కాండ్లా ఓడరేవు అద్భుతం
► దేశ ప్రగతికి ఓడరేవులు కీలకం
► రూ.993 కోట్ల ప్రాజెక్టుల శంకుస్థాపన సందర్భంగా మోదీ
కాండ్లా: దేశ ప్రగతికి మంచి ఓడరేవులు ఎంతో కీలకమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. రెండ్రోజుల పర్యటన నిమిత్తం గుజరాత్ చేరుకున్న ప్రధాని.. కాండ్లా ఓడరేవులో రూ. 993 కోట్ల విలువైన ఆరు ప్రాజెక్టులకు సోమవారం శంకుస్థాపన చేశారు.
ఆసియాలో ప్రముఖ ఓడరేవుల్లో ఒకటిగా కాండ్లా అవతరించిందని, తక్కువ కాలంలో ఇంత వేగంగా అభివృద్ధి చెందడం ఆర్థికవేత్తల్ని సైతం ఆశ్చర్యానికి గురిచేసిందన్నారు. సరైన మౌలిక సదుపాయాలు, సామర్థ్యాలే దేశ ఆర్థిక వృద్ధికి కీలక పునాదులని, దేశం పురోగమించాలంటే మంచి ఓడరేవులు తప్పనిసరన్నారు. కాండ్లా పోర్ట్ ట్రస్ట్(కేపీటీ)కి బీజేపీ –ఆర్‌ఎస్‌ఎస్ సిద్ధాంతకర్త పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్ పేరు పెట్టాలని సూచించారు.
చాబహార్, కాండ్లా రేవులు కలిస్తే..
ఇరాన్‌లోని చాబహర్ పోర్టు నిర్మాణం పూర్తయితే.. ఆ దేశానికి చెందిన ఓడలు నేరుగా కాండ్లాకే వస్తాయని, ఈ రెండు ఓడరేవులు కలిస్తే.. అప్పుడు ప్రపంచ వాణిజ్యంలో అంగద్ (రామాయణంలో శక్తికి ప్రతీక, వాలి కుమారుడు)గా కాండ్లా పేరుప్రఖ్యాతులు సాధిస్తుందని మోదీ పేర్కొన్నారు. ఓడరేవులు, రవాణా రంగంలో కేంద్ర మంత్రి గడ్కారీ చేస్తున్న కృషిని ప్రధాని కొనియాడారు. ఈ ఏడాదిలోనే గుజరాత్‌లో ఎన్నికలుండడంతో మోదీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.