tuticorin port
-
మాల్దీవుల మాజీ ఉపాధ్యక్షుడు అరెస్టు
ట్యూటికోరన్: మాల్దీవుల మాజీ ఉపాధ్యక్షుడు అహ్మద్ అదీబ్ అబ్దుల్ గఫూర్‌ను ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించడంతో తమిళనాడులోని ట్యూటికోరన్ ఓడరేవులో ఆయనను అరెస్టు చేశారు. టగ్ బోటులో ప్రయాణిస్తూ.. క్రూ మెంబర్‌గా చెప్పుకొని అక్రమంగా భారత్‌లో వచ్చేందుకు ఆయన ప్రయత్నించినట్టు తెలుస్తోంది. ఎలాంటి ధ్రువపత్రాలు లేకుండా ఆయన భారత్‌కు వచ్చారని, అక్రమంగా అదీబ్ దేశంలోకి వచ్చే అగత్యం ఎందుకు వచ్చిందో తెలుసుకునేందుకు దర్యాప్తు జరుపుతున్నామని అధికార వర్గాలు తెలిపాయి. మాల్దీవులు మాజీ ఉపాధ్యక్షుడి అరెస్టుపై సమాచారమిస్తూ కేంద్ర విదేశాంగ శాఖకు ఐబీ ఓ రిపోర్ట్ పంపినట్టు తెలుస్తోంది. ఈ విషయమై మాల్దీవుల ప్రభుత్వంతో మాట్లాడి నిజానిజాలు తెలుసుకుంటామని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీష్‌కుమార్ మీడియాకు తెలిపారు. -
దేశంలో జల రవాణా విప్లవం
న్యూఢిల్లీ: దేశంలో జలరవాణా విప్లవం రాబోతున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. ఇది రవాణా వ్యయాన్ని 4 శాతం మేర తగ్గిస్తుందని, తద్వారా 30 శాతం మేర ఎగుమతులు పెరగడానికి అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. కాండ్లా నుంచి ట్యూటికోరిన్ వరకు (వయా మంగళూరు, కొచ్చిన్) రవాణాకు ఉద్దేశించిన కంటెయినర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (కాంకర్) తొలి కంటెయినర్‌ను మంత్రి వీడియోకాన్ఫరెన్స్ ద్వారా గురువారం ప్రారంభించారు. జల రవాణా మార్గాల అభివృద్ధి, గంగా నదిపై రవాణా నౌకలను నిర్వహించాలనే ఆలోచనలను ఎగతాళిగా చూసిన విషయాన్ని గుర్తు చేశారు. ‘‘బంగ్లాదేశ్, మయన్మార్‌కు వారణాసి ద్వారా ఎగుమతులకు మార్గం సుగమం చేశాం. రవాణా వ్యాయాన్ని 4 శాతం తగ్గిస్తే... 25–30 శాతం మేర ఎగుమతులు పెరుగుతాయి’’ అని గడ్కరీ పేర్కొన్నారు. తీర ప్రాంత రవాణా వాటా చైనాలో 24 శాతం, జర్మనీలో 11 శాతం, అమెరికాలో 9 శాతంగా ఉంటే, భారత్‌లో 4.5– 5 శాతం మధ్యే ఉందని చెప్పారు. జల మార్గాల అభివృద్ధికి భారీ చర్యలు తీసుకుంటున్నామన్నారు. 111 నదులను జల మార్గాలుగా మలచాల్సి ఉందని, ఇందులో 11 నదులపై ప్రాజెక్టులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. గంగానదిపై గతేడాది 80 లక్షల టన్నుల రవాణా జరిగిందని, 3 మీటర్ల మేర నీటి నిల్వలు కొనసాగిస్తే... 280లక్షల టన్నులకు రవాణా పెరుగుతుందన్నారు. రూ.25,000 కోట్లకు కాంకర్ టర్నోవర్: రైల్వే శాఖా మంత్రి పీయూష్ గోయల్ కేంద్ర ప్రభుత్వ నవరత్న కంపెనీ కంటెయినర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (కాంకర్) రానున్న ఐదేళ్లలో రూ.25,000 కోట్ల టర్నోవర్‌ను నమోదు చేయాలన్న లక్ష్యంతో ఉన్నట్టు రైల్వే శాఖా మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో కాంకర్ టర్నోవర్ రూ.6,000 కోట్లుగా ఉందన్నారు. కాంకర్ తొలి కంటెయినర్ నౌక ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా మంత్రి గోయల్ మాట్లాడారు. రైల్వే శాఖ పరిధిలోని కాంకర్‌కు ప్రస్తుతం 81 టెర్మినల్స్ ఉన్నాయని, రానున్న సంవత్సరంలో 100 మార్క్‌ను చేరుతుందని మంత్రి చెప్పారు. తద్వారా దేశంలో అధిక రవాణా వ్యయాలను తగ్గించేందుకు తోడ్పడుతుందన్నారు. రైలు, రోడ్డు, సముద్ర మార్గాల్లో బహుముఖ విధాలైన రవాణా ఆర్థిక రంగ వృద్ధిని పెంచుతుందని అభిప్రాయాన్ని గోయల్ వ్యక్తం చేశారు. -
మళ్లీ అక్కడే... రూ.రెండు కోట్ల బంగారం దొరికింది
చెన్నై : తమిళనాడులోని టుటికోరన్ నౌకాశ్రయంలో మంగళవారం డీఆర్ఐ అధికారులు ఆరు కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆ బంగారాన్ని సీజ్ చేశారు. నౌకాశ్రయంలో తరలించేందుకు సిద్ధంగా ఉంచిన పార్సిల్లో బంగారం ఉన్నట్లు ఆగంతకుడి ద్వారా సమాచారం అందుకున్న డీఆర్ఐ అధికారులు... ఆ దిశగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆరు కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన బంగారం విలువ రూ. 2 కోట్లు ఉంటుందని డీఆర్ఐ అధికారులు వెల్లడించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందులోభాగంగా సదరు పార్సిల్ ఎవరు పంపారు. పార్సిల్ పై గల చిరునామా గురించి డీఆర్ఐ అధికారులు ఆరా తీస్తున్నారు. గత గురువారం ఇదే నౌకాశ్రయం నుండి కౌలాలంపూర్‌కు తరలించేందుకు సిద్ధంగా ఉంచిన పార్సిల్ నుంచి 12 కేజీల బంగారాన్ని డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. -
రూ. 4 కోట్ల విలువైన బంగారం పట్టివేత
చెన్నై : తమిళనాడులోని టుటికోరన్ నౌకాశ్రయంలో 12 కేజీల బంగారాన్ని గురువారం డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆ బంగారాన్ని సీజ్ చేశారు. ఈ నౌకాశ్రయం నుంచి కౌలాలంపూర్‌కు తరలించేందుకు సిద్ధంగా ఉంచిన పార్సిల్ నుంచి ఈ బంగారాన్ని డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆగంతకుడు డీఆర్ఐ అధికారులకు సమాచారం అందించాడు. ఈ నేపథ్యంలో పార్సిళ్లను డీఆర్ఐ అధికారులు తనిఖీ చేశారు. పట్టుబడిన బంగారం విలువ రూ.4 కోట్లు ఉంటుందని డీఆర్ఐ అధికారులు వెల్లడించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందులోభాగంగా సదరు పార్సిల్ ఎవరు పంపారు. పార్సిల్ పై కౌలాలంపూర్‌లోని గల చిరునామాపై డీఆర్ఐ అధికారులు ఆరా తీస్తున్నారు.