప్, 5 సెల్ఫోన్లు, 4 సిమ్ కార్డులు, 1 మెమరీ కార్డు, 8 సీడీలు/డీవీడీలు, అభ్యంతరకర పత్రాలు లభించాయి. వీటిని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించాం’ అని ఎన్ఐఏ ఒక ప్రకటనలో పేర్కొంది. ఐఎస్ కార్యాకలాపాలకు సంబంధించిన సమాచారంపై కొందరిని ప్రశ్నించామని తెలిపింది. కాగా, గత వారం రాష్ట్రంలోకి అక్రమంగా చొరబడిన లష్కర్–ఇ– తైబా ఉగ్ర సంస్థ సభ్యులతో వీరికి సంబంధాలున్నాయా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పెడదారి పట్టిన యువతను సోషల్ మీడియా ద్వారా కొందరు వ్యక్తులు ఐఎస్ ఉగ్ర సంస్థలోకి ఆకర్షించి కేరళ, తమిళనాడుల్లో దాడులకు ప్రయత్నాలు చేస్తున్నట్లు ఎన్ఐఏ మేలో కేసులు నమోదు చేసింది. -
దేశంలో జల రవాణా విప్లవం
న్యూఢిల్లీ: దేశంలో జలరవాణా విప్లవం రాబోతున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. ఇది రవాణా వ్యయాన్ని 4 శాతం మేర తగ్గిస్తుందని, తద్వారా 30 శాతం మేర ఎగుమతులు పెరగడానికి అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. కాండ్లా నుంచి ట్యూటికోరిన్ వరకు (వయా మంగళూరు, కొచ్చిన్) రవాణాకు ఉద్దేశించిన కంటెయినర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (కాంకర్) తొలి కంటెయినర్‌ను మంత్రి వీడియోకాన్ఫరెన్స్ ద్వారా గురువారం ప్రారంభించారు. జల రవాణా మార్గాల అభివృద్ధి, గంగా నదిపై రవాణా నౌకలను నిర్వహించాలనే ఆలోచనలను ఎగతాళిగా చూసిన విషయాన్ని గుర్తు చేశారు. ‘‘బంగ్లాదేశ్, మయన్మార్‌కు వారణాసి ద్వారా ఎగుమతులకు మార్గం సుగమం చేశాం. రవాణా వ్యాయాన్ని 4 శాతం తగ్గిస్తే... 25–30 శాతం మేర ఎగుమతులు పెరుగుతాయి’’ అని గడ్కరీ పేర్కొన్నారు. తీర ప్రాంత రవాణా వాటా చైనాలో 24 శాతం, జర్మనీలో 11 శాతం, అమెరికాలో 9 శాతంగా ఉంటే, భారత్‌లో 4.5– 5 శాతం మధ్యే ఉందని చెప్పారు. జల మార్గాల అభివృద్ధికి భారీ చర్యలు తీసుకుంటున్నామన్నారు. 111 నదులను జల మార్గాలుగా మలచాల్సి ఉందని, ఇందులో 11 నదులపై ప్రాజెక్టులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. గంగానదిపై గతేడాది 80 లక్షల టన్నుల రవాణా జరిగిందని, 3 మీటర్ల మేర నీటి నిల్వలు కొనసాగిస్తే... 280లక్షల టన్నులకు రవాణా పెరుగుతుందన్నారు. రూ.25,000 కోట్లకు కాంకర్ టర్నోవర్: రైల్వే శాఖా మంత్రి పీయూష్ గోయల్ కేంద్ర ప్రభుత్వ నవరత్న కంపెనీ కంటెయినర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (కాంకర్) రానున్న ఐదేళ్లలో రూ.25,000 కోట్ల టర్నోవర్‌ను నమోదు చేయాలన్న లక్ష్యంతో ఉన్నట్టు రైల్వే శాఖా మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో కాంకర్ టర్నోవర్ రూ.6,000 కోట్లుగా ఉందన్నారు. కాంకర్ తొలి కంటెయినర్ నౌక ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా మంత్రి గోయల్ మాట్లాడారు. రైల్వే శాఖ పరిధిలోని కాంకర్‌కు ప్రస్తుతం 81 టెర్మినల్స్ ఉన్నాయని, రానున్న సంవత్సరంలో 100 మార్క్‌ను చేరుతుందని మంత్రి చెప్పారు. తద్వారా దేశంలో అధిక రవాణా వ్యయాలను తగ్గించేందుకు తోడ్పడుతుందన్నారు. రైలు, రోడ్డు, సముద్ర మార్గాల్లో బహుముఖ విధాలైన రవాణా ఆర్థిక రంగ వృద్ధిని పెంచుతుందని అభిప్రాయాన్ని గోయల్ వ్యక్తం చేశారు. -
కాండ్లా ఓడరేవు అద్భుతం
► దేశ ప్రగతికి ఓడరేవులు కీలకం ► రూ.993 కోట్ల ప్రాజెక్టుల శంకుస్థాపన సందర్భంగా మోదీ కాండ్లా: దేశ ప్రగతికి మంచి ఓడరేవులు ఎంతో కీలకమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. రెండ్రోజుల పర్యటన నిమిత్తం గుజరాత్ చేరుకున్న ప్రధాని.. కాండ్లా ఓడరేవులో రూ. 993 కోట్ల విలువైన ఆరు ప్రాజెక్టులకు సోమవారం శంకుస్థాపన చేశారు. ఆసియాలో ప్రముఖ ఓడరేవుల్లో ఒకటిగా కాండ్లా అవతరించిందని, తక్కువ కాలంలో ఇంత వేగంగా అభివృద్ధి చెందడం ఆర్థికవేత్తల్ని సైతం ఆశ్చర్యానికి గురిచేసిందన్నారు. సరైన మౌలిక సదుపాయాలు, సామర్థ్యాలే దేశ ఆర్థిక వృద్ధికి కీలక పునాదులని, దేశం పురోగమించాలంటే మంచి ఓడరేవులు తప్పనిసరన్నారు. కాండ్లా పోర్ట్ ట్రస్ట్(కేపీటీ)కి బీజేపీ –ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్త పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్ పేరు పెట్టాలని సూచించారు. చాబహార్, కాండ్లా రేవులు కలిస్తే.. ఇరాన్‌లోని చాబహర్ పోర్టు నిర్మాణం పూర్తయితే.. ఆ దేశానికి చెందిన ఓడలు నేరుగా కాండ్లాకే వస్తాయని, ఈ రెండు ఓడరేవులు కలిస్తే.. అప్పుడు ప్రపంచ వాణిజ్యంలో అంగద్ (రామాయణంలో శక్తికి ప్రతీక, వాలి కుమారుడు)గా కాండ్లా పేరుప్రఖ్యాతులు సాధిస్తుందని మోదీ పేర్కొన్నారు. ఓడరేవులు, రవాణా రంగంలో కేంద్ర మంత్రి గడ్కారీ చేస్తున్న కృషిని ప్రధాని కొనియాడారు. ఈ ఏడాదిలోనే గుజరాత్లో ఎన్నికలుండడంతో మోదీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. -
కార్గో హ్యాడ్లింగ్లో 12 ప్రధాన పోర్ట్‌ల రికార్డ్
► సత్ఫలితాలిచ్చిన చర్యలు ► షిప్పింగ్ మంత్రి గడ్కరీ న్యూఢిల్లీ: భారత్‌లోని 12 ప్రధాన ఓడరేవులు గడిచిన ఆర్థిక సంవత్సరంలో రికార్డ్‌స్థాయిలో కార్గో హ్యాడ్లింగ్ చేశాయి. ప్రభుత్వ ఆధీనంలోని ఈ ప్రధాన పోర్ట్‌ల పనితీరు మెరుగుపరచడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలు సత్ఫలితాలు ఇచ్చాయని కేంద్ర షిప్పింగ్ రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. ఈ 12 మేజర్ పోర్ట్‌లు 2016–17 ఆర్థిక సంవత్సరంలో 647.43 మిలియన్ టన్నుల కార్గోను హ్యాండిల్ చేశాయని, ఈ సంవత్సరం 6.8 శాతం వార్షిక వృద్ధి నమోదైందని తెలియజేశారు. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరంలో 4.3 శాతం వృద్ధి సాధించామని చెప్పారాయన. గత ఆర్థిక సంవత్సరంలో ప్రైవేట్ పోర్ట్‌లు 4 శాతం వృద్ధి మాత్రమే సాధించాయని తెలిపారు. అగ్రస్థానంలో కాండ్లా పోర్ట్: అన్ని ప్రధాన పోర్ట్‌లలో కాండ్లా పోర్ట్ అత్యధికంగా కార్గోను హ్యాండిల్ చేసిందని గడ్కరీ తెలిపారు. 105.44 మిలియన్ టన్నులతో కాండ్లా పోర్ట్ మొదటి స్థానంలో నిలిచిందన్నారు. 88.95 మిలియన్ టన్నులతో పారదీప్ పోర్ట్, 63.05 మిలియన్ టన్నులతో ముంబై పోర్ట్‌లు రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయని తెలియజేశారు. కమోడిటీల విషయానికొస్తే, ఇనుప ఖనిజం ట్రాఫిక్ బాగా పెరిగిందన్నారు. ఇనుప ఖనిజం ట్రాఫిక్ 164 శాతం పెరిగిందని, పెట్రోలియమ్, ఆయిల్, లూబ్రికెంట్స్ 8 శాతం, ఇతర సాధారణ కార్గో 19 శాతం చొప్పున పెరిగాయని వివరించారు. అంతర్జాతీయ ప్రమాణాలు అందుకునేలా ఈ పోర్ట్‌లను అభివృద్ధి చేశామని చెప్పారు. భారత్‌లో మొత్తం 12 ప్రధాన పోర్ట్‌లున్నాయి. కాండ్లా, ముంబై, జవహర్ లాల్ నెహ్రూ పోర్ట్, మర్మగోవా, న్యూ మంగళూర్, కొచ్చిన్, చెన్నై, ఎన్నోర్, వి ఓ చిదంబరనార్, విశాఖ పట్టణం, పారదీప్, కోల్‌కత(హల్డియాను కలుపుకొని) పోర్ట్‌లున్నాయి.