‘దేశం’ అధికార దాహం
సాక్షి, కాకినాడ :జెడ్పీ పీఠంతో పాటు మెజార్టీ మున్సిపాలిటీలు, మండల పరిషత్‌లు దక్కినా తెలుగుదేశం పార్టీ అధికార దాహం తీరలేదు. ప్రత్యర్థి పార్టీకి దక్కిన మండల పరిషత్లలోనూ పాగా వేసే లక్ష్యంతో.. ప్రజాస్వామికస్ఫూర్తికి విరుద్ధంగా ఆ పక్షపు ఎంపీటీసీలకు గేలం వేసేందుకు అధికారాన్ని అడ్డం పెట్టుకుంటోంది. అడ్డదారులన్నీ తొక్కుతోంది. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు సైతం రంగంలోకి దిగిహేయమైన రాజకీయాలకు దిగుతున్నారు. కాగా.. టీడీపీ ప్రలోభాలకు మొగ్గు చూపుతున్న వారు కూడా.. ఫిరాయిస్తే అనర్హత వేటు పడే అవకాశమున్నందున తటపటాయిస్తున్నారు.జిల్లాలో రాజమండ్రి కార్పొరేషన్‌తో పాటు ఏడు మున్సిపాలిటీలు, మూడు నగర పంచాయతీల పాలకవర్గాలు ఈ నెల 3న, మండల పరిషత్ పాలకవర్గాలు 4న, జిల్లా పరిషత్ పాలకవర్గాలు 5 న కొలువుదీరనున్నాయి.
ఇందు కోసం ఉద్దేశించిన ప్రత్యేక సమావేశాలకు హాజరు కావాలని గత రెండు రోజులుగా ఆయా సంస్థల సభ్యులకు నోటీసులు జారీ చేశారు. చాలామంది సభ్యులు క్యాంపుల్లో ఉండడంతో వారి ఇళ్లకు వెళ్లి కుటుంబ సభ్యులకు అందజేసారు. అధ్యక్ష పదవీ యోగం కోసం మూడు నెలల పాటు నిరీక్షించిన ఆశావహులు ముహూర్తం ముంచుకొచ్చే కొద్దీ నమ్ముకున్న వారు ఎక్కడ వెన్ను పోటు పొడుస్తారోనన్న ఆదుర్దాకు లోనవుతున్నారు. జిల్లాలోని 1063 ఎంపీటీసీ స్థానాలకు 608 స్థానాల్లో టీడీపీ, 391 స్థానాల్లో వైఎస్సార్ సీపీ విజయం సాధించగా, కాంగ్రెస్ రెండు స్థానాల్లో, 62 చోట్ల ఇండిపెండెంట్లు గెలుపొందారు. 40 మండలపరిషత్‌లలో టీడీపీకి, 12 మండలాల్లో వైఎస్సార్ సీపీకి స్పష్టమైన మెజార్టీ స్థానాలు లభించాయి. నాలుగు మండలాల్లో ఇరు పార్టీలకు చెరి సగం సీట్లు వచ్చాయి. ఏలేశ్వరం మండల పరిషత్‌లో టీడీపీకి మెజార్టీ స్థానాలు దక్కినప్పటికీ.. అధ్యక్ష పదవి ఎస్టీలకు రిజర్వయిన ఇక్కడ ఆ పార్టీకి ఆ కేటగిరీ విజేత లేకపోవడంతో వారి పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది.
