Malabar Group
-
పరిశ్రమల ఏర్పాటుకు అనువుగా తెలంగాణ
గచ్చిబౌలి (హైదరాబాద్): పరిశ్రమల ఏర్పాటుకు తెలంగాణ ప్రాంతం ఎంతో అనువైనదని, అందులో హైదరాబాద్ నగరం మరింత అనువైనదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు పేర్కొన్నారు. మాదాపూర్‌లోని ట్రైడెంట్ హోటల్లో మలబార్ గ్రూపు ఆధ్వర్యంలో మహేశ్వరంలో ఏర్పాటు చేసే మలబార్ గోల్డ్, డైమండ్స్ ఆభరణాల ఉత్పత్తి సంస్థ ఫ్యాక్టరీకి శనివారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ టెక్నాలజీ, బయాలజీ, ఏరోస్పేస్, లాజిస్టిక్, ఫుడ్ ప్రాసెసింగ్, ఇతర రంగాలకు తెలంగాణ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని వెల్లడించారు. జువెలరీ సంస్థలు మరిన్ని తెలంగాణలో కంపెనీలను ఏర్పాటు చేయడానికి ముందుకొస్తే జువెలరీ హబ్ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. 2,750 మందికి ఉపాధి కల్పించేలా రూ.750 కోట్లతో మలబార్ గోల్డ్, జువెలరీ ఆభరణాల సంస్థ రాష్ట్రంలో అతిపెద్ద ఫ్యాక్టరీ ఏర్పాటుకు ముందుకురావడం పట్ల కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. మలబార్ గ్రూపు చైర్మన్ అహ్మద్ ఎంపీ, వైస్‌చైర్మన్ అబ్దుల్ సలామ్ మాట్లాడుతూ ..ప్రస్తుతం మలబార్ గోల్డ్, డైమండ్స్ రిటైల్ షోరూమ్స్ తెలంగాణలో 17 ఉన్నాయని వాటిద్వారా 1,000 మందికి ఉపాధి కలుగుతోందని చెప్పారు. కేరళ, కర్ణాటక తర్వాత హైదరాబాద్‌లో తమ సంస్థను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చామని తెలిపారు. నాణ్యతకు అత్యధిక ప్రాధాన్యతనివ్వడంతో వినియోగదారుల మన్ననలు పొందుతున్నామని చెప్పారు. కార్యక్రమంలో ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, పరిశ్రమల శాఖ కమిషనర్ కృష్ణభాస్కర్, టీఎస్ఐఐసీ వైస్‌చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ నర్సింహారెడ్డి, మలబార్ ప్రతినిధులు పాల్గొన్నారు. -
తెలంగాణలో భారీ పెట్టుబడి
సాక్షి, హైదరాబాద్: ఆభరణాల రంగంలో అంతర్జాతీయంగా పేరొందిన దేశీయ దిగ్గజసంస్థ మలబార్ గ్రూప్ తెలంగాణలో భారీ పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చింది. రూ.750 కోట్లతో బంగారు, వజ్రాభరణాల తయారీ ఫ్యాక్టరీ, గోల్డ్ రిఫైనరీ యూనిట్లను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది. రాష్ట్రంలో నైపుణ్యం కలిగిన సుమారు 2,500 మంది స్వర్ణకారులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపింది. మలబార్ గ్రూప్ అధినేత ఎంపీ అహ్మద్‌తో కూడిన ప్రతినిధి బృందం బుధవారం రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్‌తో భేటీ అయింది. రాష్ట్రంలో వ్యాపార అనుకూలతలు, నాణ్యమైన మానవ వనరులు అందుబాటులో ఉండటంతో భారీ పెట్టుబడులు పెట్టాలని నిర్ణయిం చినట్లు అహ్మద్ వెల్లడించారు. మలబార్ గ్రూప్‌నకు ప్రపంచవ్యాప్తంగా 260 స్టోర్లు ఉన్నాయని, రాష్ట్రంలో తమసంస్థ పెట్టుబడుల ద్వారా ఆభరణాల తయారీ రంగం మరింత బలోపేతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సులభతర వాణిజ్యానికి అనుకూలమైన విధానాలు ఉన్నం దున వివిధ రంగాలకు చెందినవారు భారీ పెట్టుబడులతో రాష్ట్రానికి వస్తున్నారని మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ నేపథ్యంలోనే మలబార్ గ్రూప్ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిందంటూ హర్షం వ్యక్తం చేశారు. అద్భుతమైన కళానైపుణ్యం కలిగిన స్వర్ణకారులు తెలంగాణ వ్యాప్తంగా ఉన్నారని, వీరి నైపుణ్యాన్ని దృష్టిలో పెట్టుకుని మరింత మందికి ఉపాధి కల్పించాలని కోరారు. ప్రభుత్వపరంగా బంగారు, వజ్రాభరణాల తయారీ రంగానికి అన్ని విధాలా సహకరిస్తామని ప్రతినిధి బృందానికి హామీ ఇచ్చారు. ఈ భేటీలో ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్ పాల్గొన్నారు. -
