ఎంవీపీకాలనీ (విశాఖ తూర్పు): తూర్పుతీరంలో సముద్ర వాణిజ్యంలో అన్నివేళల బలమైన శక్తిగా ఆంధ్రప్రదేశ్ నిలుస్తోంది. బంగాళాఖాతం వెంబడి ఉన్న అనేక నగరాలను దాటుకొని వాణిజ్యం, రక్షణ అంశాల్లో తూర్పు తీరం అగ్రగామిగా నిలుస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న మేజర్ పోర్టుల కేటగిరీలో సైతం విశాఖ ప్రత్యేక చాటుతోంది. వాణిజ్య పరంగా పోర్టు నుంచి రికార్డు స్థాయిలో సరుకు రవాణా సాగిస్తోంది. దశాబ్దాలుగా వాణిజ్య సామర్థ్యాన్ని పెంచుకుంటూ ముందుకు సాగుతోంది. నేడు జాతీయ మారిటైం దినోత్సవాన్ని పురస్కరించుకొని సముద్ర వాణిజ్యం, రక్షణ రంగాల్లో పటిష్టమవుతున్న విశాఖ ఖ్యాతిపై ప్రత్యేక కథనం.
విశాఖ ఓడరేవును లార్డ్ విల్లింగ్‌డన్ 1933, డిసెంబర్19న ప్రారంభించారు. రూ 3.78 కోట్లు వ్యయంతో ఈ ఓడరేవు నిర్మించారు. ప్రారంభంలో 3 బెర్త్‌లతో ఏడాదికి 1.3 లక్షల టన్నుల సరుకు రవాణా చేసిన ఈ ఓడరేవు ప్రస్తుతం 24 బెర్త్‌లతో 65 మిలియన్ టన్నుల సరుకు రవాణాతో అభివృద్ధిలో దూసుకుపోతోంది. ప్రస్తుతం 974 కిలోమీటర్లు సుదీర్ఘ సముద్రతీరం ఉన్న ఆంధ్రప్రదేశ్ మారిటైం బోర్డు పరిధిలో 13 నాన్ మేజర్ పోర్టులు ఉన్నాయి. దీంతో పాటు ఏపీలో విశాఖపట్నం పోర్టు ఏకైక మేజర్ పోర్టుగా నిలిచింది.
రక్షణ రంగంలో బలమైన శక్తిగా: రక్షణ పరంగా తూర్పు నావికదళం విశాఖ కేంద్రంగా బలమైన శక్తిగా ఎదుగుతోంది. 1968లో ఆవిర్భవించిన తూర్పు నావికాదళం క్రమంగా తూర్పు సముద్ర జలాల్లో అగ్రగామిగా నిలిచింది. దేశంలో తొలిగా నిర్మించిన అణుజలంతర్గామి ఐఎన్‌ఎస్ అరిహంత్ విశాఖలో తయారు చేయడం విశాఖకు తీరానికి గర్వకారణంగా నిలుస్తోంది. 1992 నుంచి జరుగుతున్న మలబార్ విన్యాసాలకు తూర్పు తీరం అనేక సార్లు అతిథ్యమిచ్చింది. తూర్పునావికాదళం విశిష్టతను పెంచేలా ప్రెసిడెంట్ ప్లీట్ రివ్యూలకు విశాఖను వేదికగా నిలిచింది.
తూర్పున ఏపీకి అగ్రస్థానం..
భారత పోర్ట్స్, షిప్పింగ్స్, వాటర్‌వేవ్స్ మంత్రిత్వశాఖ లెక్కల ప్రకారం నాన్ మేజర్ పోర్టుల కేటగిరీలో 2021–22 ఏడాదికి గాను ఓవర్సీస్ కార్గో ట్రాఫిక్‌లో ఆంధ్రప్రదేశ్ మారిటైం బోర్డు 2వ స్థానంలో నిలిచింది. 70.7శాతం వాటాతో 324.43 మిలియన్ టన్నుల లావాదేవీలతో గుజరాత్ తొలిస్థానంలో ఉండగా 14.8 శాతం వాటాతో ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో నిలిచింది.
తరువాతి స్థానాల్లో 7.7 శాతం వాటాతో ఒడిశా, 4.2 శాతం వాటాతో మహారాష్ట్ర రాష్ట్రాలు ఉన్నాయి. అయితే కోస్టల్ కార్గో ట్రాఫిక్‌లో ఏపీ మూడో స్థానంలో నిలిచింది. 51.7 శాతం వాటాతో 41.27 మిలియన్ టన్నుల లావాదేవీలతో గుజరాత్ తొలిస్థానంలో నిలవగా 28.3 శాతం వాటాతో మహారాష్ట్ర 2వ స్థానంలోను 14.4 శాతం వాటాతో ఏపీ మారిటైమ్ బోర్డు మూడో స్థానంలో నిలిచాయి. తూర్పున బే ఆఫ్ బెంగాల్‌లో కార్గో వాణిజ్యంలో ఆంధ్రప్రదేశ్‌కు అగ్రస్థానం లభించింది.
Comments
Please login to add a commentAdd a comment