ఆ 17 మండలాల్లో ఆశావహుల కలవరం
ఇరుపార్టీలు బొటాబొటీ మెజార్టీ సాధించిన మండలాల పరిధిలోని ఎంపీటీసీలు ఇప్పటికే క్యాంపుల్లో ఉన్నారు. వీరంతా ప్రత్యేక సమావేశం రోజు మండలాలకు వచ్చేలా ఆశావహులు ఏర్పాట్లు చేశారు. సఖినేటిపల్లి, రాజోలు, ఆత్రేయపురం, గోకవరం, బిక్కవోలు, తొండంగి, పెదపూడి, సామర్లకోట, తాళ్లరేవు, పిఠాపురం మండలాల పరిధిలో అధ్యక్ష పదవి దక్కడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్‌కు మించి ఒకటి లేదా రెండుస్థానాలు మాత్రమే టీడీపీకి రాగా, ఏలేశ్వరం, అయినవిల్లి, కాట్రేనికోనల్లో మ్యాజిక్ ఫిగర్‌కు ఒకటి రెండు స్థానాలు తక్కువ వచ్చాయి. ఇక వైఎస్సార్ సీపీ, టీడీపీ చెరిసగం సీట్లు సాధించిన కాజులూరు, యు.కొత్తపల్లి, రౌతులపూడి, తాళ్లరేవు మండలాల్లో ప్రత్యర్థి పార్టీకి చెందిన ఎంపీటీసీలకు గేలం వేసేందుకు టీడీపీ ఎన్నికల్లో మాదిరిగానే అడ్డదారులన్నీ తొక్కుతోంది. అధికారాన్ని అడ్డంపెట్టుకొని నయానో.. భయానో దారికి తెచ్చుకునేందుకు యత్నిస్తోంది. దీంతో ఈ 17 మండలాల్లో ఆశావహులు కలవరానికి గురవుతున్నారు. ‘గెలుపొందేందుకు లక్షలు కుమ్మరించాం. మద్దతిచ్చే వారిని కాపాడుకునేందుకు క్యాంపుల నిర్వహణకు మళ్లీ లక్షలు ఖర్చు పెట్టాం. తీరా ముహూర్తం సమీపించే తరుణంలో ఏం జరుగుతుందో? ఎవరెటు ప్లేటు ఫిరాయిస్తారో?’నన్న భయం వారి కంటి కి కునుకు లేకుండా చేస్తోంది.
ఏలేశ్వరంలో చిక్కుముడి!
ఏలేశ్వరం, గొల్లప్రోలు, ముమ్మిడివరం నగర పంచాయతీల్లో ఎమ్మెల్యే, ఎంపీల ఓట్లే కీలకం కానున్నాయి. ముఖ్యంగా ఏలేశ్వరం మండల పరిషత్ మాదిరిగానే ఆ నగర పంచాయతీలో పీఠంపై ఉత్కంఠ నెలకొంది. ఇక్కడ ఇరు పార్టీలకు సమానంగా సీట్లు రావడం, చైర్మన్ పదవి ఎస్సీలకు రిజర్వయిన ఇక్కడ టీడీపీకి ఆ కేటగిరీలో ఒక్కగానొక్క విజేత లేకపోవడం, ఎక్స్అఫిషియో సభ్యులుగా చేరనున్న ఎంపీ, ఎమ్మెల్యేలు చెరో పార్టీకి చెందిన వారు కావడంతో పీఠం ఎవరి వశమవుతుందో, ఈ చిక్కుముడి ఎలా కొలిక్కివస్తుందోనన్న ఉత్కంఠ నెలకొంది. కాగా టీడీపీ ఎరలకు ఆకర్షితులై, ఆ శిబిరంలోకి దూకాలనుకుంటున్న కొందరు ఎంపీటీసీలను.. పార్టీ విప్‌ను ధిక్కరిస్తే అనర్హత వేటు పడుతుందన్న గుబులు వెంటాడుతోంది. అయితే వారికి భారీగా నజరానాలు ఎర చూపి దారికి తెచ్చుకునేందుకు టీడీపీ నేతలు యత్నిస్తున్నారు. కొన్నిచోట్ల మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు సైతం రంగంలోకి దిగారు. తమ వైపు వస్తే రానున్న ఐదేళ్లలో నామినేషన్ పనులు కట్టబెడతామని, కనీసం గైర్హాజరైతే లక్షలు ముట్ట జెబుతామని ఎర చూపుతున్నారు. కాదంటున్న వారిని బెదిరిస్తూ దారికి తెచ్చుకునేందుకు యత్నిస్తున్నారు. దీంతో ఆయా మండలాల్లో ఏం జరుగుతుందోననే ఉత్కంఠ కొనసాగుతోంది.