అహ్మదాబాద్: గుజరాత్‌లో వేర్వేరు ఘటనల్లో భారీ మొత్తంలో డ్రగ్స్ పట్టుబడ్డాయి. కాండ్లా పోర్టులోని ఓ కంటైనర్ నుంచి రూ.1,439 కోట్ల విలువైన 200 కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజన్స్ (డీఆర్‌ఐ) అధికారులు సోమవారం వెల్లడించారు. గత సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో ఇరాన్ నుంచి జిప్సమ్ పేరుతో వచ్చిన 17 కంటెయినర్లు ఉత్తరాఖండ్‌లోని ఓ సంస్థకు అందాల్సి ఉందని తెలిపారు.
వాటిని తనిఖీ చేయగా 205.6 కిలోల బరువున్న రూ.1,439 కోట్ల విలువైన హెరాయిన్ బయటపడిందని చెప్పారు. ఉత్తరాఖండ్‌కు చెందిన సంస్థ యజమానిని ఎట్టకేలకు అనేక ప్రాంతాల్లో సోదాల అనంతరం పంజాబ్‌లోని ఓ కుగ్రామంలో పట్టుకున్నట్లు చెప్పారు. కాగా, గత ఏడాది సెప్టెంబర్‌లో గుజరాత్‌లోని ముంద్రా పోర్టులో రూ.21వేల కోట్ల విలువైన సుమారు 3 టన్నుల హెరాయిన్ పట్టుబడిన విషయం తెలిసిందే.
పాక్ బోటులో రూ.280 కోట్ల హెరాయిన్
పాకిస్తాన్‌కు చెందిన పడవలో అక్రమంగా తరలిస్తున్న రూ.280 కోట్ల విలువైన హెరాయిన్ కచ్ తీరంలో పట్టుబడింది. సోమవారం ఉదయం భారత ప్రాదేశిక జలాల్లోకి అక్రమంగా ప్రవేశించిన అల్ హజ్ అనే పడవను తీరరక్షక దళం, గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ గుర్తించింది. లొంగిపోవాలంటూ చేసిన హెచ్చరికలతో పారిపోయేందుకు ప్రయత్నించగా ఆ పడవలోని వారిపై కాల్పులు జరిపింది.
దీంతో అందులోని కనీసం ఇద్దరు గాయపడ్డారని అధికారులు తెలిపారు. అనంతరం, పడవతోపాటు అందులో ఉన్న 56 కిలోల బరువున్న రూ.280 కోట్ల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకుని, 9 మందిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. ఓ ఉత్తరాది రాష్ట్రానికి ఈ నిషేధిత డ్రగ్ చేరాల్సి ఉందని, కరాచీకి చెందిన ముస్తాఫా అనే స్మగ్లరే ఈ రాకెట్ వెనుక ఉండి ఉంటాడని అనుమానిస్తున్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment