కాంకర్ తొలి కంటెయినర్ నౌక ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ (కుడి), పీయూష్ గోయల్ (మధ్య)
న్యూఢిల్లీ: దేశంలో జలరవాణా విప్లవం రాబోతున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. ఇది రవాణా వ్యయాన్ని 4 శాతం మేర తగ్గిస్తుందని, తద్వారా 30 శాతం మేర ఎగుమతులు పెరగడానికి అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. కాండ్లా నుంచి ట్యూటికోరిన్ వరకు (వయా మంగళూరు, కొచ్చిన్) రవాణాకు ఉద్దేశించిన కంటెయినర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (కాంకర్) తొలి కంటెయినర్‌ను మంత్రి వీడియోకాన్ఫరెన్స్ ద్వారా గురువారం ప్రారంభించారు. జల రవాణా మార్గాల అభివృద్ధి, గంగా నదిపై రవాణా నౌకలను నిర్వహించాలనే ఆలోచనలను ఎగతాళిగా చూసిన విషయాన్ని గుర్తు చేశారు.
‘‘బంగ్లాదేశ్, మయన్మార్‌కు వారణాసి ద్వారా ఎగుమతులకు మార్గం సుగమం చేశాం. రవాణా వ్యాయాన్ని 4 శాతం తగ్గిస్తే... 25–30 శాతం మేర ఎగుమతులు పెరుగుతాయి’’ అని గడ్కరీ పేర్కొన్నారు. తీర ప్రాంత రవాణా వాటా చైనాలో 24 శాతం, జర్మనీలో 11 శాతం, అమెరికాలో 9 శాతంగా ఉంటే, భారత్‌లో 4.5– 5 శాతం మధ్యే ఉందని చెప్పారు. జల మార్గాల అభివృద్ధికి భారీ చర్యలు తీసుకుంటున్నామన్నారు. 111 నదులను జల మార్గాలుగా మలచాల్సి ఉందని, ఇందులో 11 నదులపై ప్రాజెక్టులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. గంగానదిపై గతేడాది 80 లక్షల టన్నుల రవాణా జరిగిందని, 3 మీటర్ల మేర నీటి నిల్వలు కొనసాగిస్తే... 280లక్షల టన్నులకు రవాణా పెరుగుతుందన్నారు.
రూ.25,000 కోట్లకు కాంకర్ టర్నోవర్: రైల్వే శాఖా మంత్రి పీయూష్ గోయల్
కేంద్ర ప్రభుత్వ నవరత్న కంపెనీ కంటెయినర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (కాంకర్) రానున్న ఐదేళ్లలో రూ.25,000 కోట్ల టర్నోవర్‌ను నమోదు చేయాలన్న లక్ష్యంతో ఉన్నట్టు రైల్వే శాఖా మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో కాంకర్ టర్నోవర్ రూ.6,000 కోట్లుగా ఉందన్నారు. కాంకర్ తొలి కంటెయినర్ నౌక ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా మంత్రి గోయల్ మాట్లాడారు. రైల్వే శాఖ పరిధిలోని కాంకర్‌కు ప్రస్తుతం 81 టెర్మినల్స్ ఉన్నాయని, రానున్న సంవత్సరంలో 100 మార్క్‌ను చేరుతుందని మంత్రి చెప్పారు. తద్వారా దేశంలో అధిక రవాణా వ్యయాలను తగ్గించేందుకు తోడ్పడుతుందన్నారు. రైలు, రోడ్డు, సముద్ర మార్గాల్లో బహుముఖ విధాలైన రవాణా ఆర్థిక రంగ వృద్ధిని పెంచుతుందని అభిప్రాయాన్ని గోయల్ వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment