బోటు ప్రమాదాల నివారణకు కంట్రోల్‌ రూమ్‌లు | Control rooms for the prevention of boat accidents | Sakshi
Sakshi News home page

బోటు ప్రమాదాల నివారణకు కంట్రోల్‌ రూమ్‌లు

Published Thu, Nov 7 2019 4:51 AM | Last Updated on Thu, Nov 7 2019 8:08 AM

Control rooms for the prevention of boat accidents - Sakshi

బుధవారం విచారణ కమిటీ సభ్యులతో జరిగిన సమావేశంలో మాట్లాడుతున్న సీఎం వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అంతర్గత జలరవాణా వ్యవస్థను నియంత్రించడం ద్వారా బోటు ప్రమాదాలకు అడ్డుకట్ట వేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేశారు. బోటు ప్రమాదాల నివారణ, ప్రయాణికుల భద్రత కోసం 8 చోట్ల కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. జలవనరులు, పోలీసు, పర్యాటక, రెవెన్యూ తదితర శాఖల సిబ్బందిని ఈ కంట్రోల్‌ రూమ్‌ల్లో నియమించాలని ముఖ్యమంత్రి సూచించారు. ప్రతి కంట్రోల్‌ రూమ్‌లో 13 మందిని నియమించాలని, అందులో ముగ్గురు పోలీసు కానిస్టేబుళ్లు తప్పనిసరిగా ఉండాలన్నారు. ఈ నెల 21వ తేదీన ఎనిమిది ప్రాంతాల్లో కంట్రోల్‌ రూమ్‌ల నిర్మాణానికి శంకుస్థాపన చేయాలని నిర్ణయానికొచ్చారు. ఈ కంట్రోల్‌ రూమ్‌లను 90 రోజుల్లోగా అందుబాటులోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. 

తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు మందం సమీపంలో సెప్టెంబరు 15న గోదావరిలో జరిగిన బోటు ప్రమాదంపై విచారణకు జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కమిటీ తన నివేదికను బుధవారం సీఎం వైఎస్‌ జగన్‌కు అందజేసింది. ఈ నివేదికపై ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. అంతర్గత జల మార్గాలు.. బోట్ల కదలికలు, వరద ప్రవాహాలు, వాతావరణ సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకునేలా కంట్రోల్‌ రూమ్‌లను తీర్చిదిద్దాలని అధికారులకు సూచించారు. తద్వారా బోట్ల నిర్వహణను సులభంగా పర్యవేక్షించవచ్చని చెప్పారు. 

బోట్లలో జీపీఎస్‌ తప్పనిసరి 
కంట్రోల్‌ రూమ్‌కు ఎమ్మార్వో ఇన్‌ఛార్జిగా వ్యవహరిస్తారని సీఎం వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు. బోట్లలో ప్రయాణించే వారికి టిక్కెట్లు ఇచ్చే అధికారం కంట్రోల్‌ రూమ్‌లకే కట్టబెట్టాలన్నారు. బోట్లలో జీపీఎస్‌ను తప్పనిసరిగా అమర్చాలని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బోట్లలో మద్యం వినియోగించే అవకాశం ఇవ్వకూడదని స్పష్టంచేశారు. బోటు బయలుదేరడానికి ముందే సిబ్బందికి బ్రీత్‌ అనలైజర్‌ పరీక్షలను నిర్వహించాలని పేర్కొన్నారు. ఎలాంటి ప్రమాదాలు చోటుచేసుకోకుండా చూడగలిగితే.. ఆ మేరకు గ్రేడింగ్‌ ఇచ్చి, కంట్రోల్‌ రూమ్‌ల సిబ్బందికి రెండు నెలల జీతం ఇన్సెంటివ్‌గా ఇవ్వాలని సూచించారు. 

మరోసారి తనిఖీ చేశాకే అనుమతి 
రాష్ట్రంలో బోట్లన్నింటినీ మరోసారి తనిఖీ చేసి.. వాటి ఫిట్‌నెస్‌ను ధ్రువీకరించాకే అనుమతి ఇవ్వాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తేల్చిచెప్పారు. సారంగి, బోటు సిబ్బందికి శిక్షణ, అనుభవం ఉంటేనే లైసెన్సు ఇవ్వాలన్నారు. ఆపరేటింగ్‌ స్టాండర్ట్‌ ప్రొసీజర్‌(ఎస్‌ఓపీ) రూపొందించాలన్నారు. కంట్రోల్‌ రూమ్‌లలో సిబ్బందిని తక్షణమే నియమించాలని ఆదేశించారు. బోట్లను క్రమం తప్పకుండా తనిఖీలు చేసి.. నిబంధనల మేరకు లేని బోటు నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement