Container Corporation of India
-
హింద్ జింక్‌కు సర్కారు గుడ్‌బై
న్యూఢిల్లీ: మెటల్ రంగ దిగ్గజం హిందుస్తాన్ జింక్ లిమిటెడ్(హెచ్‌జెడ్‌ఎల్)లో ప్రభుత్వానికి గల 29.5 శాతం వాటా విక్రయానికి గ్రీన్ సిగ్నల్ లభించింది. ఈ ప్రతిపాదనను ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ(సీసీఈఏ) తాజాగా అనుమతించింది. హింద్ జింక్‌లో వాటా విక్రయం ద్వారా ప్రభుత్వానికి రూ. 38,000 కోట్లు సమకూరే అవకాశముంది. బుధవారం సమావేశమైన సీసీఈఏ ఇందుకు అనుమతించినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. వెరసి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23)లో కేంద్ర ప్రభుత్వ డిజిన్వెస్ట్‌మెంట్ ప్రక్రియకు ఊపు లభించనున్నట్లు తెలియజేశాయి. ప్రభుత్వ రంగ సంస్థ(పీఎస్‌యూ)లలో వాటాల వ్యూహాత్మక విక్రయం ద్వారా ఈ ఏడాది రూ. 65,000 కోట్లు సమీకరించాలని బడ్జెట్లో ఆర్థిక శాఖ ప్రతిపాదించింది. రూ. 305 ధరలో..: బుధవారం ట్రేడింగ్‌లో హింద్ జింక్ షేరు బీఎస్ఈలో 3 శాతం ఎగసి రూ. 305 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో రూ. 317ను అధిగమించింది. ప్రభుత్వం 29.5 శాతం వాటాకు సమానమైన దాదాపు 125 కోట్ల షేర్లను అమ్మకానికి ఉంచనుంది. తద్వారా సుమారు రూ. 38,000 కోట్లు లభించే వీలుంది. కాగా.. 2002 వరకూ హింద్ జింక్ ప్రభుత్వ రంగ సంస్థగా కార్యకలాపాలు సాగించిన సంగతి తెలిసిందే. అదే ఏడాది ఏప్రిల్‌లో ప్రభుత్వం 26 శాతం వాటాను స్టెరిలైట్ అపార్చునిటీస్ అండ్ వెంచర్స్ లిమిటెడ్‌కు విక్రయించింది.డీల్ విలువ రూ. 445 కోట్లుకాగా.. తద్వారా వేదాంతా గ్రూప్ యాజమాన్య నియంత్రణను చేపట్టింది. తదుపరి వేదాంతా గ్రూప్ ఓపెన్ మార్కెట్ ద్వారా 20 శాతం వాటాను సొంతం చేసుకుంది. అంతేకాకుండా 2003 నవంబర్‌లో ప్రభుత్వం నుంచి మరో 18.92 శాతం వాటాను చేజిక్కించుకుంది. ఫలితంగా హెచ్‌జెడ్‌ఎల్‌లో వేదాంతా వాటా 64.92 శాతానికి ఎగసింది. కాగా.. హెచ్‌జెడ్‌ఎల్‌లో అదనంగా 5 శాతం వాటా కొనుగోలు చేయనున్నట్లు ఇటీవలే వేదాంతా గ్రూప్ చీఫ్ అనిల్ అగర్వాల్ పేర్కొనడం గమనార్హం! -
అఫ్లే అప్పర్ సర్క్యూట్- కుప్పకూలిన కంకార్
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి త్రైమాసికంలో మొబైల్ మార్కెటింగ్ కంపెనీ అఫ్లే ఇండియా లిమిటెడ్ ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. మరోపక్క ఇదే కాలంలో పీఎస్‌యూ దిగ్గజం కంటెయినర్ కార్పొరేషన్(కంకార్) లిమిటెడ్ నిరుత్సాహకర పనితీరు ప్రదర్శించింది. దీంతో అఫ్లే ఇండియా కౌంటర్లో కొనుగోళ్లకు ఇన్వెస్టర్లు క్యూకట్టగా.. కంకార్ కౌంటర్లో భారీ అమ్మకాలకు ఎగబడుతున్నారు. వెరసి అఫ్లే ఇండియా అప్పర్ సర్క్యూట్‌ను తాకగా.. నవరత్న కంపెనీ కంకార్ భారీ నష్టాలతో కుప్పకూలింది. వివరాలు చూద్దాం.. అఫ్లే ఇండియా లిమిటెడ్ ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1(ఏప్రిల్- జూన్)లో అఫ్లే ఇండియా నికర లాభం 42 శాతం పెరిగి రూ. 