అవిశ్వాసానికి రెడీ
జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ) అధ్యక్షుడిపై అవిశ్వాసం పెట్టే విషయంలో టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నేతలు మరింత దూకుడు పెంచారు. మెజార్టీ డెరైక్టర్ల మద్దతు కూడగట్టిన నాయకులు అధిష్టానం ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నారు. దాదాపు ఈ నెలాఖరుకు గంగాధర్ పట్వారీని ‘సహకార’ పీఠం నుంచి దించేందుకు రంగం సిద్ధమవుతోంది. మరోవైపు ఈ గండం నుంచి గట్టెక్కేందుకు పట్వారీ సకల యత్నాలు చేస్తున్నారు.
⇒ సీఎం పేషీకి డీసీసీబీ వ్యవహారం
⇒ కేసీఆర్ ఆదేశాల కోసం ఎదురుచూపు
⇒ టీఆర్ఎస్ ఖాతాలో మెజారిటీ డెరైక్టర్లు
⇒ జిల్లా నేతలంతా ఏకతాటి పైకి
⇒ నెలాఖరులోగా గంగాధర్ పీఠానికి ఎసరు
⇒ స్వీయ రక్షణ యత్నాలలో పట్వారీ
⇒ సంపూర్ణ విజయం దిశగా గులాబీ దళం
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ఇందూరు సహకార రాజకీయం ఊపందుకుంటోంది. 2103 ఫిబ్రవరిలో జరిగిన ఎన్నికలలో నాలుగైదు స్థానాలకు పరిమితమైన టీఆర్ఎస్ డెరైక్టర్ల సంఖ్య, ఇటీవల 15కు చేరింది. ఈ విషయంలో జిల్లాకు చెందిన శాసనసభ్యులందరూ ఏకతాటిపైకి వచ్చారని తెలుస్తోంది. నేతలంతా కలిసి, ఢిల్లీ పర్యటనకు వెళ్లే ముందు డీసీసీబీ అధ్య క్షుడిపై అవిశ్వాసం పెట్టే విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. అనంతరం అధినేత మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, విప్ గంప గోవర్ధన్, ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డితో ప్రత్యేకంగా మాట్లాడినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. ఈ నేపథ్యంలో గంగాధర్ పట్వారీపై అవిశ్వాసం పెట్టే విషయమై త్వరలోనే నిర్ణయం తీసుకుంటారన్న ప్రచారం జరుగుతోంది. దీంతో డీసీసీబీ ప్రస్తుత అధ్యక్షుడు స్వీయ రక్షణలో పడిపోయారు. ఎలాగైనా గండం నుంచి గట్టెక్కే ప్రయత్నాలు మొదలెట్టారు.
అప్పుడంతా అనుకూలం
2013 ఫిబ్రవరిలో జరిగిన డీసీసీబీ ఎన్నికలలో బోధన్ నుంచి గెలుపొం దిన గంగాధర్ పట్వారీకి అప్పుడున్న రాజకీయ పరిస్థితులు పూర్తిగా అనుకూలించాయి. కానీ, తెలంగాణ రాష్ర్ట ఏర్పాటు తర్వాత పరిస్థితులు పూర్తిగా మారాయి. సాధారణ ఎన్నికలలో ఘన విజయాన్ని అందుకున్న టీఆర్ఎస్ అనంతరం నగర కార్పొరేషన్, జడ్పీ, మున్సిపాలిటీ పదవువులను దక్కించుకుంది. అప్పట్లో జరిగిన డీసీసీబీ ఎన్నికలలో మొత్తం 20 మంది డెరైక్టర్లకుగాను 11 మంది కాంగ్రెస్, ఐదుగు రు వైఎస్ఆర్ సీపీ, నలుగురు టీఆర్ఎస్కు చెందినవారు ఎన్నికయ్యా రు. కాంగ్రెస్ పార్టీకి చెందిన గంగాధర్ పట్వారీకి అధ్యక్ష పదవి దక్కిం ది. జిల్లాలో దాదాపుగా అన్ని పదవులను సాధించుకున్న ఇపుడు డీసీసీబీపై కన్నేసి, ఆ దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఎట్టకేలకు మె జారిటీ సభ్యుల మద్దతును కూడగట్టుకుంది. సీఎం కేసీఆర్ ఆమోదమే తరువాయి. ఆయన ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన రెండు మూడు రోజు లలో నిర్ణయం ఉంటుందని భావిస్తున్నారు. దాదాపుగా ఈ నెలాఖరులోగా ఆవిశ్వాసం పెట్టాలని జిల్లా నేతలు యోచిస్తున్నట్లు తెలిసింది.
గద్దెనెక్కేది ఎవరో!
డీసీసీబీ అధ్యక్ష స్థానంపై కన్నేసిన టీఆర్ఎస్ గంగాధర్ పట్వారీ అవిశ్వాసం మోపేందుకు సిద్ధమవుతుండటం రాజకీయవర్గాలలో చర్చనీయాంశంగా మారింది. జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు ఈ మే రకు డీసీసీబీ డెరైక్టర్ల సమీకరణలో తమ శక్తియుక్తులను ప్రదర్శించడం, ఉన్న ఒక్క జిల్లాస్థాయి డీసీసీబీ చైర్మన్ పదవిని కూడా తమ ఖాతాలో కలుపుకునేందుకు వేదికను రూపొందించింది. దీంతో ఇందూరు రాజ కీయం రసకందాయంలో పడింది. సంపూర్ణ విజయం కోసం గులాబీదళం తహతహలాడుతోంది.
అవిశ్వాసం నెగ్గిన తర్వాత టీఆర్ఎస్ నుంచి చైర్మన్ అభ్యర్థి ఎవరన్న అంశంపై కూడ నేతల సమీకరణలు మొదలయ్యాయి. ఎల్లారెడ్డి, ఆర్మూరు, బాన్సువాడ నియోజకవర్గాలకు చెందిన ముగ్గురు పేర్లు పరిశీలనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. కాగా, డీసీసీబీ డైరక్టర్లుగా ప్రాతినిధ్యం వహిస్తున్నవారి పేర్లు, వారు ప్రాతినిధ్యం వహిస్తున్న సంఘాల వివరాలు ఇలా ఉన్నాయి.