తెలంగాణలో మరో కంపెనీ భారీగా పెట్టుబడులు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు మరో కంపెనీ ముందుకు వచ్చింది. డైమండ్ & జ్యూయలరీ రంగంలో అంతర్జాతీయ గుర్తింపు గల మలబార్ గ్రూప్ తెలంగాణలో ₹750 కోట్ల పెట్టుబడితో రాష్ట్రంలో మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్‌తో పాటు రిఫైనరీ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ పెట్టుబడి వల్ల రాష్ట్రంలో సుమారు 2,500 మందికి ఉపాధి లభించనున్నట్లు సంస్థ పేర్కొంది. మలబార్ గ్రూప్ ప్రపంచవ్యాప్తంగా 260కి పైగా డైమండ్ & జ్యూయలరీ స్టోర్స్ ఉన్నాయి. నేడు మలబార్ గ్రూప్ చైర్మన్ ఎంపీ అహ్మద్, ప్రతినిధుల బృందం రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ని కలిసి కంపెనీ పెట్టుబడి ప్రణాళికలను ఆయన పంచుకున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. రాష్ట్రంలో నాణ్యమైన మానవ వనరుల లభ్యతతో పాటు తెలంగాణ ప్రభుత్వం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌ని దృష్టిలో ఉంచుకొని ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చినట్లు మలబార్ గ్రూప్ ప్రతినిధులు పేర్కొన్నారు. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ గ్రూపును మంత్రి కేటీఆర్ తెలంగాణాకు స్వాగతించారు. ఈ ప్రతిపాదిత ప్రాజెక్టు వల్ల వివిధ జిల్లాల్లో నైపుణ్యం కలిగిన స్వర్ణకారులుకు ఉపాధి లభిస్తుందని మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, పరిశ్రమల శాఖ సీనియర్ అధికారులు పాల్గొన్నారు. Happy to share that 'Malabar Gold and Diamonds' will be establishing a gold and diamond jewellery manufacturing unit along with a refinery in Telangana with an estimated investment of ₹ 750 Crores This new investment will create employment to about 2500 people in the state pic.twitter.com/FQM8U8Kxof — KTR (@KTRTRS) September 15, 2021 -
గృహ నిర్మాణం కోసం పేదలకు మలబార్ ఆర్థిక సాయం
హైదరాబాద్: పేద, బలహీన వర్గాల వారందరికీ సొంతిళ్లను నిర్మించి ఇవ్వాలనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంకల్పానికి చేయూనివ్వడానికి ప్రముఖ రియల్టీ, ఆభరణాల వ్యాపార సంస్థ మలబార్ గ్రూప్ ఆర్థిక సహాయం అందిస్తోంది. కేంద్ర ప్రభుత్వపు ‘ప్రధాన మంత్రి ఆవాస్ యోజన’, కేరళ ముఖ్యమంత్రి ప్రకటించిన ‘లైఫ్ మిషన్’ వంటి కార్యక్రమాలకు మద్దతు ప్రకటిస్తున్నామని గ్రూప్ చైర్మన్ ఎం.పి.అహ్మద్ తెలిపారు. గృహ నిర్మాణ ప్రాజక్టులకు అవసరమైన పాక్షిక ఆర్థిక సాయం మలబార్ హౌసింగ్ చారిటబుల్ ట్రస్ట్, మలబార్ డెవలపర్స్ నుంచి అందుతుందని పేర్కొన్నారు. 4 సెంట్ల స్థలం కలిగి, 600 చదరపు అడుగుల నిర్మాణ వైశాల్యంలో ఇల్లు నిర్మించుకోదలచిన వారు భూమి దస్తావేజుల నకలు, ఇంటి ప్లాన్ కాపీ, ఫోటో గుర్తింపు కార్డులను జతచేస్తూ దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. దరఖాస్తులను సమీపంలోని మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ స్టోర్ లేదా మలబార్ డెవలపర్స్ కార్యాలయం లేదా మలబార్ హౌసింగ్ చారిటబుల్ ట్రస్ట్ ఆఫీస్‌లలో ఈ మార్చి 10 లోగా అందజేయాలని పేర్కొన్నారు.