19 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం సైతం 20 శాతం బలపడి రూ. 90 కోట్లను తాకింది. ఇబిటా 20 శాతం వృద్ధితో రూ. 22 కోట్లను అధిగమించింది. ఈ నేపథ్యంలో అఫ్లే ఇండియా షేరు ఎన్ఎస్ఈలో ప్రస్తుతం10 శాతం దూసుకెళ్లింది. అమ్మేవాళ్లు కరువుకావడంతో రూ. 2026 వద్ద ఫ్రీజయ్యింది. కాగా.. గత 4 నెలల్లో ఈ షేరు 81 శాతం ర్యాలీ చేయడం విశేషం! కంటెయినర్ కార్పొరేషన్ కార్గొ టెర్మినల్స్ నిర్వాహక దిగ్గజం కంటెయినర్ కార్పొరేషన్ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1(ఏప్రిల్- జూన్)లో 76 శాతం పడిపోయింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ. 58 కోట్లకు పరిమితమైంది. మొత్తం ఆదాయం సైతం రూ. 1723 కోట్ల నుంచి రూ. 1252 కోట్లకు క్షీణించింది. ఇబిటా మార్జిన్లు 24.6 శాతం నుంచి 13.4 శాతానికి బలహీనపడ్డాయి. ఈ నేపథ్యంలో కంకార్ షేరు ప్రస్తుతం ఎన్ఎస్ఈలో 15 శాతం కుప్పకూలింది. రూ. 387 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 366 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. -
ఎయిరిండియా వాటా విక్రయం మార్చిలోగా లేనట్టే..!
ముంబై: ఎయిరిండియాలో వాటా విక్రయం ఈ ఆర్థిక సంవత్సరంలో ఉండకపోవచ్చు. ఎయిర్ ఇండియాతో పాటు బీపీసీఎల్, కంటైనర్ కార్పొరేషన్ల్లో కూడా వాటా విక్రయం ఈ ఆర్థిక సంవత్సరంలోనే పూర్తి కాకపోవచ్చని ప్రభుత్వ ఉన్నతాధికారొకరు చెప్పారు. ఫలితంగా డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష్యం వెనకబడి ద్రవ్యలోటుపై ప్రతికూల ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయని అంచనా. వాటా విక్రయ ప్రయత్నాల్లో జాప్యం.... ఎయిరిండియా, బీపీసీఎల్, కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కంపెనీల్లో వ్యూహాత్మక వాటా విక్రయ ప్రయత్నాలు జరుగుతున్నాయని డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ (దీపమ్) ఉన్నతాధికారొకరు పేర్కొన్నారు. అయితే, కొన్ని కారణాల వల్ల జాప్యం జరుగుతోందని తెలిపారు. ఈ కంపెనీల వాటా విక్రయానికి సంబంధించి ఆర్థిక వివరాలను సిద్ధం చేస్తున్నామని, దీనికి కొంత సమయం పడుతుందని పేర్కొన్నారు. పలు కంపెనీల నుంచి మంచి స్పందన లభిస్తోందని, అదనపు వివరాలను అడుగుతున్నాయని వివరించారు. మరోవైపు భారత్ బాండ్ ఈటీఎఫ్ స్వల్ప నష్టంతో ఎన్ఎస్ఈలో లిస్టయింది. సగం కూడా సాకారం కాని లక్ష్యం..... ఈ ఆర్థిక సంవత్సరంలో