Water transport system
-
బోటు ప్రమాదాల నివారణకు కంట్రోల్ రూమ్‌లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అంతర్గత జలరవాణా వ్యవస్థను నియంత్రించడం ద్వారా బోటు ప్రమాదాలకు అడ్డుకట్ట వేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేశారు. బోటు ప్రమాదాల నివారణ, ప్రయాణికుల భద్రత కోసం 8 చోట్ల కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. జలవనరులు, పోలీసు, పర్యాటక, రెవెన్యూ తదితర శాఖల సిబ్బందిని ఈ కంట్రోల్ రూమ్‌ల్లో నియమించాలని ముఖ్యమంత్రి సూచించారు. ప్రతి కంట్రోల్ రూమ్‌లో 13 మందిని నియమించాలని, అందులో ముగ్గురు పోలీసు కానిస్టేబుళ్లు తప్పనిసరిగా ఉండాలన్నారు. ఈ నెల 21వ తేదీన ఎనిమిది ప్రాంతాల్లో కంట్రోల్ రూమ్‌ల నిర్మాణానికి శంకుస్థాపన చేయాలని నిర్ణయానికొచ్చారు. ఈ కంట్రోల్ రూమ్‌లను 90 రోజుల్లోగా అందుబాటులోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు మందం సమీపంలో సెప్టెంబరు 15న గోదావరిలో జరిగిన బోటు ప్రమాదంపై విచారణకు జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కమిటీ తన నివేదికను బుధవారం సీఎం వైఎస్ జగన్‌కు అందజేసింది. ఈ నివేదికపై ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. అంతర్గత జల మార్గాలు.. బోట్ల కదలికలు, వరద ప్రవాహాలు, వాతావరణ సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకునేలా కంట్రోల్ రూమ్‌లను తీర్చిదిద్దాలని అధికారులకు సూచించారు. తద్వారా బోట్ల నిర్వహణను సులభంగా పర్యవేక్షించవచ్చని చెప్పారు. బోట్లలో జీపీఎస్ తప్పనిసరి కంట్రోల్ రూమ్‌కు ఎమ్మార్వో ఇన్ఛార్జిగా వ్యవహరిస్తారని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. బోట్లలో ప్రయాణించే వారికి టిక్కెట్లు ఇచ్చే అధికారం కంట్రోల్ రూమ్లకే కట్టబెట్టాలన్నారు. బోట్లలో జీపీఎస్‌ను తప్పనిసరిగా అమర్చాలని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బోట్లలో మద్యం వినియోగించే అవకాశం ఇవ్వకూడదని స్పష్టంచేశారు. బోటు బయలుదేరడానికి ముందే సిబ్బందికి బ్రీత్ అనలైజర్ పరీక్షలను నిర్వహించాలని పేర్కొన్నారు. ఎలాంటి ప్రమాదాలు చోటుచేసుకోకుండా చూడగలిగితే.. ఆ మేరకు గ్రేడింగ్ ఇచ్చి, కంట్రోల్ రూమ్‌ల సిబ్బందికి రెండు నెలల జీతం ఇన్సెంటివ్‌గా ఇవ్వాలని సూచించారు. మరోసారి తనిఖీ చేశాకే అనుమతి రాష్ట్రంలో బోట్లన్నింటినీ మరోసారి తనిఖీ చేసి.. వాటి ఫిట్నెస్ను ధ్రువీకరించాకే అనుమతి ఇవ్వాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తేల్చిచెప్పారు. సారంగి, బోటు సిబ్బందికి శిక్షణ, అనుభవం ఉంటేనే లైసెన్సు ఇవ్వాలన్నారు. ఆపరేటింగ్ స్టాండర్ట్ ప్రొసీజర్(ఎస్ఓపీ) రూపొందించాలన్నారు. కంట్రోల్ రూమ్‌లలో సిబ్బందిని తక్షణమే నియమించాలని ఆదేశించారు. బోట్లను క్రమం తప్పకుండా తనిఖీలు చేసి.. నిబంధనల మేరకు లేని బోటు నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. -
దేశంలో జల రవాణా విప్లవం
న్యూఢిల్లీ: దేశంలో జలరవాణా విప్లవం రాబోతున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. ఇది రవాణా వ్యయాన్ని 4 శాతం మేర తగ్గిస్తుందని, తద్వారా 30 శాతం మేర ఎగుమతులు పెరగడానికి అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. కాండ్లా నుంచి ట్యూటికోరిన్ వరకు (వయా మంగళూరు, కొచ్చిన్) రవాణాకు ఉద్దేశించిన కంటెయినర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (కాంకర్) తొలి కంటెయినర్‌ను మంత్రి వీడియోకాన్ఫరెన్స్ ద్వారా గురువారం ప్రారంభించారు. జల రవాణా మార్గాల అభివృద్ధి, గంగా నదిపై రవాణా నౌకలను నిర్వహించాలనే ఆలోచనలను ఎగతాళిగా చూసిన విషయాన్ని గుర్తు చేశారు. ‘‘బంగ్లాదేశ్, మయన్మార్‌కు వారణాసి ద్వారా ఎగుమతులకు మార్గం సుగమం చేశాం. రవాణా వ్యాయాన్ని 4 శాతం తగ్గిస్తే... 25–30 శాతం మేర ఎగుమతులు పెరుగుతాయి’’ అని గడ్కరీ పేర్కొన్నారు. తీర ప్రాంత రవాణా వాటా చైనాలో 24 శాతం, జర్మనీలో 11 శాతం, అమెరికాలో 9 శాతంగా ఉంటే, భారత్‌లో 4.5– 5 శాతం మధ్యే ఉందని చెప్పారు. జల మార్గాల అభివృద్ధికి భారీ చర్యలు తీసుకుంటున్నామన్నారు. 111 నదులను జల మార్గాలుగా మలచాల్సి ఉందని, ఇందులో 11 నదులపై ప్రాజెక్టులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. గంగానదిపై గతేడాది 80 లక్షల టన్నుల రవాణా జరిగిందని, 3 మీటర్ల మేర నీటి నిల్వలు కొనసాగిస్తే... 280లక్షల టన్నులకు రవాణా పెరుగుతుందన్నారు. రూ.25,000 కోట్లకు కాంకర్ టర్నోవర్: రైల్వే శాఖా మంత్రి పీయూష్ గోయల్ కేంద్ర ప్రభుత్వ నవరత్న కంపెనీ కంటెయినర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (కాంకర్) రానున్న ఐదేళ్లలో రూ.25,000 కోట్ల టర్నోవర్‌ను నమోదు చేయాలన్న లక్ష్యంతో ఉన్నట్టు రైల్వే శాఖా మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో కాంకర్ టర్నోవర్ రూ.6,000 కోట్లుగా ఉందన్నారు. కాంకర్ తొలి కంటెయినర్ నౌక ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా మంత్రి గోయల్ మాట్లాడారు. రైల్వే శాఖ పరిధిలోని కాంకర్‌కు ప్రస్తుతం 81 టెర్మినల్స్ ఉన్నాయని, రానున్న సంవత్సరంలో 100 మార్క్‌ను చేరుతుందని మంత్రి చెప్పారు. తద్వారా దేశంలో అధిక రవాణా వ్యయాలను తగ్గించేందుకు తోడ్పడుతుందన్నారు. రైలు, రోడ్డు, సముద్ర మార్గాల్లో బహుముఖ విధాలైన రవాణా ఆర్థిక రంగ వృద్ధిని పెంచుతుందని అభిప్రాయాన్ని గోయల్ వ్యక్తం చేశారు. -
తెలంగాణలో రోడ్డు ప్రాజెక్ట్‌లకు రూ.41వేల కోట్లు
-
తెలంగాణలో రోడ్డు ప్రాజెక్ట్‌లకు రూ.41వేల కోట్లు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో రోడ్డు ప్రాజెక్టుల కోసం రూ. 41 వేల కోట్లు కేటాయించినట్టు కేంద్రమంత్రి నితిన్ గడ్కారీ పేర్కొన్నారు. సోమవారం ఆయన హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. హైదరాబాద్, విజయవాడ, హైదరాబాద్-బెంగళూరు ఎక్స్‌ప్రెస్ హైవేలకు 16 వేల కోట్లు రూపాయలు కేటాయించినట్టు చెప్పారు. హైదరాబాద్‌లో జలరవాణా వ్యవస్థకు నావిగేషన్ రిపోర్టు ఇవ్వమని చెప్పినట్టు ఆయన తెలిపారు. ఈ జలరవాణా వ్యవస్థ ద్వారా నేషనల్ హైవే, ఎయిర్ వే, రైల్వే కనెక్టివిటీల ఏర్పాటుకు మార్గం సుగమం అవుతోందని గడ్కారీ ఆశాభావం వ్యక్తం చేశారు. -
జల రవాణాకు కదలిక