డిజిన్వెస్ట్‌మెంట్ ద్వారా రూ.1.05 లక్షల కోట్లు సమీకరించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఇప్పటివరకూ దీంట్లో సగం కూడా సమీకరించలేకపోయింది. గత ఏడాది సెప్టెంబర్ నాటికి రూ.12,359 కోట్లు మాత్రమే సమీకరించగలిగింది. మరోవైపు ద్రవ్యలోటు బడ్జెట్ అంచనాలను మించింది. మరో 4 నెలల్లో ఆర్థిక సంవత్సరం ముగియనున్నప్పటికి, ఇప్పటికే ద్రవ్యలోటు 115%కి ఎగబాకింది. బీపీసీఎల్ వాటా రూ.60,000 కోట్లు. బీపీసీఎల్(భారత్ పెట్రోలియమ్ కార్పొరేషన్ లిమిటెడ్)లో కేంద్రానికి 53 శాతం వాటా ఉంది. ఈ వాటా విక్రయం కారణంగా ఖజానాకి రూ.60,000 కోట్లు లభిస్తాయి. షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో వాటా విక్రయం ద్వారా రూ.2,000 కోట్లు లభించనున్నాయి. ఇక కంటైనర్ కార్పొ డిజిన్వెస్ట్‌మెంట్ ద్వారా రూ.13,000 కోట్లు లభించే అవకాశాలున్నాయి. -
బీపీసీఎల్, కాంకర్ విక్రయానికి బిడ్లు
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగంలోని బీపీసీఎల్, కంటెయినర్ కార్పొరేషన్ (కాంకర్)లో వ్యూహాత్మక వాటాల విక్రయానికి సంబంధించి పెట్టుబడులు, ప్రజా ఆస్తుల విభాగం (దీపమ్) ఆసక్తి కలిగిన సంస్థల నుంచి ప్రతిపాదనలకు ఆహ్వానం పలికింది. బీపీసీఎల్‌లో ప్రభుత్వం పూర్తి వాటాను విక్రయించనుండగా, కాంకర్లో మాత్రం 24 శాతం మేర వాటాను తన వద్దే అట్టిపెట్టుకుని మిగిలిన వాటాను, యాజమాన్య నియంత్రణను ప్రైవేటు సంస్థకు కట్టబెట్టనుంది. బీపీసీఎల్‌కు అసోంలో ఉన్న నుమాలిగఢ్ రిఫైనరీని మాత్రం ప్రభుత్వరంగ సంస్థకే విక్రయించాలని కేంద్ర కేబినెట్ తాజాగా నిర్ణయించిన విషయం తెలిసిందే. -
దేశంలో జల రవాణా విప్లవం
న్యూఢిల్లీ: దేశంలో జలరవాణా విప్లవం రాబోతున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. ఇది రవాణా వ్యయాన్ని 4 శాతం మేర తగ్గిస్తుందని, తద్వారా 30 శాతం మేర ఎగుమతులు పెరగడానికి అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. కాండ్లా నుంచి ట్యూటికోరిన్ వరకు (వయా మంగళూరు, కొచ్చిన్) రవాణాకు ఉద్దేశించిన కంటెయినర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (కాంకర్) తొలి కంటెయినర్‌ను మంత్రి వీడియోకాన్ఫరెన్స్ ద్వారా గురువారం ప్రారంభించారు. జల రవాణా మార్గాల అభివృద్ధి, గంగా నదిపై రవాణా నౌకలను నిర్వహించాలనే ఆలోచనలను ఎగతాళిగా చూసిన విషయాన్ని గుర్తు చేశారు. ‘‘బంగ్లాదేశ్, మయన్మార్‌కు వారణాసి ద్వారా ఎగుమతులకు మార్గం సుగమం చేశాం. రవాణా వ్యాయాన్ని 4 శాతం తగ్గిస్తే... 25–30 శాతం మేర ఎగుమతులు పెరుగుతాయి’’ అని గడ్కరీ పేర్కొన్నారు. తీర ప్రాంత రవాణా వాటా చైనాలో 24 శాతం, జర్మనీలో 11 శాతం, అమెరికాలో 9 శాతంగా ఉంటే, భారత్‌లో 4.5– 5 శాతం మధ్యే ఉందని చెప్పారు. జల మార్గాల అభివృద్ధికి భారీ చర్యలు తీసుకుంటున్నామన్నారు. 111 నదులను జల మార్గాలుగా మలచాల్సి ఉందని, ఇందులో 11 నదులపై ప్రాజెక్టులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. గంగానదిపై గతేడాది 80 లక్షల టన్నుల రవాణా జరిగిందని, 3 మీటర్ల మేర నీటి నిల్వలు కొనసాగిస్తే... 280లక్షల టన్నులకు రవాణా పెరుగుతుందన్నారు. రూ.25,000 కోట్లకు కాంకర్ టర్నోవర్: రైల్వే శాఖా మంత్రి పీయూష్ గోయల్ కేంద్ర ప్రభుత్వ నవరత్న కంపెనీ కంటెయినర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (కాంకర్) రానున్న ఐదేళ్లలో రూ.25,000 కోట్ల టర్నోవర్‌ను నమోదు చేయాలన్న లక్ష్యంతో ఉన్నట్టు రైల్వే శాఖా మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో కాంకర్ టర్నోవర్ రూ.6,000 కోట్లుగా ఉందన్నారు. కాంకర్ తొలి కంటెయినర్ నౌక ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా మంత్రి గోయల్ మాట్లాడారు. రైల్వే శాఖ పరిధిలోని కాంకర్‌కు ప్రస్తుతం 81 టెర్మినల్స్ ఉన్నాయని, రానున్న సంవత్సరంలో 100 మార్క్‌ను చేరుతుందని మంత్రి చెప్పారు. తద్వారా దేశంలో అధిక రవాణా వ్యయాలను తగ్గించేందుకు తోడ్పడుతుందన్నారు. రైలు, రోడ్డు, సముద్ర మార్గాల్లో బహుముఖ విధాలైన రవాణా ఆర్థిక రంగ వృద్ధిని పెంచుతుందని అభిప్రాయాన్ని గోయల్ వ్యక్తం చేశారు. -
నేటి నుంచి కాంకర్లో 5% వాటా విక్రయం
ఆఫర్ ధర రూ.1,195; రిటైలర్లకు 5% డిస్కౌంట్ న్యూఢిల్లీ: కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (కాంకర్)లో 5% వాటా విక్రయం నేటి (బుధవారం) నుంచి ప్రారంభం కానున్నది. రూ.1,195 ధరకు 97,48,710 షేర్లను ప్రభుత్వం ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్) విధానంలో విక్రయిస్తుంది. మంగళవారం బీఎస్ఈలో ఈ షేర్ ముగిసిన ధర(రూ.1,227)తో పోల్చితే ఇది 2.58% తక్కువ. బుధవారం సంస్థాగత ఇన్వెస్టర్లకు, గురువారం రిటైల్ ఇన్వెస్టర్లకు షేర్లు విక్రయిస్తారు. రిటైల్ ఇన్వెస్టర్లకు ప్రభుత్వం ఆఫర్ చేసే ధరలో 5% డిస్కౌంట్ లభిస్తుంది. మొత్తం 5% వాటాలో 20% వాటా రిటైల్ ఇన్వెస్టర్లకు కేటాయించారు. మొత్తం ఈ 5% వాటా విక్రయం కారణంగా ప్రభుత్వానికి రూ.1,165 కోట్లు సమకూరుతాయని అంచనా. మ్యూచువల్ ఫండ్స్, బీమా కంపెనీలు మినహా మరే ఇతర సంస్థ కూడా మొత్తం ఆఫర్లో 25 శాతానికి మించి బిడ్ చేయడానికి వీలు లేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డిజిన్వెస్ట్మెంట్లో భాగంగా ప్రభుత్వం విక్రయిస్తున్న ఏడో ప్రభుత్వ రంగ వాటా విక్రయం ఇది. రైల్వేల నిర్వహణలో ఉన్న కంటైనర్ కార్పొరేషన్లో ప్రభుత్వ వాటా 61.8%గా ఉంది.