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: అర్ధశతాబ్దం క్రితం ఆగిపోయిన జల రవాణా వ్యవస్థకు మళ్లీ ప్రాణం పోసేందుకు చర్యలు ప్రారంభమయ్యాయి. భారత్ జల రవాణా సంస్థ (ఐడబ్ల్యూఏఐ) సహకారంతో రాష్ట్రంలో జల రవాణా అభివృద్ధికి కసరత్తు జరుగుతోంది. దీనిలో భాగంగా కాకినాడ నుంచి పాండిచ్చేరి వరకూ జాతీయ జల రవాణా మార్గం-4 ను పునరుద్ధరించడానికి చర్యలు ప్రారంభమయ్యాయి. దీని కోసం ఇటీవల విజయవాడలో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ప్రకాశం, నెల్లూరు జిల్లాల అధికారులు హాజరు కాకపోవడంతో మళ్లీ త్వరలోనే సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ వ్యవస్థ ఏర్పాటుకు సుమారు *2,100 కోట్లు ఖర్చవుతుందని ప్రాథమికంగా అంచనా వేశారు. జలరవాణా వ్యవస్థ ఏర్పాటులో భాగంగా నైపుణ్యం కలిగిన కన్సల్టెన్సీని ఏర్పాటు చేసుకోవాలనే అంశాన్ని ఉన్నతాధికారుల పరిశీలనకు పంపించనున్నారు. పాండిచ్చేరి నుంచి కాకినాడకు జలరవాణా మార్గం ఆంధ్రప్రదేశ్‌తో పాటు తమిళనాడు, పాండిచ్చేరి రాష్ట్రాల పరిధిలో ఉంది. ఇందులో ఎక్కువ భాగం రాష్ట్రంలోనే ఉండటం విశేషం. ప్రకాశం జిల్లాలో నల్లమడ లాకుల నుంచి పెదగంజాం వరకూ కొమ్మమూరు కాల్వ 38 కిలోమీటర్లు ఉంది. ఇది కృష్ణానది జలాలను తీసుకువచ్చే కాలువ. అక్కడి నుంచి పెదగంజాం మీదుగా సముద్రపు ఒడ్డున ఉప్పునీటి కాల్వగా బకింగ్‌హామ్ కెనాల్ ఉంది. పాకల, కరేడు మీదుగా ఇది నెల్లూరు జిల్లా పులికాట్ సరస్సు వరకూ వెళ్తుంది. కొమ్మమూరు కాల్వ పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండగా, బకింగ్‌హామ్ కెనాల్ మాత్రం అవసాన దశకు చేరుకుంది. సముద్రపు ఆటుపోటు ద్వారా వచ్చే నీటితో ఉన్న ఈ కాల్వపై పలుచోట్ల ఓడ వచ్చినపుడు తీయడానికి వీలుగా లాకులు, దీన్ని ఆపరేట్ చేయడానికి లస్కర్ల వ్యవస్థ ఉంది. అయితే కొన్ని దశాబ్దాలుగా ఉపయోగించకపోవడంతో ఇవి శిథిలావస్థకు చేరుకున్నాయి. జిల్లాలో 43 కిలోమీటర్ల మేర ఉన్న బకింగ్‌హామ్ కాల్వను పూర్తిస్థాయిలో పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది. 2008 నవంబర్లోనే రైట్స్ అనే కన్సల్టెన్సీ సంస్థ జలరవాణా వ్యవస్థ ఏర్పాటుపై అధ్యయనం చేసింది. కాకినాడ - పాండిచ్చేరి మధ్య సుమారు 1,095 కిలోమీటర్ల పొడవునా జలరవాణా వ్యవస్థ ఏర్పాటుకు కాలువలు, నదులు అనుకూలంగా ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వానికి నివేదిక కూడా వెళ్లింది. అప్పట్లోనే *1,516 కోట్లు ఖర్చవుతుందని ఆ సంస్థ అంచనా వేసింది. 2009-2010 ఆర్థిక సంవత్సరంలో కేంద్రం ప్రాథమికంగా *62 కోట్లను జలరవాణాకు కేటాయించి, 2013 నాటికి ప్రాజెక్టును పూర్తి చేయాలని భావించింది. కానీ తర్వాత జలరవాణా మార్గం అభివృద్ధి మరుగునపడింది. రాష్ట్రంలో పోర్టుల అనుసంధానం, కోస్తా కారిడార్ ఏర్పాటు నేపథ్యంలో జలరవాణా మళ్లీ తెరపైకి వచ్చింది. కాకినాడ-పాండిచ్చేరి జలరవాణా మార్గం వల్ల ఏటా 11 మిలియన్ టన్నుల కార్గో రవాణా అయ్యే అవకాశాలున్నాయి. ఈ విషయాన్ని ఆరేళ్ల క్రితం సర్వే చేసిన వెప్కాస్ అనే సంస్థ తెలియజేసింది. మూడు రాష్ట్రాల మధ్య బియ్యం, బొగ్గు, ఆహార పదార్థాలు, సిమెంట్, ఎరువులు, అటవీ ఉత్పత్తులు, ఉప్పు తదితర వాటిని రవాణా చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం వీటన్నింటినీ రైళ్లలో రవాణా చేయడం వల్ల భారమవుతోందని వ్యాపారులు పేర్కొంటున్నారు. ఏది ఏమైనా మళ్లీ జలరవాణా అందుబాటులోకి రావాలని జిల్లా ప్రజలు కోరుకుంటున్నారు.